|
|
Click Play to listen audio of this column If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here Are you using iPad ( any iOs Device)? Try direct MP3, Click here
నల్ల సూర్యుని అస్తమయం
2003లో మా అబ్బాయి క్రికెట్ ప్రపంచ కప్పు ఆటలకు దక్షిణాఫ్రికా వెళ్లి వస్తూ నాకో బహుమతిని తెచ్చాడు. నెల్సన్ మండేలా ఆత్మకథ -ఎ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. "స్వాతంత్య్రానికి సుదీర్ఘ ప్రయాణం" దాదాపు తెనుగు సేత. అప్పటికి ఆత్మకథల మోజులో ఉన్న నేను -నా ఆత్మకథ రచనకు ఉపక్రమించబోతున్న నేను -వదలకుండా కొన్ని రోజులు చదివాను. చదివాక కొన్ని సంవత్సరాలు నన్ను వెంటాడిన పుస్తకం -కాదు -వెంటాడిన జీవితం మండేలాది. మండేలాకీ మన దేశానికీ దగ్గర బంధుత్వం ఉంది. మహాత్ముని అహింసాయుతమైన పోరాటాన్ని -శాంతియుత సమరాన్ని స్ఫూర్తిగా తీసుకున్న రెండో వ్యక్తి -నెల్సన్ మండేలా. మొదటి వ్యక్తి -మార్టిన్ లూధర్ కింగ్. దక్షిణాఫ్రికాలో తెల్లవారి పాలన మీదా, వారి ఆంక్షల మీదా, విధించిన శిక్షల మీదా కొన్ని దశాబ్దాలపాటు జరిగిన పోరాటంలో -ఎంతోమంది మరణించగా, ఎందరో పాలకుల దౌష్ట్యానికి బలిఅయిపోగా -వారిపై తిరుగుబాటు చేసి -వారు విధించిన శిక్షకు 27 సంవత్సరాలు తలవొంచి కేవలం తన చిత్తశుద్ధితో, ఆత్మవిశ్వాసంతో, ధృడమైన కర్తవ్య దీక్షతో -నిశ్శబ్ద విప్లవం జరిపి -తెల్ల పాలకుల తలలు వంచిన ఏకైక వీరుడు నెల్సన్ మండేలా. దుర్మార్గాన్నీ, దౌష్ట్యాన్నీ, అన్యాయాన్నీ -కేవలం సంయమనంతో, నిర్దుష్టమైన ఆత్మవిశ్వాసంతో ఎదిరించిన యోధుడు మండేలా. తమ పోరాటానికి ఫలితాన్ని తన జీవిత కాలంలోనే చూసి -దక్షిణాఫ్రికా రిపబ్లిక్‌కు మొదటి అధ్యక్షుడయ్యాడు. ఓర్పు, సంయమనం, అకుంఠితమైన చిత్తశుద్ధిలో తన గురువు కంటే నాలుగు అడుగులు ముందు నిలిచిన అద్భుత మానవతావాది మండేలా. చరిత్ర మలుపులో తనని జైలులో పెట్టిన నాయకత్వంతో (డి క్లార్క్‌తో) ప్రపంచ స్థాయి గౌరవాన్ని -నోబెల్ శాంతి బహుమతిని పంచుకున్న యోధుడు. శుక్రవారం మండేలాకు నివాళులర్పిస్తూ ఆర్చిబిషప్ డెస్మండ్ టుటు అన్నారు: "రేపు సూర్యుడు ఉదయిస్తాడు. ఎల్లుండీ, ఆ తర్వాతా ఉదయిస్తాడు. కాని నిన్నటి సూర్యుడి ప్రకాశాన్ని, ఆశనీ చూపలేడు" అన్నాడు -మండేలాలేని జాతిని ఊహించుకుంటూ. ఆయన ఒకసారి చెప్పారు. "మా కుటుంబంలో ఎవరూ స్కూలుకి వెళ్లలేదు. కాని నా చిన్నతనంలో నేను స్కూలుకి వెళ్లాను. అప్పటి మా టీచరు ఎమ్‌డింగానే స్కూలులో చేరిన మొదటి రోజునే నాకో కొత్తపేరు పెట్టింది. మా పెద్దలు పెట్టిన ఆఫ్రికన్ పేర్లతో కాక -సుళువైన పేర్లు టీచర్లు పెట్టడం ఆనవాయితీ. ఆవిడ పెట్టిన పేరు -నెల్సన్. నెల్సన్ అని ఎందుకు ఏమో తెలీదు" మనకి ఇప్పుడు తెలుసు. మానవాళి ఎల్లకాలం గుర్తుంచుకోడానికి. మానవత్వపు విలువలకి మన్నికైన మారుపేరుగా శాశ్వతంగా నిలవడానికి. జైళ్లలో ఐదు నక్షత్రాల సుఖాల్ని అనుభవిస్తున్న మన నాయకమ్మణ్యుల కథలు మనం చదువుకుంటున్నాం. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, భారతరత్న, దక్షిణాఫ్రికా మొదటి అధ్యక్షుడు, అమెరికా శాంతి బహుమతిని, రష్యా లెనిన్ పతకాన్ని అందుకున్న మండేలా అనే స్వాతంత్య్ర యోధుని జైలు జీవితాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం. మండేలా రాబిన్ ద్వీపంలో 18 సంవత్సరాలు జైలులో ఉన్నారు. బి తరగతి ఖైదీల విభాగంలో ఒంటరిగా అతన్ని బంధించారు. 8 అడుగుల పొడవు, 7 అడుగుల వెడల్పుగల గదిలో కాంక్రీటు నేలమీద ఒక గడ్డి చాపమీద పడుకునేవాడు. ఎందరో తెల్లజాతి వార్డన్లు రాసి రంపాన పెట్టేవారు. పగలు రాళ్లని పిండికొట్టే చాకిరీ. తర్వాత చెక్కసున్నం క్వారీని తవ్వేపని. నల్లకళ్లద్దాలు పెట్టుకోవడాన్ని వార్డన్లు నిషేధించారు. సున్నం తాకిడికీ, వెలుగు సున్నంలోంచి కళ్లమీదికి ప్రతిబింబిస్తూండగా కంటిచూపు శాశ్వతంగా దెబ్బతింది. రాత్రివేళల్లో ఎల్‌ఎల్‌బి (న్యాయ శాస్త్రం) చదువుకునేవాడు. వార్తాపత్రికలు ఆయనకి ఇచ్చేవారు కాదు. తోటి ఖైదీలు దయతలిచి ఆయనకి పేపర్ల కట్టింగులు అందిస్తే -వాటిని సంపాదించుకున్నందుకు ఎన్నో సందర్భాలలో ఆయన్ని ఏకాంతంగా బంధించి ఉంచేవారు. ఆయన నాలుగో తరగతి ఖైదీగా లెక్క. ప్రతీ ఆరునెలలకీ ఒక్కరు మాత్రం కలిసేవారు. ఒక్క ఉత్తరాన్ని బాగా సెన్సారు చేసి యిచ్చేవారు. ఆయన జైల్లో ఉన్నప్పుడు -1968లో ఆయన తల్లి ఒక్కసారే ఆయన్ని చూడనిచ్చారు. తర్వాత ఆమె కన్నుమూసింది. ఆయన కొడుకు కారు ప్రమాదంలో మరణించాడు. కాని రెండు విషాదాల్ని పంచుకోడానికి ఆయనకి అనుమతి లభించలేదు. ఆయన భార్య విన్నీ ఒకటి రెండుసార్లు మాత్రమే ఆయన్ని చూడగలిగింది. తర్వాత రాజకీయమైన ఉద్యమాలకు ఆమెనీ అరెస్టు చేశారు. 1982 -88 మధ్య పోల్స్ మూర్ జైలులో నిబంధనలను సడలించారు. ఈ పీడనని ఇంత విపులంగా వ్రాయడానికి కారణం -ఒక జాతి జీవనాన్ని మలుపు తిప్పే నాయకుడి ఆత్మస్థైర్యాన్ని చెదరగొట్టడానికి మానవ హృదయం -ఒక నిర్వేదంతో, నిస్పృహతో, నిర్వీర్యం కావడానికి ఎంత ప్రయత్నం జరిగిందో అర్థం కావడానికి. నేను అండమాన్‌లో అలనాటి స్వాతంత్య్ర యోధులెందరినో బంధించిన సెల్యులర్ జైలుని చూశాను. తెల్లవారిలేస్తే వందలాది మందిని ఉరితీసే దృశ్యం అనుక్షణం కళ్లబడేటట్టు -ఉరికంబం పక్కనే ఉన్న జైలుగదిలో అలనాడు వీర సావర్కార్‌ని ఉంచారట. ఒక నిర్దుష్టమైన మానవ సంకల్పం, అకుంఠితమైన కార్యదీక్షా వీరుల చిత్తశుద్ధిని ఛిన్నాభిన్నం చేయలేకపోవడమే చరిత్ర. 1988 -90 మధ్య విక్టర్ వెర్ట్స్‌ర్ జైలుకి మార్చారు. తర్వాత డి క్లార్క్ దక్షిణాఫ్రికా నాయకత్వాన్ని చేపట్టడం -దేశ స్వాతంత్య్రం తర్వాతి చరిత్ర. మండేలా జీవితంలో మూడుసార్లు పెళ్లి చేసుకున్నారు. ఆయనకి ఆరుగురు పిల్లలు. 29 మంది మనుమలు, ఆరుగురు మునిమనుమలు. ఆయన 80 వ యేట తనకంటే 27 సంవత్సరాలు చిన్నదయిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. జీవితమంతా తను నమ్మిన నిజాల కోసం పోరాటం సాగించాడు. జీవితమంతా తనకోసం జీవిస్తూనే ఉన్నాడు. తొమ్మిది సంవత్సరాల క్రితం మన రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ దక్షిణాఫ్రికా మాజీ రాష్ట్రపతిని ఆయన ఇంటి దగ్గర కలిశారు. ఆయన శలవు తీసుకుంటున్నప్పుడు మండేలా గుమ్మందాకా నడుస్తూ చేతికర్రని వదిలేసి కలామ్ భుజాన్ని ఊతం చేసుకున్నారట. అప్పుడు కలామ్ అడిగారట: "డాక్టర్ మండేలా! దక్షిణాఫ్రికాలో జాతి వివక్షని ఎదిరించి పోరాడిన తొలి నాయకులు ఎవరు" మండేలా నవ్వి ఒకే ఒక్కపేరు చెప్పారు -గాంధీ. "ఇండియా మాకు ఎమ్.కె.గాంధీని ఇచ్చింది. మేము మీకు మహాత్మాగాంధీని అందజేశాం"అన్నారట. ఆయన హయాంలోనే మన దేశ స్వాతంత్య్రానికి తొలి బీజాలు పడిన దక్షిణాఫ్రికా రైలు స్టేషన్ -పీటర్ మారిట్స్ బర్గ్‌లో -స్టేషన్లోనే మహాత్మాగాంధీ విగ్రహాన్ని స్థాపించారు. విచిత్రమేమిటంటే అహింసా పోరాటాన్ని జీవితాంతం జరిపిన ఈ వీరుని విగ్రహం ఉన్నచోట ఇంకా హింస కొనసాగుతూనే ఉంది. మా అబ్బాయి -ఆ విగ్రహాన్ని చూడడానికి పీటర్ మారిట్స్ బర్గ్ స్టేషన్‌కి వెళ్లాడు టాక్సీలో. టాక్సీని ఓ నల్ల అమ్మాయి నడుపుతోంది. ఇతని ఉద్దేశాన్ని గమనించి ఆమె ఆశ్చర్యంగా చూసిందట. "ఎందుకంత రిస్కు తీసుకుంటున్నావని" "బడీ! నేను కారు ఇంజన్ నడుపుతూ ఏక్సలరేటర్ మీద కాలు పెట్టి ఉంటాను. నీ అదృష్టం బాగుండి పరిగెత్తుకు రాగలిగితే ఇక్కడినుంచి దూకేద్దాం" అన్నదట. నేనప్పుడు విశాఖపట్నంలో ఉన్నాను. మా అబ్బాయి మారిస్ పీటర్స్ బర్గ్ స్టేషన్‌లో గాంధీని దర్శిస్తున్నప్పుడు -నేను రోడ్డుపక్క కారు ఆపి -అతని ఫోన్‌కి ఎదురుచూస్తున్నాను -కొన్ని వేల మైళ్లలో టాక్స్ డ్రైవరు లాగే ఆతృతగా. మండేలా చెప్పిన రెండు మాటలు ఆయన జీవితాన్నీ, ఆయన ఆదర్శాన్నీ, ఆయన వ్యక్తిత్వాన్నీ కళ్లకు కట్టినట్టు నిర్వచిస్తాయి. ఆయన అంటారు: జీవితంలో గొప్పతనం ఎ ప్పుడూ ఓడిపోకుండా నిలవడం కాదు. కాని ప్రతీసారి కింద పడినప్పుడూ లేచి నిలబడగలగడం గొప్పతనం -అని. మరొక్కమాట: భయం లేకపోవడమే ధైర్యం అని నేను నమ్మడం లేదు. భయాన్ని జయించడం ధైర్యమని నమ్ముతాను. జీవితంలో ఎప్పుడూ భయపడనివాడు కాదు ధైర్యస్థుడు. భయాన్ని శాశ్వతంగా జయించినవాడు -అంటారు ఆయన. మండేలా ఈ రెండు సూత్రాలను కేవలం నోటితో చెప్పలేదు. జీవితంలో 95 సంవత్సరాలు పాటించి ఆకాశమంత ఎత్తున నిలిచాడు. కొందరు సత్యాన్ని గుర్తిస్తారు. కొందరు సత్యానికి గుర్తులు పెడతారు. కొందరు ఆ సత్యానికి తమ జీవితాన్నే అభిజ్ఞలు చేసుకుంటారు. జీవితమంతా మహాత్ముని అడుగుజాడల్లో నడిచి మరో మహాత్ముడుగా నిష్క్రమించిన ఆకాశం పేరు నెల్సన్ మండేలా.
*************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com |
|