Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here 
 
Are you using iPad ( any iOs Device)? Try direct MP3, Click here

      బురదకొలనులో ఒంటరి మొగ్గ

     

   సినీమా పాఠాలు చెప్పకూడదు. ఆ పని సినీమాది కాదు.
సినీమా చంకలు గుద్దే వెర్రి వేషాలు వెయ్యకూడదు. ఆ పనీ సినీమాది కాదు.
సినీమా విస్కీకాదు. తులసి తీర్ధం కాదు. మార్ఫియా కాదు పాలగ్లాసూ కాదు. కాని ప్రాచుర్యం దృష్ట్యా, అప్పీలు దృష్ట్యా సినీమాకి ఓ బాధ్యత ఉంది. ఇదీ న్యాయంగా ఉండనక్కరలేదు. కానీ ఉండక తప్పని పరిస్థితి - కేవలం దాని ప్రాచుర్యం కారణంగా.
ప్రఖ్యాత ఫ్రెంచి దర్శకుడు గొదార్ద్ (ఇప్పుడాయనకి 82 ఏళ్ళు) ఓ మాట అన్నాడు. "సినీమా సెకనుకి ఇరవై నాలుగు సార్లు నిజాన్ని చెపుతుంది" అని. సినీమా ఫ్రేములు 24 కదిలితే తెరమీద బొమ్మ కదులుతుంది. అయితే అవి ఫ్రేములు కావట. అన్నిసార్లు నిజానికి మద్దత(ట)!
మిరియాల కషాయంతో బెల్లం ముక్క ఇస్తుంది అమ్మ. బెల్లం తాయిలం. కషాయం వైద్యం. కేవలం బెల్లాన్నే తినిపిస్తే మరో వైద్యం చెయ్యాలి.
డ్రాయింగు రూముల్లోకి దూసుకువచ్చి - అనితర సాధ్యమైన ప్రభావాన్ని చూపే మాధ్యమం - సినీమా - అంత బలమైన ప్రభావాన్ని చూపుతున్న కారణంగానే - కాస్త బాధ్యతని తీసుకోవాలి. తీసుకోకపోతే? బాధ్యతని వహించని, వహించాలని తెలియని, వహించనక్కరలేదన్న అహంకారం గల వ్యక్తుల చేతుల్లో అది మారణాయుధం అవుతుంది. ఫలితం? నిన్న మొన్నటి ఢిల్లీ సంఘటన కావచ్చు. మరేదయినా కావచ్చు.
మేం సినీమాలు రాసే రోజుల్లో - అంటే దాదాపు 50 ఏళ్ళ కిందట - సినీమాకి ఏదో ఆదర్శం, లక్ష్యం, దారం, నీతి, సందేశం - కనీసం అంతర్గతంగానయినా - ఉండాలనుకునేవాళ్ళం. ఉండడాన్ని ప్రేక్షకులూ ఆశించేవారు. ఆ 'ఆశ 'ని వమ్ము చేయకూడదని మడిగట్టుకునేవాళ్ళం. "పూలరంగడు" ఏ వెర్రివేషాలు వేస్తే బాక్సాఫీసు దగ్గర కొల్లగొడుతుందో మేం ఆలోచించలేదు. గుర్రబ్బండీ నడుపుకునే నేలబారు మనిషి - చెల్లెలి కాపురాన్ని నిలబెట్టడానికి తండ్రి నిర్దోషిత్వాన్ని నిరూపించడం కథ. మరో పాతికేళ్ళ తర్వాత - ఈ కథని మళ్ళీ రాశాను - "ఆలయ శిఖరం". మళ్ళీ ప్రేక్షకులు వందరోజులు చూశారు.
విపరీతమైన ప్రభావాన్ని చూపే మాధ్యమానికి సంస్కారపు అంచులను నిర్దేశించుకోవడం - సామాజిక బాధ్యత. నైతిక బాధ్యత. అన్నిటికీ మించి మానవత్వపు బాధ్యత. ఏ తల్లీ ఉగ్గు గిన్నెతో బిడ్డకు విస్కీ పట్టదుకదా?
అయితే - సినీమాని వినిమయ వస్తువుగా, డబ్బుని కొల్లగొట్టే సాధనంగా మాత్రమే ఆయుధాన్ని చేసిన బాధ్యతారహితమైన నేపధ్యంలో 'మిథునం' బురదకొలనులో ఒంటరి మొగ్గ.
'మిథునం' రెండు నిజాల్ని చెపుతుంది. మంచి అభిరుచికి కాలం చెల్లలేదని. మంచి ఆదర్శం - అదెంత స్థూలమయినదయినా - ఆదరించి ఆహ్వానించే ప్రేక్షకులు - ఇంకా ఇంకా కొనవూపిరితోనయినా ఉన్నారని.
నేనీమధ్య ఆరు సినీమాలలో నటించాను. కానీ ప్రతిరోజూ "ఈ మధ్య సినీమాలలో వేయడం లేదా సార్?" అని ఎవరో ఒకరు అడుగుతూనే ఉంటారు. "అదేమిటి? ఈ మధ్య ఆరు సినిమాలలో..." మాట పూర్తికాకుండానే చిన్ననవ్వు - "ఈ మధ్య సినీమాలు చూడడం లేదండీ!" అనడం తరుచుగా వినిపిస్తూంటుంది. మరెవరు చూస్తున్నారు? సినీమాల్ని చూసే అలవాటున్న తరం దూరంగా వెళ్ళిపోయి - ఎందుకు చూడాలో, ఎలా చూడాలో తెలీని కొత్త తరానికి చోటిస్తోందా? చూడాల్సిన, చూడగలిగిన, చూడడానికి కొన్ని గుర్తుల్ని పెట్టుకున్న ఎందరినో సినీమాఎందుకు దూరం చేసుకుంటోంది?
ఆ ప్రశ్నకి సమాధానం - 'మిథునం'.
మిథునంలోనూ లోపాలున్నాయి. ఇంకా బాగుండగలిగిన ఆస్కారం ఉంది. పెద్ద హిట్ కాగలిగిన గొప్ప లక్షణాల ఆవశ్యకత ఉంది. (శంకరాభరణం, మయూరి, ప్రతిఘటన, సీతారామయ్యగారి మనవరాలు, మనుషులు మరాలి.. వగైరా వగైరా). కాని 'మిథునం ' ఈ మధ్య కాలంలో చల్లని చలివేంద్ర. మాధ్యమం విలువని, బలాన్ని ఎరిగి బాధ్యత వహించిన పెద్దమనిషి. గంభీరంగా, గుంభనంగా, నిర్దుష్టంగా, నిర్మలంగా కథ చెప్పిన వ్యాపారికాని దర్శకుడు భరణి. వ్యాపారాన్ని సినీమా చేస్తుంది ఎలాగూ. కాని సినీమాని కేవలం వ్యాపారం మాత్రమే చెయ్యకూడదు. శంకరాభరణంలో బట్టలిప్పుకునే అందమయిన బొంబాయి హిందీ అమ్మాయి డాన్స్ వ్యాపారి భయానికో, ప్రలోభానికో నిదర్శనం.
భరణి అందం మీద దృష్టి పెట్టలేదు. ఆకర్షించాలన్న యావ చూపించలేదు. ఒప్పించాలని తాపత్రయపడలేదు. ఇద్దరు ముసిలి దంపతుల ఏకాంత జీవితాన్ని - డీ గ్లామరైజ్ చేసి - చెయ్యడానికి నానా తంటాలు పడి చూపించాడు. మరి ఏది ఆకర్షించింది ఈ సినీమాలో? దర్శకుడి గొప్ప నిజాయితీ ఆకర్షించింది. కథలో ఉన్న జీవలక్షణం ఆకర్షించింది. ఎక్కడో మన మనస్సుల్లో - ఇలాంటి అనుభూతిని గుర్తుపట్టిన ప్రేక్షకుల స్పందనకి పట్టం కట్టింది. వృద్ద దంపతులు ఇలా ఉండాలా? మనం ఇలా ఉన్నామా? ఉంటే బాగుంటుందా? ఏమో! ఉండడం బాగుంది. అది చాలు. అదే కళ. అదే సినీమా. అదే ఉత్తమయిన కళ చేసే పని. ఉదాత్తమయిన కళ ప్రయోజనం. ఉత్తమమయిన కళ అనుభూతిని గుర్తుపడుతుంది. కాదు. అపురూపమయిన అనుభూతికి గుర్తుపెడుతుంది. అప్పుడు అది వ్యాపారమూ అవుతుంది.మళ్ళీ ఉదాహరణ: శంకరాభరణం, మయూరి, ప్రతిఘటన, సీతారామయ్యగారి మనుమరాలు, మనుషులు మారాలి.. వగైరా వగైరా.
'మిథునం ' గుండె బలంతో, సంపూర్ణమైన విశ్వాసంతో, ప్రేక్షకుల అభిరుచిమీద అపారమైన నమ్మకంతో నిర్మించిన చిత్రం. ప్రేక్షకులు దర్శకుడు, నిర్మాత ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకున్నారు. మంచి అభిరుచిని పంచాలనే సదుద్దేశాన్ని గుర్తుపట్టారు. కృతజ్నతతో థియేటర్లో కూర్చున్నారు.
ఫ్రిడ్జ్ లాంగ్ అనే గొప్ప దర్శకుడు ఓ గొప్ప మాట అన్నాడు. దర్శకుడికి తనేం చేస్తున్నాడో తెలిస్తే - అతనికి తెలుసునన్న విషయాన్ని ప్రేక్షకులూ గుర్తుపడతారు. అంతేకాదు. గౌరవిస్తారు. ఆ గుర్తింపు పేరే - విజయం.
ఆ 'విజయం' వ్యాపారం కాదు. కానీ నిజమైన 'విజయం' వెనక వ్యాపారీ సంతృప్తి చెందుతాడు. కేవలం - అమ్మి సొమ్ము చేసుకోవాలనుకునే స్థాయికి - కక్కుర్తికి సినీమాని దించకూడదు. దించనక్కరలేదు.
ఆ నిజాన్ని చాలా ఆలశ్యంగానయినా, ధైర్యంగా, గుండెబలంతో నిరూపించిన చిత్రం - మిథునం.
మా - అంటే ప్రేక్షకుల - అభిరుచిని గుర్తుపట్టి, గౌరవించి, మమ్మల్ని కేవలం సెక్స్ బజారులో విటులుగా చేయనందుకు - 'మిథునం ' యూనిట్ కి - ప్రేక్షకుల తరపున మా ధన్యవాదాలు.
 

 


                                                                           gmrsivani@gmail.com  

 
                                           జనవరి 14, 2013          

*************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 


KOUMUDI HomePage