Click Play to listen audio of this column If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here రాజకీయ వంకాయగొల్లపూడి మారుతీరావు gmrsivani@gmail.com మాయాబజార్ లో పింగళిగారు శాకంబరీ వరప్రసాదంగా గోంగూరని అభివర్ణించారుగాని- నా దృష్టిలో ఆ గౌరవం- ఇంకా చెప్పాలంటే మహా శాకంబరీ దేవి పూర్ణావతారంగా వంకాయని నేను పేర్కొంటాను. పురుషులందు పుణ్యపురుషులలాగ కూరగాయలలో తలమానికం వంకాయ.వంకాయని విశ్వామిత్ర సృష్టి అంటారు. ఆ ఒక్క కారణానికే విశ్వామిత్రుడిని జగన్మిత్రుడిగా మనం కొలుచుకోవాలి. ఓ కవిగారు వంకాయ కూర తిని తిని, పరవశించి, తలకిందులై, కవితావేశంతో ఆశువు చెప్పాడు. వంకాయ వంటి కూరయు లంకాపతి వైరివంటి రాజును ఇలలో శంకరునివంటి దైవము పంకజముఖి సీతవంటి భార్యామణియున్అంటూ క్రియముక్కని వదిలేశాడు. “లేరు లేరు లేరు” అని ఎవరికి వారు చెప్పుకోవాలని ఆయన ఉద్దేశం. మనదేశంలో ఉల్లిపాయకి కొరత వచ్చింది. బంగాళాదుంపకి కొరత వచ్చింది. చక్కెరకి కొరత వచ్చింది. కిరసనాయిలుకి కొరత వచ్చింది. పెట్రోలు కొరత ఉండనే ఉంది. కాని- ఏనాడయినా, ఏ రాష్ట్రం వారయినా వంకాయ కొరత వచ్చిందన్నారా? దీనిని బట్టి ఈ దేశంలో దేశభక్తిలాగే వంకాయ భక్తి సర్వవ్యాప్తమని గ్రహించాలి. మనదేశంలో 200 పై చిలుకు వంకాయ రకాలున్నాయట. ఈ మాట వినగానే నా గుండె పగిలిపోయింది. నా జీవితంలో ఏ పది రకాల వంకాయనో తిన్న వాడిని. మిగతా రకాలు ఎప్పుడు తింటానా అని ఉవ్విళ్ళూరుతున్నాను. ఈ లోగా బీటీ వంకాయ విపత్తు వచ్చిపడింది. బీటీ వంకాయ అంటే కృత్రిమ గర్భోత్పత్తిలాగ, జన్యు బీజాలలోనే ప్రయోగశాలలో వంగ వంగడాలను తయారు చేసి అమ్ముతారట. నాకర్ధంకాని విషయం- ఈ దేశంలో రైతులకీ అర్ధంకాని విషయం- ఉన్న మొగుడొకడుండగా బావ మొగుడెందుకని? అయ్యా, ఈ దేశంలో గొప్ప వస్తువులన్నీ- విచిత్రంగా “మనవి” అని చెప్పుకోవాలన్న ఆలోచన మనకి లేదు. ఆ ప్రయత్నం అవసరమని కూడా మనకి తెలీదు. శతాబ్దాలుగా బస్మతీ బియ్యాన్ని మనం సాగుచేస్తున్నా- ఆవుల్నీ, మేకల్నీ, ఆఖరికి మనుషుల్నీ కాల్చుకు తినే అమెరికా వారు బస్మతీ బియ్యాన్ని పేటెంటు చేశారు. మనలో చాలామందికి తెలీదు. గర్వపడడం అసలు తెలీదు. మనకి పొరుగింటి పుల్లకూర- అది మురిగినా, కుళ్ళినా మనకి రుచి. వేద కాలం నుంచే నిలదొక్కుకుని ఉన్న జ్యోతిష శాస్త్రం మన దేశంలో ఉండగా జాతకాలు వేసే సాఫ్టు వేర్ ఒక అమెరికా సంస్థ కంఫ్యూటర్ల లోకి ఎక్కించగా ఒక జైపూర్ సంస్థ దాన్ని వితరణ చేసి కోట్లు సంపాదిస్తోంది. మన దరిద్రం ఏమిటంటే మనకి జ్యోతిషం మీద నమ్మకం లేదు. అమెరికా వారికి వ్యాపారం మీద నమ్మకం ఉంది. ముందు ముందు భగవద్గీత, బాదం పప్పు, ఖద్దరు లుంగీ, ఆవుపేడ పిడకలు అమెరికావారు పేటెంటు చేస్తే మనం ఆనందంగా దిగుమతి చేసుకుంటాం. ఘనత వహించిన మన నాయకమ్మణ్యులు- ముఖ్యంగా జయరాం రమేష్ వంటి కేంద్ర మంత్రి వరేణ్యులు అమెరికాలో మొన్సానో అనే సంస్థ కొన్ని మిలియన్ల పెట్టుబడితో దిక్కుమాలిన వంకాయ వంగడం తయారు చేస్తే దాన్ని ఈ దేశంలో ప్రవేశ పెట్టాలని ఉవ్విళ్ళూరుతున్నారు. ఇందువల్ల ఎన్ని వందల కోట్లు ఎన్ని జేబులు మారుతాయో భగవంతుడికెరుక. ఒక్కటి మాత్రం తెలుసు. చాటు కవుల దగ్గర్నుంచి, నేటి కవుల దాకా ఆసేతు హిమాచలం ఏమీ ఇబ్బంది పడకుండా అనవరతం తిని ఆనందించే 200 రకాల వంకాయ పంటకి చీడ పట్టే అదృష్టం ఇప్పటికి కలిగింది- జయరాంగారి ధర్మమాంటూ. రైతులంతా బెంబేలెత్తిపోతున్నారు. తర తరాలుగా మేం వంగపంట పండించుకుంటూ ఉండగా ఆ దిక్కుమాలిన బి.టి. వంకాయఎందుకండీ బాబూ అని ఈ మధ్య రమేష్ గారి హైదరాబాదులో రైతుల్ని కలిసినపుడు వాళ్ళంతా ఆయన్ని నిలదీశారు. ఆయనకి నోరు తిరగలేదు. నన్నడీగితే అరిగేదాకా వారిని కూర్చోబెట్టి వారికి గుత్తివంకాయ కూర తినిపించాలని నా ఉద్దేశం. కోపెన్ హేగన్ లో పర్యావరణంలో జరిగే మానవదౌష్ట్యానికి ఎలాగూ పరిష్కారం దొరకలేదు. ఓ పక్క ఒబామా గారు తెల్లభవనం చేరాక అందరూ చంకలు గుద్దుకున్నారు. కానీ ఇండియా సాఫ్ ట్ వేర్ కంపెనీల నోటిదగ్గర అన్నాన్ని పడగొడుతున్నాడు. వీటిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉండగా కేంద్రమంత్రి జయరాం గారు వంకాయని పట్టుకుని వీధినపడడం కేవలం డబ్బు సంపాదించడానికే అనే ఆలోచనగానే తోస్తోంది. నాదొక మనవి. ఇంటగెలిచి రచ్చగెలవాలణేది సామెత. నేనంటాను ’ వంట ఇంట గెలిచి రచ్చగెలవాల ’ ని.! ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ఉద్యమాల్లో కొత్త పద్ధతి ఒకటి బయలుదేరింది. అందరూ రోడ్లమీదే వంటలు చేసుకుని అక్కడికక్కడే భోజనాలు చేస్తున్నారు. తిండీ తిప్పలూ లేకుండా ఉద్యమాల్లో పడ్డారనే అపప్రధ లేకుండా భోజనాలే ఉద్యమాలు చేయడం చాలా తెలివైన ధీరణి. మరి ఈ వంటకాల్లో వంకాయ ఉందో లేదో ఛానెల్స్ సరిగా చూపలేకపోతున్నాయి. ఈ వంటల్లో వంకాయకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నా మనవి. మనదేశం చెడింది, మన ఐకమత్యం చెడింది, మన కుర్రాళ్ళ శ్రేయస్సు ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో చెడింది. అందుకని వారి వారి ఉద్యమ లక్ష్యాలు ఎలా వున్నా తెలంగాణ, సీమ సర్కారు నేతలు వంకాయ విషయంలో ఏకమై ఈ దేశంలో భారతవంకాయని కాపాడ్డం దేశభక్తి అనిపించుకుంటుందని నా ఉద్దేశమ్. భారతదేశంలో ఈ ఉద్యమానికి నా ప్రియతమనాయకుడు శిబు సొరేన్ ని అధ్యక్షుడిగా ఉంచాలని నా అభిప్రాయం. జైలు కెళ్తేనే పోటీ చేయడానికి వీల్లేదన్న ఈ ప్రభుత్వం ముక్కుమీద గుద్ది మరీ ముఖ్యమంత్రి కాగలిగిన మొనగాడు. మాయావతిని ఉపాధ్యక్షురాలిగా ఉంచాలని, పనిలో పనిగా ఆవిడ, కనీసం ఉత్తరప్రదేశ్ లోనైనా, తన విగ్రహాల పక్కనే రకరకాల వంకాయల విగ్రహాలు నిర్మించగలదనీ తద్వారా మనదేశ వంగడానికి మనమిచ్చే గౌరవాన్ని చాటగలదనీ నా ఆశ. ఇంకా రాజ్ ధాకరే, బాల్ ధాకరే, నరేంద్రమోడి..అలాగే మన రాష్ట్ర నాయకులంతా ఏకం కావాలని మనవి చేస్తున్నాను. రాజకీయాలవల్ల దేశం గబ్బు పట్టవచ్చు కాక, కానీ రోడ్లమీద తిన్నా, ఇంట్లో తిన్నా, చెట్టుకింద తిన్నా వంకాయకూర చేసే పులకింత దేనికీ సాటిరాదని నామనవి. వెనకటికి ఒకాయన హిందూ ముస్లిం సంస్కృతికి చిహ్నంగా బీడీ కాల్చేవాడని ఒక రచయిత పేర్కొన్నాడు. నేనంటాను ఈ దేశ ఐక్యతకి చిహ్నంగా వంకాయని ఉపయోగించమని కోరుతున్నాను, విజ్నప్తి చేస్తున్నాను..ఆ(.. అన్నట్లు డిమాండ్ చేస్తున్నాను..!! ఫిబ్రవరి 8, 2010 ************ ************ ************* ************* |