Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here 
 
Are you using iPad ( any iOs Device)? Try direct MP3, Click here

      'విశ్వరూపం'

   విశ్వరూపం సమస్య నిజంగా ''విశ్వరూపం'' సినిమాది కాదు. ప్రాంతీయ, మత ఛాందసుల అభిప్రాయాలను నెత్తికెత్తుకోవడం ద్వారా వోట్లకు కక్కుర్తిపడే రాజకీయ వర్గాల ప్రలోభపు విశ్వరూపమది.
ప్రతి వ్యక్తిలోనూ ఈ ప్రలోభం ఉంటుంది. మా వాళ్లని పొగిడితే నాకు ఆనందం. నన్ను తిడితే కోపం. తన ప్రాంతం, తన భాష, తన మతం, తనవాడు -యిలాగ. అయితే వ్యక్తి ప్రాతినిధ్యం వ్యవస్థ స్థాయికి పెరిగే కొద్దీ వ్యక్తి ప్రయోజనం మరుగున పడి -సామాజిక ప్రయోజనంపై దృష్టి మరలుతుంది.
కాని రోజులు మారిపోయాయి. వ్యక్తి ప్రయోజనాన్ని వ్యవస్థీకరించే నాయకత్వం, తమ స్వలాభాన్ని హక్కుగా వక్కాణించి, పోరాడి సాధించుకునే నాయకత్వం -వీటికి వోట్ల బంగారు ముసుగు రాజ్యమేలుతున్న రోజులు. ఆ వ్యక్తి సముదాయాన్ని వోట్ల బంగీగా ముద్దుపెట్టుకునే నాయకత్వం ప్రస్తుతం వారిని దువ్వుతోంది.
నిన్న కమల్‌హాసన్‌ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహాత్మాగాంధీ బతికి ఉంటే ఈపాటికి పాకిస్థాన్‌లో స్థిరపడి ఉండేవారు అన్నారు. ఇది నన్ను మెరుపులాగ ఆకర్షించిన విషయం. వ్యక్తి మీమాంసని తొక్కిపెట్టి 'మానవత్వపు' విలువల్ని విహంగస్థాయిలో నిలిపిన ఓ మహాత్ముని దృక్పథానికి దక్కిన కితాబు ఇది.
''విశ్వరూపం'' తాలిబన్ల కథ అని కమల్‌ చెప్పనే చెప్పారు. కాగా ఇది కేవలం వినోదాత్మక చిత్రం అని కూడా అన్నారు. ఏమీ గజిబిజి లేకుండా నాగరిక ప్రపంచంలో ఏ మర్యాదనూ పాటించకుండా భామియన్‌ బుద్ధ విగ్రహాలను ధ్వంసం చేయడం దగ్గర్నుంచి, చదువు ముఖ్యమన్న ఓ అమ్మాయిని కాల్చి చంపి గర్వపడే సంప్రదాయం తాలిబన్లది. కాగా ఇది కల్పితగాధ.
మనదేశంలో ముస్లిం సోదరులకు, ముస్లిం మతానికి -వారు కళలకు, సంగీతానికి, సమాజానికి చేసిన సేవలను మనలో ఒకరుగా -త్వమేవాహంగా నెత్తిన పెట్టుకుంటున్న దేశం మనది. 'సారే జహాసె అచ్ఛా హిందుస్థాన్‌ హమారా' అని ఒక ముస్లిం కవి ఇక్బాల్‌ గొంతెత్తిన దేశం మనది. దిలీప్‌ కుమార్‌, మధుబాల, నౌషాద్‌, బడే గులాం ఆలీఖాన్‌, అబిద్‌ హుస్సేన్‌, ఆలీ అక్బర్‌ ఖాన్‌ వంటి మహనీయులు మనం గర్వపడే వ్యక్తులు.
మరి ఈ అసహనం ఎక్కడిది? అది ఒక పార్శ్యం. అసహనాన్ని ప్రదర్శించే వర్గాలను భూతద్దంలో చూపించే నాయకత్వపు అవకాశవాదం ఈనాటి చర్చనీయాంశం. ఆయా వర్గాలకంటే -వాటికి విలువనిచ్చి నెత్తికెత్తుకునే నాయకత్వం ఇంకా భయంకరమైన కీడుని సమాజానికి చేస్తోంది.
రాజ్‌ ధాకరే మహారాష్ట్రీయుల కోసం ఎత్తిన ప్రాంతీయ వాదం ఆ రాష్ట్రానికి చెందిన కొందరు పెద్దల్ని రహస్యంగానయినా మనస్సుల్లో ఆనందాన్ని కలిగిస్తూ ఉండవచ్చు. ''మనవాడు జెండా ఎగరవేస్తున్నాడు. మంచిదే'' అని తలలు అటు తిప్పుకున్న సందర్భాలు మనకు తెలుసు. ఈ ధోరణిని వారు ఎదిరించిన దాఖలాలు లేవు.
ఒక అద్భుతమైన ఉదంతం చెప్పుకుంటే చాలు. ప్రముఖ రాజకీయ నాయకులు, ఒకప్పటి మంత్రివర్యులు శ్రీ భాట్టం శ్రీరామమూర్తి గారు తమ ఆత్మకథ ''స్వేచ్ఛా భారతం''లో ఈ ఉదంతాన్ని ఉటంకించారు.
ఈనాటి ఆవశ్యకత ఏమిటి? ఇదీ సమాధానం.
నౌఖాలీలో హిందూ ముస్లింల మధ్య కొట్లాట జరుగుతోంది. రక్తం ఏరులయిపారుతోంది. వారి మధ్య కూర్చుని మహాత్ముడు నిరాహార దీక్షని చేస్తున్నాడు. సోషలిస్టు నాయకుడు డాక్టర్‌ రామ్‌ మనోహర్‌ లోహియా వారిని పరామర్శించడానికి వెళ్లారు. ''నేను చెప్పింది చేస్తావా?'' అని అడిగారు బాపూ. ''అది నాకర్తవ్యం'' అన్నాడు లోహియా. ''పది ముస్లిం మొహల్లాలకు వెళ్లి ప్రతీ తలుపు తట్టి సమావేశానికి పిలువు. వారితో వారి తప్పిదాల్ని చెప్పు'' అన్నారు. ఆవేశాలు ఆకాశానికి అంటే వాతావరణంలో వారిని పిలవడమా? వారి అనుచితాల్ని చెప్పడమా? కొందరు తిట్టారు. కొందరు కసిరారు. కొందరు బెదిరించారు. కొందరు అరిచారు. కాని మీటింగుకి అరడజను మంది హాజరయారు. ఆయన మాట్లాడడం మొదలెట్టగానే తిడుతూ అయిదుగురు లేచిపోయారు. మహాత్ముడిని కలిశారు లోహియా. ఈ ఒక్కడే సభలో మిగిలాడని చూపించారట. అప్పుడు మహాత్ముడు అన్నారట: ''ఈ ఒక్కడే ఒక సైన్యం. అలాంటి ఒక్కడినే ఇక్కడ కూర్చున్నాను. అతన్ని విడిచిపెట్టకు. సమాజంలో ఒక్కడు చాలు -సత్యాన్ని నిర్దేశించడానికి''. అదీ మహాత్ముడు. వేల రూపాయలు ఖర్చుపెట్టి లక్షలాది జనాన్ని పోగుచేసి ఆకాశం దద్దరిల్లేటట్టు ఉపన్యాసాలు ఇస్తే చప్పట్లు వస్తాయేమో కాని వోట్లు రావు. ఎవరిదారిన వారు పోతారు. అలనాటి తిరుపతిలో చిరంజీవి అవిలాల సభ అందుకు గొప్ప తార్కాణం.
మనకి చాలా విశ్వరూపాలున్నాయి. ప్రలోభాల, స్వార్థాల, పదవీ వ్యామోహాల, ఆత్మవంచనల, విశ్వరూపాలు. ఇప్పటి విశ్వరూపాన్ని ఎదిరించే చిన్న చిన్న మత ఛాందసులలో అసహనం ఉంది. అయితే ఆ అసహనాన్ని ప్రదర్శించే ఎంతో కొంత నిజాయితీ ఉంది. కాని వారిని సమర్థించే, వారిని బుజ్జగించే, తమ ప్రయోజనాలకు వాడుకునే, వోట్ల కోసం తాకట్టుపెట్టే ప్రలోభాల విశ్వరూపం ప్రమాదకరమైనది. అదీ ఈనాటి దుర్వ్యవస్థ.
కావలసింది -సహేతుకమైన, సజావయిన, సత్యాన్ని నిర్దేశించగల, ధైర్యంతో నిలిచే ఒకే ఒక గొంతు. నా ఉద్దేశం ''విశ్వరూపాన్ని'' ఎదిరించే మత శక్తులలో ఉన్న నిజాయితీ, వాటిని ఎదిరించవలసిన నాయకత్వంలో లేదని. ఇది ఆత్మవంచన ఆరోప్రాణం. మన నాయకత్వపు నిజస్వరూపం. ఇందుకు చక్కని ఉదాహరణలు -జయలలిత, మమతా బెనర్జీ.


                                                                           gmrsivani@gmail.com  

 
     ఫిబ్రవరి 4,2013          

*************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 


KOUMUDI HomePage