ఈ మధ్య నన్నో మిత్రుడు అడిగాడు:
ఏమండీ, ఈ సృష్టిలోంచి త్వరలో పులి మాయమవుతోంది కదా? అలాంటి పరిస్థితి మనిషికి
వస్తుందా? అని. సమాధానమే ఈ కాలం. "వస్తుంది బాబూ వస్తుంది" అనాలో "వస్తోంది
బాబూ వస్తోంది" అనాలో "వచ్చేసింది బాబూ వచ్చేసింది" అనాలో తెలియడం లేదు. అంతే
తేడా. అయితే 'ఈ ప్రకృతి ఊహించినంత ఆలశ్యంగా కాదు.' మానవుడి చేతలకు 'ఊహించనంత
తొందరగా ' అని చెప్పుకోవాలి.
ప్రకృతి పరిణామాలను గురించి మాట్లాడేటప్పుడు సంవత్సరాలు చాలా అర్ధం లేని
కొలతలు. కొన్ని కోట్ల సంవత్సరాల కిందట ఈ గ్రహం అగ్నిపర్వతాలతో, లావాతో, పగుళ్ళు
చూపిన భూమితో, బొగ్గుపులుసు వాయువుతో నిండి ఉండేది. 'ప్రాణి ' అన్న ఆలోచన
ప్రమేయమే లేదు. ఎక్కడా ప్రాణవాయువు లేదు. మనిషి మనుగడ దాదాపు రెండు లక్షల
సంవత్సరాల కిందటి కథ. కొన్ని వేల సంవత్సరాలు సూర్యరశ్మికి ఈ భూమి ఉపరితలం రగిలి
- అక్కడా అక్కడా ఉన్న నీటి తేమ కరిగి - సూర్యుని వేడికి ఆవిరి అయి, వర్షించి
భూమి పొరల్లో ఎక్కడో విచిత్రంగా ఆక్సిజన్ చాయలు బయటపడి- ఇలా - ఈ గ్రహం మీద
ప్రాణి ఉనికి ఓ అద్భుతం. (యాన్ ఆర్ధస్ బెర్రాటండ్ అద్భుతమైన చిత్రాన్ని 'హోం '
అనే పేరిట నిర్మించాడు.)
వటపత్రశాయి, నోవా ఆర్క్ కథల్ని ఒక్క క్షణం పక్కన పెట్టి సహేతుకంగా ఈ సృష్టిని
అర్ధం చేసుకోడానికి ప్రయత్నిస్తే - ఈ సృష్టిలో ఏ ప్రాణికీ స్వతంత్రమైన
ప్రతిపత్తిలేదు. ప్రతీ ప్రాణీ మరొక ప్రాణితో సహజీవనం చెయ్యడమే ఈ సృష్టి రహస్యం.
(ఈ సత్యాన్ని మన మతమూ,వేదమూ చెపుతుంది - తెలుసుకోగోరిన వారికి - అది వేరే
విషయం.)
గాలిలో ఎగిరే పక్షికీ, నేలలో పాకే సూక్ష్మజీవికీ, మనకీ అద్భుతమైన సయోధ్య ఉంది.
స్వామి పార్ధసారధి ఓ చక్కని మాటని చెపుతారు. ఈ సృష్టిలో ప్రతీ ప్రాణికీ వివేచన
(intellect) ఉంటుంది. కాని మానవుడు అభ్యాసంతో అలవరచుకునేది ఒకటుంది. వివేకం
(intelligence). పులిని చూడగానే లేడిపిల్ల ఆగిపోతుంది - ప్రాణభయం ఉన్నదని,
తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. వివేచన, మనిషికి వివేకం ఉంది. తుపాకీ
తీస్తాడా, పరుగున వెళ్ళి జీపు ఎక్కుతాడా? వేసిన 'మాటు ' వేపుకి పులిని
మళ్ళిస్తాడా? ఏమో.
అడివిలో సింహం దున్నని చంపుతుంది. తినగా మిగిలిన అవశేషాల్ని నక్కలు, దుమ్ముల
గొండి జంతువులు తింటాయి. మిగిలిన అవశేషాల్ని రాబందులు తింటాయి. ఇంకా మిగిలిన
దాన్ని భూమిలో సూక్ష్మ క్రిములు భుజిస్తాయి. కొంతకాలానికి ఆ దున్న అవశేషం
కనిపించదు. కొన్ని జంతువుల్ని
Scavengers అన్నారు. అక్కరలేని వస్తువులోంచి తమకి
కావలసినది వెదుక్కునే ప్రాణులు.
అడివిలో ఏ సింహం - ఆకలి లేనప్పుడు - సరదాకి - కేవలం సరదాకి పదిలేళ్ళని చంపదు. ఆ
పని 'వేట ' రూపేణా మనిషి చేస్తాడు. అది చరిత్ర. అది మనిషికి వినోదం. అంటే
ఊసుపోవడానికి పరాయి ప్రాణిని హింసించే క్రీడ. అడివిలో ఏ జంతువూ ఏనుగు జోలికి
పోదు. నిజానికి పోలేదు. "గ్రాసం లేక స్రుక్కిన జరాకృశమైన.." అని ఏనుగు
కుంభస్థలాన్ని కొట్టి సింహం భుజిస్తుందన్నది - సాధారణంగా ఉత్ర్పేక్ష. ఏ జంతువూ
ఏనుగు జోలికి పోవడానికి సాహసించవు. కాని వాటిని చంపి - దంతాన్ని వాడుకోవచ్చుననే
ప్రలోభం, దుర్మార్గమయిన ఆలోచన ఉన్న ప్రాణి ఏది? మానవుడు. మంచి ఉదాహరణ వీరప్పన్.
కొన్ని వందల ఏనుగుల్ని చంపిన వీరుడు మన వీరప్పన్.
సృష్టిలో ప్రతి జంతువుకీ - కేవలం వివేచన కారణంగా - ఒక అద్భుతమైన క్రమశిక్షణ
ఉంది. ఇది కోట్ల సంవత్సరాలలో వరస తప్పకుండా ఈ సృష్టిలో జరిగే అద్భుతమైన
పరిభ్రమణం. "నెలకి మూడు వర్షమ్ములు కురియుచున్నవా?" అన్న కవుల పాట పాత రోజుల
మాట. ఇప్పుడు మూడు సంవత్సరాలకి ఒక్కసారయినా వర్షం కురియదు. కరువు కాటకాలు,
త్సునామీలు మనకి మామూలు సంఘటనలు.
హిమాలయాలు కరిగిపోతున్నాయి. ఉత్తర ధ్రువంలో మంచు నీరయిపోతోంది. సముద్ర మట్టం
పెరుగుతోంది. రుతువుల క్రమశిక్షణ మృగ్యమయింది. విచిత్రమేమిటంటే - లక్షల
సంవత్సరాలుగా పుట్టి చస్తున్న పురుగులకీ, జంతువులకీ ఈ విషయం తెలీదు. వాటికి
విచిత్రమైన క్రమశిక్షణతో బ్రతకడమే తెలుసు. విశేషం - మానవుడికి తెలుసు. అతనికి
ఆలోచన ఉంది. అవగాహన ఉంది. చంద్రమండలానికి దూకే మేధస్సు ఉంది. కొన్ని వందల
సంవత్సరాలుగా సముద్రంలోని ప్రాణులను కాపాడే 'రీఫ్ 'లను ధ్వంసం చేస్త్తే
ఏమవుతుందో తెలుసుకునే తెలివితేటలున్నాయి. కాని తెలిసి తెలిసి ధ్వంసం చేసే
ఆత్మవంచన ఉంది.
తన ఉనికి ఈ సృష్టిలో అంతం కాబోతోందని పులికి తెలియదు. కాని తన ఉనికిని ప్రతీ
క్షణం కురుచ చేసుకుంటున్న విషయం మానవుడికి తెలుసు. ఎంత విచిత్రం! భస్మాసురుడి
కథ మనం పురాణాల్లో చదివాం. తన చేతిని తన నెత్తిమీదే పెట్టి నాశనమయిన 'ఆసురుడి '
కథ. ఇప్పుడు మానవుడు అక్షరాలా 'తెలిసి ' ఆ పనే చేస్తున్నాడు.
ప్రస్తుతం మానవుడి మేధస్సు కారణంగా - ఇంకా చెప్పాలంటే ఆత్మవంచన, స్వార్ధం,
మూర్ఖత్వం కారణంగా పులి మాత్రమే కాదు - సాలీనా 50 వేల రకాల ప్రాణులు ఈ సృష్టిలో
మాయమవుతున్నాయి. కాస్త ఊపిరి బిగపట్టండి. రోజుకి 137 రకాల ప్రాణులు
సమసిపోతున్నాయి. ఈ వేగం - మామూలు ధోరణికన్నా వెయ్యి రెట్ల వేగం. ఈ లెక్కన -
పులి దారిలోనే మానవుడి వెళ్ళడానికి 'తెలిసి తెలిసి ' వేగాన్ని
పెంచుకుంటున్నాడు.
తన మానాన తనని వదిలితే పులి మరో 20 లక్షల ఏళ్ళు బతికేదేమో. తెలియదు. కాని
ఒక్కటి మాత్రం తెలుసు. ఈ సృష్టికి పట్టిన పెద్ద చీడ - మానవుడు - కేవలం తన
మేధస్సు, విజ్నానం, స్వార్ధపరత్వం కారణంగా ఈ గ్రహాన్ని అతి త్వరగా తొలినాటి
భయంకరమైన స్థితికి లాక్కుపోతున్నాడు.
పులి వెళ్ళిపోతోంది. కనుచూపు దూరంలో - బహుశా కొన్ని తరాల దూరంలో మానవుడూ ఆ
దారినే పోబోతున్నాడు. మరిచిపోవద్దు - భూమి పరిణామ క్రమంలో సంవత్సరం చాలా
హాస్యాస్పదమైన కొలత.