Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version.
Click Here

 

బాబోయ్! నాకర్ధమయేలా చెప్పండి!

గొల్లపూడి మారుతీరావు
                 gmrsivani@gmail.com                             

      నేను మతఛాందసుడిని కాను.మసీదులు కూల్చడం, పబ్బుల్లో అమ్మాయిల్ని చావగొట్టడం వంటి పనులమీద నాకు బొత్తిగా నమ్మకం లేదు. అలాగే ప్రాంతీయ దురభిమానిని కాదు. పై ప్రాంతాలవారి వస్తువుల్ని బహిష్కరించడం, విభేధించేవారి  నాలుకలు చీల్చడం మీద అసలు నమ్మకం లేదు.

        నాకు చిత్రలేఖనం గురించి బొత్తిగా తెలీదు-మంచి చిత్రాన్ని చూసి ఆనందించడం తప్ప. అయితే ఏది మంచి చిత్రమో, అది ఎందుకు మంచి చిత్రమో తెలీదు.

        ఈ దేశం ఎమ్.ఎఫ్.హుస్సేన్ గారి సేవలను ,ప్రతిభను గౌరవించిందనడానికి నిదర్శనం-వారిని పద్మశ్రీగా, పద్మభూషణ్ గా, పద్మవిభూషణ్ గా సత్కరించడం. ఇంతకన్న ఏ దేశమూ ఏ కళాకారుడినీ నెత్తిన పెట్టుకోలేదు.

        ఆయన ఆ మధ్య బట్టలిప్పిన సరస్వతినీ, బట్టల్లేని భారతమాతనీ, చక్కగా బట్టలు కట్టుకుని, పరువుగా నిలబడిన తన తల్లినీ చిత్రించారు. ఈ మూడు చిత్రాల గురించే నేను మాట్లాడదలుచుకున్నాను.

        తల్లిని గౌరవంగా, పవిత్రంగా చూడాలని భావించిన పద్మవిభూషణులు దేశమంతా తల్లిగా కొలిచే దేశమాతని బట్టలిప్పిచిత్రించే అభిరుచిని ఎలా పెంపొందించుకున్నారు? శతాబ్దాలుగా ఈ దేశ ప్రజలు చదువుల తల్లిగా కొలిచే సరస్వతిని బట్టలిప్పి ఎందుకు నిలబెట్టారు?- పండరీపూర్ వంటి పవిత్ర పుణ్య క్షేత్రంలో జన్మించిన ఈ పద్మవిభూషణులు!

        మరొక్కసారి- నేను ప్రమోద్ ముతాలిక్ రామసేననీ, ప్రవీణ్ తొగాడియా ఆవేశాన్నీ సమర్ధించను.

        కాని తన తల్లిపట్ల పవిత్రతని చూపించాలని ఎరిగిన 94 ఏళ్ళ వృద్ధ కళాకారుడు తను పుట్టిన దేశమంతా ఆరాధించే దేశమాత, సరస్వతి పట్ల జాతి గౌరవాన్ని అర్ధంచేసుకోలేకపోయారా? లేదా ఈ సంస్కృతిపట్ల ఏ మూలనో వారికి చులకన భావం ఉన్నదా?

        చాలామంది మేధావులు, గొప్పమతాతీత దృక్పధం గల విచక్షణాపరులు, అపూర్వమయిన కళాకారులు, రాజకీయనాయకులు- ఎందరో కళాకారుని స్వేఛ్ఛనీ, వారి దృక్పధాన్నీ మనం గౌరవించాలని వాపోయారు. వారి కళాదృష్టిని మనం కించపరచకూడదని నొక్కి వక్కాణించారు.

        తన తల్లిని గౌరవించిన చిత్రకారుడు పొరుగువాడి తల్లిని లంజగా చూపడం ఏ స్వేఛ్ఛ కిందకి వస్తుందో కాస్త తెలియజేస్తారా? మొన్న హోం మంత్రి చిదంబరంగారు హుస్సేన్ గారు భారతదేశం వస్తే వారికి రక్షణ కల్పిస్తామని అన్నారు. భేష్! అది మన విచక్షణకీ, ఆరోగ్యకరమైన దృక్పధానికీ ప్రతీక. కాని చిదంబరంగారూ భారతీయులేకదా? వారు చంద్రమండలం నుంచి రాలేదుకదా? వారిని ఈ అనౌచిత్యం బాధించలేదా? బాధించినా మంత్రిత్వం వారిమీద ఏదైనా బురఖాను కప్పిందా?

        ఇప్పుడో బురఖా కధ. ఎప్పుడో 2007 లో మహమ్మదు ప్రవక్త బురఖాకు వ్యతిరేకమని ఏదో పత్రికలో తస్లీమా నస్రీం రాయగా ఆ వ్యాసం అనువాదాన్ని కర్ణాటకలో కన్నడప్రభ దినపత్రిక ప్రచురించినందుకు నిన్న చెలరేగిన విధ్వంసకాండలో- పోలీసులు షిమాగోలో కాల్పులు జరుపగా ఇద్దరు మరణించారు. ఎందరో గాయపడ్డారు. తమ మతాన్ని వీధిన పెట్టినందుకు చెలరేగిన దుమారమిది. తీరా నేనే కర్ణాటక పత్రికకూ రాయలేదు మొర్రో అని తస్లీమా నస్రీం వాపోయారు. ఇదీ మతం కారణంగా మనస్సు గాయపరిచినప్పుడు ఆ మతం వారు చేసే ప్రయత్నం.

        మరొక్కసారి- నేను ప్రమోద్ ముతాలిక్ చర్యని ఏ మాత్రం సమర్ధించను.

        ఎక్కడో డేనిష్ పత్రికలలో తమ మతాన్ని ఎవరో కార్టూన్లలో అపహాస్యం చేశారని- కొన్ని వందల కార్లు,ఆస్తులూ ప్రపంచమంతటా తగలడ్డాయి. నేనా కార్టూన్లు చూశాను. తగలెట్టిన వాళ్ళెవరూ ఆ కార్టూన్లు చూసివుండరు.

        ఖతార్ వారసత్వం దక్కిన హుస్సేన్ అనే మేధావి కళాకారునికి తన స్వేఛ్ఛనీ, తన artistic expression నీ ఈ దేశం పద్మభూషణ్ ని చేసి అందలమెక్కించగా- ఈ జాతి చదువుల తల్లిని, దేశమాతని బట్టలిప్పి అవమానించారని వారికి తెలీదా? అందుకు ఆయన భేషరతుగా జాతికి క్షమాపణ చెప్పవలసిన అవసరం లేదా? 90 ఏళ్ళు బతికిన జన్మస్థలానికి విలువనివ్వడం తెలీని కళాకారుడు మరో దేశం పౌరసత్వాన్ని ఆలంబన చేసుకోవడం ఆయన అభిరుచి దారిద్ర్యాన్నే ఎక్కువగా చెప్తోంది.

        స్వేఛ్ఛ గురించి మాట్లాడే, హుస్సేన్ గారి కళా వైదగ్ధ్యాన్ని తలకెత్తుకునే , భారతదేశం వారికి జరిపిన అన్యాయానికి వాపోయే పెద్దలకు ఈ చిత్రాలు ఆక్షపణగా అనిపించలేదా? Artistic expression, artistic freedom అని జుత్తు పీక్కొనే వీరికి ఈ పనిలో artistic vulgarity, artistic decadence కనిపించడం లేదా?

        మళ్ళీ మరొక్కసారి-నేను ప్రవీణ్ తొగాడియా భక్తుడిని కాను.

        కాని గుర్రాల మీదా, గాడిదల మీదా బొమ్మలు వేసే హుస్సేన్ గారి చిత్రకళా నైపుణ్యాన్ని నేనీమధ్య టీవీలో చూశాను. నేను భారతీయుడినని వారు వాపోవడాన్ని పేపర్లో చదివాను. కాని ఏ ఒక్కసారీ ఆయనకానీ, ఆయన్ని వెనకెసుకొచ్చే అద్భుతమైన విచక్షణ గల పెద్దలు గానీ బట్టలిప్పిన బొమ్మల గురించి మాట్లాడకపోవడం- నాలాంటి నేలబారు భారతీయుడిని ఆశ్చర్యపరుస్తుంది. గాయపరుస్తుంది.

        నా సెన్సిటివిటీ హర్ట్ అవుతోంది. మేధావులకు అలాంటి ప్రమాదం లేదేమో. ఈ మధ్య ఓ జ్యోతిష శాస్త్ర   నిపుణుడు  నాతో అన్నాడు. మనిషికి 80 ఏళ్ళు దాటాక ఇక ఏ శాస్త్రంతోనూ పనిలేదని.

        బహుశా 94 ఏళ్ళు దాటిన హుస్సేన్ గారు ప్రస్థుతం ఆ పరిస్థితిలోనే ఉన్నరేమో. ఇది సెనిలిటీ నిలదొక్కుకునే వయస్సు కనుక.

        క్షమించండి. నేను నేలబారు పామరుడిని. భారతీయుడిని. సరస్వతీ నమస్థుభ్యం అని అయ్యవారు అక్షరాలు రాయించగా అక్షరాభ్యాసాన్ని ప్రారంభించినవాడిని. నాకు తెలిసిన స్వేఛ్ఛల జాబితాలో పద్మవిభూషణ్ గారి బట్టలిప్పిన సరస్వతి, దేశమాతల బొమ్మలు లేవు.

        రాళ్ళు రువ్వడం నా స్వభావానికి విరుద్ధం. కాని ఈ విషయంలో ప్రమోద్ ముతాలిక్ నీ, ప్రవీణ్ తొగాడియానీ నేనర్ధం చేసుకోగలను. ఈ దేశంలో ఛాందసత్వం తిరగబడడానికి కారణం- అర్ధంలేని, అవసరంలేని, అసందర్భమైన మేధావి వర్గం ఆత్మవంచన అని నాకనిపిస్తుంది.

        ఒక బింద్రన్ వాలేనీ, ఒక ఒసామా బిన లాడెన్ నీ ఆయా వ్యవస్థలే తయారు చేశాయని మనం మరిచిపోకూడదు.

 

           మార్చి 08, 2010

       ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

KOUMUDI HomePage