Click Play to listen audio of this column If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here
తోడికోడలు నవ్వింది..
గొల్లపూడి మారుతీరావు gmrsivani@gmail.com
నా చిన్నతనంలో - నిజానికి 20 సంవత్సరాల కిందటివరకూ - ఆడవాళ్ళు చుడీదార్
డ్రస్సులు వేసుకోవడం తెలీదు. అందరూ పరికిణీ, ఓణీలతో లక్షణంగా తెలుగుదనంతో
కనిపించేవారు. అలాంటి డ్రస్సులు ప్రస్థుతం మాయమయిపోతున్నాయి. నేటి తరం
సినీమాల్లో హీరోయిన్ల ఒంటి మీద బట్టలు వెద్దుక్కోవలసిన పరిస్థితి.
ఏదో సినీమాలో కూతురు పొట్టి నిక్కరుతో మెట్లు దిగుతూంటుంది. తండ్రి వచ్చి
ఇబ్బందిగా "కింద బట్టలు వేసుకోవడం మరిచిపోయినట్టున్నావమ్మా" అంటాడు
ఇబ్బందిగా. ఈ సీనుని రాసుకుని నేనూ, విశ్వనాధ్ గారూ ఓ రోజంతా నవ్వుకున్నాం.
అది ఆ రోజుల మాట. ప్రస్థుతం చాలామంది ఆడపిల్లలు ఇలా మరిచిపోయి చాలా
రోజులయింది. అలాంటి ఇబ్బందులు ఎవరూ పడడం లేదు.
మగవాళ్ళు ఆడ డ్రస్సులు వేయడం లేదు కానీ, నూటికి నూరుపాళ్ళు ఆడవాళ్ళు మగ
డ్రస్సులు, మగ జుత్తులు, మగ డ్రింక్, మగ సిగరెట్టు, మగ డాన్సులూ - అన్నీ
చేస్తున్నారు. దీన్నే ప్రపంచీకరణ అంటారు కాబోలు! మాదక ద్రవ్యాలు నిండిన
హుక్కా కేంద్రాలు జంట నగరాల్లో విరివిగా ఆడపిల్లల్ని ఆకర్షిస్తున్నాయని ఆ
మధ్య ఓ ఛానల్ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేసింది.
నలభై మూడేళ్ళ నాటి మాట. గగన మహల్ రోడ్డులో నేనూద్దె ఇంటికోసం వెళ్ళాను.
స్కాట్స్ ఆఫీసుకి ఎదురుగా ఉన్న క్రిసెంట్ రోడ్డులో సౌందర రాజన్ అనే ఓ
తమిళులు ఉండేవారు. ఆయన పద్దెనిమిదేళ్ళు పైబడిన అమ్మాయి ఉంటే ఇల్లు అద్దెకి
ఇవ్వనన్నాడు. కారణం - ఆ అద్దె ఇంట్లో ఒక పడకగది ఉన్న పోర్షన్ మాత్రమే ఉంది.
పద్దెనిమిదేళ్ళ అమ్మాయి సొంత కూతురయినా, తోడబుట్టిన చెల్లెలయినా - పరాయి
స్త్రీ కిందే లెక్క అని ఆయన ఉద్దేశం. ఒక గదిలో ఉండకూడదట! ఇప్పుడు ఇలాంటి
దిక్కుమాలిన ఛాందసాలు ఎవరికీ లేవు. ఆ మాటకి వస్తే ఈ విచక్షణ పరాయి
అమ్మాయిలకే వర్తించదు.
మన నాగరికత పెరిగింది. స్త్రీలలో 'సమాన ప్రతిపత్తి' ఇంకా వెర్రితలలు వేసింది.
ఎట్టి పరిస్థితులలోనూ స్త్రీలు మగవారికంటే ముందుండగలరని భేషరతుగా
నిరూపించుకుంటున్నారు. ఇది ఆక్షేపణీయంగా అంటున్న మాట కాదు. గర్వపడుతూ
చెపుతున్నమాటే. కానీ కొన్ని నియమి తులు ఆ సమాజపు సంస్కృతిని కాపడతాయి.
స్త్రీ సంక్షేమానికి గొడుగుని పడతాయి. అయితే ఇలాంటి మాటలెవరయినా అంటే బూతు
మాట విన్నంతగా కస్సుమనే రోజులొచ్చాయి.
ఆడవాళ్ళు - ఎంతగా శరీరాన్ని వీధిన పడేస్తున్నారో - హైదరాబాదు సెంట్రల్ మాల్,
నెక్లెస్ రోడ్, ప్రసాద్ మల్టీ ప్లెక్స్ ల దగ్గర ఒక్క అరగంట నిలబడితే
అర్ధమవుతుంది. ఎవరూ ఈ విషయం చెప్పనక్కర్లేదు. సరే. రేపులూ, హత్యలూ, ఏసిడ్
దాడులూ మనం ఇప్పుడిప్పుడు విరివిగా వింటున్నాం. ఈ విషయాలు - వీటికి కారణాలు
- ఇంత అవగాహన పెంచుకున్న స్త్రీలకు మట్టుకు తెలీదా!
ఈ మధ్య పోలీసు డైరెక్టర్ జనరల్ దినేష్ రెడ్డిగారు - పట్టణాల్లో, పల్లెల్లో
అమ్మాయిలు రెచ్చగొట్టే విధంగా బట్టలు వేసుకోవడం ఈ నేరాలకు ఒక కారణమని
అన్నారు(ట). చాలామంది స్త్రీలూ, సంస్థలూ కోపంతో ఊగిపోయారట. కేంద్ర మంత్రి
పురందరేశ్వరి గారికి కోపం వచ్చింది. పోనీ ఆవిడెందుకు పాంటూ చొక్కాతో
పార్లమెంటుకి రావడం లేదు? ఇంతమంది కళ్ళుమూసుకుంటున్నారా అని ఆశ్చర్యపోవలసిన
సందర్భమిది. బాబోయ్! నేనలా అనలేదు - నా మాటల్లో తప్పుడు అర్ధం తీశారు అని
వెనక్కు తగ్గారు దినేష్ రెడ్డిగారు. ఆయన అలా అనే మనిషి కాదు - మాకు తెలుసు.
ముసిలివారికీ, స్త్రీలకీ ఎంతో ఉపకారం చేసే స్వభావులు - అని ఇద్దరు మహిళా
పోలీసు అధికారులు - తేజ్ దీప్, అనురాధ ఆయనకి వత్తాసు పలికారు.
వెనకటికో సామెత ఉంది. అత్తకొట్టిందని కాక తోడికోడలు నవ్విందని ఒకావిడ
గింజుకుందట. ఈఆడ సంస్థల గింజుడు అలానే అనిపిస్తోంది. వారికి ఆడపిల్లల
వికారాలకంటే దినేష్ రెడ్డిగారి మాటలు ఆక్షేపణీయంగా కనిపించాయి.మొన్న ఒకావిడ
టీవీలో చెప్తోంది. కొత్త సంవత్సరం నాడు తాగి క్లబ్బులో తందనాడాడుతున్న
అమ్మాయిల్ని పట్టుకుని మీ ఇళ్ళ ఫోన్ నంబర్లు ఇవ్వమన్నారట పోలీసులు. "వద్దండీ.
మాడాడీ, మమ్మీ ఇప్పుడు దొరకరు. క్లబ్బుల్లో ఉంటారు - అన్నారట పిల్లలు.
యద్యదాచరతి శ్రేష్టః. ఇది ఒక మహిళ కార్యక్రమంలో ఆక్షేపణగా చెపుతోంది.
ఆ మధ్య పూణే వెళ్ళాను. రోడ్డుమీద ప్రతీ ఆడపిల్లా మొహం కనిపించకుండా పెద్ద
గుడ్డ - చున్నీనో బన్నీనో చుట్టుకుని కనిపించింది. ఒక పోలీసు అధికారి ఆ
నగరానికి వచ్చి "ఇదేంటమ్మా వీరిలో తీవ్రవాదులున్నారా? నేరస్థులున్నారా? రంకు
నడిపే పెళ్ళికాని పిల్లలున్నారా? పెళ్ళయిన ఇల్లాళ్ళున్నారా? పెద్ద
మనుషులున్నారా? తెలియడం లేదు" అంటూ అభ్యంతరం తెలిపాడట. అంతే. మిన్ను విరిగి
అతని నెత్తిన పడింది. "మమ్మల్ని అలాంటి మాటలంటారా?" అని విరుచుకుపడ్డారట.
అభ్యంతరపెడితే హక్కు. పెట్టకపోతే - రంకు, బొంకు, నేరం - ఏదో ఎదో. పాపం ఆయన
భయపడిపోయి నోరుమూసుకున్నాడట. ప్రస్థుతం అలాంటి ముసుగులు మన నగరాల్లోకీ రవాణా
అవుతున్నాయి. సూర్య నమస్కారాలు చెయ్యడానికి సంస్కారం కావాలి కాని - నేరాలకి
'ముసుగు ' సంపాదించడం ఏం కష్టం?
శరీరం వీధిన, మొహాలు ఉసుగులో - ఇది నేటి ఆడపిల్లల సంస్కారానికా? ఈ దేశపు
సంస్కృతికా? ఈ సమాజపు స్వేచ్ఛా ప్రవృత్తికా? పెరుగుతున్న పాశ్చాత్య
వ్యామోహానికా? విమర్శని సదుద్దేశంతో గ్రహించలేని కుమతికా - అన్నిటికీ మించి
"మా ఇష్టం వచ్చినట్టు బతికే హక్కు మాకుంది. అది మా చదువూ, జీవన విధానం
నేర్పిన వెసులుబాటు. కాదనడానికి నువ్వెవరివి?" అనే కుహనా అహంకారానికా?
అన్నట్టు - దినేష్ రెడ్డిగారిని ఆర్ ఎస్ ఎస్ కి సంబంధించిన రాష్ట్ర సేవికా
విభాగం మహిళా శాఖ సమర్ధించి హర్షించింది. అదిగో, ఇది ఛాందసాన్ని ప్రచారం
చేసే అతివాద శక్తుల వాగుడు - అని ఎవరో అంటారు. సంస్కారానికి సాకుల ముసుగు,
కుసంస్కారానికి స్వేచ్ఛ హక్కుని పులిమే దబాయింపు ఈకాలానిది.
నేను దినేష్ రెడ్డిగారిలాగ గవర్నమెంటు ఆఫీసర్ని కాదు. నా అభిప్రాయాలను
చెప్పుకునే హక్కు - ఆడవాళ్ళ బట్టల్లాగ, మొహాల ముసుగుల్లాగ, సగం సగం
డ్రస్సులాగ - నాకూ ఉంది.