నాకు చాలా ఇష్టమైన ఆల్ర్ఫెడ్ హిచ్ కాక్ సినిమాల్లో 'ది రోప్' ఒకటి. ఒక సాయంకాలం
- కేవలం ఊసుపోకకి, తమ తెలివితేటల్ని నిరూపించుకోవాలనే వికారమైన, విపరీతమైన
ఆనందానికి ఇద్దరు యువకులు తన మిత్రుడిని హత్యచేసి ఒక సందుగ పెట్టెలో శవాన్ని
ఉంచి, ఆ పెట్టె మీదే ఆ సాయంకాలం మిత్రులకి విందుని ఏర్పాటు చేస్తారు. వాళ్ళ
టీచరు హత్యని గుర్తుపడతాడు. అప్పటి ప్రముఖ నటుడు జేమ్స్ స్టూవర్ట్ ఆ పాత్రని
నటించాడు. విషయం తెలిసి షాక్ అయి వాళ్ళిద్దరినీ నిలదీస్తాడు. "మరొక వ్యక్తిని
చంపేహక్కు మీకెవరిచ్చారు? మీరేం దేవుళ్ళా?" అంటాడు. సంవత్సరాలు గడిచినా ఆ
సన్నివేశం నాకు జ్నాపకం వస్తూంటుంది. రీలు నిడివి 900 అడుగులు కనుక - తప్పదు
కనుక - 8 షాట్లలో తీసిన ఈ చిత్రంలో ఆ పతాక సన్నివేశాన్ని అద్భుతంగా నటించారు
జేమ్స్ స్టూవర్ట్. ఆనాటికీ, ఈనాటికీ అది గొప్ప ప్రయోగం. అయితే అలా తీసినందుకు
తర్వాత హిచ్ కాక్ బాధపడ్డాడు. కారణం? కొన్ని నిశితమైన విషయాల్ని నిలదీసి
చెప్పలేకపోయినందుకు. సరే. ఇది విషయాంతరం.
మనిషి చావుని నిర్ణయించే అధికారం ఒక్క దేవుడికే ఉందని గుర్తుచేసిన సందర్భమది.
మరి ఉరిశిక్షలు? అవసరమా? ఉరిశిక్షలు విధించే హక్కు న్యాయస్థానానికి ఉన్నదా,
ఉండాలా అన్నది ఇంతవరకూ తెగని సమస్య. ఏ అజ్మల్ కసాబ్నో, అఫ్జల్ గురూనో, కొన్ని
లక్షల మంది యూదుల చావుకి కారణమయిన అడోల్ఫ్ ఈక్ మన్ నో తలుచుకున్నప్పుడు మన
నమ్మకాలు సడులుతాయి. కాని ఆరోగ్యకరమైన వ్యవస్థలో 'చావు' సామాన్యమే అయినా చంపడం,
చచ్చిపోనివ్వడం, కోరి చావుని అంగీకరించేటట్టు చేయడం - సంస్కారానికీ, ఉదాత్తమయిన
మానవతా విలువలకీ ఎదురు తిరిగే సమస్య.
ఇప్పుడు అసలు కథ. 1973 లో కర్ణాటకలో హాల్దీపూర్ లోని కింగ్ అడ్వర్డ్ మెమోరియల్
ఆసుపత్రిలో పనిచేసే అందమయిన నర్స్ - అరుణా షాన్ బాగ్ ని సోహన్ లాల్ భార్తా
వాల్మీకీ అనే వార్డ్ బోయ్ కుక్క గొలుసుతో గదిలో బంధించి దారుణంగా రేప్ చేశాడు.
ఆమె చెవి రింగులు, రిస్టువాచీ దోచుకున్నాడు. గొలుసుతో గొంతు బిగించడం వల్ల -
మెదడుకి అందాల్సిన ప్రాణవాయువు నిలిచిపోయింది. అతని హింసకి ఆమెకి చెవులు పోయాయి.
కళ్ళుపోయాయి. మానసిక స్థిమితం పోయింది. అప్పటినుంచీ - 37 సంవత్సరాలు - ఇదే
స్థితిలో - అరుణ కొనసాగుతొంది. ఆమెకి ప్రస్తుతం 62 సంవత్సరాలు. కేవలం ప్రాణం
ఉన్న కట్టెలాగ - జీవచ్చవమైపోయింది. శరీరంలో ప్రాణం ఉంది. ఏదయినా ఆహారం ఇస్తే
నోరు తెరుస్తుంది. ఆమెకి ఆ రోజుల్లో ఇష్టమైన మాంసాహారం ఇస్తే ముఖం కాస్త
వికసిస్తుంది. నోటమాట లేదు.
ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న. ఎవరికీ ఉపయోగంలేని, తనకూ ప్రయోజనం లేని ఈ జీవితాన్ని
నిరవధికంగా ఇలా కొనసాగించవలసిందేనా - అన్నది. అయితే మనిషి ఏదయితే ఇవ్వలేడో -
మనిషి ప్రాణాన్ని - దాన్ని తీసే హక్కు అతనికి లేదన్నది - ముఖ్యమయిన వాదన. ఆమె
దయనీయంగా హింసని అనుభవించకుండా - హుందాగా, నిశ్శబ్దంగా కన్నుమూసే హక్కు ఆమెకి
ఉన్నది - అన్నది మరో వాదన.
అయితే ఈ హక్కుని ఎవరు నిర్ణయించాలి? వెళ్ళిపోవడాన్ని ఆమె కోరుకుంటున్నదని ఎవరు
నిరూపించగలరు? మనకు తెలియని నిర్ణయాన్ని, మనం మంచిదనుకున్న విధంగా - ఒక
ప్రాణానికి సంబంధించి తీసుకునే హక్కు ఉన్నదా? సంస్కృతీ వికాసంలో మానవుని
సంస్కారాన్నీ, ఉదాత్తత ప్రశ్నించే అత్యంత కీలకమైన విషయం ఇది. ఈ నిర్ణయాన్ని
బంధువులు కోరినా, ఆత్మీయులు ఆర్ధించినా "ఆమె తన్నుకులాడుతోంది. వెళ్ళిపోనివ్వండి"
అని అయినవాళ్ళు ప్రార్ధించినా - నిర్ణయం తీసుకోడానికి న్యాయవ్యవస్థ ఎప్పుడూ
వణుకుతూనే ఉంది.
కారణాలు - మానవత్వపు విలువలకి సంబంధించినవే - ఎన్నెన్నో. గుండెల్ని వణికించే
ఉదాహరణ - అమెరికాలోనే జరిగింది. కారెన్ ఆన్ క్విన్ లాన్ అనే ఆవిడ చాలా
సంవత్సరాలుగా ఇలాంటి దయనీయమైన స్థితిలోనే ఉన్నది. ఇది 1975 మాట. కోర్టు ఆమెను
చచ్చిపోనివ్వవచ్చని అంగీకారం తెలిపింది. వెంటిలేటర్లు తీసేశారు. ఆ తర్వాత ఆమె -
కేవలం పది సంవత్సరాలు బతికింది. న్యాయస్థానం, ప్రపంచం వణికిపోయింది. 1985 జూన్
11 న కన్నుమూసింది. మృత్యువుని ఆహ్వానించడానికి మనమెవరం? మన తాహతు ఎంత?
భవిష్యత్తుని గురించి మన అవగాహన ఎంత? నైతికమయిన ఊతం ఎంత?
ఈ విషయమై గుండెల్ని పిండిచేసేంత అద్భుతమైన నాటకాన్ని బెన్ క్లార్క్ అనే అమెరికన్
నాటక రచయిత రాశాడు. ఈ నాటకం ఆధారంగా తీసిన సినిమాలో ఈ పాత్రని మహానటుడు రిచర్డ్
డ్రైఫస్ నటించారు. ఆ చిత్రం ఒక మహాకావ్యం. అతని నటన అపూర్వం. అంతకుమించి - ఆ
నాటకం ఇచ్చే సందేశం.
అరుణ గురించి పింకీ ఇరానీ అనే పాత్రికేయురాలు 'అరుణ కథ' అని పుస్తకం రాసింది.
ఆమె సుప్రీం కోర్టులో ఒక దరఖాస్తు పెట్టింది. అరుణ చూడలేదు. వినలేదు. ఒక
నిర్జీవమైన కట్టె ఆమె జీవితం. ఆహారాన్ని ఆపుచేసి హుందాగా ఆమెని వెళ్ళిపోనివ్వండి
- అని ఆమె దరఖాస్తు సారాంశం. ఒక నిర్ణయానికి రావడానికి సుప్రీం కోర్టు గుంజాటన
పడుతోంది. ఒక విధంగా అజ్మల్ కసాబ్ శిక్షని నిర్ణయించడం తేలిక. ఒక దురన్యాయానికి
గురై, ప్రాణాలతో ముప్పై ఏడు సంవత్సరాలుగా పోరాడుతున్న మనిషిని చచ్చిపోనివ్వాలా
వద్దా అన్నది, అతి క్లిష్టమైన నిర్ణయం.
ఇంతకీ నేరస్థుడు సోహన్ లాల్ ఎమయాడు? హత్యకి ప్రయత్నించినందుకు అతనికి కోర్టు ఏడు
సంవత్సరాలు శిక్షని విధించింది. రేప్ నేరాన్ని కోర్టులో ప్రవేశపెట్టలేదు నర్స్
భవిష్యత్తు దృష్ట్యా. ఫలితంగా సోహన్ లాల్ ఏడేళ్ళ తర్వాత విడుదలయి, పేరు
మార్చుకుని - మళ్ళీ ఢిల్లీ ఆసుపత్రిలో వార్డ్ బోయ్ గా చేరాడు. ఈ మధ్య ఎయిడ్స్
వ్యాధితో చచ్చిపోయాడు.
ఆమెని పరీక్షించిన వైద్యుడు డాక్టర్ ప్రజ్నా పాయ్ - ఇలా అన్నారు. ప్రాణాన్ని
నిలిపే యంత్రాల మీద ఆధారపడి ఆమె ప్రస్థుతం ప్రాణం నిలుపుకోలేదు. గుండె
కొట్టుకుంటోంది. మెదడు - ఏ కొంచెమయినా పనిచేస్తోంది. అంటే ఆమె చచ్చిపోయినట్టు
లెక్కకాదు.
అయితే ఏది చావు? మర్యాదస్తుడికి పరువు, నీతి పరుడికి నింద, ఆడదానికి మానం,
మగాడికి బ్రతికే ఆశ - చాలదు. మనిషి ఇంక చచ్చిపోవచ్చునని చెప్పడానికి ఈ తూకపు
రాళ్ళు చాలవు. ఇంకాస్త లోతుకి పోతే ప్రాణం పోయలేని మనిషి మరొక ప్రాణం
తీయవచ్చునని నిర్ణయించడానికి ఏ తూకపు రాయీ చాలదు.
మరి ప్రేమించలేదని ఏసిడ్ పోసేవాళ్ళకి, మతాన్ని ఎదిరించారని మారణ హోమానికి
పూనుకున్నవారికి, కార్పణ్యాలు కారణంగా కత్తులు దూసేవారికి - 'చావు' ఒక ప్రతీకారం.
కాని న్యాయవ్యవస్థకి, ఉదాత్తమయిన మానవతా దృష్టితో చూడగల వ్యక్తికి - మరొకరి 'చావు'ని
నిర్ణయించడం - అత్యంత సాహసం. అనూహ్యం. నరాల్ని వణికించే మీ మాంస.
ఇదే ఓ ఏసుప్రభువు, ఓ మహాత్ముడూ, ఓ బుద్దుడూ, ఓ మదర్ థెరెస్సా - తాము జీవించి -
నిరూపించినది. తమ ప్రాణాలు ఒడ్డి రుజువు చేసినది.
మృత్యువు సమదర్శి - మన ప్రమేయం లేకుండా మీద పడినప్పుడు. మృత్యువు పెద్ద చెలియలి
కట్ట - మనిషి జీవన గమనాన్ని ఆపే అవసరం, అగత్యం మన చేతుల్లోకి వచ్చినప్పుడు.
సుప్రీం కోర్టు పింకీ ఇరానీ దరఖాస్తుని తోసిపుచ్చింది. అరుణని ప్రాణాలతో
ఉండనివ్వాలని శాసించింది.