Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here 
 
Are you using iPad ( any iOs Device)? Try direct MP3, Click here

      మేలుకొలుపు

     

అక్బరుద్దీన్‌ ఒవైసీకి నేను మనసారా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. శరీరంలో స్థిరపడి దానిని నయం చెయ్యాలని కూడా గ్రహించని, చెయ్యనక్కరలేదని భావించిన అలసత్వానికి గుర్తుగా వికటించి బయటపడిన కేన్సర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ. ఇప్పుడు బయటపడినా చికిత్సకి లొంగని చావుకి గుర్తు ఈ 'కేన్సర్‌'. అయితే అంత దయనీయమైన దశలో ఉన్నదా హిందూదేశం? హిందూమతం?

మన మతానికి విస్తృతి ఎక్కువ. ఔదార్యం ఎక్కువ. జాలి ఎక్కువ. సంయమనం ఎక్కువ. అన్నిటికీ మించి అలసత్వం ఎక్కువ. బట్టల్లేని సీతమ్మనీ, నగ్నంగా నిలిపిన భరతమాతనీ చూసికూడా తన తల్లికి బట్టలు తొడిగిన ఎమ్‌.ఎఫ్‌.హుస్సేన్‌గారి కళాస్వేచ్ఛని నెత్తికెత్తుకునే కళాతృష్ణ మనది. 'మతం' గురించి ఎవరు మాట్లాడినా, దేవుడిని వెనకేసుకొచ్చినా 'హిందుత్వ'మని కత్తులు దూసే సెక్యులర్‌ కవచాలు తొడుక్కున్న ఆత్మవంచన చేసుకునే అవకాశవాద పార్టీలున్న దేశం మనది. మనం నలుగురు ముస్లిం పెద్దల్ని రాష్ట్రపతుల్ని చేసుకున్నాం. ఇద్దరు ముస్లింలను ఉపరాష్ట్రపతుల్ని చేసుకుని గౌరవించుకున్నాం. మరే ముస్లిం దేశంలోనూ ఏ హిందువూ ఏ విధమయిన పదవిలోనూ నిలిచిన దాఖలాలు లేవు. నెదర్లాండులో తమ దేవుడిని వెక్కిరించే కార్టూన్లు వేస్తే ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ ఆస్తులూ, ఇళ్లూ తగలెట్టారు. తమ దేవుడిని దూషించిన ముస్లిం రచయితనే చంపాలని మరో దేశపు మతగురువు శాసిస్తే -యిప్పటికీ సాల్మన్‌ రష్దీ రహస్యపు బతుకు బతుకుతున్నాడు. మనం చిత్రగుప్తుడిని, యముడినీ (రెండు 'యముడికి మొగుడు' సినీమాల్ని చూసి సంతోషించాం) శ్రీకృష్ణుడినీ, నారదుడినీ ఆటపట్టిస్తే ప్రేక్షకులు వందరోజులు చూసి ధన్యులవుతారు. బ్రాహ్మణ్యాన్ని గర్హించి -వాళ్ల చేత పేడ తినిపిస్తే -బ్రాహ్మణతరులు కిల కిల నవ్వుకుంటారు. ముస్లింలలో అలాంటి పరాచికాలు ఎప్పుడయినా ఎవరయినా చేసిన దాఖలాలు ఉన్నాయా? చేసి బతికి బట్టకట్టగలరా?

ఈ దేశంలో ముస్లిం సోదరులంతా ఒకటి. ఎక్కడ ఉన్నా ఒకటిగా ఓటు వేస్తారు. అయిదేళ్ల ఆడపిల్లకి బురఖా వేస్తారు. అరవైయ్యేళ్ల ముసలాయనా టోపీ పెడతారు. తమని కాదంటే పదేళ్ల పిల్లనీ కాల్చి చంపుతారు. మతం పట్ల గౌరవం, మరొక పక్క భయం - వారిని సంఘటిత పరుస్తుంది.

మనదేశంలో మనం మహారాష్ట్రులం, తమిళులం, బెంగాళీలం, వెనుకబడిన వారం, ముందుబడినవారం, కులాలవారం, రెడ్లం, కమ్మవారం, కాపులం, బ్రాహ్మణులం, శ్రీవైష్ణవులం, శైవులం, మాలలం, మాదిగలం -మనం సామూహిక ప్రతిపత్తిని ఏనాడూ ప్రకటించుకోము. ఎవరూ ఎవరిమాటా వినరు. ఎవరి ప్రయోజనాలు వారివి. ఎవరయినా ఎప్పుడయినా ముస్లింలకు ప్రాతిపదిక మతం. మనకి? వ్యక్తిగత ప్రయోజనం, స్వలాభం, డబ్బు, పదవి, ఎదుటివాడి పతనం -మరేదో, మరేదో.

హిందూదేశంలో ముస్లింల 'హజ్‌' యాత్రకి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంది. ప్రపంచంలోని 52 ముస్లిం దేశాలలో ఏ దేశంలోనూ ఈ ఉపకారం లేదు. శుభం. మరి భారతదేశంలో కాశీ, గయ, కేదార్‌, బదరీ, వైష్ణోదేవి యాత్రలకు మన ప్రభుత్వం ఆర్థిక సహాయం చెయ్యదేం? అడిగే నాధుడేడీ? వాళ్ల స్వార్దాలకే వ్యవధి చాలకపోయె. మన చిన్న పొట్టకు శ్రీరామరక్ష. మన కులానికి మేలు కలిగితే చాలు. మొన్న విశాఖపట్నంలో ఓ స్వామీజీని బహిరంగంగా కొట్టారు. కారణమేదయినా ఈ పనిని ఏదీ? ఒక 'ఇమామ్‌'కి దమ్ముంటే చేయమనండి. మనది భారతదేశం. పరాయి పెద్దని అవమానించమనడం ఉద్దేశం కాదు. మన మర్యాదకి నీడలేదని చెప్పడం ఉద్దేశం.

అక్బరుద్దీన్‌ చేసిన ప్రసంగం ఏ హిందువయినా చేసి బతికి బట్టకట్టగలడా? ముస్లింలు మాట దేవుడెరుగు. ఔదార్యం కట్టలు తెంచుకునే మన సెక్యులర్‌ వీరులు 'హిందుత్వం' పేరిట గొంతుచించుకోరా? అక్బరుద్దీన్‌ అరాచకాన్ని ఉత్తరప్రదేశ్‌లో మరో ముస్లిం నాయకుడు సమర్థించారు! హిందూ దేశంలో ముస్లింల కిచ్చిన ప్రత్యేక స్థానం మరే ముస్లిం దేశంలోనయినా హిందువుల కిచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఈ దేశంలో 15 శాతం మైనారిటీ వర్గాన్ని 85 శాతం మెజారిటీ వర్గం నెత్తిన పెట్టుకుంటోంది.

కరుణానిధికి రామాయణం కట్టుకథ. ఆయన మన ముఖ్యమంత్రి. దేవుడిని నమ్మని, నమ్మకం లేదని బల్లగుద్దే ఏ ముస్లిమయినా ఏ ముస్లిం దేశంలో నయినా నాయకుడు కాగలడా?

ఈ విచిత్రాన్ని ఎవరయినా గమనించారా? గాజాలో అరబ్బులు క్షేమంగా లేరు. పాకిస్తాన్‌లో వందలమంది ముస్లింలను వారే చంపుకుంటున్నారు. లిబియాలో, మొరాకోలో, ఆఫ్గనిస్థాన్‌లో, సిరియాలో, లెబనాన్‌లో, ఈజిప్టులో, ఇరాక్‌లో, యెమెన్‌లో ముస్లింలు హింసకు బలి అవుతున్నారు. ఆస్ట్రేలియాలో, ఇంగ్లండులో, ఫ్రాన్స్‌లో, ఇటలీలో, జర్మనీలో, స్వీడన్‌లో, అమెరికాలో, నార్వేలో వారు క్షేమంగా, హాయిగా ఉన్నారు. అయినా ఆ దేశాల్లో ముస్లింలు పై దేశాల్లో ముస్లింలుగా ఉండాలనుకుంటున్నారు.

మహారాష్ట్రలో, ఉత్తరప్రదేశ్‌లో, బీహార్‌లో ముస్లింలు మైనారిటీలుగా రాయితీలు పొందుతున్నారు. శుభం, మరి ఈ దేశంలోనే జమ్ము కాశ్మీర్‌లో, మిజోరంలో, నాగాలాండ్‌లో, అరుణాచల్‌ప్రదేశ్‌లో, మేఘాలయలో మైనారిటీలయిన హిందువులకు ఆ రాయితీలు యివ్వడం లేదేం?

ముస్లిం మత కార్యకలాపాలను, వారి వ్యవహారాలను చూసే వక్ఫ్‌ బోర్డులున్నాయి. వాటి ఆదాయాన్ని ఈ దేశంలో ఎవరయినా ముట్టుకోగలరా? పదిమంది దర్శించే ప్రతి హిందూ దేవాలయ పరిపాలనా, ఆదాయం -రాజకీయ నాయకుల, వారి ప్రతినిధుల చేతుల్లోకి పోయిందేం?

ఎవరయినా మనల్ని తిట్టినప్పుడు -మనం హిందువులం. ఎవరూ తిట్టనప్పుడు -మనల్ని మనమే తిట్టుకునే స్వదేశీయులం. అదీ మన ప్రతాపం.

'మనవాళ్లు ఉత్త వెధవాయిలోయ్‌!' అన్నాడు గిరీశం. అక్బరుద్దీన్‌ వంటి పెద్దలు ''వీళ్లంతా ఉత్త వెధవాయిలోయ్‌!'' అని నవ్వుకుని ఉంటారు. అందుకే రొమ్ము విరుచుకుని -ప్రేక్షకులు మురిసిపోయేలాగ -హిందూ దేశంలో హిందువుల్ని తిట్టి -తీరిగ్గా లండన్‌ వెళ్లి కూర్చున్నారు. ఇక్కడ మన వీరంగం చూసి -అక్కడ పేపర్లలో చదువుకుని నవ్వుకుంటూ ఉండి ఉంటారు.

కులాల పేరిట, వర్గాల పేరిట -కిష్టిగాడు, రాములు వెధవ, సీతి, లచ్చి స్థాయికి మతాన్ని యీడ్చిన గౌరవనీయులైన హిందువులు -మొదట ఇల్లు చక్కబెట్టుకోవలసిన అవసరం ఎంతయినా ఉంది. తమలో ఏ లోపాలున్నా 'మతం'- భేషరతుగా -నయానికో, భయానికో -తమకి గుర్తింపునీ, బలాన్నీ, సామూహిక ప్రతిపత్తినీ యివ్వగల శక్తి అని ముస్లింలు నమ్ముతున్నారు. మనం ఏనాడయినా -ఎవరో మనని దుయ్యబట్టిన యిలాంటి అరుదయిన సందర్భాల్లో ప్రథమ కోపాన్ని చూపడం తప్ప -యిలాంటి సంఘటిత శక్తిని ప్రదర్శించామా?

అక్బరుద్దీన్‌ తప్పు చేశాడా? ఇప్పుడు క్రైస్తవ మతాన్ని సహాయం తెచ్చుకుంటాను. మీ మతాన్ని, మీ విలువల్ని, మీ విశ్వాసాల్ని, మీ ఆచారాల్ని గౌరవించే మొనగాడెవరయినా ఉంటే మొదటి రాయి వెయ్యండి.

నా ఉద్దేశంలో అక్బరుద్దీన్‌ ప్రసంగం మేలుకొలుపు. పేడ తినే బ్రాహ్మణ్యం, యముడిని వెక్కిరించే సినిమాలూ, స్వజనాన్ని గౌరవించుకోలేని స్వార్థం, వేలంటీన్‌ వేలం వెర్రికి విర్రవీగే సామూహిక పైత్యం, దేవుడు, దేవాలయాలు 'హిందుత్వం' అని రాజకీయ ప్రయోజనాలకు గొంతు చించుకునే అవకాశవాద పార్టీలూ మతానికి విలువని పెంచవు. అక్బరుద్దీన్‌ వంటి వారి నోటికి బలి అవుతాయి. అంతకంటే భయంకరమైన విషయం ప్రేక్షకుల ప్రశంస అనే హెచ్చరిక.


                                                                           gmrsivani@gmail.com  

 
                                           జనవరి 7, 2013          

*************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 


KOUMUDI HomePage