Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version.
Click Here

 

విదూషకుడి విషాదం
గొల్లపూడి మారుతీరావు

                 gmrsivani@gmail.com              

         చచ్చినవాడి కళ్ళు చేరడేసి అన్నది సామెత. పద్మనాభం అనే నటుడు నిన్న ఉన్నాడు. మొన్న ఉన్నాడు. అప్పుడు ఆయన కళ్ళు మామూలుగానే ఉన్నాయి. పోయాక ఆయన కళ్ళు సైజు పెరిగింది. సామెత వీధిన పడింది.

        అది లోక ధర్మం. సమాజం, సమీప సన్నిహిత ప్రపంచ క్రూరత్వానికి నిదర్శనం. మరొక్కసారి- యిది లోక ధర్మం.

        సినీమా నటుడు కావాలని ఏమాత్రం కలలు గనని, అసలు కలలు గనాలని తెలియని ఓ కుర్రాడి కొత్త ప్రపంచం అప్పటిది. కేవలం తనకు వంటబట్టిన పద్యాలు చదివి, మెప్పించి సైకిలు కొన్నుక్కోవాలని మద్రాసులో అడుగు పెట్టిన ఓ కుర్రాడు రావడమే సరాసరి కన్నాంబ సమక్షానికి వచ్చాడు. ఆమె ఆ కుర్రాడి పద్యాలు విని మురిసి- మొదట కడుపు నిండా అన్నం పెట్టించింది. కడారు నాగభూషణంగారికీ, తదితర యూనిట్ సభ్యులకీ పద్యాలు చదివింపించింది. ఆ విధంగా- అనుకోకుండా, ఆశించకుండా సినీమాల్లో పద్మనాభం ఆరంగేట్రం జరిగింది.

        దేశాన్ని నవ్వించాలని ఆయన మద్రాసు చేరలేదు. మహానటుడు కావాలని కలలుగనలేదు. ఆ బంగారు కలల కోసం అర్రులు జాచలేదు. తనమానాన తనని వదిలేస్తే- కడప దగ్గర సింహాద్రిపురంలో ఎవరికీ తారసపడని సాదాసీదా జీవితాన్ని పద్మనాభం గడిపేవారేమో! విధి నడిపించే దారిని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు.

        తన స్నేహితుడి కూతురు పేరుని తన సంస్థకి పెట్టుకున్న అతి ఉదారమైన ఘనత ప్రపంచంలో ఒక్క పద్మనాభంకే దక్కుతుందనుకుంటాను.వల్లం నరసింహారావు కూతురు రేఖ. తన కొడుకు మురళి. తన నాటక సంస్థ పేరు రేఖా అండ్ మురళీ ఆర్ట్స్. సినీనటుడయి మద్రాసులో స్థిరపడ్డాక తనతో ప్రయాణాన్ని సాగించిన మిత్రులందరికీ తన కృషిలో భాగస్వాముల్ని చేశారు. అదే బానర్ మీద చిత్రాలు తీశారు. అలా నాటక సంస్థకి దూరంకాని మరో నటుడు నాగభూషణం.

        రాగయుక్తంగా పద్యాలు చాలామంది చదవగలరుకాని- నాటకీయంగా చదవడం ప్రత్యేకమైన సొగసు. నాకు తెలిసి- ఆ సొగసుని బాగా వంటబట్టించుకున్న ముగ్గురు-మాధవపెద్ది సత్యం, పద్మనాభం, ఎస్.వరలక్ష్మి.

        ఆ రోజుల్లో పద్మనాభం లేని సినీమా లేదు. ఆయన కోసం నేనూ వేషాలు రాశాను. నా తొలి చిత్రం- డాక్టర్ చక్రవర్తిలో పద్మనాభం చక్కని పాత్రను పోషించారు.

        పద్మనాభంలో చాలా లోపాలున్నాయి. ఒకటి: గతాన్ని మరిచిపోని కృతజ్ణతా భావం. రెండు: తనతో ప్రయాణం చేసిన స్నేహితుల్ని ఆద్యంతమూ తనతో నిలుపుకునే ఆప్యాయత. మూడు: తన విజయాన్ని తోటివారితో పంచుకునే సౌజన్యం. మనిషిని మనిషి తినే వ్యాపార ప్రపంచంలో ఇన్ని లోపాలు చాలా ప్రమాదకరమైనవి.

        ఆయన చక్కని వ్యాపారి అయివుంటే దేవత వంటి హిట్ తర్వాత వరసగా వ్యాపారం చేసి డబ్బు కొల్లగొట్టగలిగేవాడు. కధానాయిక మొల్ల వంటి కళాత్మకమైన చిత్రానికి- అదిన్నీ అప్పటికి పెద్ద పేరు సంపాదించని వాణీశ్రీతో తీసేవాడుకాదు. ఆ తర్వాత వ్యాపారాన్ని మరిచి వ్యక్తిని ప్రమోట్ చేసే చిత్రాలు తీసేవారుకాదు. లారల్ హార్డీ,నార్మన్ విజ్డమ్, డానీ కేయీ వంటి హాస్యనటులు హీరోలుగా

చేస్తే చెల్లుబడి అయే దశ ఇంకా అప్పటికి మన దేశంలో రాలేదు. అది చిన్న తప్పటడుగని నేననుకుంటాను.

        బూతులు, నాటు శృంగారాన్ని వినోదంగా సరిపెట్టుకునే దశలో పద్మనాభం వంటి నికార్సయిన స్లాప్ స్టిక్ హాస్యం వెనుకబడింది. కాగా, హాస్యం అనునిత్యం పారే సెలయేరు. జాతి లక్షణాన్ని పుణికిపుచ్చుకుంటూ మారుతూ పోతూంటుంది. ఒక సమాజం అభ్యున్నతి తెలియాలంటే ఆ సమాజం నవ్వుకుంటున్న హాస్యం తెలియాలి. అందులో ఔచిత్యం ఉందా, అభిరుచి దారిద్ర్యం ఉందా, లేకితనం ఉందా, చవకబారుతనం ఉందా, వ్యంగ్యం ఉందా? సమాజపు పురోగతికి హాస్యం కొలబద్ద. ఈ స్కేల్ తో కొలిచినప్పుడు పద్మనాభం బాక్ నంబర్ కావడం ఆయన తప్పు కాదు.

        పద్మనాభంగారిని మొదటిసారి, ఒకే ఒక్కసారి అమెరికా తెసుకువెళ్ళిన అవకాశం నాది. శ్రీలంక మీదుగా వెళ్ళాం. శ్రీలంక విమానాశ్రయంలో ఆనందంతో ఉర్రూతలూగిపోయారు. మా మారుతి నన్ను లంకకి తెసుకువచ్చాడు అని. అమెరికాలో 18 చోట్ల సుబ్బిశెట్టి పాత్రతో తన పద్యాలతో ప్రవాసాంధ్రులను తేలికగా పాతికేళ్ళు వెనక్కి తీసుకుపోయారు. అక్కడివారికి నాకంటే పద్మనాభం తరం హాస్యానికి మక్కువ ఎక్కువ. నేనూ, జె.వి.సోమయాజులు, పద్మనాభం, తులసి- నా నాటికలు

దొంగగారొస్తున్నారు స్వాగతం చెప్పండి, మనిషి గోతిలో పడ్డాడు ప్రదర్శించాం.

        ఆయన స్టేజిమీదా, తెరమీదా కనిపిస్తే చాలు ప్రేక్షకులకి మృష్టాన్న భోజనం. ఆయనకి పోర్షన్ కంఠస్థం చేయడం రాదు. ఇంప్రొవైజ్ చేసుకుంటారు. పాత్రని అన్వయించుకుంటారు. అదొక కళ. నా రేడియో నాటిక అడ్డుగోడలు లో అద్భుతమైన పాత్రని చేశారు.

        తెలుగు చలన చిత్ర పరిశ్రమ వజ్రోత్సవాలలో 75 సంవత్సరాలు నిండిన పద్మనాభంగారికి సన్మానం జరిగింది. అదే సందర్భాన్ని పురస్కరించుకుని- మద్రాసులో మరొక సంస్థ మరికొంతమందిని సత్కరించినప్పుడు నా చేతులమీదుగా పద్మనాభంగారిని సత్కరించే అవకాశం నాకు దక్కింది.

        తీసిన చిత్రాలు దూరమై, వయస్సు మీద పడినప్పుడు- పద్మనాభంగారు అంతర్ముఖులయారు. విదూషకుడి కన్నీరుకూడా ప్రేక్షకులకి ఆటవిడుపే. హాస్యనటుల జీవితాల్లో విషాదం- చాలామందికి సామాన్యధర్మం. చాప్లిన్ దగ్గర్నుంచి పద్మనాభం వరకూ అది సామన్య నైజమయిపోయింది. దానిని కళగా మలిచిన ఒకే ఒక శిల్పి చాప్లిన్.

        ఆర్ధిక విజయం చేదోడయితే పద్మనాభం నూరేళ్ళు జీవించేవారు. హాస్యం జీవిత వాస్తవాల మీద కళాకారుడు పరిచే పల్చటి తెర. అదిచిరిగిపోతే కళాకారుడి కళ్ళు వర్షిస్తాయి. అయినా ప్రేక్షకులు నవ్వుతూనే వుంటారు. అది హాస్యం కాదని కళాకారుడికి తెలుస్తూనే ఉంటుంది. కాని ప్రేక్శకులకి వినోదం ఒక అలవాటు. ఆ అలవాటుని కొనసాగిస్తారు. ఇదే రాజకపూర్ కళాఖండం మేరా నామ్ జోకర్.

        హాస్యనటుడి కన్నీరు వస్తూంటుంది. దాన్ని ఉదారంగా, కృతజ్ణతతో, అలవాటుగా ప్రపంచం దాన్ని ఆనందంగా తర్జుమా చేసుకుంటూనే వుంటుంది. పద్మనాభం అనే ఓ గొప్ప కళాకారుడూ, ఓ గొప్ప మనిషి, గొప్ప మిత్రుడు చెల్లించిన మూల్యం అది.       

 

           మార్చి 01, 2010

       ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

KOUMUDI HomePage