సైబీరియన్ గీత
గొల్లపూడి మారుతీరావు gmrsivani@gmail.com
మహాభారతంలో అర్జునుడు దౌర్జన్యకారుడు. కౌరవ
సైన్యాన్ని తుదముట్టించడమే అతని లక్ష్యం. కాకపోతే కురుక్షేత్రంలో సైన్యాల
మధ్య నిలబడగానే గుండెవణికింది. కాళ్లు తడబడ్డాయి. తన అన్నదమ్ముల్నీ,
బంధువర్గాన్నీ చంపాలా అని వాపోయాడు. శ్రీకృష్ణుడనే ఓ జిత్తులమారి -రకరకాల
సిద్ధాంతాల్ని ఉటంకించి, పూర్తిగా గందరగోళం చేసి, చంపడమే పరమ కర్తవ్యమని
నూరిపోశాడు. కృష్ణుడి విషం తలకెక్కింది. మరో ఆలోచన లేకుండా -తన పర అని
చూడకుండా వేలాదిమందిని చంపాడు అర్జునుడు. ఇదీ భగవద్గీత లక్ష్యం, మారణహోమం,
జీవహింస, దీనికి కర్మ, విధి, సాంఖ్యం, క్షేత్ర క్షేత్రజ్ఞం వంటి సాకుల్ని
జతచేసి మానవాళికి తరతరాలుగా ఎక్కిస్తున్న విషం -ఈ భగవద్గీత. స్థూలంగా అతి
స్థూలంగా రష్యాలో సైబీరియాకు చెందిన టోంస్క్ కోర్టులో ప్రాసిక్యూటర్‌గారి
ఆరోపణల సారాంశమిది. దీనికి ప్రేరణ ఇప్పటికీ వందలాది దేశాలలో వేలాదిమంది
ఆదరిస్తున్న హరేకృష్ణ ఉద్యమ వ్యవస్థాపకులు (ఇస్కాన్) భక్తి వేదాంత
ప్రభుపాద వారి భాష్యానికి పట్టినగతి.
క్రైస్తవ ఛాందసం తలకెక్కిన టోంస్క్ విశ్వవిద్యాలయానికి చెందిన ముగ్గురు
మేధావులు 'కృష్ణుడు పాపాత్ముడు క్రైస్తవ సిద్ధాంతాలకి ఆయన బోధలు బొత్తిగా
చుక్కెదురు' అని సెలవిచ్చారు. అదే దేశంలో రష్యాకవి అలెగ్జాండర్ వుష్కిన్‌కి
రామాయణం అభిమాన కృతి. 1792 నాటికే కాళిదాసు శాకుంతలం రష్యన్ భాషలోకి
అనువదింపబడింది. 1788లో భగవద్గీత అనువాదం ఆ దేశంలో ప్రచురితమయింది. హిందూ
ధర్మమూ, పౌరాణిక చింతనా ఈ దేశానికి కొత్త కాదనడానికి ఇవి కేవలం ఉదాహరణలు
మాత్రమే. ప్రముఖ రష్యన్ రచయిత లియొ టాల్‌స్టాయ్‌కి భగవద్గీత అత్యంత అభిమాన
గ్రంథం. ఈ మేధావి వర్గం నిరసించిన ఈ విషాన్ని 80 దేశాలలో 10 కోట్లమంది
యిప్పటికీ చదువుతున్నారు. ఆదరిస్తున్నారు. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, ఎమర్సన్
వంటి ఎందరో మహనీయులు ఈ గ్రంథాన్ని ఎంతగానో ప్రశంసించిన ఉదాహరణలున్నాయి.
ఈ కోర్టు కేసుని నిరసిస్తూ -యిప్పటికే దేశంలో కనీసం 600 పత్రికలు, యితర
సంచికలలో వ్యాసాలు, కావ్యాలు, సంపాదకీయాలు రాశారు. పార్లమెంటులో ఎందరో
గొంతులెత్తారు. మరీ ముఖ్యంగా మౌలానా ఖాలిద్ రషీద్ అనే ముస్లిం మత గురువు
(ఫిరణి మహర్) లక్నోలో ఇస్లాం మత ప్రచారకులు. ఆయన రష్యా అహంకార యుతమైన
చర్చని తీవ్రంగా ఖండిస్తూ అందరు ముస్లింలు ఈ చర్యని నిరసించాలన్నారు.
ఇటువంటి మత దుష్ప్రచారాన్ని ప్రభుత్వం తీవ్రంగా గర్హించాలన్నారు. క్రియా
యోగ ప్రచారకులు శ్రీశ్రీ రవిశంకర్ యీ చర్య వల్ల రష్యా ప్రజలకే తీరని
నష్టమని వాపోయారు. అయితే ఇందులో చిన్న విసర్వయం ఉంది. రష్యాలో ఒక మూల ఇలాంటి
దుశ్చర్య సాగుతుండగా, మాస్కోలో వున్న 80 ఇస్కాన్ కేంద్రానికి సంబంధించిన
50 వేలమంది భక్తులు 2012 నాటికి లెనిన్ గ్రాడ్‌స్కీలో మాస్కో వేద
కేంద్రాన్ని స్థాపించే ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
అక్టోబర్ విప్లవం తర్వాత -మతాన్నీ, దేవుడినీ అటకెక్కించిన దేశమది. కొన్ని
దశాబ్దాలు -ఎక్కడో మారుమూలలో, మరెక్కడో భక్తుల మనస్సుల్లోనో 'దేవుడు'
తలదాచుకున్నాడు. దాదాపు 15 సంవత్సరాల క్రితం అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో
ఒక సినీమా చూశాను. దానిపేరు ''పశ్చాత్తాపం'' (రిపెంటెన్స్) దేశంలో వామపక్ష
సిద్ధాంతాలను వెక్కిరిస్తూ తీసిన ఈ చిత్రం చాలా సంవత్సరాలు బయటికి రాలేదు.
గోర్బచేవ్ కాలంలో దీనికి మోక్షం లభించిందంటారు. ఈ సినీమాలో ఆఖరి సీను -80
ఏళ్లు దాటిన ముదుసలి (ఆనాటి అక్టోబర్ విప్లవాన్ని చూసిన వ్యక్తి) -ఈ ఇంటి
ముంగిట ఆగి తలపు కొడుతుంది. 18 ఏళ్ల పిల్ల తలుపు తీస్తుంది. ''చర్చికి తోవ
ఎటు?'' అని అడుగుతుంది. ఆ పిల్ల కంగారుపడి ''అటు తోవవుంది. కాని అక్కడ
చర్చిలేదు'' అంటుంది. ముదుసలి నవ్వుకొంటూ -వెనుదిరిగి 'చర్చిలేని తోవ ఉండేం
లేకపోతేనేం?' అనుకొంటూ వెళ్లిపోతుంది. అదీ ముగింపు. ఈ నిర్వీర్యతలోంచి ఇంకా
ఆనాటి 'ఛాందసం' నిలదొక్కుకొన్న కొందరు మేధావులున్నారని ఈ కేసు నిరూపించింది.
ఇండియాలో రష్యా రాయబారి అలెగ్జాండర్ కడాకిన్ బాధపడుతూ -రష్యావంటి
ప్రజాస్వామిక దేశంలో ఇలాంటి ఆలోచనలకు తావులేదు. ఇక్కడ ప్రపంచంలో అన్ని
మతాలకూ గౌరవ ప్రపత్తులున్నాయి'' అన్నారు. మన పార్లమెంటులో (రాజ్యసభలో) తరుణ్
విజయ్ అనే సభ్యుడు ఆవేశంతో ''సూర్యుడిని ఎవరయినా ఆపగలరా? హిమాలయాన్ని
బహిష్కరిస్తారా? భూమి చలనాన్ని ఆపుతారా? భగవద్గీతని బహిష్కరించడం అలాంటిది''
అన్నారు. టోంస్క్‌లో ఒక పత్రిక ఈ చర్యని ఖండిస్తూ -గీత -ఒక మతాన్ని
నిర్దేశించే గ్రంథం కాదు. మానవాళి అంతటికీ సంబంధించిన ప్రబోధం.మానవాళికి
మార్గదర్శి అన్నది.
టోంస్క్ కోర్టులో జరిగిన అనర్ధానికి టోంస్క్ లోనే ఒక పత్రిక సబబైన సమాధానం
చెప్పింది. భారతీయ ఆధ్యాత్మిక చింతనని రెండు మాటల్లో సూచించింది. నిజానికి
భగవద్గీత మతగ్రంథం. ప్రతిమనిషికీ కరదీపిక. సర్వ కాలికమయిన విశ్వాసాలకు 'దేవుడు'
తొడుగువేయడం వల్ల ఆ విశ్వాసాలకు మన్నిక, ఆదరణ లభిస్తుందని -అలనాటి పెద్దలు
తొడిగిన 'అంగీ' మతం. శ్రీకృష్ణుడిని, అర్జునుడిని కాదనుకొని చదివినా ఓ
గొప్ప గురువు ఓ గొప్ప శిష్యునికి బోధించే అద్భుత జీవన సత్యాలకు నిలయం
భగవద్గీత. అన్ని కాలాలకూ వర్తించే గైడ్.
అందుకనే ప్రతీ కాలంలో, ప్రతీ తరంలో, ప్రతీ మతప్రవక్త, నాయకులూ, పెద్దలూ -ఆ
కాలానికి, ఆ సమాజానికీ ఆనాటి విలువలకీ అన్వయిస్తూ -భగవద్గీతకి భాష్యం
చెప్పారు. అన్ని కాలాలకూ సరిపోయే 'రైల్వే గైడ్' ఉండదు. కాలానికనుగుణంగా,
అవసరాలకు అనుగుణంగా మారుతుంది. శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య,
మహాప్రభు, ధ్యానేశ్వర్, స్వామి వివేకానంద, అరవిందులు, సర్వేపల్లి
రాధాకృష్ణన్, అనీబిసెంట్, తిలక్, మహాత్మాగాంధీ, ప్రభుసాద, చిన్మయానంద,
దయానంద సరస్వతి, పార్థసారధి, సుందర చైతన్య -ఆఖరికి యండమూరి వీరేంద్రనాథ్
-ఈ జాబితా అనంతం -అది మానవాళి జీవన సరళిని సుగమం, సుఖవంతం చేసే ఎలిక్సిర్.
ఒకే ఒక్క ఉదాహరణ 12వ అధ్యాయం 'భక్తియోగం'లో 8, 9, 10, 11, 12 శ్లోకాలు.
అద్వైష్టా సర్వభూతానాం మైత్ర: కమలావచ'' -భక్తుడి (మంచి నడవడికకి) లక్షణాలను
గురువు (కావాలనే శ్రీకృష్ణుడనడం లేదు) 31కి సూచించారు. అన్ని ప్రాణులపట్ల
కరుణ, మైత్రి, నిర్మమత, సుఖదు:ఖాల పట్ల సమభావం, క్షమ... యిలా. ఈ 31
లక్షణాలనూ దేవుడికే ఏమీ సంబంధం లేదు. ఆ మాటకివస్తే -ఈ లక్షణాలకీ భక్తికీ ఏమీ
సంబంధం లేదు. కాని ఈ లక్షణాలు ఏ కొన్నిటినీ, కనీసం ఒక్కటి సాధించినా -అతను
'భక్తుడు' కాదు జీవన్ముక్తుడు -ఒక్క కరుణచే ఈ ప్రపంచంలో అద్భుతమైన సంకేతం -ఏసు
ప్రభువు.
ఇంతకంటె భగవద్గీత విశ్వజనీనత, సర్వకాలజ్ఞతని చెప్పడానికి నాకు శక్తి చాలదు.
చివరకు సైబీరియాలోని టోంస్క్ స్థానిక కోర్టు 'గీత'పై కేసును కొట్టివేయడం
ఊహించినదే!
జనవరి 2, 2012
************ ************ ************* ************* Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com Read all the columns from Gollapudi గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి |