చాలా ఏళ్ళ క్రితం ఒకానొక పత్రికలో నేను టంగుటూరి ప్రకాశం గారి మీద కాలం రాశాను.
వెంటనే ఒక పాఠకుడు ఈ సందర్భాన్ని ఉటంకిస్తూ సంపాదకునికి లేఖ రాశాడు. ఆ లేఖలో
వివరాలివి. ఇది ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో జరిగిన సంఘటన.
ప్రకాశం గారు అతిధి బంగళా గదిలోంచి ఎంతకీ బయటికి రావడం లేదట. బయట కొందరు ఎదురు
చూస్తున్నారు. తీరా ఆలశ్యానికి కారణం అయిన (ముఖ్యమంత్రి) చొక్కాకి తెగిపోయిన
రెండు బొత్తాములు కుట్టించుకుంటున్నారట! బయట నిలబడిన ఓ పెద్ద మనిషి తన
మిత్రుడిని పిలిచి తను ఇస్తే ఆయన ఎలాగూ పుచ్చుకోరు కనుక, ఆయనతో స్టేషన్ దాకా
వెళ్ళి - ఆయనకి ఎక్కడికి వెళుతూంటే అక్కడికి రైలు టిక్కెట్టు కొని ఇచ్చి
రమ్మన్నాడు. ఈ ఉత్తరాన్ని ఆ రోజుల్లో దాచుకోనందుకు ఇప్పటికీ బాధపడుతూంటాను.
ఎప్పటికయినా వేటపాలెం లైబ్రరీకి వెళ్ళయినా ఈ ఉత్తరం సంపాదించాలని నా కోరిక.
నాయకులు కోట్లు ఆస్తులు మూటగట్టుకుంటున్నారని పత్రికలు ఘోషించే ఈ రోజుల్లో
ఇలాంటి అసమర్ధులు నాయకత్వం వహించారన్న నిజం అబ్బురంగా చెప్పుకోవాల్సిన విషయం.
మరొకాయన ఉన్నాడు. ఆయన ఈ దేశపు రెండవ ప్రధాన మంత్రి. లాల్ బహదూర్ శాస్త్రి. ఆయన
కొడుకు సునీల్ శాస్త్రి 'లాల్ బహదూర్ శాస్త్రి : ఫాస్ట్ ఫార్వర్డ్' అనే
పుస్తకంలో ఈ సంఘటనల్ని ఉదహరించాడు. ఒకసారి ఆయనకి తన తండ్రిగారి (ప్రధాని)
చెవర్లెట్ ఇంపాలా కారులో తిరగాలని ముచ్చట కలిగింది. డ్రైవర్ని తాళాలడిగి బయటికి
వెళ్ళాడు. ఆ విషయం తెలిసిన ప్రధాని డ్రైవర్ని పిలిచి "ఈ కారు తిరిగిన వివరాలు
రాసుకుంటావా?" అని అడిగారు. డ్రైవరు భయం భయంగా తలూపాడు. తన కొడుకు ముందు రోజు
ఎంత దూరం తిరిగాడని అడిగారు. పధ్నాలుగు కిలోమీటర్లు. తన పర్సనల్ సెక్రటరీని
పిలిచి - ఆ పధ్నాలుగు కిలోమీటర్లకి అయిన ఖర్చు - తన సొమ్ముని గవర్నమెంట్
అకౌంటులో నమోదు చెయ్యమన్నారు.
వాళ్ళావిడ హిందీ నేర్చుకోవాలనప్పుడు ఓ హిందీ టీచర్ని పెట్టుకున్నారట. ఆదాయం
ఎలాగ? ఇంటి పనిమనిషిని తీసేసి ఆ డబ్బుతో టీచర్ని పెట్టుకున్నారట. పాతబడిన ఆయన
చొక్కాలను కత్తిరించి రుమాళ్ళు చేయమని ఆయన భార్యకి ఇచ్చేవారట.
ఓసారి ఫైజాబాద్ జైల్లో రాజకీయ ఖైదీగా ఉన్నప్పుడు భార్య రెండు మామిడి పళ్ళు
తెచ్చిందట. శాస్త్రిగారు భార్యని గట్టిగా మందలించారట - అలాంటి తప్పుడు
పనిచేస్తున్నందుకు. ఏమిటా తప్పుడు పని? ఖైదీగా శిక్షని అనుభవిస్తున్న తను రూల్స్
ప్రకారం జైలు కూడే తినాలిగాని ఇలా మామిడి పళ్ళు తినడం దొంగతనం అవుతుందన్నారట!
కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు నిజమైన గాంధేయ మార్గంలో లోకల్ రైళ్ళలో
ఆఫీసుకి వెళ్ళేవారట.
ఈ కథలన్నీ - అబ్బురాలు. కొందరికి విపరీతాలు, విచిత్రాలుగా కనిపిస్తాయి. ఎందుకంటే
ప్రస్తుతం మనం గూండాలనీ, హంతుకులనీ పార్లమెంటు దాకా ప్రయాణం చేయడం చూస్తున్నాం.
జైళ్ళలో మందు, విందు, సెల్ ఫోన్ల రవాణా విరివిగా జరగడం వింటున్నాం. ఈ నేపధ్యంలో
శాస్త్రిగారిలాంటి నాయకులు ఈదేశాన్ని పాలించారంటే ముక్కుమీద వేలేసుకునే
రోజులొచ్చాయి.
నాకు తెలిసి - నా తరంలో - అంటే మన తరంలో అలాంటి నాయకుడిని చూశాను. ఆయన వావిలాల
గోపాలకృష్ణయ్య. ఓసారి మేమిద్దరం ఆంధ్ర విశ్వవిద్యాలయం సభలకి అతిధులం. ఆయన చేతిలో
ముతక ఖద్దరు సంచి ఉండేది. అందులో ఓ పంచె, చొక్కా. సభ అయాక ఆయన్ని విశాఖపట్నంలోనే
ఏదో బస్ స్టాండులో దింపిన గుర్తు. వాళ్ళ పాదాలు అందుకునేటంత ఎత్తుకి ఎదగగలిగితే
అటువంటి నాయకులకి పాదాభివందనం చేయగలగడం అదృష్టం.
ఈ కాలంకి 'నీచ నాయకులు' అని పేరు పెట్టడం చాలా మందికి ఆశ్చర్యంగా ఉండొచ్చు.
కడివెడు పాలలో చిన్న విషపు చుక్క ఆ పాల 'రుచి 'ని నాశనం చేస్తుంది. ప్రస్తుతం
కడివెడు 'విషం 'లో ఓ పాలచుక్క కథ మనం చెప్పుకునేది. అందుకని ఈ కాలం కి ఈ
శీర్షిక సార్ధకమని నా ఉద్దేశం. ఇంకా తమరు నాతో ఏకీభవించకపోతే ఒక చిన్న నమూనా.
కేవలం రెండు రోజుల కిందటి కథ.
ఉత్తర ప్రదేశ్ లో ఆరియా జిల్లాలో పర్యటనకి మహారాణి మాయావతి - ఆ రాష్ర్ట
ముఖ్యమంత్రిగారు - హెలికాప్టర్ లో దిగారు . వారి బూట్ల మీద దుమ్మి పడింది.
డిప్యూటీ సూపరింటెండెంట్ అయిన పోలీసు ఆఫీసరు టీవీ కెమెరాల సమక్షంలో ఆమె బూట్లు
తుడుస్తున్నాడు. ఈ మహత్తర దృశ్యాన్ని దేశమంతా చూసి తరించింది. ఓ టీవీ
కార్యక్రమంలో ఎమ్మెల్యే నవాబ్ ఖాసీం ఆలీగారు - ఆవిడ తుడవమనక పోయినా,
అసంకల్పితంగా, తమ నాయకుల మీద భక్తి పారవశ్యంతో పోలీసు అలా తుడిచి ధన్యుడయాడని
పేర్కొన్నాడు. సదరు పదం సింగ్ కి ఈ మధ్యనే సర్వీసుని ఓ సంవత్సరం పాటు
పొడిగించారట,
చెప్పులు తుడిచే చెంచా కథ చెపుతూ, నాయకులని విమర్శించడం ఏం సబవు? అని
కొందరికయినా అనిపించవచ్చు. అయ్యా, గంజాయి వనాల్లోనే కలుపు మొక్కలు ఏపుగా
పెరుగుతాయి. సంజయ్ గాంధీ బూట్లు తుడిచే ఎన్.డి.తివారీలనూ, జయలలిత కాళ్ళమీద పడి
నెత్తికి ధూళిని పూసుకునే భక్తశిఖాగ్రేసరులనూ.. ఏదీ? వాజ్ పేయ్ సభలోనో,
సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి సభలోనో చూపించండి.
ఈ పని లాల్ బహదూర్ శాస్త్రిగారి చెప్పులకి ఎవరేనా చేసి ఉంటే ఏం జరిగేదనే ఆలోచన
నాకొచ్చింది. ఆ ఆఫీసరుని సంజాయిషీ అడిగేవారా? కసిరి తిట్టేవారా? కళ్ళనీళ్ళు
పెట్టుకుని అతని రెండు చేతులూ పట్టుకునేవారా? భార్య రెండు మామిడి పళ్ళని జైలుకి
తీసుకొచ్చినందుకు మందలించిన పెద్దమనిషి ఆ ఉద్యోగిని బర్తరఫ్ చేసినా ఆశ్చర్యం
లేదు.
కన్నకొడుకు ప్రయాణం చేసిన కారుకి తండ్రి డబ్బు చెల్లించే ప్రధానులు, చిరిగిన
చొక్కాకి బొత్తాములు కుట్టుకునే ముఖ్యమంత్రులూ, సభలకి బస్సుల్లో వచ్చే
ఎమ్మెల్యేలూ ఈ తరానికి నమ్మశక్యం కాని 'నాయకులు'. మహాత్మాగాంధీ చచ్చిపోయి ఇంకా
ఎంతో కాలం కాలేదు. మహారాణీ మాయావతుల విన్యాసాలకు అలవాటుపడిపోతున్న తరం మనది.
ఆఖరుగా పాఠకులకు మనవి. 'నీచ' అన్నమాటకంటే ఛండాలంగా, హీనంగా మరో మాట వాడలేని నా
అసమర్ధతకి భేషరతుగా నా క్షమాపణ.