దాదాపు 50 సంవత్సరాల కిందట నేనో పెద్ద కథ రాశాను. పేరు: అహంకారపు అంతిమ క్షణాలు.
నాతో ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఆనర్స్ చదివే సీనియర్ ఒకాయన ఉండేవాడు. నాగభూషణం.
ఏలూరు దగ్గర ఏదో ఊరిలో ఉంటున్న ఓ హెడ్మాష్టరుగారబ్బాయి. తల్లిదండ్రుల్ని కాదని,
ఓ టెలిఫోన్ ఆపరేటర్ని పెళ్ళిచేసుకున్నాడు. తండ్రి చదువుకి డబ్బు పంపడం
నిలిపేశాడు. ఆమెకి సంపాదన ఉంది. ఇతన్ని చదివించేది. నరకయాతన పడిపోయేవాడు. మించి
ఆమెని యాతన పెట్టేవాడు. సంస్కారే. చదువుకున్నవాడే. కనకనే మానసికంగా మధన ఎక్కువ.
ఇద్దరికీ మనశ్శాంతి ఉండేది కాదు. సంవత్సరాలు గడిచాక నేను ఉద్యోగాన్ని ఊరు విడిచి
వెళ్ళి తిరిగి వచ్చాక - ఇద్దరూ నాకు కనిపించారు. వాళ్ళకిప్పుడూ ఇద్దరు పిల్లలు.
అతని ముఖంలో విజయ గర్వం. ఆమె ముఖంలో మనశ్శాంతి. ఏం జరిగింది? అతనికి ఉద్యోగం
వచ్చింది. ఆమె జీతం కన్నా తక్కువ. అయినా భార్య ఉద్యోగం మానిపించాడు. ఇప్పుడు తను
ఇంటికి యజమాని. తనదే పై చెయ్యి. ఆమె అతని అహంకారానికి ఒదిగింది. విజయం ఒదిగిన
ఆమెదా? వంచిన భర్తదా? అదీ కథ.
మనది పురుషాధిక్యత చెల్లుబాటయే సమాజం. బాగా సంపాదిస్తూ, కీర్తి ప్రతిష్టలున్న
భార్యల్ని రాసి రంపాన పెట్టిన చదువుకున్న, సంస్కారవంతులైన 'నాగభూషణా'ల నెందర్నో
నాకు తెలుసు. నవ్వుతూ భర్త వెనుక నడిచే పెద్ద కీర్తిమంతురాలి కంటి కింద మచ్చ
రాత్రి జరిగిన 'రచ్చ'ని చెప్పేది. పేర్లు చెప్పలేను. ఆ సంసారాలు నిలబడడానికి
భర్తల దౌష్ఠ్యం కంటే, పురుషాధిక్యతని చెల్లనిచ్చే ఆ ఇల్లాళ్ళ 'పరిణతి ' గొప్పది.
కష్టాన్ని కడుపులో దాచుకుని కాపురాల్ని నిలబెట్టుకున్న ఆ సాధ్వీమ తల్లులది.
అంతకన్నా మార్గాంతరం మాత్రం ఏముంది?
రాత్రంతా టెలిఫోన్ ఆఫీసులో డ్యూటీ చేసి వచ్చేది ఈ ఇల్లాలు. నాగభూషణం పొద్దుటే
హోటల్ కి వచ్చి ఫలహారం తీసుకువెళ్ళేవాడు - చాలా కృంగిపోతూ.
'టిఫిన్ తెచ్చారా? ' అతి సాదా సీదా ప్రశ్న.
'ఏం? సంపాదిస్తున్నానని అహంకారమా? '
'నేను నీకు నౌఖర్నా? '
'ఎవడి కోసం తెస్తాడులే అన్న జులుమా? '
'నువ్వు దుప్పటీ కప్పుకు నిద్రపోతే నేను చాకిరీ చెయ్యాలా? '
ఆ ప్రశ్నకి ఇన్ని సమాధానాలు అక్కరలేదు. కాని చదువుకున్న మెదడులో అతని 'ఆత్మన్యూనత'
అల్లిన 'చెద' ఇది.
పాపం. అతని మనస్సు నొప్పించకూడదని అతనికి కనిపించేటట్టు రోజు ఖర్చుకి డబ్బు
ఉంచేది. 'కుక్కకి బిస్కత్తు అందించినట్టు డబ్బు పడేస్తుంది' - భర్త కామెంటు.
అతి నిరపాయమైన, సరదా ప్రశ్న ఉందనుకోండి: 'ఏమిటివాళ ఆనందంగా ఉన్నారు? '
'ఏం? అడుక్కు తినేటట్టు ఉండాలని నీ ఉద్దేశమా?'
'కాఫీ తాగారా? '
'ఏం? ఏమీ తాగక మాడి చావాలని నీ ఉద్దేశమా?'
ఆత్మన్యూనత భయంకరమైన జబ్బు. అహంకారం అర్ధంలేని రోగం. పురుషాధిక్యత ఈ సృష్టిలోనే
మగాడిని పట్టిపీడించే రోగం. టొరెంటో విశ్వవిద్యాలయంలో రోత్సన్ స్కూలులో కొందరు
పరిశోధకులు ఈ మధ్య ఓ గొప్ప సత్యాన్ని కనుగొన్నారని పేపర్లో చదివాను. హాలీవుడ్
సినీతారలకి కీర్తితోపాటు ఆస్కార్ బహుమతులు వస్తే సంసార జీవితం తప్పనిసరిగా
విడాకులకు దారి తీస్తుందని కనుగొన్నారట. కారణం - పురుషాధిక్యత. జోన్ క్రఫోర్డ్,
బెట్లీ క్రఫోర్డ్, బెట్లీ డేవిస్, హాలీ బెర్రీ, కేట్ విన్స్ లెట్ - ఉదాహరణలుగా
చెప్పారు.
ఇది గొప్ప పరిశోధన చేసి సూర్యుడు తూర్పున ఉదయిస్తాడని తేల్చడం లాంటిది. నేను
రెండు ఉదాహరణలు చెపుతాను.
మా పనిమనిషి నాలుగిళ్ళలో పనిచేసి సమృద్ధిగా సంపాదించి - ఇంటికి భోజనం తీసుకు
వెళుతుంది. మొగుడు వడ్రంగి పని చేసి నూరు రూపాయలు సంపాదించి, దానితో మందు తాగి,
పెళ్ళాం తెచ్చిన అన్నం తిని దాన్ని చావబాదుతాడు. పొద్దుటే పగిలిన పెదవితో,
కమిలిన మోచెయ్యితో, విరిగిన నడుంతో కనిపిస్తుంది. 'ఆ వెధవ మళ్ళీ కొట్టాడా? ' అని
నేను హుంకరిస్తే వెన్నెల లాగ నవ్వుతుంది - పిల్లల కోసం మొగుడి అరాచకానికి తలవంచే
- ఈ పనిమనిషి హాలీ బెర్రి కన్న గొప్ప మానసిక సౌందర్య రాశి అంటాను నేను.
మా వంట మనిషి భర్త వంట చేస్తాడు భార్యతో కలిసి. తన వాటా ఆదాయాన్ని తాగుడుకి
ఖర్చు పెడతాడు. ఇంటికి వచ్చి భార్యని డబ్బు ఇవ్వమని సతాయిస్తాడు. భార్య తిట్టి,
కొడితే తన్నులు తిని అతన్ని బయటికి పంపింది. ఇప్పుడు శవాలు మోస్తూ బతుకుతున్నాడు.
గత 14 ఏళ్ళుగా ఇద్దరు ఆడపిల్లల్ని చదివించుకుంటోంది నాలుగిళ్ళలో వంటలు చేసుకుంటూ.
పెళ్ళి అంటే తెలియని వయస్సులో 14 ఏట ఆమెకి పెళ్ళి జరిగింది. నిండా మునిగిన
సంసారం అనే 'టైటానిక్ 'లోంచి తననీ, ఆడపిల్లల్నీ కాపాడుకుంటున్న అభినవ కేట్ విన్
స్లెట్ ఈ ఇల్లాలు.
పురుషాధిక్యత అనే రోగం ప్రపంచ వ్యాప్తం. ఈ రోగానికి ఎవరికి వారు తమదైన
చికిత్సల్ని వెదుక్కున్న సౌందర్యరాశులెందరో ఉన్నారు. హాలీవుడ్ కనుక వాళ్ళ కథలు
వీధిన పడ్డాయి. ఈ నేలబారు తారల కథలు - మేఘాల చాటు తారల కథలు.
నేను మా వంటమనిషితో అంటూంటాను. "నీలాంటి పెళ్ళాం నాకుంటే హాయిగా నీ చేతి వంట
తిని ఇంట్లో కూర్చుని కథలు రాసుకునేవాడిని' అని.
భర్త అనే చీడనుంచి తన బిడ్డల్ని ఉద్ధరించుకునే గొప్ప 'ఉద్యమాన్ని'
నిర్వహిస్తున్న ఉద్యమకారిణిలాగ ఆమె నాకు కనిపిస్తుంది.
.