Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version.
Click Here

 కేక

గొల్లపూడి మారుతీరావు
gmrsivani@gmail.com 

       

        ప్రస్థుతం ఆంధ్రదేశంలో జరుగుతున్న ఉద్యమ లక్ష్యాలకీ ఈ కాలమ్ కీ ఏ విధమయిన సంబంధం లేదు.

          పత్రికల్లో వార్త: ఆర్టీసీ బస్సు చార్జీలు  పెంచారు. అందరిమాటా అలావుంచి ముందు రాజకీయ నాయకులు ఆంధోళన వ్యక్తం చేశారు. సామాన్యుడి నడ్డివిరిగిందని తెలుగు దేశం నాయకులు చంద్రబాబు నాయుడుగారు వాపోయారు. వారి పార్టీ అన్ని ఆర్టీసీ డిపోల ముందూ ధర్నా చేస్తోంది, బీజేపీనాయకులు బండారు దత్తాత్రేయగారూ, కిషన్ రెడ్డిగారూ తదితర నాయకులూ ధర్నాలు చేస్తున్నారు. సిపియం నాయకులు రాఘవులుగారు ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఇవన్నీ ఆయా నాయకుల ప్రజా సంక్షేమ ధృక్పధానికీ, వారి అకుంఠిత దేశ సేవానిరతికీ ప్రత్యక్ష సాక్ష్యాలు. ఆంద్రదేశానికి ఇలాంటి నాయకత్వం ఉండడం ప్రజలు చేసుకున్న పుణ్యం. సందేహం లేదు.

          ఈ మధ్య రాష్ట్రమంతటా జరిగిన ఉద్యమాలలో దాదాపు 690  ఆర్టీసీ బస్సులు తగలడ్డాయి. మతాబాల్లాగ, చిచ్చుబుడ్లలాగ బస్సుల్లోంచి అగ్ని జ్వాలలు ఆకాశానికి ఎగస్తూంటే కుర్రవాళ్ళు హాహాకారాలు చేసే దృశ్యాలు మనం చూసి ఆనందించాం. 250 కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని ఎవరో నిస్సహాయంగా మూలిగిన మూలుగు మనం విన్నాం. న్యాయంగా చాలామంది ప్రయాణీకుల ప్రయాణాలు నిలిచిపోయివుంటాయి. కొందరికి ప్రాణాంతకమైన సమస్యలు వచ్చి వుంటాయి. కొందరి కష్టాలేమిటో మనకు తెలీవు. తెలుసుకోవాలనే ఆలోచన, వ్యవధీ ఎవరికీ లేదు. పార్టీలకీ, ఘనత వహించిన నాయకులకీ అస్సలు లేదు.

          ఆర్టీసీ సిబ్బందికి తమ ఉపాధి కష్టాలు ఉండేవుంటాయి. కాని ఒకపక్క రోమ్ మండుతూంటే నీరో చక్రవర్తి వయొలిన్ వాయించినట్టు- అసలే సమస్యలు తెగక అయిదో తారీఖున అందరూ ఢిల్లీలో జుత్తులు  పీక్కొంటూంటే ఆరవ తేదీనుంచి కొన్ని లక్షల మంది సిబ్బంది బస్సుల్ని నడపరని సమ్మెకు దిగారు. ఇది వీరి సమాజ హితానికీ, దేశభక్తికీ నిదర్శనం. ఎవరో కిట్టనివాళ్ళు దీన్ని బ్లాక్ మెయిల్ అన్నారు. అసలే దిక్కుతోచని ప్రభుత్వం తప్పనిసరిగా తలవొంచింది. ఇది మూలిగే నక్కమీద తాటిపండు కనుక,.

          వెరసి- ఆర్టీసీ ధరలు పెరిగాయి. కాలిపోయిన బస్సుల్ని బాగుచెయ్యడానికో, కొత్త బస్సుల్ని నిలపడానికో ఎవరింట్లోనో కన్నం వేసి తీసుకురారు కదా? ఇప్పుడు సామాన్య మానవుడికి పెనుభారం అని అరుపులు. సామాన్య మానవుడి నడ్డివిరిగిందని నాయకుల ఆక్రోశం వల్ల ఒరిగేదేమిటి?. అయ్యా! ఆనాడు బస్సులు ఒక్కొక్కటీ కాలుతున్నప్పుడే సామన్యమానవుడి నడ్డి మీద క్రమంగా భారం పడనుందని ఘనత వహించిన నాయకులెవరూ  ఎందుకు భావించలేదు?. ఈ రోజు వీరి ధర్నాలకీ నిన్నటి ఆర్టీసీ బ్లాక్ మెయిల్ కీ పెద్ద తేడాలేదు.

          నేను 40 ఏళ్ళ కీందట నీలయ్యగారిదయ్యం అనే నాటిక రాశాను. అందులో బాలగంగాధర తిలక్ అనే కుర్రాడి పాత్ర.. చాలా ఆలోచించే ఈ కుర్రాడికి ఆ పేరు పెట్టాను. ఈ కుర్రాడు హుషారుగా ఇంట్లోకి వస్తాడు.పినతండ్రి అడుగుతాడుఏమిట్రా నీశక్తి? అని. కుర్రాడు చిందులు వేస్తూ సమాధానం చెప్తాడు: నీకేం తెలుసు బాబాయ్! ఏ క్షణాన బడితే ఆ క్షణాన- ఏ కారణానికి బడితే ఆ కారణానికి సిటీ బస్సులు తగలెట్టడానికి 60 మంది మిత్రులున్నారు. ఏ రకమయిన సత్యాగ్రహం- నిరాహార దీక్ష, హర్తాళ్, ఘెరావ్ వగైరా వగైరా జరపడానికి పాతికమంది నిగ్గుల్లాంటి వీరులున్నారు. మందీ మార్బలాన్ని పోగుజెయ్యడానికి మాకు లారీలు ఉచితంగా సప్లై చేసే కంట్రాక్టర్లు ఉన్నారు. బస్సులు తగలెట్టడానికి ఉచితంగా పెట్రోల్ సరఫరా చేసే సర్వీసు స్టేషన్ వుంది. నాశనం చేయడానికి కావలసినంత దేశం వుంది. ఇంతకంటె మాకు కావలసినదేముంది?

          (గమనించాలి. ఇది 40 ఏళ్ళ కిందటి నా రచన. నా సమగ్ర సాహిత్యంలో ఈ నాటిక వుంది)

          ఏ వస్తువునయినా ధ్వంసం చేయడం మనిషికి అతి ప్రాధమికమయిన సరదా. పసివాడికి బెలూన్ ఆనందాన్నిస్తుంది. అయిదు నిముషాల తర్వాత ఆ బెలూన్ పేలిపోతే ఆనందంతో కేరింతాలు కొడతాడు. చేతిలో వున్న ఆట బొమ్మ ఆరుముక్కలయి కిందపడడం ఆ పసివాడి ఆనందానికి పరాకాష్ట.. తనని, తనవాళ్ళని, తనదయిన వస్తువుల్ని కాపాడుకోవడం ఆటవికమైన ప్రవృత్తి (tribal instinct). ఇంకా జంతు ప్రవృత్తి.. దీనికీ మనిషికీ ఏం సంబధం లేదు. దీన్ని మాత్రమే పోషించే మనిషికీ జంతువుకీ తేడా లేదు. చీమ నుంచి ఏనుగుదాకా ఈ పనే చేస్తుంది. తన జాతి, మానవ సంతతి, సమస్త ప్రజానీకం శాంతి సంతోషాలతో ఉండాలనుకోవడం రుషిత్వం. దీని అర్ధం, వివరణ- యింకా 2009 నాటికి- భారత దేశానికి  వివరించనక్కరలేని అదృష్టం వుంది. ఒక మహాత్ముడు, ఒక మదర్ ధెరిస్సా- యిలాంటి పేర్లు రుషిత్వానికి పరాకాష్టలు కావు. మానవునికి నైతిక స్థాయిలో అందే నమూనాలు. పరాకాష్టలు చూడాలని వుందా? ఓ రెండు ఉదాహరణలు చాలు- కంచి పరమాచార్య, భగవాన్ రమణ మహర్షి.

          సరే. ఇవన్నీ అనవసరమైన platitudes- ఈ తరానికి. ఉద్యమాలు జరిపే నాయకులంతా తమ తమ కోరికలను బల్లగుద్ది వినిపిస్తున్నా- తగలబడే ప్రతీ బస్సూ నేలమీద నిలబడిన మామూలు పౌరుడి జేబులోంచి వచ్చిన పైసాని దోచుకుంటుందని తెలియదా? గాంధీనీ, పొట్టి శ్రీరాములునీ, ప్రశాంతతనీ బోధించే వీరంతా ఇన్ని రోజులుగా ఇన్ని బస్సులు తగలడుతూంటే- ఒక్కరు- ఒక్కరు- ఒక్కరు- ఒక్క విధ్వంసం గురించి (నేను చెప్పేది బస్సుల మాట) మాట్లాడలేదేం? యువత ఆవేశపడుతోంది. భేష్. ఆవేశం, విచక్షణ చాలని ఉద్రిక్తత వారి సొత్తు. కాని బస్సుల్ని తగల పెట్టడం మన ఆర్ధిక వ్యవస్థని, కడుపు కట్టుకుని రూపాయలు కూడగట్టుకుని బిడ్డల్ని చదివించుకునే తల్లిదండ్రుల పొట్టల్నికొట్టడం అని- నాకు గుర్తు కొచ్చిన పేర్ల జాబితాని ఇక్కడ రాస్తున్నాను-చంద్రబాబునాయుడు, బండారు దత్తాత్రేయ, జానారెడ్డి, కె.చంద్రశేఖరరావు, కోదండరామ్, హరీష్ రావు, జయప్రకాష్ నారాయణ, చిరంజీవి, టి.సుబ్బరామిరెడ్డి, యనమల రామచంద్రుడు, నాగం జనార్దన రెడ్డి- ఈ జాబితా అసంపూర్ణం- ఒక్కరు- ఒక్కరు- ఒక్కరు- మాట్లడరేం? ఆవేశానికి ఆటవస్తువుల్లాగ బస్సులు తగలడుతూంటే - ఉన్న బస్సులు నడపడానికి , కాలిన బస్సుల రిపేర్ కి, సిబ్బంది జీతాల పెంపుకి, జారిన ఆర్ధిక మాంద్యం నుంచి బయట పడడానికి ఏ మంత్రీ వారింటినించి సొమ్ము తీసుకురాడుకదా? ఉద్యమాలకు ఆహుతయిన ఆస్తుల భర్తీ ప్రజలమీదే పడుతుంది కదా? బస్సులని తగలెట్ట వద్దని చెప్పడం మరిచిపోయిన ఈ నాయకులు బస్సు చార్జీలు పెంచారని ఏ మొహం పెట్టుకుని సమ్మెలు చేస్తున్నారు? భక్త రామదాసు మాటల్లో ఎవడబ్బ సొమ్మని బస్సుల్ని తగలెట్టనిచ్చారు?

          ఈ ఉద్యమాలు చేసే నాయకులు- తమ లక్ష్యాలు ఏమయినా- బసుల్ని తగలెట్టడం మన ఇంటికి నిప్పెట్టుకోవడం లాంటిదని-అంతా ఏకమయి- ఒక్క ఊరేగింపు చేస్తే- ఒక్కటి- ఒక్కటి- ఒక్క బస్సుకి- యువత నిప్పంటించేదా? ఈ సందేశం ఎంత అపూర్వంగా, అద్భుతంగా ప్రజల్ని సముదాయించేది?

          అలాంటి ఆలోచన నాయకత్వంలో లేదు. 40 ఏళ్ళ కిందటి నా పాత్రబాలగంగాదర తిలక్ కి ఈ విషయం తెలుసు. బస్సులు తగలబడడం వారికి అవసరం. అలాగే  సామాన్యుడి నడ్డివిరిగిందని ధర్నాలు చెయ్యడమూ వారి అవసరానికే. ఇదీ మరొక రకమయిన బ్లాక్ మెయిల్. యువత ఇందులో సమిధెలు. ఇప్పుడిప్పుడు నా తిలక్ పాత్ర విశ్వరూపం దరించింది. ఎక్కడ చూసినా తిలక్ లు దొరుకుతారు- నాయకుల దర్మమా అని.

          ఇక్కడ ఒకటి రెండు నిజాలు. నేను 38 సంవత్సరాలుగా పొరుగు రాష్ట్రం తమిళనాడులో ఉంటున్నాను. ఇన్నేళ్ళుగా ఏ ఒక్క కారణానికయినా- ఒక్కటి- ఒక్కటి- ఒక్క బస్సు తగలబడడం చూడలేదు. మహారాష్ట్రలో- నిన్నకాక మొన్న- రాజ్ ధాకరే మరాఠా స్వదేశీయులకోసం ఉద్యమం జరిపారు. పరాయివారి ఆస్తులు ధ్వంసం చేశారుగాని ఒక్క బస్సుని తగలెట్టలేదు.

          జపాన్ లో ఎవరయినా పాలక వ్యవస్థ మీద తమ అసంతృప్తిని తెలపాలంటే మన ఆర్టీసీ సోదరులలాగ తెల్లారితే మీ ఏడుపు మీరేడవండని ధర్నా చెయ్యరు. తమ పనిని చెడగొట్టరు. చెడి వీధిన పడతామని శాపనార్దాలు పెట్టరు. నిర్ణీత వేళల్లో తమ విధులు నిర్వహించి విరామ సమయంలో అందరూ కలిసి ఎక్కువ పని చేసి చూపి- యిందుకు మాకు వేతనాలు పెంచాలని నిరూపిస్తారు.

          కాలమ్ ముగించే ముందు మరొకసారి- విధ్వంసం అతి ప్రాధమికమైన వినోదం. ఆత్మరక్షణ ఆటవిక, పాశవికం. జాతి సంక్షేమం మహనీయత.

          1996 లో నిలోఫర్ ఆసుపత్రిలో డాక్టర్ల సమ్మె కారణంగా బలయిపోయిన పసిపిల్లల వార్త పత్రికలో చదివి- ఓ కధానిక రాశాను. ఆ కధలో ఆఖరి వాక్యాలతో ఈ కాలమ్ ని ముగిస్తాను.

          సరైన టైమ్ చూసుకుని పుట్టని కారణంగా భుట్టోకి ఈ ప్రపంచం స్వాగతం పలకలేదు.

          మన హక్కుల పరిరక్షణకి ఎన్నాళ్ళయినా సమ్మె

          మాటలు వినిపించలేదు సంజీవరావుకి ( బిడ్డని బతికించుకోలేని పాత్ర పేరు సంజీవరావు!)

          ఎదురుగ్గా రోడ్డు మీద వెలిసిపోయిన గాంధీ. దక్షతతో వాడుకోవడం తెలీని జాతికి ఎంత పదునైన ఆయుధాన్ని యిచ్చావయ్యా!

          బాస్టర్డ్! అని ఆసుపత్రి దద్దరిల్లేలాగ కేక పెట్టాడు సంజీవరావు.

          (ఈ కధ 1996 ఆంధ్రప్రభ దీపావళి సంచికలో ప్రచురితమయింది. ఇలాంటి ఆలోచన యిప్పటిదని అవకాశవాదులు సరిపెట్టుకుని మరిచిపోతారేమోనని ఈ వివరాన్ని ఉటంకిస్తున్నాను.)

జనవరి 11,2010

       ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

KOUMUDI HomePage