Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version.
Click Here

 

శివ....శివా....
గొల్లపూడి మారుతీరావు

                            gmrsivani@gmail.com         

     మహాశివరాత్రినాడు ఖాన్ గారి సినీమా రిలీజవుతోంది. ఆయన పాకిస్థాన్ ఆటగాళ్ళను వెనకేసుకొచ్చాడు.శివసేన అనే దేశభక్తుల పార్టీ ఆయన సినీమాను, ఆయన పరపతినీ, ఆ సినీమా తీసినవారి వ్యాపారాన్ని- అన్నిటినీ ధ్వంసం చేయడానికి పూనుకుంది. ఎందుకు? ఖాన్ గారికి దేశభక్తి లేదు. కాగా పొరుగున వున్న తన మతంవారంటే భక్తి. ఎదిరించే వీరికి(?) బోలెడంత దేశభక్తి. ఎవరు చెప్పారు? ఎవరు ఒప్పుకున్నారు? ఈ మధ్య ఈ పార్టీని ఓటర్లు కూడా ఛీ, అవతలికి పొమ్మన్నారుకదా?

       అయ్యా, అక్కడే ఉంది మతలబు. ముఖం చెల్లని ఉద్యమానికి ప్రజల్లో పేరున్నవాడిని కొడితేనే పరపతి. ఒకసారి నాతో అల్లు రామలింగయ్యగారన్నారు. పదిమందిలో అల్లు మీద రాయివేస్తే వందమంది మీద వేసినట్టు అని. మహారాష్ట్రలో ఇంకా బోలెడు సినీమాలు రిలీజవుతున్నాయికదా? మహారాష్ట్రలో పాపం, ఖాన్ గారొక్కరేనా పాకిస్థాన్ ఆటగాళ్ళమీద సానుభూతిని చూపింది? ఎంతమందో వారికి జరిగిన అన్యాయానికి గర్హించడం నేను టీవీల్లో చూశాను. అక్కడ ఢిల్లీలో హోం మంత్రి చిదంబరంగారు కూడా అలాంటి అభిప్రాయమే వెల్లడించారు. ఖాన్ గారి అభిప్రాయం కన్న ఈ దేశపు హోం మంత్రి అభిప్రాయానికి ఎక్కువ విలువకదా? కాని ఖాన్ గారు ముస్లిం. ఎదిరించింది శివసేన. ఇక్కడ విసిరిన రాయి దేశభక్తికి దగ్గరతోవ.

       బెదిరింపులతో, బుకాయింపులతో జరిగే ఉద్యమాలన్నీ ఇలాగే ఉంటాయి. ఖాన్ గారి సినీమా పోస్టర్లు చింపారు. ఎంతమంది? వందమంది. పేటకి వందమందేనా దేశభక్తులు? ఆయనకి దేశభక్తి లేదని ఎదిరించారు. ఎవరు? ఒక పార్టీ. మిగతా కోట్లాదిమంది ప్రజలు ఏమంటున్నారు? ఎవరికి తెలుసు? పత్రికలు,రేడియోలు, టీవీలు ఈ ముఖాల్నే దేశానికి సంధిస్తున్నాయి. నేలబారు మనిషిని ఎవడడిగారు? అడిగినా కెమెరాముందు అతని సజావయిన సమాధానం చెప్పి ఎలాబతకగలుగుతాడు? రాళ్ళు వేస్తామని బెదిరించిన సినీమాకి లక్షల మంది రాకపోవడానికి కారణం వీరి దేశభక్తికి మెచ్చికాదు. వీరిలాంటి దేశభక్తితోనే పులకిస్తున్నందుకు కాదు. బుర్ర బద్దలవుతుందేమోనన్న భయానికి.తీరా వెళ్ళి రాయిని నెత్తిని వేసుకోవడం ఎందుకన్న అలసత్వానికి. తప్పనిసరిగా వీరి ముష్కరత్వం మీద అపారమైన నమ్మకం ఉన్నందుకు! ఓ వర్గపు గూండాయిజం నుంచి తమని తాము కాపాడుకోవాలనే అప్రమత్తతకి. వారి మానాన వారిని వదిలేస్తే- ఎన్నిలక్షలమంది వారి కారణాలకి సినీమాను చూసేవారో. ఎన్ని కారణాలకి చూడడం మానుకునేవారో.

       సరే. ఖాన్ గారికి దేశభక్తిలేదు. అలాగే వారి అభిప్రాయం వంటి అభిప్రాయమే వున్న హోం మంత్రిగారివంటి లక్షల మందికి దేశభక్తి లేదు. అందుకు ఏమిటి శిక్ష? ఖాన్ గారు వెళ్ళి బాలధాకరేగారికి ఎందుకు క్షమాపణ చెప్పాలి? ఆయనెవరు? మహారాష్ట్ర ముఖ్యమంత్రా? మాహారాష్ట్ర నీతి సూత్రాలను నిర్డేశించే నైతిక ప్రతినిధా?హిందూ మతానికి పీఠాధిపతా? మత ప్రవక్తా? ముల్లావా? ఓడిపోయి తలబొప్పికట్టిన ఓ మైనారిటీ పార్టీకి- ఓ ముసిలి నాయకుడు.

       మాన్ ఫ్రైడే అనే సినీమాలో రాబిన్సన్ అనే నావికుడు ఓడ కూలి ఒక ద్వీపంలో నెలల తరబడి ఏకాకిగా ఉండిపోతాడు. ఓసారి ఉన్నట్టుండి మరో పడవ మునిగి ఓ నల్లవాడు ఆ ద్వాపానికి కొట్టుకు వస్తాడు. అతనిమెద తుపాకీ ఎక్కుపెట్టి నేను నీ యజమానినిఅంటాడు.

       అర్ధంకాక ఎందుకని? అనడుగుతాడు నల్లవాడు.

       నా దగ్గర తుపాకీ ఉందికనుక అంటాడు రాబిన్సన్.

       బాలాసాహెబ్ గారు దగ్గర బోలెడు రాళ్ళున్నాయి.విసిరే ముష్కరత్వం వుంది. దాన్ని పోషించే బలగం వుంది. దానికి పాపులారిటీ అనే దొంగ పేరు పెట్టి వోట్లు నొల్లుకోవాలనే దుర్మార్గపు పధకం వుంది. విసరడానికి సిద్ధంగా వున్న రేపటి నాయకులున్నారు. కొన్ని కోట్లమంది ఆ రాళ్ళకి దూరంగా వుండాలనుకొంటారు. కొన్ని లక్షల మంది కావాలనే ఆ ముష్కరత్వాన్ని ఎదుర్కోరు. కొన్ని వందలమంది ప్రయత్నిస్తారు. కొన్ని పదులమంది బలయిపోతారు. ఎందుకు? వాళ్ళు ఈ దేశంలో పాపులర్ మనుషులు కనుక. వీరిలో ఖాన్ గారు ఒకరు.

       షారూక్ ఖాన్ మీద రాయి వేస్తే దేశమంతా ప్రతిధ్వని స్తుంది. దాన్ని వోట్లుగా తర్జుమా చేసుకోవడం వారికి వెన్నతో పెట్టిన విద్య. అలాకాక ఎక్కడో మూలనున్న ముసిలి నటుడిమీద రాయి వేస్తే ఏమొస్తుంది?

       దౌర్జన్యానికీ, మైనారిటీ బ్లాక్ మెయిల్ కీ భయం పెట్టుబడి. దీన్ని మూల సూత్రంగానే నేటి రాజకీయ వ్యవస్థ చాలా చోట్ల బతికి బట్టకడుతోంది. చాలా ఘెరావ్ లూ, ఉద్యమాలూ- అలనాటి ఉప్పు సత్యాగ్రహమో, బార్డోలీ సత్యాగ్రహాన్నోపోలదు. అంత moral forceమన నాయకత్వానికి ఎక్కడిది? తలవొంచకపోతే చావగొడతారు కనుక- తలవొంచుకుని తప్పుకుంటుంది మధ్యతరగతి ప్రజ. దీనికి విజయమనే దొంగపేరు పెట్టుకుంటుంది నాయకత్వం. ఏకాంతంగా, వ్యక్తిగతంగా నేలబారు మనిషిని తన అభిప్రాయాన్ని అడగమనండి. ఈ శివసేన నోరు మూసి ఖాన్ గారి సినీమా టిక్కెట్లు అమ్మమనండి.మామూలుగా సినీమా చూడనివారుకూడా కసిగా విరగబడి చూస్తారు.

       భయంతో నొక్కే నోరు ప్రజాభిప్రాయానికి గంత. ఆ ఉద్యమం వాస్తవానికి దర్పణం కాదు. సామాన్య మానవుడి vulnerability కి, తన గొంతు వినిపించలేని నిస్సహాయతకీ, ముఖ్యంగా తమ శ్రేయస్సు గురించిన భయానికీ నిదర్శనం. పోస్టర్లు చించడం, ధియేటర్ల మీద రాళ్ళు వేయడం- ఓ పార్టీదో, ఓ నాయకుడిదో దేశభక్తి అనిపించుకోదు. రహస్యంగా ఆ దౌర్జన్యం పట్ల విముఖతనీ, తమ వ్యక్తిగత శ్రేయస్సుమీద భయాన్నీ రెచ్చగోడతాయి.  దీన్ని ప్రజామోదమని వాడుకుంటాయి రాజకీయ పార్టీలు- మరో ఎన్నికల్లో మాడు పగిలే వరకూ.

       నోరులేని, నోరు మెదపలేని సామన్య వోటరు అదృష్టవశాత్తూ తన చేతిలో ఉన్న శక్తిని గుర్తుపట్టాడు. దాన్ని అవకాశం వచ్చినప్పుడల్లా నిరూపిస్తూనే వున్నాడు. ఇది ఈ వ్యవస్థ resiliance కీ, durability కీ నిదర్శనం.

           ఫిబ్రవరి 15, 2010

       ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

KOUMUDI HomePage