తుంటి పళ్ళు
గొల్లపూడి మారుతీరావు gmrsivani@gmail.com
1971లో 'అండర్సన్ టేప్స్' అనే హాలీవుడ్
చిత్రం వచ్చింది. జేంస్ బాండ్గా నటించిన షాన్ కోనరీ దొంగ. ఒక
అపార్టుమెంటునంతా దోచుకోడానికి పన్నాగం చేస్తాడు. కొన్ని నెలలపాటు
దొంగతనానికి ఏర్పాట్లు చేస్తాడు. అతను చేసే ప్రతీపనీ - గవర్నమెటులో ఏదో
విభాగాంకి తెలుస్తోంది. కారణం - అతను సంప్రదించిన అన్నిసంస్థల, వ్యక్తుల
టెలిఫోన్లను ఆయా విభాగాల డిపార్టుమెంటుల నిఘా ఉంది కనుక. అయితే అన్ని వి
భాగాల సమాచారాన్ని కలిపే ఆస్కారం లేదు. ఏర్పాటు లేదు. కనుక దొంగతనం
గవర్నమెంటుకి తెలియలేదు. నెలల తర్వాత పధకం ప్రకారం దొంగతనం ప్రారంభమయింది.
మరో అరగంటలో తప్పించుకుంటాడనగా - ప్రభుత్వం మేలుకుంది. దొంగని పట్టుకుంది.
అదీ కధ.
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి పదవిలోకి వచ్చింది. వచ్చింది లగాయతు
కొన్ని వేల కోట్ల ఖర్చుతో లక్నోలో పార్కుల నిర్మాణాన్ని సాగించారు. ఆమె
పార్టీ గుర్తు ఏనుగు. కనుక లక్నోలో పార్కుల నిండా బలసిన ఏనుగుల రాతి
బొమ్మల్ని చెక్కించారు. మాయావతివి విగ్రహాలు పదకొండు చెక్కించారు. పార్కుల
నిండా ఏనుగు బొమ్మల తలుపుల పిడులూ, మాయావతి స్థంభాలు, మాయావతి చక్రాలు,
కాన్షీరాం విగ్రహాలు సమృద్దిగా ఉన్నాయి. నోయిడా పార్కులో రెండు పెద్ద
మాయావతి విగ్రహాలు, యాభైరెండు ఏనుగుల రాతి విగ్రహాలు ఉన్నాయి. ఇవన్నీ ఒక్క
రోజులో వెలిసినవి కావు. వేలకోట్ల ఖర్చుతో సంవత్సరాల తరబడీ నిర్మించినవి.
మెజారిటీ ప్రజల మద్దతుతో పదవిలోకి వచ్చిన నాయకురాలు తన పార్టీకీ, తనకీ
ఇష్టమైన - ఇంకా చెప్పాలంటే తన విగ్రహాలను నిర్మించుకోవడం ఏం సబబు? ఈ ప్రశ్న
ఇన్ని సంవత్సరాలలో ఎవరూ వేయలేదు. నిరాఘాటంగా నిర్మాణం సాగింది. ఆ మధ్యనే
పార్కుల నిర్వహణకు మరికొన్ని వందల కోట్లను కేంద్రం కేటాయించాలని మాయావతి
కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
ఎవరో ఈ నిర్మాణాల మీద కోర్టు కెక్కితే కొంతకాలం నిర్మాణాన్ని ఆపివేసింది
కోర్టు.
ఇప్పుడు ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం కళ్ళు తెరిచింది. ఈ సంఘం ఇంతకాలం
దుబాయిలోనో, హాంకాంగ్ లోనో లేదు కదా? ఇంత విస్ర్తు తంగా నిర్మాణాలు
జరుగుతున్నట్టు ఈ సంఘానికి తెలీదా? తెలిసి తెలిసి - ఎన్నికల వరకూ
నిద్రపోవడమేనా చెయ్యగలిగిన పని? ఇప్పుడు ఎన్నికలకి పద్దెనిమిది గంటల వ్యవధి
ఉండగా - ఈ విగ్రహాల మీద - ఏనుగుల మీదా, మాయావతి విగ్రహాల మీదా ముసుగులు
కప్పాలని నిర్ణయం తీసుకుంది.
లక్నో, నోయిడా అధికారులు అప్పుడు సమావేశమయి - ఏ విధంగా విగ్రహాలను కప్పాలి,
ఏ రంగు పరదాలతో కప్పాలి? దానికి ఎంత గుడ్డకావాలి అన్న విషయాల మీద చర్చించారు.
బహుజన సమాజ్ పార్టీ గుర్తు ఉదా రంగు ఏనుగు. కనుక ఏనుగుని ఊదారంగు ప్లాస్టిక్
పరదాలతో, మాయావతిగారిని ఊదారంగు గుడ్డల్తో కప్పాలని నిర్ణయించారు. ఇందుకు
మరికొన్ని లక్షల ఖర్చు.
ఇప్పుడు ఇప్పుడు చూసేవారికి ఏనుగులు కనిపించకపోవచ్చు. మాయావతి విగ్రహాలు
కనిపించకపోవచ్చు. కానీ ముందుకన్న కొట్టొచ్చినట్టు అక్కడ ముసుగుల కింద ఏం
ఉన్నాయో మరింత స్పుటంగా చూపరులకు గుర్తుకొస్తూంటుంది. ఇది ఎన్నికల సంఘం
చేసిన ఉపకారం.
వెనకటికి "పెళ్ళివారి గుట్టు బయటపెట్టకురా బాబూ!" అని ఓ పెళ్ళికొడుకుకి
నచ్చచెపితే - అతను బుద్ధిగా పెళ్ళివారితో అన్నాడట: "అయ్యా ఈ షర్టూ, పాంటూ
నాదే, కానీ ఆ తివాచీ గురించి నన్నడగకండి" అని. ఎన్నికల కమిషన్ మేధస్సుకి
జోహారులర్పించాలి. ఒకరోజులో ఎన్నిక జరుగుతుందనగా - అధికార యంత్రాంగాన్ని
మేలుకొలిపి, లక్షల ఖర్చుతో ముసుగులు తొడిగి - 'పెళ్ళికొడుకు' ఫక్కీలో "ముసుగుల
వెనుక మేం ఉన్నాం సుమా!" అన్న స్పృహని ప్రత్యేకంగా ఈ చర్యద్వారా
ప్రసాదించారు.
బహుజన సమాజ్ పార్టీ నాయకులు మిశ్రాగారు ఓ ధర్మసందేహాన్ని వెలిబుచ్చారు.
"అయ్యా, ఏనుగులకి ముసుగులు తొడిగారు. బాగానే ఉంది. మరి సైకిలు గుర్తున్న
పార్టీ ఎన్నికల్లో సైకిళ్ళను మాయం చేస్తారా?
ఈ దేశంలో రచయితలు ఏనాడయినా మైనారిటీ వర్గమే. చేతన్ భగత్ అనే రచయిత ఓ మాట
అన్నాడు. మొదట ఆ విగ్రహాలు కట్టడాన్ని ఆపివుండాలి. తీరా కట్టారు కనుక
నోరుమూసుకోవాలి. ఇప్పుడు కావలసింది విగ్రహాలకు ముసుగులు కావు. నిలవనీడయినా
లేని ప్రజానీకానికి ఆ డబ్బుతో కప్పుకునే దుప్పట్లు.
ఆకరి క్షణంలో అధికారులు మేలుకొనడం వల్ల - కొన్ని విషయాలు దేశ ప్రజలకు
అర్ధమవుతాయి. అధికార యంత్రాంగం వీలయినంతకాలం కళ్ళు మూసుకుని నిద్రపోతుందని.
పదవిలో ఉన్నవారు ఏం చేసినా ఎవరూ ఏమీ చెయ్యలేరని. ఏ రోజయినా మొండివాడు
రాజుకన్నా బలవంతుడని. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం వల్ల ఆకులకు నష్టం -
చేతులకు, చేతలకు లాభం ఉండదని.
కిందపడినా నేనే గొప్ప అన్నట్టు - ముసుగులు కప్పిన ఏనుగులూ, మాయావతులూ -
ముసుగుల్ని తలదన్నేలాగ అధికారుల చేతకాని తనాన్నీ, అజ్నానాన్నీ, నిస్సహాయతనీ,
తెలివితక్కువ తనాన్నీ చెప్పక చెపుతున్నాయి. లేదా ప్రజల కళ్ళు తుడవడానికి
ఇదొక దగ్గరతోవా?
ఏతావాతా - తాను మళ్ళీ పదవిలోకి వచ్చాక - అర్ధాంతరంగా కలిసొచ్చిన ఈ లక్షలాది
వ్యయంతో సమకూరిన ముసుగులు ఏ సంస్థల కళ్ళ మీద కప్పాలో మాయావతిగారు తన
అనుచరులతో ఈ పాటికే చర్చలు జరుపుతూ ఉంటారని మనం ఊహించవచ్చు.
మన దేశంలో ఎప్పుడూ పల్ళు రాలలంటే తుంటి మీదే కొట్టడం ఆచారం.
జనవరి
16, 2012
************ ************ ************* ************* Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com Read all the columns from Gollapudi గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి |