'49 ఓ'
గొల్లపూడి మారుతీరావు

      gmrsivani@gmail.com

       ప్రజాస్వామిక విధానాలలో కొన్ని సౌకర్యాలున్నాయి. అంతకు మించిన ఎన్నో అనర్థాలున్నాయి. సౌకర్యాలను మింగేసిన అనర్థాలు పెచ్చురేగితే ఏమౌతుంది? అది భారతదేశమౌతుంది.
ఏ విచక్షణా అక్కరలేకుండా కేవలం ప్రజల మద్దతు సంపాదించుకున్న ఎవరయినా 'ప్రజాప్రతినిధి' కావచ్చును. ఇది గొప్ప ఏర్పాటు. అయితే 'ఎవరయినా' అన్న ఒక్క కారణానికే, ఎంతమంది బొత్తిగా అర్హతలేని, చాలని, ఏ విధంగానూ నాయకత్వ లక్షణాలు లేని హంతకులూ, గూండాలూ, తప్పుడు కారణాలకి ప్రాచుర్యాన్ని సంపాదించిన వారూ (ఇందుకు ఉదాహరణ చెప్పాలని నా కలం ఊరిస్తోంది. టీవీ రామాయణంలో సీత, రావణుడు) మనకు నాయకులయి మన దేశాన్ని ఈ స్థితికి తీసుకు వచ్చారు.
ఎన్నికలలో చాలామంది పోటీ చేస్తారు. దానికి పార్టీ మద్దతు, పలుకుబడి, ప్రాచుర్యం (అది ఎలాంటిదయినా కానీ), బలం, బలగం, కులం, మతం, ధనం -ఇవన్నీ కలిసిరావాలి. కానీ ఇవి మాత్రమే కలిసివచ్చిన బొత్తిగా సమర్థత, నిబద్ధత, సమాజహితం తెలియని ఎంతోమందిని ఈ దేశం 64 సంవత్సరాలుగా భరిస్తోంది. ఫలితం నేటి అరాచకం. నాకు అనిపిస్తుంది, ఆయా పార్టీలో, సంస్థలో నిలిపిన వారిని తప్ప, లేదా నిలిపిన వారిలో మాత్రమే ఎన్నోకోవలసిన, ఎన్నుకోక తప్పని పరిస్థితి ఓటరుది. తమిళనాడు సంగతే తీసుకుందాం. అక్కడ ప్రముఖమయిన పార్టీలు రెండే రెండు. పాతికేళ్లుగా ఓటరు ఏ ఒక్కపార్టీనీ రెండోసారి ఎన్నుకోలేదు. ఒక పార్టీ పదవిలోకి వస్తే అయిదేళ్లకి వారి విధానాలకి విసిగి, మొహంమొత్తి తప్పనిసరిగా రెండో పార్టీని ఎన్నుకుంటున్నాడు. మరోగతి లేదు కనుక. ప్రతీసారీ ఎన్నుకొన్న పార్టీని గద్దె దించుతున్నాడు. ఇది వారి నిర్వాకానికీ, ప్రజల నిర్వేదానికీ నిదర్శనం. ఇంతకన్న అతనికి గత్యంతరం లేదు. అది ప్రజాస్వామ్యపు అనర్థం. అవినీతిపరుల అవకాశం.
నిన్నటి వరకు కరుణానిధి నాయకుడు. ఆయన కొడుకు స్టాలిన్‌ దాదాపు ముఖ్యమంత్రి. ఇవాళ అతని మీద క్రిమినల్‌ కేసులు బనాయించింది జయలలిత ప్రభుత్వం. ఎందరో డిఎంకె మంత్రులూ, ఎమ్మెల్యేలూ క్రిమినల్‌ కేసులతో జైళ్లకు వెళ్లారు మేడమ్‌ ధర్మమంటూ. కరుణానిధిగారి హయాంలో ఆ పని డిఎంకె ప్రభుత్వం చేసింది. జయలలిత పూనుకున్న సెక్రటేరియట్‌ భవనాన్ని డిఎంకె గ్రంథాలయాన్ని చేసింది. డిఎంకె నిర్మించిన సెక్రటేరియట్‌ భవనాన్ని జయలలిత ఆసుపత్రిని చేసింది. ప్రజాహితం ఎవరి మనస్సులోనూ లేదనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకే కావాలి? ఇంతకంటే మరోగతి లేదా దేశానికి? మాయావతిగారు అద్భుతమైన మెజారిటీతో పదవిలోకి వచ్చారు. కోట్ల ఖర్చుతో తన బొమ్మలూ, ఏనుగుల బొమ్మలూ, కాన్షీరాం బొమ్మలూ స్థాపించారు.
తన హయాంలోనే పదవుల్లో పాలించిన 26 మంది మంత్రులను అవినీతిపరులని ఎన్నికలముందు బర్తరఫ్‌ చేశారు. వారంతా తాను పదవుల్లో నిలిపిన వారే. అంటే ఈ అయిదేళ్లూ నాయకురాలి కళ్ల బడకుండా 26 మంది అవినీతిపరులు పరిపాలన సాగించారన్నమాట! ఈ మధ్య తమిళనాడు, మన రాష్ట్రం, ఇంకా చాలా రాష్ట్రాలు వేల కోట్ల రాయితీల్ని ప్రజలకు పంచుతున్నారు. ఆ పని వారి శ్రేయస్సు పట్ల సానుభూతిగా కాక తమ పార్టీ పరపతి పెంచుకునే దేబిరింపుగా అందరికీ అర్థమౌతూనే ఉంది. ఆ సౌకర్యాలు పొందుతున్న వారికీ ఈ విషయం తెలుసు. ఇది ఎవడి బాబు సొమ్ము? ఈ పని ఆయా నాయకుల నెర్వస్‌నెస్‌కీ, లాభసాటి బేరానికీ నిదర్శనం. ఈ రోజుల్లో ఎవరూ పొలాల్లో పనులు చేయడం లేదు. చేయాల్సిన అవసరం లేదు. చాలామంది తాగుడు మరిగారు. పల్లెల్లో రైతులు స్వయంగా చెప్పినమాట ఇది. సస్యశ్యామలమైన కోనసీమలో ఈసారి దాదాపు లక్ష ఎకరాల్లో పంటలు వేయలేదట. ప్రభుత్వం చేసే ఉపకారం పనులు చెయ్యడానికి స్ఫూర్తికావాలి కానీ, సోమరితనానికి సాకు కాకూడదు. పదవులకి పెట్టుబడి కాకూడదు. పని చెయ్యకుండా ఓటర్లని ముద్దుచేసే 'మొద్దు' నాయకుల కాలమిది.
వీళ్లందరినీ కాదనే హక్కు ఓటరుకి లేదా? ఇలాంటి దరిద్రాన్ని కాదనే ఓటరు గొంతు వినిపించే మార్గం ఏదయినా వుందా? ఇది పెద్ద మీమాంస.
ఉందిబాబూ ఉంది. ఎలక్షన్‌ కమిషనర్‌ టి.ఎస్‌.కృష్ణమూర్తి 2004 లో అప్పటి భారత ప్రధానికి ఒక ప్రతిపాదన చేసారు. '49ఓ' అనే సవరణను సూచించారు. రహస్య ఓటింగులోనే మతాల, కులాల, గూండాల, హంతకుల జాబితాలలో నాయకులు 'ఎవరూ మాకు వద్దు' అని చెప్పగల ఒక ఏర్పాటును చెయ్యాలన్నారు. ఎన్నికయిన కుహనా నాయకుని కంటే 'ఎవరూ వద్దనే' ఓట్లు ఎక్కువయితే ఆ ఎన్నిక రద్దవుతుంది. ఆ నాయకులు జీవితమంతా ఎన్నికల్లో పోటీ చేసే హక్కు పోతుంది.
అయితే ప్రజాస్వామ్యంలో సజావుగా ప్రజా ప్రతినిధుల్ని ఎన్నుకునే ఆదర్శాన్ని ఇది దెబ్బతీస్తుందని పెద్దల భావన. ఈ భావనని చాలామంది 'అవినీతిపరులు, అవకాశవాదులు' ముసుగు చేసుకుంటారని అందరికీ తెలిసిందే. ఆదర్శం చక్కని ఆరోగ్యకరమైన ఆలోచనల పర్యవసానం. అవినీతి ఆదర్శాన్ని దుర్వినియోగం చేసే అడ్డుతోవ. ఈ ఏర్పాటు తప్పనిసరిగా ఉండాలని భావించే ఉద్యమం పేరు అన్నా హజారే. అయితే మహిళా రిజర్వేషన్‌ బిల్లులాగ, లోక్‌పాల్‌ బిల్లులాగ ఈ '49 ఓ' ఏనాడూ కార్యరూపం దాల్చదు. దాల్చితే మన ఉచిత టెలివిజన్లు, లాప్‌టాపులూ, సైకిళ్లూ, మంగళసూత్రాలూ, వడ్డీలు లేని రుణాలూ, వెరసి పదవులకి పెట్టుబడులు ఏం కావాలి? మన మధ్య బలిసిన ఏనుగులెన్నో ఉన్నాయి. వాటి పునాదులు బలంగా ఉన్నాయి.
కొసమెరుపు:ఇలాంటి అవకాశాన్ని ధైర్యంగా అమలు చేసిన దేశం రష్యా. అయితే ఇందువల్ల ఎన్నికలు రద్దయితే ప్రజాధనం వృధా అవుతుంది కనుక, తప్పక వోటుచేసి తీరాలని, అంటే మీకు నచ్చినా, నచ్చకపోయినా, బాచన్ననో, బూచన్ననో, అతను కొంపముంచుతున్నాడని తెలిసినా ఎన్నుకోక తప్పదని నిర్ణయించింది ఆస్ట్రేలియా. క్రికెట్‌లోనే కాదు, మూర్ఖత్వంలోనూ ఇండియాకంటే ఒకడుగు ముందే ఉంది ఆస్ట్రేలియా.

 

                                               
ఫిబ్రవరి 06, 2012    

   ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


KOUMUDI HomePage