Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version.
Click Here

 

ఒక డిమాండ్

గొల్లపూడి మారుతీరావు
gmrsivani@gmail.com 

              ఆ మధ్య మా తమ్ముడు అన్నాడు. నువ్వు అన్ని రంగాలలో పనిచేశావు. ఒక్క రాజకీయ రంగమే మిగిలిపోయిందిఅని. చాలా సంవత్సరాలుగా చాలామంది పెద్దలు నన్ను ఎన్నికలలో పోటీ చెయ్యమని రెచ్చగొడుతూ వచ్చారు. పార్టీల్లో చేరడానికి ప్రోత్సాహకాలు, తాయిలాలు చూపుతూ వచ్చారు. అయితే ఓపికలేని కారణాన, ఇంత ఆలశ్యంగా పోటీల్లో దిగే శ్రమకి భయపడి ఆగిపోయాను.

        కాని నిన్న నేను చేసిన పొ్రపాటు నాకర్ధమయింది. శ్రమనుంచి విశ్రాంతికి బోలెడన్ని అవకాశాలు ఆ రంగంలోనూ లేకపోలేదని నిన్న తెలిసివచ్చింది. నాకు నిద్రపట్టని జబ్బు ఒకటి వుంది. రచయితని కావడం చేత- ఏ చక్కని ఆలోచన మనస్సులో కదిలినా అది నిద్రని ఏ మూడో ఝాముకో ఎగరేసుకుపోతుంది. ఇది తప్పనిసరిగా అనారోగ్యహేతువు. కాని నిన్న కలెక్టర్ల సమవేశంలో ఘనత వహించిన 8 మంది మంత్రి శేఖరులు హాయిగా నిద్రపోతున్న దృశ్యాన్ని టీవీల్లో, పత్రికల్లో చూశాక నా పొరపాటు తెలిసివచ్చింది.  హాయిగా నిద్రపోయే అదృష్టాన్ని సంపాదించుకునే  ఒక్క కారణానికే నాకిప్పుడు మంత్రి కావాలనే కోరిక పెరుగుతోంది. ఇప్పుడు పత్రికా ముఖంగా ప్రకటన చేస్తున్నాను. ఏ పార్టీ అయినా నాకు టిక్కెట్టు ఇచ్చి, నన్ను మంత్రిని చేసి- వారానికి రెండు రోజులయినా కలెక్టర్ల సమావేశాలు ఏర్పాటు చేస్తామని హామీ యిస్తే- నేను రాజకీయ ప్రవేశం చెయ్యడానికి సిద్ధంగా వున్నాను.

        నా స్పూర్తి మహారాజరాజశ్రీ శిల్పా మోహన రెడ్డి, ధర్మన ప్రసాదరావు, శత్రుచర్ల విజయరామరాజు, శ్రీధర్ బాబు, వెంకటరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య అని మనవి చేస్తున్నాను. వీరు ఎంత ఖర్చు చేసి, ఎంత కృషి చేసి ఈ సుఖాన్ని సాధించుకోగలిగారో నేనూహించగలను. వీరిని చూసి నేను ఈర్ష్య పడుతున్నాను.

        రేడియోలో పనిచేసే రోజుల్లో సినీమాలు ముమ్మరంగా రాస్తూ ఆఫీసులో విశ్రాంతిగా వుండేవాడిని. నన్నెవరయినా "ఎప్పుడు మిమ్మల్ని కలుసుకోవచ్చు?'' అని అడిగితే ఏరోజయినా ఆఫీసులో పదినుంచి అయిదువరకూ తీరికగా వుంటాను అని చెప్పేవాడిని.

             అసలే ఉద్యమాలతో ఢిల్లీ ప్రయాణాలతో, చిదంబరంగారి ప్రకటనలను అన్వయించుకోలేక, జీర్ణించుకోలేక, విద్యార్ధులను రెచ్చగొట్టే ఉపన్యాసాలతో, సెక్రటేరియట్ కి రావడానికే తీరికలేని ప్రజాహిత కార్యక్రమాలతో సతమతమవుతున్న మంత్రివర్యులు- మూక వుమ్మడిగా కలెక్టర్ల సమావేశాల్లోనయినా నిద్రించగలగడం మనం హర్షించదగ్గ విషయం.           

               మరో గొప్ప ఔషధం యిందుకు కారణమని నా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రోశయ్యగారు ఏ విషయం మాట్లాడినా అరిటిపండు వొలిచి చేతిలో పెట్టినట్లు స్పష్టంగా, పెద్దబాలశిక్షలాగ సూటిగా, హాయిగా వుంటుంది. ఆయన ఉపన్యాసాల్లో మధ్య మధ్య పిట్ట కధలు చెప్తారు. ఈ సమావేశంలో రోశయ్యగారు ఇద్దరు తోడికోడళ్ళ కధని చెప్పారు. ఈ సుఖం కూడా మన మంత్రుల్ని జోకొట్టి నిద్రపుచ్చిందని నాకు తోస్తుంది.

          ఈ సౌకర్యం దౄష్ట్యా- ఆరోగ్యశ్రీ పధకం కింద వారానికి రెండు మూడు రోజులయినా నిద్రరాని నాలాంటి అభాగ్యులని సమావేశపరిచి రోశయ్యగారి ఉపన్యాసాలు ఏర్పాటు చెయ్యాలని నాకు తోస్తుంది. కాగా, మిగతా మంత్రులు-బొత్సా సత్యనారాయణ, గీతారెడ్డి, సునీతా రెడ్డి, మాణిక్య వరప్రసాద్ వంటి మహనీయులు ఈ సభకి ఆలశ్యంగా వచ్చారట. బయట ఏవో రాచకార్యాలు, ఉద్యమాల కృషి జరుపుకు వచ్చివుంటారు.ముఖ్యమంత్రి అద్యక్షత వహించే రాష్ట్ర కలెక్టర్ల సమావేశానికే వీరు ఆలశ్యమయారంటే బయట ఏ రాచకార్యాలు చేస్తున్నారో మనం ప్రయత్నించినా ఊహించలేని విషయం. కాగా,  వీరు నిద్రపుచ్చే రోశయ్యగారి చిట్కాను నష్టపోయారని, ముందు ముందు మంత్రులందరికీ ఈ సౌకర్యం అందేటట్లుగా కలెక్టర్ల సమావేశాలు కనీసం 8 గంటలు జరపాలని నా మనవి.

            ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు పెద్దలు. మనల్ని పాలించే నాయకుల ఆరోగ్యం మన భాగ్యం. ఇళ్ళల్లో, ఉద్యమాల్లో- సాధకభాధకాలను అనుభవించి వున్న వీరు కనీసం ఇలాంటి సమావేశాల్లో కంటినిండా నిద్రపోగలగడం ప్రజలు చేసుకున్న అదృష్టం. రేపు వీరే మరింత ఆరోగ్యంగా, మరింత ఉదృతంగా, మరింత ఉత్సాహంగ ఉపన్యాసాలు యివ్వగలరు. ప్రజాహితాన్ని సమకూర్చగలరు.

      నిద్ర అలసటనుంచి ఆటవిడుపు. శ్రమ జీవుల హక్కు. నిద్రపోయే ప్రతీవ్యక్తీ- పరోక్షంగా తను నిరంతరం పడే శ్రమని చెప్పక చెప్తున్నట్టు లెక్క. గొప్పవాళ్ళ కృషి మనకు రెండు విధాలుగా తెలుస్తుంది. 1.వారు శ్రమ పడుతున్నప్పుడు. 2. శ్రమకారణంగా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు. ప్రస్థుతం మన మంత్రులు ఆ రెండో విషయాన్నిసమావేశంలో నిద్రించి మనకు నిరూపిస్తున్నారు. ఇది కూడా మన భాగ్యం. ఇలాంటి మంత్రివర్యుల్ని ఎన్నుకోవడం తెలుగు దేశపు వోటర్లు చేసుకున్న పుణ్యం.

             ముందు ముందు మిగతా మంత్రులుకూడా తమ శ్రమ మనకి తెలిసివచ్చేలాగ మూక వుమ్మడిగా నిద్రించే కలెక్టర్ల సమావేశాలు ఏర్పాటు చేసి, మన ముఖ్య మంత్రి రోశయ్యగారు పిట్ట కధలతో సుదీర్ఘంగా ఉపన్యాసాలను ఏర్పాటు చెయ్యాలని నేను డిమాండ్ చేస్తున్నాను.(ప్రతీదానికీ డిమాండ్ చెయ్యడం ఈనాటి ఫేషన్ కనుక)                   

జనవరి 25,2010

       ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

KOUMUDI HomePage