ఏవీ ఈ పద్మాలు
గొల్లపూడి మారుతీరావు gmrsivani@gmail.com
'సాయంకాలమైంది' అనే నా నవలలో కథానాయకుడు
బాగా చదువుకున్నాడు. విదేశాలకు వెళ్లే అవకాశం వచ్చింది.
'మావాడు పై దేశాలకు ఎందుకు వెళ్లాలి?' అనడిగాడు అలాంటి చదువు చదువుకోని
తండ్రి.
అమెరికా నుంచి వచ్చిన మనిషి ఎడిత్ కామెరాన్ సమాధానం చెప్పింది. ''మీ
దేశంలో చదువుకీ, అర్హతకీ, సామర్థ్యానికీ కులాల గుర్తులు పెట్టుకున్నారు.
మేం కేవలం సామర్థ్యానికి, విజయానికీ డబ్బు గుర్తు పెట్టుకున్నాం. మీరు
ముసిలి వాళ్లను గౌరవించి సంప్రదాయాన్ని గౌరవిస్తున్నామని చంకలు
గుద్దుకుంటారు. పద్మభూషణ్‌లూ, భారతరత్నలూ జీవితం ఆఖరి దశలో ఉన్న సమాజానికి
సెంటిమెంటల్ తృప్తినిచ్చే పెద్దలు. మా దేశంలో ప్రతీయేటా నోబెల్ బహుమతులు
పుచ్చుకునే యువరక్తం కావాలి. ప్రతీ యేటా కొత్త ఆలోచనకి పట్టం కట్టాలి. మేం
యువకుల సామర్థ్యాన్ని సంపాదించి, వాడుకోడానికి సముద్రాలు దాటి వెళ్తాం.'
సేవలకు గుర్తింపు ఏనాడూ కొలబద్దకాదు. ప్రతిభకి బిరుదులు ఏనాడూ గుర్తింపు
కాదు. కాని గుర్తింపులూ, బిరుదులూ -ఆ సమాజం, వ్యవస్థా ఆ వ్యక్తులకు కృతజ్ఞత
చెప్పుకునే ఔదార్యానికీ, పెద్ద మనస్సుకీ, ఉదాత్తతకీ నిదర్శనం.
కుచేలుడిని శ్రీకృష్ణుడు అనుగ్రహించడం కుచేలుడి భక్తికి కొలబద్ద కాదు. కాని
శ్రీకృష్ణుడి ముందు కుచేలుడు చెయ్యిజాచక పోవడం కుచేలుడి ఉదాత్తతకీ, ఆ
ఆలోచనకయినా తావులేని నిష్కల్మషమైన మైత్రికీ నిదర్శనం.
ఇంత చెప్పాక మరొక్కమాట చెప్పాలి. మన దురదృష్టం -మనం ఆంధ్రులం కావడం. మనల్ని
చూసి మనకి గర్వపడడం తెలీదు. అది చిన్న విషయం. గర్వపడాలని తెలీదు. ప్రతి
తెలుగువాడూ ఒక ద్వీపం. నాయకులయితే బొత్తిగా కులాల, పదవుల, డబ్బు,
స్వజాతీయుల ఎల్లలు గీసుకున్న ద్వీపాలు.
ఈ దేశానికి జాతీయ గీతం రవీంద్రుడిది. ఈ దేశానికి మాతృవందనం బంకించంద్ర
ఛటర్జీది. ఇద్దరూ వంగదేశీయులు. తమ రాష్ట్రీయుల ప్రతిభను గర్వంగా చాటుకోవడంలో
ప్రథమ స్థానం వంగదేశీయులది. ఈ దేశంలో మొట్టమొదటి జ్ఞానపీఠ పురస్కారం శంకర్
కురూప్‌ది. తమ రాష్ట్రంవారి ప్రతిభకు కిరీటం పెట్టే పెద్దమనస్సు గలవారు -మళయాళీలు.
ఈ దేశంలో సంగీతానికి మొట్టమొదటి భారతరత్న పొందింది ఎమ్మెస్ సుబ్బలక్ష్మి.
సంగీతానికీ, త్యాగరాజుకీ దైవత్వాన్ని కల్పించి ఆరాధించే ఔదార్యం తమిళులది.
మనం ఆంధ్రులం. చాలా సంవత్సరాల క్రితం ఓ ఎమ్మెల్యేగారితో గౌరవ డాక్టరేట్
విషయం ప్రస్తావించాను. 'అదేమిటి? ఎవరిస్తారు?' అన్నారాయన. ఈయనకి మంత్రి
అయ్యే అర్హతలున్నాయనుకున్నాను. నిజంగా ఆయన తర్వాత మంత్రి అయ్యాడు!
శ్రీపాద పినాకపాణికి 1984లో పద్మభూషణ్ ఇచ్చారు. ఆయన వయస్సిప్పుడు నూరేళ్లు.
గత దశాబ్దంగా మంచంమీద పడుకునే చాలామంది చెయ్యలేని కృషి చేస్తున్నారు. ఈ
మధ్యనే వారి సీడీలు హైదరాబాద్ భారతీయ విద్యా భవనంలో విడుదల చేశారు. ఆయనకి
పద్మవిభూషణ్ ఇవ్వాలని ఎవరూ అనుకోలేదు.
బాలమురళీకృష్ణ బాలమేధావి. ఓ జీవితకాలం సంగీతాన్ని తపస్సు చేసుకున్న వ్యక్తి,
72 మేళకర్తలలో కీర్తనలు చేశారు. త్యాగరాజు, దీక్షితార్ కీర్తనలన్నింటినీ
పాడి రికార్డు చేశారు. ఏనాడో ఆనాటి ముఖ్యమంత్రి జయలలిత వారికి భారతరత్న
ఇవ్వాలన్నారు. నేటికీ ఇవ్వలేదు.
తెలుగుజాతి గర్వించే చిత్రకారులు బాపూ. రామకథ అంటే ఆయన పులకించిపోతారు.
కుంచె వీరవిహారం చేస్తుంది. ఆనాటి 'సీతారామ కళ్యాణం' మొన్నటి 'శ్రీరామ
రాజ్యం' గొప్ప కృషి. బాపూకి పద్మభూషణ్ ఇవ్వలేదు. ఈపాటికి పద్మవిభూషణ్
సత్కారం జరపవలసినంత ఎత్తయిన కళాకారుడు బాపూ.
నిన్నకాక మొన్న మంచి రచనలు చేసిన తమ సినీ గీత రచయిత వైరముత్తుని పద్మశ్రీ
చేసుకున్నారు తమిళులు. గీత రచనలో చరిత్రను సృష్టించిన ఇద్దరు మహా రచయితలు
ఆచార్య ఆత్రేయ, వేటూరి ఆ గౌరవానికి నోచుకోకుండానే నిష్క్రమించారు.
గుమ్మడి, సావిత్రి వంటి మహా నటులకి ఆ గౌరవం దక్కలేదు. వేద వాఙ్మయాన్ని,
బ్రాహ్మణులను, ఉపనిషత్తులను తెలుగు జాతికి అందించిన రచయిత, అలనాటి తెలంగాణా
పోరాటంలో పాల్గొన్న వీరుడు దాశరథి రంగాచార్యను కనీసం పద్మశ్రీని చెయ్యలేదు.
గత యాభై సంవత్సరాలుగా తెలుగు భాషకూ, మహిళాభ్యుదయానికీ సేవ చేస్తున్న
రచయిత్రి మాలతీచందూర్. కనీసం పది భాషల్లో తనదైన బాణీలో రచనలను అసిధారా
వ్రతం లాగ కృషి చేసిన పండిత గాయకుడు పి.బి. శ్రీనివాస్, ఏమయింది మనవాళ్లకి?
ఎనభయ్యో పడిలో కూడా ఎన్నో అపూర్వ త్యాగరాజ కీర్తనలకూ, అన్నమాచార్య కీర్తనలకూ
బాణీలను ఏర్పరచిన మహాగాయకులు -ఎమ్మెస్ సుబ్బలక్ష్మి వంటివారికి ఆ బాణీలను
నేర్పిన సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తిగారిని పద్మభూషణల్ని చెయ్యడం
తెలుగువారు ఆయన కృషికి రుణాన్ని తీర్చుకోవడం. అరవై సంవత్సరాలుగా తనదైన
బాణీతో చరిత్రను సృష్టించిన రావు బాలసరస్వతి, ప్రముఖ నేపథ్యగాయని ఎస్.జానకి
గార్లకు ఏ పద్మ పురస్కారమూ అందలేదు.
తమిళనాడులో వీధికొక పద్మశ్రీ కనిపిస్తారు. అది వారి అభిరుచి, వారి అవగాహనకి
నిదర్శనం. వారి సంస్కారానికి గుర్తు. ఆ రాష్ట్రం చేసుకున్న పుణ్యం. హరిహరన్,
చిత్ర, సుధారఘునాథన్, టి.వి.శంకరనారాయణ్, ఈ జాబితా అనంతం. తమ కళాకారుల్ని
గౌరవించుకోడానికి అవసరమైతే ఢిల్లీతో తగాదా పడతారు. మనం కులం కోసం, మంత్రి
పదవులకోసం, వాటాల కోసం... ప్రముఖ గాయని పి.సుశీలని పద్మభూషణ్‌ని చేసింది
తమిళులు. బాలసుబ్రహ్మణ్యంను పద్మభూషణ్‌ని చేసింది తమిళులని విన్నాను. ఆనాడు
శ్రీపాద పినాకపాణిని పద్మభూషణ్‌ని చేసింది శెమ్మంగుడి అంటారు. మాండలిన్
శ్రీనివాస్‌ని పద్మశ్రీని చేసింది తమిళులు. భూపేన్ హజారికా 85 సంవత్సరాలు
బతికారు. గాయక శిఖామణి. ఆయన కన్ను మూశాక పద్మవిభూషణ్‌ని చేసింది ఈ ప్రభుత్వం.
ఎవరి కళ్లు తుడవడానికి? అలాగే కార్టూనిస్టు మారియో మిరాండా.
'సాయంకాలమైంది' నవలలో నా పాత్ర ఎడిత్ కామెరాన్ నిద్దట్లో నవ్వుకుంటూంటుంది,
ఈ దేశపు ఆత్మవంచనకి.
జనవరి
30, 2012
************ ************ ************* ************* Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com Read all the columns from Gollapudi గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి |