Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version.
Click Here

 

ఆదర్శం - ఆచరణ

గొల్లపూడి మారుతీరావు
gmrsivani@gmail.com 

  

              19 సంవత్సరాల కిందట ఓ పధ్నాలుగేళ్ళ అమ్మాయిని మానభంగం చేసి. ఆమె కుటుంబానికి మనశ్శాంతి లేకుండా చేసి ఆమె ఆత్మహత్య చేసుకోడానికి కారణమైన హర్యానా పోలీసు ఇనస్పెక్టర్ జనరల్ రాధోడ్ గారు - మనకి ఓ గొప్ప జీవిత సత్యాన్ని నిన్ననే కోర్ట్ నుంచి బయటికి వస్తూ వివరించారు.

              "నేను లక్నో విశ్వవిద్యాలయంలో చదువుకునే రోజుల్లో - నెహ్రూ గారిని చూడాలని ఆ తరం కుర్రకారుతో పరుగులు తీసేవాడిని. ఇప్పటికీ ఆయన బొమ్మ నా గదిలో బల్లమీద ఉంది. కష్టాల్లో చిరునవ్వు నవ్వడం ఆయన నేర్పారు" అంటూ పత్రికా విలేఖ్హరుల వేపు తిరిగి "మీరు నాకు కీడు తలపెడుతున్న కొద్దీ నేనింకా నవ్వుతూనే ఉంటాను" అని వాక్రుచ్చారు.

              నెహ్రూ గారిని నేనూ చూశాను. నేనూ విశ్వవిద్యాలయంలో చదువుకునే రోజుల్లో ఆయన్ని చూడడానికి మా విశ్వవిద్యాలయం తరఫున ఢిల్లీ తీన్ మూర్తి హౌస్ కి వెళ్ళాను. ఆయనతో ఫోటో తీయించుకున్నాను. ఆయన వందలాది ఉపన్యాసాలను పత్రికలో పాత్రికేయుడిగా రాసాను. కాని ఆయన నవ్వుగురించి యింతగా ప్రభావితుడైన వ్యక్తి కథ నేనెప్పుడూ చదవలేదు. కాగా, గాంధీగారు బోసినవ్వుతో ఉన్న ఫోటోలు కనిపించినన్ని నెహ్రూ గారి ఫోటోలు కనిపించవు. ఎందుచేతనో.

              అయితే మానభంగాలు, హత్యలు చేయించిన పాత పోలీసాఫీసర్లకి ఆ నవ్వు బాగా వంటబడుతుందేమో! ఏదో బెర్నార్డ్ షా నాటకంలో ఓ పాత్ర "ఒరే కుక్కా!" అని తిడుతుంది ఎదుటి పాత్రని. పక్కనే ఉన్న కుక్క బాధపడుతుంది "నన్ను అతనితో పోల్చి నన్ను అవమానించ వద్దు సార్!" అని.

             రాధోర్ కథని చెప్తూ న్యూస్ రీడర్ ప్రణయ్ రాయ్ దాదాపు ఇదే మాట టీవీ ప్రసారంలో అన్నాడు. పాపం, నెహ్రూగారు తన సమాధిలో కలవరపడుతో ఉంటారు అని. నెహ్రూగారి జీవితంలో అపకీర్తుల జాబితా తయారు చేస్తే, యిక ముందు వారు నవ్వుతున్న ఫోటో కన్పిస్తే తప్పని సరిగా నీచమయిన నేరానికి పాల్పడిన రాధోడ్ నవ్వు - ఓ తీరని మచ్చలాగా మనకి గుర్తొస్తుంది.

              కాగా హిట్లర్ మీసం, నెహ్రూ నవ్వు, పటేల్ గారి గుండూ, లాల్ బహదూర్ టోపీ, వినోభా గోచీ - యివి ఆదర్శాలు కావు. ఇలాంటి వాటిని ఆదర్శాలుగా తీసుకున్న వారు తప్పని సరిగా రాధోడ్ లాంటి వారే అయిఉంటారు.

               అకుంఠితమైన దేశభక్తికి, మతాతీతమైన సమాజ స్థాపనకీ, పంచవర్ష ప్రణాళిలకీ, ఈ దేశంలో అణు పరిశోధనకూ, నాగార్జునసాగర్, హీరాకుడ్, భాక్రానంగల్ వంటి అపూర్వమైన ప్రోజెక్టులకీ నెహ్రూ ఆదర్శం. ఆయన లోపాల్ని, తప్పుల్ని ఎరిగిన ఆనాటి నాయకులు కూడా ఆయన లక్శ్యాల్ని, ఆదర్శాలనూ ఏనాడూ ప్రశ్నించలేదు.

              ఈ 60 ఏళ్ళలో గాంధీని వాడుకున్నట్టు మరెవరూ దుర్వినియోగం చెయ్యలేదు. నగరం నడిబొడ్డులో శిలావిగ్రహాల దగ్గర్నుంచి, రోడ్ల మీద గళ్ళీల పేర్ల దగ్గర్నుంచి, క్షవర శాలల వరకూ గాంధీగారిని రోడ్లకి ఈడ్చారు. అయితే ప్రస్తుతం ఆయన సంవత్సరానికి రెండు రోజులే మనకి గుర్తొస్తాడు. జనవరి ముప్పైన, అక్టోబర్ రెండున. ప్రస్తుత రాజకీయ నాయకుల్ని గాంధీ గురించి పదిలైన్ల కాంపోజిషన్ వ్రాయమని పోటీ పెడితే - ఇదొక్కటే వారు నాయకులుగా ఉండడానికి అర్హతగా షరతు పెడితే - తొంభై అయిదు శాతం పరీక్షలో ఫెయిలవుతారని నా ధృఢ విశ్వాసం.

                ఈ మధ్య కాలంలో గాంధీని బొత్తిగా మూలనున్న చీపురు కట్టని వాడినట్టు వాడిన ఉదాహరణలు కోకొల్లలు. ముఖ్యంగా ఆయన నిరాహార దీక్షలు. ఆలోచించండి. ఆయన స్వాతంత్ర్య పోరాటంలో గాంధీగారొక్కరే నిరాహార దీక్ష చేశారేం? నెహ్రూగారెందుకు చెయ్యలేదు? పటేల్ గారెందుకు చెయ్యలేదు? రాజేంద్రప్రసాద్ గారెందుకు చెయ్యలేదు? ఆ వ్యక్తిత్వానికి, ఆయన ఆస్థిత్వానికి, తనని తాను శిక్షించుకునే నైతిక స్థాయికీ అంత గొప్ప విలువ వున్నప్పుడే ఆ దీక్షకి విలువ. ఆ దీక్ష హెచ్చరిక హెచ్చరిక కాదు. ఆయుధం కాదు. తనపై తాను విధించుకున్న శిక్ష.1922 లో మహాత్ముడు సహాయనిరాకరణోద్యమాన్ని ప్రారంభించారు. దేశం అట్టుడికి పోయింది. ఆయన్ని ఏనాడూ చూడని వ్యక్తులు ఆవేశపడ్డారు. చౌరా చౌరీ అనే గ్రామంలో కాగడాలతో మలుపు తిరిగారు. దూరంగా లాఠీలతో పోలీసులు. వాళ్ళూ భారతీయులే. కానీ ఆ క్షణంలో వారు అధికారం లో ఉన్నారు. ఐనా ఉద్యమకారుల్ని చూసి పోలీసులు హడలిపోయారు. పోలీసు స్టేషన్లోకి పరుగెత్తి తలుపులు మూసుకున్నారు. ఉద్యమకారులు ఆవేశంతో పిచ్చెత్తిపోయారు. పోలీస్ స్టేషన్ తలుపులు మూసి నిప్పటించారు. పోలీసులు సజీవదహనమయ్యారు. అప్పుడు - అప్పుడు మహాత్ముడు నిరాహార దీక్షకి కూర్చున్నారు. వెంటనే ఉద్యమాన్ని ఆపెయ్యాలన్నారు.." ఈ దేశం శాంతి యుతంగా ఉద్యమం జరిపే అర్హతని సంపాదించుకోలేదు. బహుశా నేను తొందరపడ్డానేమో!" అన్నారు. దేశం వణికిపోయింది. నాయకులు ప్రాధేయపడ్డారు. పటేల్ ఆయన్ని సముదాయించబోయారు. "దేశమంతా శాంతియుతంగా సత్యాగ్రహం చేశారు బాపూజీ. కానీ..కానీ..ఒక్కచోటే.ఒక్కచోటే..."

        నీళ్ళు నిండిన కళ్ళతో " ఆ మాట చచ్చిపోయిన ఆ పోలీసుల కుటుంబాలకు చెప్పండి. వాళ్ళని ఒప్పించగలరేమో చూడండి.." అన్నారు బాపూ.

        గాంధీజీ శాంతికాముకత్వం ఆయుధం కాదు. గాంధీజీ వ్యక్తిత్వం ఆయుధం. దేశాన్ని రెండుగా చీల్చిన 1947 నాటి మారణహోమంలో పశ్చిమాన భారతదేశంలో వున్న బలగాలన్నీ తంటాలు పడుతుంటే తూర్పున బెంగాలులో - ఒక్కరే ఆ పని చేస్తున్నారు - నిరాహారదీక్షతో. ఆయన మహాత్ముడు. ఆయన  నా one man army అన్నారు మౌంట్ బాటెన్.

       పొట్టి శ్రీరాములు వ్యక్తిత్వం ఆయుధం కాలేదు. ఆయన దీక్ష పర్వవసానం ఆయుధమయింది. ఒక జీవుని వేదన చిరంతనమైన ఆదర్శంగా నిలిచింది.

       శ్రీకృష్ణుడు మార్గదర్శకం కాదు. ఆయన ఆచార్యుడు. ఆయన ఉవాచ మార్గదర్శకం. రాముడు ఆచార్యుడు కాడు. ఆయన జీవితం మార్గదర్శకం. శ్రీకృష్ణుడు తత్వం. శ్రీరాముడు పాఠం.

       మండేలా వ్యక్తిత్వానికి 25 సంవత్సరాల జైలు శిక్ష పదునుపెట్టింది. తనని హింసించిన వారిమీద ఒక్క క్షణం కూడా ద్వేషం చూపని అతని ఔదార్యం అతన్ని మహాత్ముడ్ని చేసింది. రాబెన్ ఐలాండ్ జైలునుంచి సరాసరి ఆయన మానవాళి గుండెల్లోకి, రాష్ట్రపతి భవనంలోకి అడుగుపెట్టారు.

        ఈ మధ్యనే టెన్నిస్ ఆటగాడు ఆంధ్రీ అగాస్సీ ఆత్మకథ చదువుతున్నాను. ఆయనకి మండేలాని కలుసుకునే అవకాశం లభించింది. ఆయన రెండే వాక్యాలు రాశారు. He seems saintly to me. Gandhi like - void of all bitterness(దేవదూతలాగా కనిపించారు. గాంధీలాగ. ఏ మత్సరమూ లేకుండా). అగాసీ దేవదూతలని చూసి ఉండరు. గాంధీని చూడలేదు. కాని ఆ స్థాయి ఊహించనంత ఉన్నతమయిందని అతని మనస్సులో నిలిచింది. గాంధీని బూతుమాటలాగ, నెహ్రూని చిరునవ్వుని ఆట వస్తువులాగ వాడుకునే చిల్లర రోజులు వచ్చేశాయి.         

జనవరి 18,2010

       ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

KOUMUDI HomePage