నల్లసొమ్ము
గొల్లపూడి మారుతీరావు

      gmrsivani@gmail.com

     సత్యజిత్‌ రే సినిమా 'పథేర్‌ పాంచాలీ' సినిమాను తలచుకున్నప్పుడల్లా నాకు ఒళ్లు పులకరించే సంఘటన ఒకటి గుర్తుకొస్తుంది. ఆ ఇంట్లో అక్కా, తమ్ముడూ చిన్నపిల్లలు. ఒక సన్నివేశంలో అక్క పూసలదండ దొంగతనం చేసిందని స్నేహితురాలు నిందవేస్తుంది. తన బిడ్డమీద నింద పడినందుకే ఉదాసీనతతో తల్లి కూతుర్ని కొడుతుంది. తమ్ముడు నిస్సహాయంగా గమనిస్తాడు. తర్వాత అమ్మాయి చచ్చిపోతుంది. కొన్ని నెలల తర్వాత ఆ కుటుంబం వేరే చోటుకి తరలిపోతోంది.
సామాన్లు తీస్తూండగా -ఓ కుండ పిడతలో -పూలదండ -తమ్ముడికి కనిపిస్తుంది. పసివాడు ఏం చేస్తాడు 'ఇదిగో దండ, అక్క నిజంగానే దొంగతనం చేసిందమ్మా' అని తల్లి దగ్గరికి పరిగెత్తుతాడా? రచయిత, దర్శకుడు మహాద్రష్టలు. పసివాడు -ఆ దండ పట్టుకుని యింటికి దూరంగా వున్న కోనేరు దగ్గరికి వస్తాడు. అక్క చచ్చిపోయింది. చచ్చిపోయిన అక్కమీద కళంకం ఇది. దండని కోనేరులోకి విసిరేస్తాడు. ఎండుటాకుల మధ్య దండ మాయమయే వరకూ నిలబడి వెనుదిరుగుతాడు. ఈ ప్రపంచంలోనే లేని అక్కమీద 'కళంకానికి' ఆ దశలో శాశ్వతంగా తెరవేశాడు. ఇది అతి ఉదాత్తమయిన సన్నివేశంగా నాకెప్పుడూ జ్ఞాపకం వస్తుంది.
ఇంత చెప్పాక, ఇంతటి ఉదాత్తులు మనదేశంలో రాజకీయ రంగంలోనూ ఉన్నారని మనం గర్వపడే రోజులొచ్చాయి. ఈ మధ్యనే మన సిబిఐ డైరెక్టరు ఏ.పి.సింగ్‌ కేవలం స్విట్జర్లాండు బ్యాంకుల్లోనే 500 బిలియన్ల నల్లధనం ఉన్నదని వక్కాణించారు. నల్లధనాన్ని దాచిపెట్టే దేశాలు ప్రపంచంలో 69 ఉన్నాయట. మారిషస్‌, స్విట్జర్లాండు, లిస్టెసీర్‌, బ్రిటిష్‌ వర్జిన్‌ ద్వీపాలు, ఇలాగ. అయితే విదేశాల్లో దాచిన ధనం కన్నా మూడు రెట్లు నల్లధనం మన దేశంలోనే ఉంది. మొదట ఇంటగెలిచి రచ్చ గెలవడం మంచిది అన్నారు మాజీ సిబిఐ డైరెక్టర్‌ జోగీందర్‌ సింగ్‌. అన్ని దేశాల్లో నల్లధనం కలిపితే దాదాపు 1456 బిలియన్లు ఉండవచ్చునట.
ఆ మధ్య లోపాయికారీగా జర్మన్‌ వర్గాల ద్వారా ఇలా నల్లధనం అకౌంట్లున్న 18 మంది పేర్లు ప్రభుత్వానికి అందాయి. అలాగే ఫ్రాన్స్‌ నుంచి మరికొన్ని జాబితాలు చేరాయి. ఆ పేర్లు బయటపెట్టమని ప్రతిపక్షాలు అంటున్నాయి. 'మీ హయాంలో మీరెందుకు ఆ పని చెయ్యలేదు?' అని దిగ్విజయ్‌ సింగ్‌ ధ్వజమెత్తారు.
చాలా సంవత్సరాల కిందట, కేంద్రం ఇలాంటి నల్లధనాన్ని మన దేశానికి తెచ్చుకోడానికి ఒక పథకాన్ని అమలులోకి తెచ్చింది. 'మీ డబ్బుని బయటపెట్టండి. ఫలానా శాతం పన్ను కట్టి బ్యాంకుల్లో వేసుకోండి' అన్నారు. చాలామంది దొంగలు పెద్దమనుషులయిన అరుదయిన సందర్భమిది. మళ్లీ అలాంటి ప్రయత్నం ఈ మధ్యకాలంలో జరగకపోవచ్చునని ప్రభుత్వ వర్గాలంటున్నాయి.
ఈ వ్యవహారంలో అసలు రహస్యం ఏమిటంటే 'దొంగలు'గా బయటపడడానికి ఇష్టపడేవారు కొందరుంటారు. వాళ్లకి డబ్బే ప్రధానం. ఇష్టపడని వారు ఎక్కువమంది ఉంటారు. వారికి డబ్బే కాక, పరపతి, పదవి, కీర్తి, యివన్నీ ప్రధానం. వీరు 'పథేర్‌ పాంచాలి'లో అక్క లాంటివారు.
మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే', మన ప్రభుత్వంలో 'పథేర్‌ పాంచాలి' తమ్ముడు వంటి ఉదాత్త నాయకులున్నారని. వారికి ప్రస్తుతం మన మధ్యలేని వారి పేర్లు, ఉన్న పదవుల్లో ఉన్నవారి పేర్లు, పదవుల్లో లేకపోయినా అపూర్వమైన కీర్తిప్రతిష్టలున్న వారి పేర్లూ, బయటపెట్టడం ఇష్టంలేని ఉదాత్తులు వీరు. అద్వానీగారూ, వెంకయ్య నాయుడు గారూ, సుష్మాస్వరాజ్‌ గారూ -ఈ 'ఉదాత్తత'ని వారి బలహీనతగా భావించడం అన్యాయం. మనం మహానుభావులని భావించే పెద్దలు సాదాసీదా డబ్బు దొంగలని తెలిస్తే మనగుండె ఎంత పగిలిపోతుంది? కొన్ని పేర్లయినా చెప్పాలని వుంది. కాని నేనూ 'తమ్ముడు' లాంటివాడిని. కనక చెప్పడానికి సాహసించడంలేదు. అసలు దిగ్విజయసింగ్‌' 'మీ బి.జె.పి. హయాంలో చర్యలు ఎందుకు తీసుకోలేదయ్యా?' అనడంలోనే మనకు ఆ సూచనలు తెలుస్తున్నాయి. 'బాబూ! ఇప్పుడు మేం పడ్డ బాధలే అప్పుడు మీరు పడ్డారని మా కర్థమవుతోంది. కనుక, ఒకరి నొకరు అర్థం చేసుకొని నోరు మూసుకొందాం, అని వారి తాత్పర్యం. కడుపు చించుకుంటే తప్పనిసరిగా కాళ్లమీద పడుతుంది. కేవలం డబ్బుకోసం, దశాబ్దాలుగా మనం పెంచుకున్న గౌరవాలు, ఇచ్చిన పదవులకి ఎసరు పెట్టడం మంచిది కాదన్న పెద్ద మనస్సుతోనే ప్రభుత్వం తొందర పడడం లేదని మనం గ్రహించాలి. ప్రతిరోజూ పేపర్లలో వెయ్యి రూపాయలకి కక్కుర్తిపడిన అమాయకపు కానిస్టేబుల్‌, మూడు వేలకి గడ్డి కరిచిన రెవిన్యూ గుమాస్తా, రెండు వేలకి తప్పుపని చేసిన మంత్రసానుల కథల్నీ వింటున్నాం కానీ, 1400 కోట్లు దేశం నుంచి దాటేయించిన ఖత్రోచీలు, హర్షద్‌ మెహతాల కథలు -అధవా బయట పడినా నిరూపణ అయ్యాయా? చేతికందిన 18 నల్లధనం 'పెద్దల' జాబితాలో ఎంతమంది పెద్దల గోత్రాలున్నాయో?!
'వినిపించని రాగాలు తియ్యన' -అన్నాడు ఆత్రేయ. దొరకని కారణాన, మన దేశానికి 18 మంది 'పెద్ద మనుషుల్ని' మిగిల్చిన ఈ ప్రభుత్వం పెద్ద మనసుని గుర్తించి, మరోసారి పదవుల్లోకి తీసుకురావాలని ఓటర్లకి మనవి చేస్తున్నాను.

 

                                               
ఫిబ్రవరి 20, 2012    

   ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


KOUMUDI HomePage