ముంబైలో 'ఆదర్శ ' హౌసింగ్ సొసైటీ కుంభకోణం 31 అంతస్థుల భవనాన్ని కూలద్రోయాలని
కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంత్రి జైరాం రమేష్ గారు ఈ నిర్ణయాన్ని
కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. ఇది మరీ పెద్ద అవినీతి అని నా ఉద్దేశం. ఒక
రొట్టెముక్క ఉంది. వెంకయ్య తినాలా రామయ్య తినాలా అన్నది తగువు. మధ్యవర్తి వచ్చి
ఎవరూ తినకూడదు అంటూ తను నోట్లో వేసుకోవడం ఫక్తు 'కాంగ్రెసు' తీర్పు. దీనికే
పాతకాలం సామెత ఒకటుంది - పిల్లీ పిల్లి తగువు కోతి తీర్చిందని. కాని ఎవరూ
తినకూడదు అంటూ సముద్రంలోకి గిరాటు వెయ్యడం - జైరాం రమేష్ గారు ఇవ్వవలసిన తీర్పు
కాదు.
ఆ అపార్టుమెంటుని పడగొడితే అసలు సిసలైన కార్గిల్ వీరులం మా మాటేమిటని ఒకాయన
వాపోయాడు. ఖర్చయిన సిమెంటు, ఇసుక, సరంజామా మాటేమిటని మరొకాయన బుగ్గలు
నొక్కుకున్నాడు. అసలు అవినీతిపరులు కిక్కురుమనకుండా ఉన్నారు. ఇవన్నీ సముచితమైన
నిర్ణయాలు కావని నా ఉద్దేశం. నాదొక సలహా ఉంది. దీనిని ప్రభుత్వమూ, పెద్దలూ
పరిశీలించి ఒక నిర్ణయానికి రావాలని మనవి చేస్తున్నాను.
ఇంగ్లీషులో "స్కాండ్రల్స్, రోగ్స్" కథల పుస్తకాలున్నాయి. దగుల్బాజీలు, దగాకోర్ల
కృత్రిమ మేధాసంపత్తిని, అనూహ్యమైన తెలివితేటల్ని ఉటంకించే కథలవి. ఇంగ్లీషు
వాడికి గొప్ప సెన్సాఫ్ హ్యూమర్ ఉంది.వాళ్ళ దేశంలో అగాధా క్రిస్టీకి ఉన్నట్టే,
చార్లెస్ శోభరాజ్ వంటి వారికీ సముచిత స్థానం ఉంది.
ఇప్పుడు నా సలహా ఇది. ఆదర్శ్ అపార్ట్ మెంట్స్ ని కూలదోయడం అన్యాయం. అవాస్తవం.
తెలివితక్కువతనం. మనదేశంలో 64 కళలలోనూ దొంగతనాన్ని కూడా ఒక కళగా పేర్కొన్న
సంస్కృతి మనది. దాన్ని పరాకాష్టకు చేర్చిన తరం మనది. సైనికాధికారులూ, మంత్రులూ,
మంత్రుల తొత్తులూ, బంధువులూ, చిల్లర మల్లర ఆఫీసర్లూ - అంతా ఏకమయి ఆరు అంతస్తుల
భవనాన్ని 32 అంతస్థులకు సాగదీయడం అద్భుతమైన కథ. ఈ 'ఆదర్శ' భవనాన్ని మన దేశంలో
అవినీతికి ఆదర్శంగా ఒక మ్యూజియంగా మార్చాలని నా సలహా. ఇంగ్లీషువాడిలాగే మనకీ
మనల్ని చూసి మనమే నవ్వుకుని అభినందించే విచక్షణ మనకీ ఉన్నదని చాటి చెప్పాలి. ఈ
దేశంలో రకరకాల స్థాయిల్లో అవినీతికి పాల్పడిన వారి ఫోటోలూ, కథలూ అక్కడ
ప్రదర్శించాలి. చూసేవారికి ఒక పక్క కితకితలు పెట్టినట్టు సరదా కలగాలి. కొందరికి
ఆశ్చర్యం, కొందరికి కోపం, కొందరికి కనువిప్పు - ఇలా రకరకాల అనుభూతులు కలగాలి.
ఇది 'ఆదర్శ' అవినీతికి ఆదర్శంగా నిలవాలి.
అదిగో, మీలో కొందరికి తప్పనిసరిగా నవ్వు వస్తోందని నాకు తెలుసు. ఈ భవనంలో
లల్లూగారూ, వారు తిన్న గడ్డీ, ఏ.రాజాగారూ, కల్మాడీగారూ, దర్బారీగారూ,
మహేంద్రూగారూ, ఖత్రోచీగారూ, హర్షద్ మెహతాగారూ, రామలింగరాజుగారూ, కేతన్ పారిఖ్
గారూ, పండిత సుఖ్ రాం గారూ, మనూశర్మగారూ, సంతోష్ సింగ్ గారూ మొన్న పెళ్ళాన్ని
చావగొట్టి రక్తం మడుగులో వదిలేసిన అనిల్ వర్మగారూ, నీరా రాడియాగారూ, పి.జె.
ధామస్ గారూ, రాజా భయ్యాగారూ, రాధోడ్ గారూ, తెల్గీ గారూ, బంగారు లక్ష్మణ్ గారూ,
షిబూ సారేన్ గారి, గాలి సోదరులు, ఎడ్యూరప్ప గారూ, మధుకోడాగారూ - ఇలా ఇంకా
ఎందరికో స్థానం ఉంటుంది.
అందరికన్నా ముందు గదిలో మహాత్మా గాంధీ ఫోటో - ఆయనే స్వయంగా చెప్పుకున్న అవినీతి
- ఆఫ్రికాలో పెళ్ళాన్ని చెంపదెబ్బ కొట్టిన సందర్భం - ఉటంకించడం జరుగుతుంది.
31 అంతస్థులూ తిరిగి వచ్చిన వాడికి - నిన్న మొన్నటి రెవిన్యూ గుమాస్తా వెయ్యి
రూపాయల అవినీతి ఏనుగు ముందు చలిచీమలాగా కనిపిస్తుంది. మానవ స్వభావం ఎన్ని
రకాలయిన పుంతలు తొక్కగలదో, మేధస్సు ఎన్ని రకాలయిన వక్రమార్గాలు తొక్క గలదో
అర్ధమవుతుంది.
ఆస్కార్ లకు దీటుగా అమెరికాలో ఉత్తమ చెత్త చిత్రం, ఉత్తమ దరిద్ర కళా దర్శకుడు,
ఉత్తమ ఛండాలపు నటుడూ - ఇలా బహుమతిలిచ్చే సంస్థ ఉంది. వారి సెన్సాఫ్ హ్యూమర్ కి
జోహార్లు. ఈ దేశంలో అవినీతి కథలకు ఆదర్శంగా 'ఆదర్శ' మ్యూజియం నిలవాలని,
అపూర్వమయిన విజయాలు సాధించిన వారి చరిత్ర గిన్నీస్ బుక్ లోకి ఎక్కినట్టు ’ఈ
మధ్య ఫలానా ఆయన పేరు ఆదర్శ మ్యూజియం చేరింది ' అని చెప్పుకోవడం ఒక కొలబద్దలాగ
నిలుస్తుంది.
ఈ సొసైటీకి బారసాల చేసి 'ఆదర్శ' అని పేరు పెట్టిన మహాత్ముడెవరో ఆయనకి జోహార్.
ఇది నిజమైన 'ఆదర్శ్' ప్రదర్శన. ఇందులో తామందరికీ చోటుంది. పెళ్ళాన్ని కొట్టారా?
పక్కవాడి జేబు కొట్టారా? సిగరెట్టు దొంగతనం చేశారా? గడ్డి తిన్నారా? పొరుగాయన
పెళ్ళాన్ని లేపుకుపోయారా? మంత్రిగా ఉంటూ ఓ గిరిజన అమ్మాయిని మానభంగం చేసి జైలుకి
పంపారా? కక్కుర్తిపడి కారాకిళ్ళీ డబ్బివ్వకుండా నోట్లో వేసుకున్నారా? రండి. మీకు
ఈ ఆదర్శ ప్రదర్శనలో చోటుంది. తమ ఫోటో, తమ కథ, ఇలాంటి ఆలోచనలు తమ కెప్పటినుంచీ
వస్తున్నాయి? అన్నీ సెలవివ్వండి. ముందు తరాలు మిమ్మల్ని గుర్తుంచుకుంటాయి.
అయితే, ఈ దేశపు పాలనా వ్యవస్థకి, మంత్రులకు ఇంత ఆబ్జెక్టివ్ గా ఒక మ్యూజియం
ఏర్పరచి నవ్వుకునే దమ్ము, సెన్సాఫ్ హ్యూమర్ ఉన్నదా అని.
మరొక్కసారి - ఇది నవ్వుకుని మరిచిపోయే కాలం కాదు. ప్రాచీన కాలం నుంచీ - అంటే
మృచ్ఛకటికలో చారుదత్తుడి కాలం నుంచీ నేటి మధుకోడా దాకా అవినీతి ఎన్ని రకాలయిన
పరిణామాలను పొందింది, మానవ స్వభావం ఎంతగా దిగజారిపోయింది - ముఖ్యంగా భారతదేశంలో
- తెలియజెప్పే ప్రదర్శన శాల ఇది.
చివరగా ఈ ప్రదర్శన శాలలో ఒక భగవద్గీత శ్లోకం ఉంచాలి:
యద్యదాచరతి శ్రేష్టః తత్తదేవేతరోజనః|
సయత్ర్పమాణం కురుతే లోకస్తదనువర్తతే||
పెద్దలు ఏం చేస్తారో వారి వెనుక ఉన్నవారూ అదే చేస్తారు. ఎవరు ఏ ఆదర్శాన్ని
నిర్దేశిస్తారో దానినే సమాజం అనుసరిస్తుంది. పర్యవసానం: 'ఆదర్శ' సొసైటీ
ప్రదర్శన శాల.