Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here 
 
Are you using iPad ( any iOs Device)? Try direct MP3, Click here

   ఎవడబ్బ సొమ్ము?

బస్సు చార్జీలు పెరిగాయి. సందేహం లేదు. సామాన్య మానవుడి జీవితం మీద ఇది గొడ్డలి పెట్టు. ఈ కారణంగా ఖర్చులు, నిత్యావసర వస్తువులు, ఇతర సంభారాల ధరలూ - అన్నీ పెరుగుతాయి.

ఇవాళ పేపర్లో ఒక సుందర దృశ్యాన్ని (ఫోటో)ని ప్రచురించారు. ఓ పార్టీ హర్తాళ్ చేస్తూ బస్సుని తాళ్ళతో లాగుతున్నారు. ఇది ఊహించిన, సబబైన నిరసన. కానీ దీనికి బాధ్యులు?

దాదాపు 45 ఏళ్ళ కిందట "నీలయ్యగారి దయ్యం" అనే నాటిక రాశాను. అందులో ఓ కాలేజీ కుర్రాడిని అతని బాబాయి అడుగుతాడు. "ఏమిట్రా నీ శక్తి?" అని. కుర్రాడి సమాధానం. "నీకేం తెలుసు బాబాయ్? ఏ క్షణాన బడితే ఆ క్షణాన , ఏ కారణానికి బడితే ఆ కారణానికి సిటీబస్సులు తగలబెట్టడానికి 60 మంది మిత్రులున్నారు. ఏ రకమయిన సత్యాగ్రహం - అంటే నిరాహారదీక్ష, హర్తాళ్, ఘొరావ్ వగైరా వగైరా జరపడానికి పాతికమంది నిగ్గుల్లాంటి వీరులున్నారు. బస్సులు తగలబెట్టడానికి ఉచితంగా పెట్రోలు సరఫరా చేసే సర్వీసు స్టేషన్ ఉంది. నాశనం చెయ్యడానికి కావలసినంత దేశం ఉంది. ఇంతకంటే మాకు కావలసినదేముంది?" అని బోరవిరుస్తాడు.

ఈ దేశంలో ఎవరయినా ఏ కారణానికయినా నిరసన తెలుపాలన్నా బస్సులు తగలడాలి. రాజకీయ కారణాలకి, నిర్భయ పట్ల అన్యాయానికి, మంత్రిగారి మనుమడిని బస్సు కండక్టరు టిక్కెట్టు అడిగిన కారణానికి, పరీక్షలు వాయిదా వెయ్యడానికి, దేశనాయకుల విగ్రహాలు కూల్చిన కారణాలకి - దేనికయినా బస్సులు తగలడతాయి. తాళ్ళతో బస్సుల్ని లాగి నేలబారు మనిషి కష్టాన్ని వీధిన పెట్టి సమర్ధించే ఈ పార్టీలు ఏనాడయినా, ఏ ఒక్కసారయినా "బాబూ! ఇది మన సొమ్ము. తగలెట్టొద్దు. నష్టపోయేది మనమే" అని ధర్నాచేశారా? ఏ కారణానికయినా, ఏ దేశంలోనయినా బస్సులు తగలడడం మనం చూశామా? అంతెందుకు? మన పొరుగు రాష్ట్రాలలో ఈ అనర్ధం కనిపించిందా?

ఈ మధ్య రాజకీయ కారణాలకి నెలల తరబడి బస్సులు నిలిచిపోయాయి. 2849 బస్సులు రోడ్లమీంచి మాయమయాయి. ఒక్క ఉత్తరాంధ్రలోనే రవాణాశాఖకి 160 కోట్లు నష్టం వచ్చిందని తెలిపారు. ప్రజలు కదలలేక, ఆటోల జులుముని  తట్టుకోలేక కకావికలయిపోయారు. ఒకాయన వాపోయాడు: "ప్రత్యేక రాష్ట్రం కావాలన్న వారిమీద కోపాన్ని మన రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం మీద చూపడం ఏం సబబు?" అని. సిబ్బంది ఆరాటం, వారి చిత్తశుద్ది గొప్పదే. కానీ ఈ చర్య దరిమిలాను - మనమే భారాన్ని మోయవలసిన స్థితికి వస్తుందని తెలియదా?

బాపూజీ విదేశీయుల పాలనలో - ఆ పాలకుల వ్యవస్థని అతలాకుతలం చేసే సమ్మెలను చేపట్టారు. రవి అస్తమించని బ్రిటిష్ సిం హాసనం పునాదులు కదిలాయి. వారిని దిక్కుతోచకుండా చేసింది. జపాన్ లో ఇప్పటికీ సిబ్బంది తమ నిరసనని తెలపాలంటే యజమానిని నష్టపెట్టరు. తమ విధుల్ని యధావిధిగా నిర్వర్తిస్తూనే - లంచ్ వేళలో అదనంగా పనిచేసి - మరింత ఉత్పత్తిని చూపి - మా కోరికలు తీరిస్తే ఈ ప్రయోజనాన్ని ఇవ్వగలమని నిరూపిస్తారు. యాజమాన్యం దిగివస్తుంది.

అయితే మనకి కరెంటు ఆపేసి, బస్సులు నిలిచిపోయి, పరిపాలన స్థంభించినా - ఢిల్లీలో నాయకులు స్పందించరు. వారి చర్మం మొద్దుబారిపోయింది. అది మన ఖర్మ. లేదా మన హక్కుని పదే పదే వాడి దుర్వినియోగం చేసుకున్నామా? మందుకూడా మితి మించితే వికటిస్తుంది.

మరి ఇంత నష్టం - ఇన్ని విధాలుగా జరిగాక - ధరలు పెంచకపోతే ఎలా? ఎవడబ్బ సొమ్ము తీసుకొచ్చి - బస్సులు తగలెట్టడానికి, ఆదాయానికి గండికొట్టడానికి కూడా ప్రభుత్వం వెసులుబాటు కల్పించగలదు? అర్ధంలేని ఆవేశాన్ని ఆనాడు ఆపలేని వ్యవస్థ అవసరమయిన వడ్డింపుల్ని నోరు మూసుకు భరించక తప్పదని ఈ పార్టీలకి తెలియదా? ధ్వంసమయిన ప్రతీ బస్సూ, బస్సు నడవని ప్రతీరోజూ సామాన్యుడి జేబులోంచి రొక్కాన్ని బెల్లించుకు పోతోందని గ్రహించకపోవడం దురదృష్టం.

సామూహిక ఉన్మాదం (mob frenzy)  తరచుగా విచక్షణని కోల్పోతుంది. ఫాక్టరీకి నిప్పెడితే యజమాని కత్తి దూస్తాడు. ఇంటికి నిప్పెడితే ఎవరూ ఎదురు తిరగరు. ఎందుకని? అది నీ సొత్తు కనుక. నీ చేతిని నువ్వే కాల్చుకుంటున్నావు కనుక. రేపు నీ ఆవేశం చల్లబడ్డాక నువ్వే డబ్బు చెల్లించాలి కనుక. ఇప్పుడాపనే చేస్తున్నాం

లోగడ ఇలా తగలెట్టిన బసుల్ని ప్రభుత్వం ఊరేగించింది. "బాబూ! ఇదెంత అర్ధరహితమైన పనో మీరే తేల్చుకోండి" అంటూ. కాని ప్రాధమికమైన ఆవేశానికి విచక్షణ కలిసిరాదు. అప్పుడదే జరిగింది.

నేను ప్రభుతాన్ని సమర్ధించడం లేదు. నేలబారు మనిషి మీద భారానికి బాధపడుతున్నాను. కానీ పొయ్యిలో చెయ్యిపెట్టి కాలిందని వాపోవడం ఆత్మవంచనేమోనని అంటున్నాను.

ప్రజానీకం మానసిక భావాల్ని గ్రహించి గౌరవించలేని వ్యవస్థ, చెప్పుతీసి కొట్టడం తప్ప మరొక మార్గం లేని సిబ్బంది, ప్రజల ఆవేశం, అర్ధం లేని ఆక్రోశానికి అనర్ధాన్ని ఆశ్రయించే ఆలోచనాలేమి - ఇవన్నీ సమష్టిగా ఎదురు తిరిగిన పరిణామమే - బస్సు చార్జీల పెంపు. సందేహం లేదు. సామాన్య మానవుని జీవితం మీద ఇది గొడ్డలి పెట్టు. కానీ 'గొడ్డలిని' ఎంతో కొంత నియంత్రించే శీలం సామాన్య మానవుడి  పరిధిలోనే ఉన్నదని నాకనిపిస్తుంది. వ్యవస్థని నిలదీయండి. కానీ మన కాళ్ళని మనం నరుక్కుని కాదు.

       
 
      gmrsivani@gmail.com   
     నవంబర్ 11,  2013          

*************

Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   


KOUMUDI HomePage