Click Play to listen audio of this column If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here సాహితీ బంధువు గుమ్మడి గొల్లపూడి మారుతీరావు
అయిదారు దశాబ్దాలు సినీరంగాన్ని దీప్తిమంతం చేసిన గుమ్మడిగారితో నా బంధుత్వం- ముఖ్యంగా సాహితీ పరమైనదీ, మైత్రీ పరమైనదీ. విజయవాడ రేడియోకి వచ్చిన తొలిరోజుల్లో(1968 ప్రాంతాలలో) నాదికాని యితివృత్తాన్ని తీసుకుని (న్యాయంగా అమరేంద్ర రాయాల్సినది) రాత్రికి రాత్రి బందాగారి ప్రోత్సాహంతో రాసి, అర్ధాంతరంగా నేనే నిర్వహించాను. ఆ నాటకం పేరు “కళ్యాణి”. దానికి ప్రశంసల వర్షం కురిసింది. వాటిలో ఏరి ఇంతవరకూ మనస్సులో దాచుకున్న ఉత్తరం గుమ్మడిగారిది. నా ఆడ్రసునీ, నన్నూ వెదుక్కుంటూ వచ్చింది. అది మా బంధుత్వానికి ప్రారంభం. గుమ్మడి తన చుట్టూ వున్న నాటకరంగంలోంచి, సాహిత్యం లోంచి, విదేశీ చిత్రసంపదలోంచి ఎప్పటికప్పుడు ఉదాత్తతని క్రోడీకరించుకునే గడుసు నటుడు. 50 సంవత్సరాల పై చిలుకు నట జీవితం “మాసి” పోకుండా,stale అవకుండా వుంచుకోగలగడానికి ఇదీ ముఖ్యకారణం. ఆయన ముఖతః ఎన్నోసార్లు విన్న సంఘటనల సమ్మేళనం- ఆయన పుస్తకం “తీపి గురుతులు-చేదు జ్ణాపకాలు” ఎవరిద్వారానో నాకు పంపారు. ఆ పుస్తకం మీద “నా అభిమాన రచయిత” అని సంతకం చేశారు. ఆ మధ్య ఆయన 80 వ జన్మదినం సందర్భంగా వారి కుటుంబం ఆహ్వానం మీద సినీ పరిశ్రమలోని హితులంతా స్మావేశమయినప్పుడు నేను నా సమగ్రసాహిత్యాన్ని ఆయన చేతుల్లో పెట్టాను-“నా అభిమాన నటుడికి- మీ అభిమాన రచయిత” అంటూ.మరునాడు ఫోన్ చేసి మురిసిపోయారాయన. అది మా బంధుత్వానికి పరాకాష్ట. ఆయన దాదాపు రెండున్నర దశాబ్దాలు నా “జీవనకాలమ్” కి ఫాన్. తప్పనిసరిగా ముగ్గురు అనునిత్యం నా కాలమ్ కి స్పందించేవారు. నవతా కృష్ణంరాజు, గుమ్మడి, పేకేటి శివరాం. చెన్నైలో గుమ్మడిగారింటికీ మా ఇంటికీ మధ్య ఒక రోడ్డు మాత్రమే ఉందు. కూతవేటుదూరం. కాలమ్ చదివి ఒక్కోవారం ఆనందం పట్టలేక ఇంటికి వచ్చేసేవారు. కొన్ని సాయంకాలాలు ఆయనే స్వయంగా వచ్చి నన్ను ఇంటికి తోడ్క్ని పోయేవారు. మారెండిళ్ళకీ మధ్య పేకేటిగారిల్లు. ఆగి ఆప్యాయంగా “శివా” అన్ పిలిస్తే ఆయనా చేరేవారు. అప్పుడప్పుడు గిరిబాబు వచ్చేవారు. ఇక ఆ రాత్రిళ్ళన్నీ ఫక్తు సాహితీ సమావేశాలే. చదివ్న నవలో, కధో, చూసిన సినీమా, టీవీ నాటకమో- ఏదయినా ఆ సాయంకాలాన్ని ఆక్రమించుకునేది. గుమ్మడిగారు విపరీతమైన ఆవేశి, కోపిష్ఠి. ఆయనకి నచ్చిన విషయాన్ని నెత్తిన వేసుకుని పదిమందికీ ఎలా పంచుతారో,నచ్చని విషయాన్ని కుండ బద్దలుకొట్టేవరకూ నిద్రపోరు. ఈటీవీ ఛానల్ కో, దినపత్రికకో సంబంధించిన ఏదో విషయానికి క్రుద్ధులయి ఫోనెత్తి సరాసరి రామోజీరావుగారితోనే చెప్పారట. నచ్చని విషయంలో దాపరికం లేదు, నిజాయితీ లోపం లేదు. ఓ గొప్ప నటుడి ఆవేశం, కోపం అతని నటనలో తప్పక తర్జుమా అవుతుంది ద్రోణూడూ, బలరాముడూ ఇందుకు ఉదాహరణలు. ఆ కోపం గుమ్మడిగారి నటన కాదు. ఆయన ఆస్తి. ఏటేటా అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలకు వెళ్ళడం ఆయనకి వ్యసనం. నటుడిగా ఉక్కిరి బిక్కిరి చేసే షూటింగుల్లో ఉన్న రోజుల్లో ఎప్పుడు కనిపించినా “సంపాదనేకాదు. కాస్త exposure ఉండాలి. ఫెస్టివల్స్ కి రండి” అని నన్ను రెచ్చగొట్టిన వ్యక్తి గుమ్మడి. తదాదిగా దాదాపు పాతికేళ్ళు మానకుండా చిత్రోత్సవాలు దేశంలో ఎక్కడ జరిగినా వెళ్ళాను- అంత ముమ్మరమైన షూటింగుల్లోనూ. ఆ పదిరోజుల్లో- కలకత్తానుంచి, బెంగుళూరు నుంచి, త్రివేండ్రం నుంచి మధ్య మధ్య షూటింగ్ లకు హాజరయి మళ్ళీ వెళ్ళిన సందర్భాలు బోలెడు. తర్వాత అనారోగ్యం కారణంగా ఆయన ఆగిపోయారు. బెంగుళూరు చిత్రోత్సవంలో ఓసారి మేమిద్దరం ఒకే గదిలో వున్నాం. రాత్రి సినీమాల మీద చర్చ తప్పనిసరి. నటులు ప్రభాకర రెడ్డి, దర్శకులు తిలక్, గుమ్మడీ, నేనూ తప్పనిసరిగా చిత్రోత్సవాలలో జతకట్టేవాళ్ళం. ఢిల్లీ సిరిఫోర్ట్ ఆడిటోరియంలో ఇరాన్ దర్శకుడు మాజిద్ మాజిదీ “చిల్డ్రన్ ఆఫ్ హెవెన్” చూసి యిద్దరం బయటికి వచ్చాం. ఆయన కళ్ళు ఎర్రగా పత్తికాయల్లాగ వున్నాయి. నా పరిస్థితీ అదే. ఆ కళాఖండాన్ని గురించి ఆ తర్వాత ఎంతమందితో చెప్పానో! ఎన్నిసార్లు చూశానో! మంచి ఆలోచనకి పులకరించిపోయేవారాయన. మూడేళ్ళ కిందట ఆస్ట్రేలియా మెల్బోర్న్ తెలుగు సంఘం వారు- ముఖ్యంగా సాహితీ మిత్రులు శ్రీనివాసరావుగారు- ఆయన్ని ఆహ్వానించారు. నేను వస్తే వస్తానన్నారట. నన్నూ పిలిచారు. ఆయనతో గడపడం కారణానికే నేనూ సరేనన్నాను. తీరా అనారోగ్యం కారణంగా ఆయన రాలేకపోయారు. మెల్బోర్న్ లో ఆయన లేకుండానే సత్కారాన్ని కొనసాగించారు. నేను వక్తని. కొన్ని నెలల తర్వాత- 2008 భోగి పండగనాడు శ్రీనివాసరావు దంపతులు స్వయంగా ఆ సత్కారాన్ని జరపడానికి హైదరాబాదు వచ్చారు. అక్కినేని, సి.నారాయణ రెడ్డి, కైకాల సత్యనారాయణ, నేనూ- ఇంకా చాలామంది పరిశ్రమ పెద్దలు వచ్చారు. ముందు రోజు రాత్రి గుమ్మడి ఫోన్. “సభన్ మీరే నర్వహించాలి”అంటూ. లోగడ రెండు సభల్నే నేను నిర్వహించాను. ఒకసారి కళాసాగర్ నిర్వహించిన బాలసుబ్రహ్మణ్యం కచ్చేరీ. చెన్నై విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగిన “అంధాకానూన్” రజితోత్సవానికి ఇంగ్లీషులో చేశాను. అమితాబ్ బచ్చన్, హృషీకేశ్ ముఖర్జీ ప్రభృతులు ఆ రోజు వేదిక మీదున్నారు. మూడోది తప్పనిసరిగా, గుమ్మడిగారి మీద అభిమానానికి ఆనాటి సభ. మెల్బోర్న్ లో నా ఉపన్యాసం పదే పదే వేసుకు వింటూ ఎంత పొంగిపోయేవారో. ఒకసారి నాకు హైదరాబాదునుంచి ఫోన్. “అయ్యా, హైదరాబాదులో మాకూ ఓ ఇల్లు ఉందండీ. నేనూ ఇక్కడే ఉంటున్నాను”అని. రాజధానిలో ఏ సభలోనయినా కలిస్తే- ఆ సాయంకాలం వారింటికి రానిదే విడిచిపెట్టేవారు కాదు. నేనూ, కైకాల సత్యనారాయణ, గిరిబాబు తప్పనిసరి. అప్పటికి ఆయన గొంతు, ఆరోగ్యం క్షీణించింది. తనకి నచ్చిన కధనో, ప్రసంగాన్నో తెప్పించి నా చేత చదివించేవారు. ఓ రాత్రి 10 గంటల సమయంలో విశాఖపట్నంలో నా ఫోన్ మోగింది. “ఇన్ని సంవత్సరాలు మా అందరికీ దూరంగా ఎలా వుండగలుగుతున్నారు మారుతీరావుగారూ!” అంటూ ఎంతో సేపు ప్రసంగించారు. నా షష్టిపూర్తి సభకి- ఆరోగ్యం సహకరించకపోయినా –అక్కినేని, సి.నారాయణ రెడ్డి, బాలూలతో వచ్చి పాల్గొన్నారు. ఆయన చేసే పాత్రల్లో రాజీ లేదు. మధ్యేమార్గం లేదు. ద్రోణుడయినా, భానోజీ అయినా ఆయన కళ్ళముందు రూపుకట్టాలి. తర్వాతనే మన కళ్ళముందుకు ఆయన తెచ్చేది. నేను రాసిన ఒకానొక సినీమాలో నాకిష్టమయిన ఒక పాత్రకి ఆయన్ని అనుకున్నాం. నాకు ముందు రోజు పొల్లాచిలో షూటింగ్. వేషం వేసుకుని లొకేషన్ కి వచ్చారట. బడిపంతులు వేషం. తన అవగాహనని అర్ధం చేసుకోని డైరెక్టర్ ని ఒప్పించాలని ప్యత్నించి, సాధ్యంకాక, విసిగి- విగ్గుతీసేసి వెళ్ళిపోయారు. మరునాడు నాకు చెప్పారు. ఆయన్ని ఆ పాత్రకి నష్టపోయినందుకు బాధపడినా, నటుడిగా, రచయితగా ఆయన నిజాయితీకి గర్వపడ్డాను. ఉత్తమమయిన కళకి ఆయన తలవొంచే గొప్ప సందర్భాన్ని నేను మరిచిపోలేన్. ఓ విదేశీయానంలో నేనూ, మా శ్రీమతి, గుమ్మడిగారూ వస్తున్నాం. ఆ విమానంలో ఎమ్.ఎస్.సుబ్బులక్ష్మి గారున్నారు. విమానం గాలిలో తేలేదాకా విలవిలలాడిపోయారు గుమ్మడి. తర్వాత మా ఆవిడా, ఆయనా లేచి వెళ్ళారు ఆమె దగ్గరికి. మా ఆవిడ తన చిన్నాయన శ్రీపాద పినాకపాణిగారి పరపతిని చెప్పుక్ంది. కాని ఆ గాన సరస్వతికి గుమ్మడిగారిని తెలియదు. మా ఆవిడ పరిచయం చేసింది. ఆవిడ పవిత్రమైన గంగానది. అందులో ఎందరు భక్తులో మునకలు వేస్తారు. వారి ఉనికి నదికి తెలియనక్కరలేదు. ఇద్దరూ సభక్తికంగా ఆమెకి పాదాభివందనం చేసి వచ్చారు గర్వంగా. జీవితాన్ని తన షరతులతోనే నడిపారు.తెరమీద కన్నీళ్ళు ఆయన బాంక్ అకౌంట్. జీవితంలో వాటిని స్వయంగా రెండుసార్లే చూశాను. వారి శ్రీమతి కన్నుమూసినప్పుడు. ప్రాణప్రదమయిన కొతురు వెళ్ళిపోయినప్పుడు. దేనితోనూ రాజీపడని నిరంకుశుడు, గర్విష్టి, కోపిష్టిని అనారోగ్యం ఆఖరి రోజుల్లో లొంగదీసింది. అద్భుతమైన వాచకంతోనే అశేష ప్రజానీకాన్ని అలర్ంచిన ఆయన గొంతు సహకరించకపోవడం ఆయన్ని కృంగదీసింది. ఓ గొప్ప నటుడిక్ విధి చేసిన భయంకరమైన దోపిడీ అది. మొదటిసారిగా గుండె కలుక్కుమంది. ముందు ముందు కంప్యూటర్ యుగం వినోదాన్ని వింతగా అలంకరిస్తుంది. నేటితరం సంప్రదాయానికి అప్పుడే దూరంగా జరిగిపోతోంది. హారీపోటర్ చదివే పసివాడికి హరిశ్చంద్రుడి వైభవం తెలుసుకునే ఆస్కారం పోతోంది. డిజిటల్ ధర్మమాంటూ ఒక గొప్ప ఇతివృత్తం ఈ దేశంలో చచ్చిపోయి చాలారోజులయింది. ఆ యితివృత్తాన్ని ఒక జీవితకాలం తన సొత్తుగా, మాధవపెద్ది, అద్దంకి, పులిపాటివారికి వారసుడుగా ఓ తరాన్ని ప్రభావితం చేసిన ఆఖరి యోధుడి నిష్కమణాన్ని తలపండిన అభిమానులే తలచుకుని కంటతడిపెట్టే రోజులొచ్చేశాయి. అయితే గుమ్మడివంటి మహానటుల చరిత్రని పంచరంగుల కలగా భద్రపరిచే ప్రయత్నాలు అదృష్టవశాత్తూ ఈ దేశంలో ప్రారంభమయాయి. నిన్నటి “మాయాబజార్” అందుకు మంచి శకునం. ముందు తరాలకి తెర అంతా పరుచుకున్న యిలాంటి మహానటుల విశ్వరూపం- ఆనందాన్నీ, ఆశ్చర్యాన్నీ, గర్వాన్నీ, ఈ కళని అపురూపమయిన వారసత్వ వైభవాన్నీ సంతరించక మానదు. ఫిబ్రవరి 1, 2010 ************ ************ ************* ************* |