Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version.
Click Here
 
  'పేద' మెలో డ్రామా

గొల్లపూడి మారుతీరావు
      gmrsivani@gmail.com
 

ఆనాటి బ్రిటిష్ ప్రధానమంత్రి విన్ స్టన్ చర్చిల్ తన అనుభవాలలో చెప్పిన కథ ఇది. రెండవ ప్రపంచ యుద్ధం రోజుల్లో - ఇద్దరే పాపులర్ నాయకులు - హిట్లర్, చర్చిల్. మిగతా వారంతా వీరి తర్వాతే. ఇద్దరూ అమోఘమైన వక్తలు. రెండు వేర్వేరు దృక్పధాలకి ప్రపంచాన్ని ఆకట్టుకున్న నాయకులు - ఇద్దరూ విరోధి పక్షాలవారు.
యుద్ధపు రోజుల్లో జాతిని ఉత్తేజపరచడానికి చర్చిల్ రేడియోలో చేసే ప్రసంగాలు చాలా ఆవేశపూరితంగానూ, ఆసక్తికరంగానూ ఉండేవి. ప్రపంచమంతా చెవులొగ్గి వినేది. ముఖ్యంగా - బ్రిటిష్ ప్రజలకి అవి అపూర్వమైన క్షణాలు. అప్పటికింకా చర్చిల్ ప్రధాని కాలేదు. ఇప్పుడు చర్చిల్ చెప్పిన ఉదంతం వినండి.
ఆయన హడావుడిగా - బి.బి.సి. ఆఫీసుకి వెళ్ళాలట - ప్రసంగిచడానికి. టాక్సీ ఎక్కవలసి వచ్చింది. డ్రైవరు తీసుకెళ్ళనన్నాడు. కారణం - మరో అరగంటలో చర్చిల్ ప్రసంగం వినాలని. "పోవయ్యా నేను రాను. చర్చిల్ ప్రసంగం వినాలి" అన్నాడట. అవి రేడియో రోజులు. టీవి రోజులు కావు. చర్చిల్ ముఖం అంత పాపులర్ కాదు (కనీసం ఆ టాక్సీ డ్రైవరుకి). చర్చిల్ ఆ మాటకి ఆనంద పడ్డాడు. తనే చర్చిల్ నని చెప్పడం నామోషీ అనిపించింది. ఉదారంగా, ఉదాత్తంగా తన అభిమాన శ్రోతకి రెట్టింపు ధర ఇస్తానన్నాడు. టాక్సీ డ్రైవరు ఎగిరి గంతేశాడు. "ఎవడిక్కావాలయ్యా బోడి చర్చిల్ ఉపన్యాసం! కారెక్కు" అన్నాడట. ఇది చర్చిల్ స్వయంగా చెప్పిన సంఘటన. అదీ ఈ కథకి రుచి.
ఈ కథ నీతి ఏమిటయ్యా అంటే - డబ్బుకంటే ఏ వ్యక్తి పరపతీ ఎక్కువ కాదు - అని. దీన్ని ప్రస్తుతం మన దేశంలో నిరూపిస్తున్నంత ఉదారంగా ఏ దేశపు రాజకీయ చరిత్రా నిరూపించలేదు.
నా కనిపిస్తుంది. పదేళ్ళకిందట ఎవరైనా డి.ఎం.కె.రాజాగారిని ఓ గదిలో కూర్చోబెట్టి "చూడు బాబూ! నిన్ను పదేళ్ళ పాటు రెండుసార్లు మంత్రిని చేస్తాం. చేతనయినంత తిను. మా చేత తినిపించు. ఏనాడయినా గుట్టు బయటపడితే - ఓ పధ్నాలుగు రోజులు జైల్లో ఉండడానికి సిద్ధపడాలి. ఆ తర్వాత నీకేమీ జరగదు. నీవాటా నీకుంటుంది" అని చెప్పివుంటే (చెప్పారేమో!) ఆయన ఆనందంగా తలూపేవాడనుకుంటాను. నా మట్టుకు ఆయన వాటాలో నాకు నాలుగోవంతు (పోనీ పదోవంతు) ఇస్తే నేను 28 రోజులు జైల్లో ఉండడానికి అంగీకరించేవాడిని.
మనకి బోలెడన్ని పాతకథలున్నాయి. అలనాడు జైన్ గారు రాసుకున్న హవాలా డైరీలు దొరికాయి. అందులో విష్ణు సహస్ర నామంలాగా ప్రముఖ నాయకులందరి పేర్లూ - ఎల్.కేద్వానీ, వీ.సీ.శుక్లా, పి.శివశంకర్, శరద్ యాదవ్,బలరాం జక్కర్, మదన్ లాల్ ఖురానా వంటి నాయకుల పేర్లున్నాయ్. ప్రస్తుతం వీరిలో కొందరు ఇప్పటికీ నాయకులే. వీరందరికీ 180 లక్షల డాలర్లు ముట్టజెప్పినట్టు జైన్ గారు రాసుకున్నారు. వారిలో ఒక్కరూ అరెస్టు కాలేదు. తగినంత సాక్ష్యం లేదని డైరీల్లో రాతలు మాత్రమే నేర నిరూపణ చెయ్యలేవని 1997 లో కోర్ట్ కేసుని కొట్టేసింది.
(అవినీతికి చిన్న కిటుకు: తమరెప్పుడైనా అవినీతి విషయాలపై డైరీల్లో రాసుకునేటప్పుడు - ఎందుకేనా మంచిది - నలుగురైదుగురు నాయకుల పేర్లు కూడా జతచేసుకోండి. వారు మురికి నీటిలో ఇండుగ పిక్కలాంటివారు. మీ అసలు అవినీతికి వారి పేర్లు విరుగుడుగా పనిచేస్తాయి.)
మధ్యలో చాలా కథలున్నాయి గాని - ఇటీవలి కథ - కామన్వెల్తు క్రీడల్లో కోట్ల అవినీతి ఉన్నదని పత్రికలు, ఛానళ్ళు గొంతులు చించుకున్నాయి. దీనికి కారకులు సురేష్ కల్మాడీ అన్నారు. వారి అనుచరులు మహేంద్రూ, దర్బారీ వంటి పెద్దల్ని అరెస్టు చేశారు. 90 రోజుల తర్వాత వారి నేరాలకి తగ్గిన సాక్ష్యాధారాలు లేవని విడుదల చేశారు.గిరీశం అన్నట్టు పెద్దవాళ్ళకి చిన్న గడువు. చిన్నవాళ్ళకి పెద్ద గడువు. అయితే ఆఖరికి అందరూ విడుదల అవుతారు. తీరా వారు కూడబట్టుకున్న సొమ్ము! వారి దగ్గరే మిగిలిపోయింది!
రాహుల్ ఫతే ఆలీ ఖాన్ అనే గాయకుడి దగ్గర లక్షా పాతిక వేల డాలర్ల కరెన్సీ దొరికింది. వారిని అధికారులు ప్రశ్నిస్తున్నారు కాని, ఆయన స్వేచ్చగా వీధుల్లో తిరుగుతున్నాడు. 'పాడు' వారికి 'పాడు' పనుల్లో వాటాని ప్రశ్నించరాదని పాకిస్థాన్ ఆవేశపడుతోంది. ఆయన్ని జైల్లో పెట్టే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా? ఆయనకి డబ్బిచ్చినవారి గోత్రాలు ఎంత బలమైనవో!
ప్రస్థుతం మన రాజాగారిని తీహార్ జైలుకి పంపించారుగాని - లోపాయకారీ ఒప్పందం ప్రకారం వారు జామపండులాగ 14 రోజుల్లో బయటికి వస్తారని నా నమ్మకం.
అసలు విషయమేమిటంటే - ఈ దేశంలో సురేష్ కల్మాడీ ఇంట్లో సోదా, రాజాగారి అరెస్టు, షహీద్ బాల్వా అందమైన సూట్లో కార్లు ఎక్కి దిగుతూండడం - ఇవన్నీ పేదవాడి మెలోడ్రామాలు. న్యాయానికి మంచి రోజులు వచ్చాయని చంకలు గుద్దుకోడానికి ప్రదర్శనలు. గొప్పవాడు తలవొంచుకు నడవడం జనాన్ని కితకితలు పెట్టే చక్కని మెలోడ్రామా. పత్రికల్లో చదివి, టీవీల్లో చూసి జనం మురిసిపోతూంటారు. ఈలోగా బాలధాకరేలు, ఇందిరాగాంధీలు, లల్లూ ప్రసాద్ లూ, జయలలితలూ, నరేంద్రమోడీలు, పీవీ నరసింహారావులూ - నేరస్తులుగా చిత్రితమౌతూంటే - అమ్మో! మనది ఎంత నిజాయితీ! అంటూ ముక్కుమీద వేళ్ళు వేసుకుని వేసుకుని ఈ పాటికి ప్రజల ముక్కులు అరిగిపోయుంటాయి.
తమిళనాడులో కళైనర్ టీవీ మీద దాడి మరో గొప్ప మెలోడ్రామా. కరుణానిధిమీదా, దయాళూ అమ్మాళ్ మీదా, కనిమొళి మీదా చర్యలు తీసుకునే దమ్ము ఈ ప్రభుత్వానికి ఎక్కడ ఉంది? మొన్న ప్రధాని మాటల్లోనే రాజాగారి అవినీతి తెలుస్తున్నా తోటి పార్టీలతో పొత్తు కారణంగా వారికే ఆ మంత్రిత్వశాఖని అప్పగించామని వక్కాణించారు.
మహానుభావుడి బెళ్ళింపు నేలబారు మనిషిని ముచ్చటపడేటట్టు చేస్తుంది. న్యాయం జరిగిపోతుందని అమాయకంగా చంకలు గుద్దుకునేటట్టు చేస్తుంది. అలనాడు చర్చిల్ గారు సరదాగా చెప్పిన కథ నేడు మన ప్రజల విషయంలో అక్షరాలా నిజం. మనకి చర్చిళ్ళు లేరు. రాజాలే ఉన్నారు. అవసరం లేనప్పుడు చర్చిల్ వంటి నాయకుల్నే గద్దె దింపే ఓటర్లు లేరు. రాజాలే ఉన్నారు. కరుణానిధుల్నీ కనిమొళుల్నీ రాజాల్నీ పోషించి అందలాలెక్కించే 'గొర్రె'లే ఉన్నారు. మనది ప్రజాస్వామ్యం. తన్నుకు చావండి - తాంబూలాలు ఎప్పుడో పుచ్చేసుకున్నారు. 
 .

 ***
ఫిబ్రవరి 21, 2011

       ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


KOUMUDI HomePage