Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here 
 
Are you using iPad ( any iOs Device)? Try direct MP3, Click here

సమాధిపై ఆఖరి రాయి

కుంభకోణం శతాబ్దాల చరిత్ర ఉన్న కాంగ్రెసు పార్టీకి చరమగీతమని చెప్పవచ్చు. ఆదర్శం అనే పేరుని, దాని అర్ధాన్నీ భయంకరంగా అనుభవం, అధికారం, అన్నిటికీ మించి విచక్షణ, వివేచన తెలిసిన నాయకులు భ్రష్టు పట్టించడానికి ఇది పరాకాష్ట. దేశంలో ఒక న్యాయాధిపతి జె.ఏ.పాటిల్, ఒక మాజీ ప్రధాన కార్యదర్శి పి.సుబ్రహ్మణ్యం కుంభకోణాన్ని పరిశీలించి ఇచ్చిన రిపోర్టుని ఒక్కసారి చూద్దాం. ముందుగా కుంభకోణంలో తలదూర్చి లబ్ది పొందిన పెద్దల జాబితా: నలుగురు ముఖ్యమంత్రులు, ఒక కేంద్ర హోం మంత్రి, ఇద్దరు జాతీయ కాంగ్రెసు మంత్రులు, పన్నెండు మంది ఐయ్యేయస్ ఆఫీసర్లు, ఇద్దరు రాష్ట్ర మంత్రులు, ఇద్దరు దేశ సైన్యాధిపతులు, ఇద్దరు మేజర్ జనరల్స్, ఒక కల్నల్, ఒక బ్రిగేడియర్, ఒక ఎఫ్ ఎస్, ముగ్గురు కలెక్టర్లు, ఎందరో పార్లమెంటు సభ్యులు, ఇంకా మరెందరో. బహుశా మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక జరిగిన కుంభకోణాల్లో ఇది తలమానికం. దేశంలో ఇంత పెద్ద పదవుల్లో ఉన్న ఇంతమంది సామూహికంగా జరిపిన కుంభకోణానికి ఇది గొప్ప చరిత్రని సృష్టించే కుంభకోణం. దేశంలో మానవ స్వభావం ఎంత నీచానికి ఒడిగట్టగలదో, ఎంత గొప్ప పదవుల్లో ఉన్నా స్వలాభం ఎంతగా పాతాళానికి కృంగదీయగలదో నిరూపించే గొప్పదరిద్రం. దీనిలో ఆయా అపార్టుమెంటుల్ని అవినీతితో పంచుకున్నవారంతా దేశపు విలువల్ని నిలిపే బాధ్యతల్ని చేపడతామని ఈదేశపు రాజ్యంగం మీద ప్రమాణం చేసి ఆయా పదవుల్ని చేపట్టినవారు. తీరా కుంభకోణం వివరాలను సాధికారమైన కమిటీ బయటపెట్టినప్పుడు - కాంగ్రెసు ప్రభుత్వం ఏం చేసింది? మహారాష్ట్ర ప్రభుత్వం నివేదికని తిరస్కరించింది. ఎందుకు? మాజీ ముఖ్యమంత్రి మీద నేర పరిశోధన ప్రారంభించడానికి మహారాష్ట గవర్నర్ శంకర్ నారాయణ్ నిరాకరించినందుకు. నిజానికి విచారణ సంఘం నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకుని గవర్నర్ మహాశయులు తన నిర్ణయాన్ని తీసుకోవాలి. అలాక్కాక గవర్నర్ గారి ఏకపక్ష నిర్ణయాన్ని వెనకేసుకు వచ్చి కమిటీ రిపోర్టుని మహారాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఇదేం విపరీతం? 2010  లో కుంభకోణం వెలుగులోకి వచ్చి రాజకీయ వర్గాలను పునాదులతో కుదిపినప్పుడు అశోక్ చవాన్ పదవికి రాజీనామా ఇచ్చారు. ఇప్పుడు విచారణ సంఘం అతి స్పష్టంగా ఆయా అధికారులు ఆయా దశలలో తీసుకున్న నిర్ణయాలు, సరైనవికావు, సమర్ధనీయాలుకావు, ప్రజాహితాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకున్నవికావు అని కుండబద్దలు కొట్టి తేల్చి చెప్పాక గవర్నరు సీ.బి. కి అనుమతిని తిరస్కరించడం ఏమిటి? దాన్ని ఆసరా చేసుకుని మహారాష్ట్ర ప్రభుత్వం కమిటీ రిపోర్టుని తిరస్కరించడం ఏమిటి? సరే. నిన్నటికి నిన్న కాంగ్రెసు యువరాజు రాహుల్ గాంధీగారు కుంభకోణం మీద విచారణ జరగాలి అన్న వెంటనే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగారు వెనక అడుగు వేశారు. దేశపు నీతి ఒక 'నాయకుని' అభిప్రాయం చుట్టూ ఏర్పడడం - అదిన్నీ నెహ్రూ కుటుంబానికి కాంగ్రెసు నాయకత్వం తలవంచడానికి ఇది దయనీయమైన మచ్చుతునక.

అసలు ప్రజలి ఆస్తుల్ని కొల్లగొట్టిన దొంగలు ఎలా పంచుకున్నారో ముచ్చట చూద్దాం. ప్రతీ దశలోనూ ఆదర్శాన్నికి కొమ్ము కాసిన ప్రతీ రాజకీయ నాయకుడూ, ప్రతీ గవర్నమెంటు ఆఫీసరూ తనవాటా గడ్డిని తిన్నాడు. 1980 ప్రాంతాలలో నిర్మాణం ప్లాన్లకు అశోక్ చవాన్ మద్దతు పలికారు. లాభం? వారి అత్తగారి పేరిట కోట్ల ఖరీదు చేసే ఒక ఫ్లాట్, ఆయన దగ్గరి బంధువులకి ఆదర్శ సొసైటీలో సభ్యత్వం. విలాస్ రావ్ దేశ్ ముఖ్ కొన్ని నిబంధనలను సవరించాక - ఇద్దరు దేశపు సైన్యాధిపతులు ఎన్.సి.విజ్, దీపక్ కపూర్ తమ తాంబూలాలను పుచ్చుకున్నారు - రెండు ఫ్లాట్ల రూపంలో. దేశ్ ముఖ్ గారు ఈస్థలం పక్కనున్న కొంత స్థలాన్ని కలుపుకోడానికి నిబంధనలను సడలించారు - తద్వారా కట్టడానికి ఎఫ్ ఎస్ పెరిగే అవకాశాన్ని కల్పిస్తూ. ఆయన తర్వాత ప్రస్తుత హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేగారు ముఖ్యమంత్రి అయారు. విషయం మీద మంత్రివర్గం నిర్ణయం తీసుకోవాలని ఆర్ధిక శాఖ సూచించగా వారు సూచనని తుంగలోకి తొక్కి తన సంతకం చేశారు. తత్కారణంగా సొసైటీలో ఉన్న 71 మందిలో 20 మందికి అపార్టుమెంటులు కేటాయించే అర్హతని సంపాదించుకున్నారు. ముఖ్యమంత్రి సెక్రటరీ సుభాష్ లల్లాగారు తెలివిగా ఫైలుని కదిపారు. తత్కారణంగా వారి తల్లికీ, కూతురికీ రెండు ఫ్లాట్లు దక్కాయి. ముంబై కలెక్టరు ప్రదీప్ వ్యాస్ సతీమణికి ఒక ఫ్లాట్ దక్కింది. అలాగే మహారాష్ట్ర నగర పాలక సంస్థ ప్రధాన కార్యదర్శి డి.కె.శంకరన్ గారికీ, సి.ఎస్ సంగీతరావు అనే మరో కలెక్టరుగారికీ వారి వారి కొడుకుల పేరిట ఫ్లాట్లు దక్కాయి. .కె.కుందన్ అనే కలెక్టరుగారికీ, నగర అభివృద్ది సంస్థ కార్యదర్శి పి.వి.దేశ్ ముఖ్ గారు ఏమీ గజిబిజి లేకుండా తమ పేరిటే ఫ్లాట్లు నమోదు చేసుకున్నారు. ఇక మాజీ జనరల్ మేనేజరు ఉత్తం ఖోబ్రగాడే. ఆయన నేరంగానీ, గూడుపుఠాణీగానీ రుజువు కాలేదని కమిటీ పేర్కొందికానీ వారి సుపుత్రి - దేవయాని ఖోబ్రగాడేకి ( మధ్య్ అమెరికాలో పోలీసుల అమర్యాదకరమైన అరెస్టుకు వార్తలలోకి ఎక్కిన సీనియర్ దౌత్య అధికారి) ఇందులో ఒక ఫ్లాట్ అనధికారికంగా కేటాయించారు. కారణం - తనకు ముంబైలో మరో ఆస్తిలేదని ఆమె తప్పుడు సమాచారాన్ని తన దరఖాస్తులో ఇచ్చారు. ఇది కేవలం స్థాళీపులాక న్యాయంగా మన పెద్దమనుషులు సిగ్గులేని దోపిడీకి కేవలం నమూనా.

ప్రారంభంలో ప్రాజెక్టుని కార్గిల్ సమరంలో ప్రాణాలు పోగొట్టుకున్న అమర వీరుల భార్యలకు నివాసాలు కల్పించే లక్ష్యాన్ని కాగితాల మీద చూపారు. నిజంగా లక్ష్యం  అభినందనీయం. ఉదాత్తం. కానీ తమ తమ దోపిడీకి దేశంలో ఉత్తమ పదవుల్లో ఉన్న రాజకీయ నాయకులు, ముఖ్యంగా సైనికాధికారులు కుంభకోణంలో చేతులు కలపడం ఒక ఉదాత్తమైన ఆదర్శాన్ని అతినీచమైన లక్ష్యాలను, ఆదర్శాన్ని చూపవలసిన సైనికాధికారులు - అతినీచంగా రాజకీయ నాయకులతో, సిగ్గులేని, నిజాయితీ కొరవడిన ఆఫీసర్లతో దోపిడీని పంచుకోవడం - చరిత్రలో సైనిక శాఖ నీచానికి ఇది దయనీయమైన నిదర్శనం.

మన దేశంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తుల రంకునీ, రాజ్ భవన్ లో గవర్నర్లు వేశ్యలతో కులికే నీచాన్ని దర్శించాం. ఇప్పుడు - మనం గర్వంగా తలకెత్తుకునే మరో వ్యవస్థ సైనిక వ్యవస్థ పతనానికి ఇది అతి దయనీయమైన ఉదాహరణ.

ఇప్పటికే కాంగ్రెసు ఊపిరి పీల్చుకోడానికి, సమర్ధించుకోడానికి వీలు లేని పీకలోతు కుంభకోణాలలో మునిగి తేలుతోంది. ప్రజలు తమ విముఖతని మధ్య జరిగిన ఎన్నికలలో నిర్ద్వంధంగా చూపారు. కర్కశంగా కాంగ్రెసుని గద్దె దింపారు. తమ విముఖతని చెప్పుతీసి కొట్టినట్టు ప్రకటించారు. ఇప్పుడీ కుంభకోణం అవినీతికి పరాకాష్ట. ఇంతకంటే నీచాన్ని చరిత్రలో మనం ఊహించలేము. పైగా అవినీతిపై విచారణకు ఒక గవర్నరు, ఒక రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించడం - ఏం జరిగినా పరవాలేదని మొండికేయడమా? ప్రజల ఏహ్యతను ఎలా ఎదిరించాలో తెలియని ఊబిలో కూరుకుపోవడమా?

ఓటరు విసుగుదలా, తిరస్కారాన్ని పూర్తిగా చవిచూసే సమయం ఇంక ఎంతదూరమో లేదు. తెలుగులో ఒక సామెత ఉంది. చాలా సంవత్సరాలకిందట ఇందిరాగాంధీ అర్ధరాత్రి అర్ధాంతరంగా ఎమర్జెన్సీని ప్రకటించి, తనని అరెస్టు చేయడానికి జయప్రకాష్ నారాయణ్ ని అర్ధరాత్రి నిద్రలేపినప్పుడు మాట అన్నారు - వినాశకాలే వీపరీత బుద్ధిః  అని. ఈనాటి పాలకుల విపరీత బుద్ది మరో వినాశకాలానికి కేవలం సూచన.

       
 
      gmrsivani@gmail.com   
     డిసెంబర్  30,  2013          

*************

Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   


KOUMUDI HomePage