'బూతు ' సమస్యా? పరిష్కారమా?
గొల్లపూడి మారుతీరావు

      gmrsivani@gmail.com

       ఈ మధ్య అడ్డమయిన కారణాలెన్నింటికో రాజకీయనాయకుల్ని విమర్శిస్తున్నారు. దుమ్మెత్తి పోస్తున్నారు. ఇళ్ళమీద రాళ్ళేస్తున్నారు. పదవుల్లో ఉన్నవారిని మంత్రి పదవులకు రాజీనామా చేయాలని నినాదాలు చేసి గద్దెలు దించుతున్నారు. ఇది చాలా అన్యాయం. అనుచితం.
నాకింకా తేలని మీమాంస ఒకటుంది. ఒకాయన ఒక అమ్మాయిని రేప్ చేశాడు. అది నేరం. మరొకాయన ప్రజల సొమ్ము తినేశాడు. అది నేరం. ఒకాయన మరొకాయన్ని హత్య చేయించాడు. అది నేరం. ఒప్పుకుంటున్నాను. కానీ ఒకాయన ఓ మూల కూర్చుని తన మానాన తాను ఓ బూతు సినిమాని చుస్తున్నాడు. అది నేరమంటే ఒప్పుకోడానికి నాకు మనస్కరించడం లేదు. కాకపోతే ఆయన మంత్రి కావడం - ఆయన కూచున్నది కర్ణాటక రాష్ర్ట చట్టసభ కావడం కాస్త అభ్యంతరం కావచ్చు. కానీ దానికీ నా సమర్ధన ఉన్నదని మనవి చేస్తున్నాను.
ఆ మధ్య ఓ నాస్తికుడు - నన్ను అడిగాడు - రోజూ దేవాలయానికి వెళ్ళడం వల్ల ఏం పుణ్యం వస్తుందని. దానికి రకరకాల సమాధానాలున్నాయి. కానీ ఎదురుగా ఉన్నది నాస్తికుడు. ఆయనకి గుడిమీదా, గుడిలో ఉన్న దేవుడు మీదా నమ్మకం లేదని తెలుస్తోంది. అతనిదీ ఈ ప్రశ్న. నేను సమాధానం చెప్పాను. "చూడు బాబూ! మనం ప్రతి క్షణం ఏవో దిక్కుమాలిన పనులు చేస్తూ ఉంటాం. అందులో ఎన్నో పక్కవాడి కొంప ముంచేవే అయివుంటాయి. కానీ - అరగంట సేపు గుడికి వెళ్ళినవాడు - ఆ అరగంట సేపయినా తన ఆలోచనలకి సెలవిస్తాడు. అతను వెళ్ళడం వల్ల పక్కవాడికి జరిగే దౌర్భ్యాగపు పని నుంచి సమాజానికి ఓ అరగంట సెలవుని ఇస్తున్నాడు. ఇదీ అతని వల్ల సమాజానికి జరిగే ఉపకారం. ఇదీ గుడివల్ల సమాజానికీ, పరోక్షంగా అతనికి దక్కే పుణ్యం" అన్నాను. ఇది ఒక విధంగా బుకాయింపు. మరో విధంగా సర్ది చెప్పడం. అన్నిటికన్నా ముఖ్యం నాస్తికుడికి అర్ధమయే విధంగా వివరించడం.
పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నారు. అటువంటి అసమర్ధపు మైనారిటీల గొడవ మనకి వద్దు. ఇప్పుడు నా వాదన వినండి. నిజమైన, సిసలైన నాయకులు అనుక్షణం దేశాన్ని దోచుకు తింటూంటారు. ఎవరి కొంపలో ముంచుతూంటారు. తెల్లారితే తమది కాని - మరెవరో సుఖంగా ఉండగల అవకాశాన్ని దొంగలిస్తారు. అది నిజమైన అవినీతి. కానీ ఒకాయన - ఇవేవీ చెయ్యకుండా ఓ మూల కూర్చుని బూతు సినిమాలు చూస్తూ ఆనందిస్తున్నాదనుకోండి - ఈయన రాజస్థాన్ లో నర్స్ తో ప్రేమకలాపాలు నడిపి ఆమెని హత్య చేయించిన మంత్రికంటే ఎంత గొప్పవాడు?
ఈయన ఎవరి కొంపలూ ముంచలేదు. ఏ అమ్మాయిని మానభంగం చెయ్యలేదు. టీవీలో విరివిగా వితరణ చేస్తున్న బూతు సినిమాల్ని చూస్తూ - కేవలం ఆనందించడమేకాక మరో ఇద్దరు తోటి సహచరులతో ఆ ఆనందాన్ని పంచుకునే స్నేహశీలత కల మంత్రిగారు.
'బూతు' అభ్యంతరం, అసభ్యం అన్న విషయాన్ని మన సినిమాలు మరిచిపోయి చాలా ఏళ్ళూ పూళ్ళూ అయింది. ఇదివరకు జయమాలిని, జ్యోతిలక్ష్మి, సిల్క్ వగైరాలు బట్టలిప్పుకు చేసిన నృత్యాలు ప్రస్తుతం ముంబైనుంచి హైదరబాదుకి దిగుమతి అవుతున్న ప్రతి తెలుగురాని హిందీ నటీమణి చేస్తోంది. మొన్ననెవరో అడ్డం పడ్డారనిగాని - ఆ మధ్య బొడ్డూడని పిల్లలచేత కూడా ఈ వికారపు డాన్సులు గెంతించి ఆనందించిన తల్లిదండ్రుల అభిరుచిని మనం టీవీల్లో చూశాం.
బజారులో మాంసం దొరుకుతోంది. మాంసాహారి తింటున్నాడు. ఆంక్ష విధించడం అన్యాయం. గుడిలో దేవుడున్నాడు. భక్తుడు గుడికి వెళతాడు. భక్తుడిని విమర్శించడం పాపం. టీవీల్లో బూతు సినిమాలు వస్తున్నాయి సరదా పడేవాడు చూసి ఆనందిస్తాడు. మిఠాయి అమ్ముతూ తినవద్దనడం ఏం న్యాయం?
ఒకే ఒక్క విషయంలో అభ్యంతరాన్ని మనం ఒప్పుకోవాలి. సదరు మంత్రిగారు - స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి. ఆయన ఇలాంటి బూతు సినిమా చట్ట సభలో చూశారన్నది అభ్యంతరం. అయ్యా 'దొరికితే దొంగలు' అన్నది సామెత. దొరికారు కనుక గాలి జనార్ధన రెడ్డిగారు నేరస్తులు. దొరకనంత వరకూ ఆయన సుష్మా స్వరాజ్ దీవెనని స్వయంగా అందుకున్న మంత్రిగారు. అలాగే ఎంతమంది క్లాసురూముల్లో, కాలేజీల్లో, ప్రార్ధనా మందిరాల్లో, పార్కుల్లో - మరెక్కడో ఈ బూతు సినిమాల్ని చూసి ఆనందిస్తున్నారో మనం చెప్పగలమా?
వంటవాడు ఎక్కడవుంటాడు? వంటగదిలోనే ఉంటాడు. అతను చేసే ఏ పనయినా వంట గదిలోనే చెయ్యగలడు. లెక్చెరర్ గారు క్లాసు గదిలోనే చేస్తాడు. పూజారిగారు ఏదో ఆనందం కోసం - ఏం చేసినా ఏం చూసినా గుడిలోనే చెయ్యగలడు. అలాగే మంత్రిగారు చట్టసభలోనే చెయ్యగలరు. అందుకాయన్ని మనం అర్ధం చేసుకుని అంగీకరించాలి.
మళ్ళీ మరొక్కసారి - దొరికితే దొంగలు అన్న సామెతని మనం మరిచిపోకూడదు. ఎవరో ఆకతాయి కెమెరామన్ కెమెరాకి దొరికారు కనుక ఇంత రాద్దాంతం జరిగింది కానీ - వారు తమ ఆఫీసులోనో, కారులోనో, ఇంట్లోనో, డ్రాయింగు రూంలోనో తమకు అభ్యంతరం ఉండేది కాదని త్రుణమూల్ కాంగ్రెసు నాయకులు డెరిక్ ఓబ్రియన్ చెప్పనే చెప్పారు. కనుక - చేసిన పని తప్పుకాదు. చేసిన చోటులో చిన్న పొరపాటు ఉంది. అదిన్నీ కెమెరాకు దొరికింది కనుక.
దేనివల్ల సమాజానికి పెద్ద హాని? అని మనం ప్రశ్నించుకోవాలి. మంత్రిగారు పీకలు కోయిస్తే దుర్మార్గం. కోట్లు దోచుకుంటే అన్యాయం. మన ఐయ్యేయస్సుల్లాగ చట్టాలకు దగ్గర తోవలు వెదికితే ఘోరం. అమ్మాయిల్ని మానభంగం చేస్తే అపచారం. కానీ - వీటి జోలికి పోకుండా - అహింసాయుతంగా, బూతు సినిమాల్ని ఏకాంతంగా చూసుకునే నాయకుల మీద కత్తిగట్టడం చాలా అమానుషం.
గాలిజనార్ధన రెడ్డిగారు, రామలింగ రాజుగారు, ఏ.రాజాగారు, సురేష్ కల్మాడీగారు, బి.పి.ఆచార్యగారు - ఇలాంటివారు చట్టాలూ, అవినీతుల జోలికి పోకుండా తమ తమ కార్యాలయాల్లో బూతు సినిమాలు చూసుకుంటూ గడిపితే ఈ సమాజం వారికెంత కృతజ్నతలని చూపేదో ఒక్కసారి ఆలోచించాలి.
పీకలు కోయడం నేరం. కానీ ఎవరి పీకల గురించి ఆలోచించకుండా పీక సౌందర్యాన్ని చూసి పులకించే రసికుడు ఈ దేశానికి అంత హానికాడని గుర్తించాలి. అంతేకాదు. నేరాలు రుజువయినా, సాక్ష్యాలు కనిపిస్తున్నా - రాజీనామాలు చెయ్యండి బాబోయ్ అని రాజకీయ పార్టీలు మొత్తుకుంటున్నా నిమ్మకు నీరెత్తినట్టు పదవుల్ని పట్టుకు వేలాడే ఈ రోజుల్లో టీవీలో పడిందే తడవుగా పదవులకు రాజీనామాలు చేసి, ఈ వ్యవహారం మీద నివేదిక వచ్చే వరకూ చట్ట సభలో అడుగు పెట్టనున్న ఈ ముగ్గురు మంత్రులూ అవినీతిపరులలో అద్భుతమైన నీతిపరులని మనం గుర్తించాలి. అవినీతిలోనూ ఒక నీతిని పాటించిన ఈ మంత్రులకు మనం జేజేలు అర్పించాలి. అసలు నా ఉద్దేశంలో పురుషులందు పుణ్య పురుషులంటే వీరే!
నన్నడిగితే పైన పేర్కొన్న జాబితాలోని పెద్దల్ని ఒకచోట చేర్చి - సమాజాన్ని దాని మానాన దాన్ని వదిలేసి బూతు సినిమాలు చూసుకోవడం ఎంత అహింసాయుతమైన వ్యాపకమో ఒక క్రాష్ కోర్స్ ఇప్పించాలని మనవి చేస్తున్నాను.

 

                                               
ఫిబ్రవరి 13, 2012    

   ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


KOUMUDI HomePage