Click Play to listen audio of this column If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here
ఇద్దరు పెద్దలు - ఒక నివాళి
ఒక మహానటుడు:
ఈ వారం ఇద్దరు పెద్దలు వెళ్ళిపోయారు. ఇద్దరూ వారి వారి రంగాలలో ప్రసిద్ధులు,
ప్రతిభావంతులు, నిష్ణాతులు, చరిత్రని తిరగరాసినవారు.
కిందటి జనవరి మొదటి తేదీన పుస్తక ప్రదర్శన ప్రారంభించడానికి ఆహ్వానించినప్పుడు
- నేను కలుసుకోవాలని ఎదురు చూసిన మిత్రులు, హితులు మిక్కిలినేని. ఉదయం రైలు
దిగుతూనే భార్యా సమేతంగా వెళ్ళాను.
మిక్కిలినేని కూతురు ఆలనలో అతి ప్రశాంతంగా కనిపించారు. ఆయన జీవితమే ఆద్యంతమూ ఒక
ఉద్యమం. ఇంత విస్తృతమైన పరిధి చాలామందిలో చూడము. అలనాడు పార్టీ కలాపాలలో
వెన్నుపూసగా నిలిచి ఇండియన్ పీపుల్స్ థియేటర్ ఆంధ్ర విభాగం ప్రజా నాట్యమండలి
సభ్యుడిగా బుర్రకథ దళాలతో ఎన్నో కార్యక్రమాలు ఇచ్చారు. సుకర సత్యనారాయణగారి "మా
భూమి"ని ఊరూవాడా ప్రదర్శించారు. అటు ప్రముఖ నటుడు బలరాజ్ సహానీ ఆ నాటకాన్ని
హిందీలోకి అనువదించారు. వివిధ కళాప్రదర్శనలతో జన చైతన్యాన్ని కలిగించిన దశ అది.
ఆ అనుభవాలను కదిలిస్తే అలవోకగా ఎన్నో ఒళ్ళు గగుర్పొడిచే కధల్ని విప్పేవారు. ఇక
'దీక్ష ' సినిమాతో సినీరంగ ప్రవేశం చేసి కొన్ని విలక్షణమయిన పాత్రలకు
ప్రత్యామ్నాయం లేని నటుడిగా దాదాపు 350 చిత్రాలు నటించిన దశ మరొకటి.
పుట్టినిల్లుని మరిచిపోకుండా కన్నతల్లి నాటకరంగానికి తనదైన సేవగా 'నాటక రంగ
చరిత్ర ', 'నటరత్నాలు ' వంటి పరిశోధనాత్మక కృషి ఇంకొకటి. ఇది నాటకరంగానికి ఆయన
చేసిన ఎనలేని ఉపకారం.
మద్రాసులో - ఆ మాటకి వస్తే మద్రాసులో అన్నమాటేంటి? - ఏ తెలుగు సభలోనయినా - ఓ
బృందం ప్రత్యేకంగా దర్శనమిచ్చేది. మిక్కిలినేని, నేరెళ్ళ వేణుమాధవ్, పేకేటి,
సినారె - ఇలాగ. బంగారం రంగు ఖద్దరు లాల్చీ, చక్కటి పంచెకట్టుతో ఎప్పుడూ
ప్రశాంతంగా, ప్రసన్నంగా కనిపించేవారు. దశాబ్దం కిందట తరం మారి, అభిరుచుల అంతరం
పెరిగినప్పుడు విజయవాడ తరలిపోయారు. నేను కలిసినప్పుడు "ఆరోగ్యం బాగుంది కాని
నడుస్తూంటే తూలు వస్తోంది. ఆ మధ్య రోడ్డుమీద పడిపోయాను. ఇప్పుడు ఎటూ వెళ్ళడం
లేదు" అన్నారు. 94 సంవత్సరాల సమగ్ర జీవనమే ఆయన జీవన శైలికీ, క్రమశిక్షణకీ
తార్కాణం.
పదిమంది శ్రేయస్సు గురించిన ఆలోచన ఆయనకి పార్టీ ఇచ్చిన స్ఫూర్తి. చక్కని విగ్రహం,
గంభీరమయిన శరీరం, నటనా కౌశలం - జన్మతః వచ్చిన వరాలు. బుర్రకథలో వేదిక మీద సింహం
లాగా దూకే మిక్కిలినేని ఛాయలు 'మాయాబజార్' వంటి చిత్రాలలో మచ్చుకి దొరుకుతాయి.
ఆ కళాఖండంలో మరో తార రాలిపోయింది. జీవితాన్ని నిలకడగా, నిండుగా, హుందాగా,
హృద్యంగా పండించుకున్న నటుడు, రచయిత మిక్కిలినేని. మనిషి నడిచిపోయిన అడుగుజాడలు
అభ్యుదయాన్ని ఆశించేవారికి దారిచూపుతూనే ఉంటాయి. ఒక మహా రచయిత:
చాలా నెలల కిందట చెన్నై పొట్టి శ్రీరాములు హాలులో జరిగిన బాపూ చిత్రప్రదర్శనకు
నేను ప్రారంభకుడిని. ఆనాటి సభలో బాపూ రమణగార్లు ఉన్నారు. నేను ప్రసంగంలో
చెప్పాను. మహా రచయితలు ముందు తరం వేసిన మార్గం వెంట ప్రయాణం చేస్తారు. కానీ
జీనియస్ లు కొత్త మార్గాన్నే నిర్దేశిస్తారు - అని. అటువంటి జీనియస్లు బాపూ రమణ.
ఏ పేరు మొదలెట్టినా రెండో పేరు కలవకపోతే అది సంతకంలో సగభాగమే. ఇద్దరూ ఒకే
నాణానికి రెండు పార్శ్వాలు. ఒక విలక్షణమైన హాస్య ధోరణికి రెండు సూచికలు. రమణ
రచనలు చెయ్యలేదు. అది మామూలు రచయితలు చేసే పని. కొత్తపాత్రల్నీ, కొత్త
నుడికారాన్నీ, కొత్త ఇతివృత్తాల్నీ, కొత్త తరహా హాస్యాన్నీ సృష్టించారు. మించి
జీవించే నైర్మల్యాన్నీ, జీవితపు విలువల్నీ తాను జీవించి నిరూపించారు. ఆ
జీవితానికి దృశ్యభాష్యం పేరు - బాపూ.
నా జీవితంలో నేను రాసిన రెండో చిత్రం - రమణగారు మొదలు పెట్టి - హఠాత్తుగా
అక్కినేని 'బుద్దిమంతుడు 'కి కాల్ షీట్లు ఇచ్చిన కారణంగా తాను పూర్తిచెయ్యలేని
'భలే రంగడు '. "ఈ పని నాకు సహాయం చేస్తున్నాననుకొని చేయండి" అన్నారు రమణ. అది
ఆయన పెద్దమనస్సు. మద్రాసులో మా రెండు కుటుంబాలూ అత్యంత సన్నిహితం. మా కోడళ్ళు
పెట్టే బొమ్మల కొలువుని చూడటానికి వచ్చి మనసారా ఆనందించేవారు. మా ఇంట్లో ప్రతీ
శుభకార్యంలోనూ వారి సతీమణుల పాత్ర ఉంటుంది.
ఏ సభకయినా - మా సభలకూ - రమణగారు రహస్యంగా వచ్చి - ఓ మూలన కూర్చుని ఆనందించి
మాయమవుతారు. ఏ సభలోనయినా 'మొహమాటం'గా పాల్గొంటూ తమ చుట్టూ తెర దించుకుంటారు. అది
ఆయన స్వభావం.
వారి పాత్రలూ, సినిమాలూ, కథలూ నిన్న మొన్నటి కోతి కొమ్మచ్చి వరకూ వారికే
ప్రత్యేకం. అలాగే వారి అభిమానుల సంపద వారికే ప్రత్యేకం. మంచి చెడులూ, రాణింపులూ,
విజయాల ప్రమేయం లేకుండా బాపూ రమణ సంతకం ఉన్నందుకే - చూసి, చదివి ఆనందించే
అభిమానుల్ని సంపాదించుకున్న ఘనత వారిది. చదువు మీద ఏ మాత్రమూ ఆసక్తిలేని
ఇళ్ళల్లో కూడా వారి పుస్తకాల బైండ్లు - కేవలం వారివే - ఎన్నో దేశాల తెలుగు
ఇళ్ళల్లో చుశాను నేను. వాటి పక్కన ఏమూలయినా నా పుస్తకం మచ్చుకి ఒక్కటయినా
ఉంటుందా అని వెదికి వెదికి నిరాశ చెందాను. 'నవ్వు'కి రమణగారు ఆలోచనతో, బాపూగారు
ఆలోచనాత్మకమయిన బొమ్మతో ఇచ్చిన యూనివర్సల్ పాస్ పోర్టు అది.
ఇద్దరూ రామభక్తులు. రమణగారి ఆఖరి చిత్రం రామకథ. అంతకన్న ధన్యత్వం ఏముంది?
విశాఖ పట్నంలో ఉన్న నాకు ఎవరో ఫోన్ చేసి రమణగారు వెళ్ళిపోయారని చెప్పారు. మూడు
నాలుగుసార్లు బాపూగారికి ఫోన్ చెయ్యాలని ఫోన్ పట్టుకుని, ప్రయత్నించి
చెయ్యలేకపోయాను. కారణం - బాపూగారిలో ఓ పెద్ద భాగం కన్ను మూసింది. సంతాపానికి
సంతాపం చెప్పడం సాహసం. నా అనుభవానికి లొంగని ప్రయత్నమది. బాపూగారి సోదరులు,
రమణగారి వియ్యంకులు, రేడియోలో నా సహచరులు, చిత్రకారులు, నా మిత్రులు శంకర్
నారాయణగారికి ఫోన్ చేశాను.
A part of Bapu is dead. Can you convey my condolences... please..!