చెన్నైలో ఆగస్టు 7న సవేరాలో ఆనాటి
ముఖ్యమంత్రి రోశయ్యగారికి కొందరు తెలుగు మిత్రులు విందు చేశారు. ఇలాంటి
కార్యక్రమాలలో సాధారణంగా అందరు తెలుగు ప్రముఖులు హాజరుకావడం రివాజు. ఆనాడు
చందూరు దంపతులు (ఎ.ఆర్.చందూర్, మాలతీ చందూర్) వచ్చారు. భోజనాలయాక హోటల్
ప్రాంగణంలో అతి అందమయిన కారెక్కారు ఎన్.ఆర్.చందూర్ గారు. "కారు చాలా ముద్దుగా
ఉంది" అన్నాను ఆయనతో. వెనకనే వస్తున్న మాలతీ చందూర్ గారు అందుకుని "నేను లేనా?
దుర్మార్గుడా! అన్నారు. చేతులు జోడించి "80 ఏళ్ళ మీ గురించి 94 ఏళ్ళ మీ ఆయనకి
ఏం చెప్పనమ్మా" అన్నాను. కారు వెళ్ళిపోయింది. అదీ నేను చందూర్ గారిని ఆఖరుసారి
చూడడం. అదీ ఆ దంపతులూ సెన్సాఫ్ హ్యూమర్కి, అన్ని సంవత్సరాల జీవితంలో
సరసత్వానికీ మచ్చుతునక.
నేను రచనలు చేయడం ప్రారంభించిన రోజుల్నుంచీ - అంటే దాదాపు 56 సంవత్సరాల నుంచీ
చందూర్ గారిని వింటున్నాను. ఆయన కథలు చదువుతున్నాను. "వాళ్ళు నలుగురూ..",
"సీతతో సినిమాకి" వంటి కథలు తేలికగా అర్ధశతాబ్దపు పాతవి. ఆయన సంపాదకత్వం వహించే
'జగతి' పత్రిక కూడా అంతే పాతది. నాకు తరచుగా వచ్చే ఎన్నో పత్రికల మధ్య విధిగా
'జగతి'ని ఏరుకుంటాను. కారణం - నెలనెలా తెలుగు సాహితీ ప్రపంచాన్ని పరిచయం చేసే
పెద్దమనిషి 'జగతి'. నిజానికి ఈమాట చందూర్ గారికే వర్తిస్తుంది. దాదాపు 40 ఏళ్ళ
పై చిలుకు ఆయనతో నాకు వ్యక్తిగతమైన పరిచయం. ఏనాడూ, ఎవరినీ ఆయన మాటతో, విమర్శతో
నొప్పించగా నేనెరగను. ఆయన పత్రికా అంతే. అత్యంత ఉదారంగా, గంభీరంగా జీవితంలో
మంచి చెడుల్ని సమతుల్యంగా బేరీజు వేసే పెద్దమనిషి చందూర్. సాహితీ ప్రపంచంలో
ఎందరో ప్రముఖులకు ఆయనతో ప్రాణస్నేహం. చలం గారు, బెజవాడ గోపాలరెడ్డి, శ్రీ శ్రీ,
ఆరుద్ర - ఎవరయినా సరే - విశ్వనాధవారన్నట్టు - చెన్నైలో చందూర్ దంపతుల
సౌహార్ధాన్ని చవి చూడనివారు అరుదు.
చందూర్ గారిదీ, మాలతిగారిదీ అపురూపమైన బంధుత్వం. ఆయన మాలతీ చందూర్ గారికి భర్త,
సఖుడు, సెక్రటరీ - అన్నీ. మాలతీ చందూర్ ఆయనకి ఒక ఉద్యమం. ఆమె వ్యాసాంగాన్నీ,
అభిరుచినీ, వ్యాపకాల్నీ, సారస్వత కృషినీ చేయూత నిచ్చి నిలిపిన, నడిపిన వ్యక్తి
ఆయన. ఆమె ప్రతిభ ఉద్దీపనకు పూర్తి వాటా ఆయనదే. నాకు తెలిసి - జీవితంలో ఇద్దరినే
ఇలాంటి వ్యక్తుల్ని చూశాను. ఎం.ఎస్ సుబ్బలక్ష్మి గారి భర్త సదాశివంగారు, చందూర్
గారు.
చందూర్ గారిది నిస్వార్ధమైన, నిరంతనమైన సహకారం. ఆమె నాతో ఒకసారి అన్నారు. రచన
పూర్తి చేశాక తీసుకొచ్చి ఆయన టేబులు మీద పారేస్తాను - అని. దానిని సవరించి,
కవరులో పెట్టి, అడ్రసు రాసి, స్టాంపులు అంటించి పంపండం - అన్నీ ఆయన బాధ్యతే.
చందూర్, మాలతిగారి సారస్వత సేవకి దక్కిన అదృష్టం.
అభిప్రాయం బేధం, విమర్శకి తావున్న ఏ పనికీ ఆయన పూనుకోరు. ఆమెని పూనుకోనివ్వరు.
ఒకానొక కథల పోటీకి ఆమెని న్యాయనిర్ణేతగా ఉండమని కోరాను. మేమిద్దరం కలిసినప్పుడు
"ఎందుకూ - అనవసర స్పర్ధలకి చోటు? వద్దులెండి" అన్నారు పాజిటివ్ థికింగ్ ని
జీవితంలో నమ్మి, పత్రికలో పాటించి, జీవనంలో భాగంగా, ఉద్యమంగా చేసుకున్న వ్యక్తి
చందూర్ గారు.
మనిషి ఆరోగ్యానికి ముఖ్యకారణం - జీవితంలో గంభీరమైన ఆదర్శం ఉండడం, జీవించడానికి
ఆరోగ్యకరమైన లక్ష్యం ఉండడం. ఈ రెండూ పుష్కలంగా ఉన్న వ్యక్తి చందూర్ గారని 95
ఏళ్ళ ఆయన జీవితం చెపుతుంది. కర్తవ్య దీక్ష, క్రమశిక్షణ తననుంచి 'తన 'ని దూరంగా
పెట్టగల, విచక్షణ ఆత్మవిశ్వాసం, అందరిలో మంచిని మాత్రమే చూడాలన్న, చూపాలన్న
నిబద్దతా - చందూర్ గారి జీవితానికి మూలస్థంభాలు.
చెన్నైలో తెలుగువారికి చెదిరిపోని ఓ జ్ఞాపకం - ఏ సభలో, ఏ సమావేశంలో
ఎన్.ఆర్.చందూర్ గారు తారసపడ్డా పక్కనే వెదికితే మాలతీ చందూర్ కనిపిస్తారు.
మాలతీ చందూర్ గారు ఎక్కడ కనిపించినా పక్కనే ఉన్న వ్యక్తి పేరు ఎన్.ఆర్.చందూర్.
కొన్ని దశాబ్దాలపాటు అస్మదాదులు అలవాటు పడిన ఈ తైలవర్ణ చిత్రంలో సగభాగం ఇక
ముందు కనిపించదు మా అందరికీ. మైలాపూర్ లోని కచ్చేరీ రోడ్డు చందూర్ దంపతుల వీధి.
ఇప్పుడది సగం కళావిహీనమయి కనిపిస్తుంది.
కొందరు విద్యుద్దీపంలాగ జిగేలుమనిపించరు. దేవుని ముందు ప్రమిదె లాగ పవిత్రంగా
నిలకడగా వెలుగుతారు. సాహితీ ప్రపంచంలో, స్నేహ ప్రపంచంలో అలాంటి నమ్మకమయిన,
విభిన్నమయిన వెలుగు - చందూర్.