|
|
Click Play to listen audio of this column If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here Are you using iPad ( any iOs Device)? Try direct MP3, Click here
టాగోర్ నోబెల్ కి నూరేళ్ళు
చాలామందికి గుర్తుండకపోవచ్చు. భారతదేశంలో మొట్టమొదటి నోబెల్ బహుమతి సరిగ్గా నూరేళ్ళ కిందట - 1913లో విశ్వకవి రవీంద్రనాధ్ ఠాకూర్ అందుకున్నారు. నిజానికి యూరోపియన్ దేశాలకి చెందని రచయిత మొదటిసారిగా సాహిత్యపు బహుమతిని అందుకున్న మొదటి సందర్భం ఇదే. అటు తర్వాతే పెరల్ బక్, నయాపాల్ వంటివారిని నోబెల్ బహుమతి వరించింది. తూర్పుదేశాల ఆలోచనా స్రవంతిని, తాత్విక చింతననీ మరో 20 సంవత్సరాల ముందే పాశ్చాత్యులకు పరిచయం చేసి, వారిని నిశ్చేష్టులను చేసిన ఘనత మరొకరికి దక్కుతుంది. ఆయన స్వామి వివేకానంద. ఇద్దరూ భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవనానికి ప్రతీకగా నిలిచిన బెంగాలు దేశస్థులు కావడం యాదృచ్చికం. ఈ మధ్య స్వీడన్ వెళ్ళాను. నిజానికి ఈ విషయాన్ని నాకు గుర్తుచేసింది - స్వీడన్ లో ఒక మిత్రుడు ప్రవీణ్ రంగినేని. ఆ ఉదయాన్నే నోబెల్ బహుమతి గ్రహీతలకు విందుని ఏర్పరిచే సిటీ హాల్ ని సందర్శించాం. బహుమతి ప్రదానం తర్వాత నోబెల్ గ్రహీతలకు ఇక్కడ స్వీడన్ రాజు, నోబెల్ సంస్థ విందుని ఇస్తుంది. వారి గౌరవార్ధం నాలుగు రకాలయిన ద్రావకాలను సేవిస్తారు (టోస్ట్). విశాలమయిన హాలు, మీదకు వెళ్ళడానికి మెట్లు ఎక్కుతూ - వంద సంవత్సరాల కిందట 52 ఏళ్ళ రవీంద్రులు ఈ మెట్లు ఎలా ఎక్కారా అనుకున్నాను. తర్వాత రెండు విషయాలు తెలిశాయి. 1913లో విందుని ఈ సిటీ హాలులో కాక రాజుగారికి పాలస్ కి ఎదురుగా ఉన్న గ్రాండ్ హోటల్ లో ఇచ్చారని. బహుమతిని అందుకోవడానికి రవీంద్రుడు రాలేదని. ఆయన ఒక టెలిగ్రాం నోబెల్ కమిటీకి పంపారు. దానిని అప్పటి బ్రిటన్ రాయబారి క్లైవ్ చదివారు. కారణం - భారతదేశం అప్పటికి బ్రిటిష్ పాలనలో ఉంది. అటు తర్వాత 1921, 1926లలో టాగూర్ నార్వేకి వెళ్ళారు. 1913 సంవత్సరానికి నోబెల్ సాహిత్యానికి బహుమతిని నోబెల్ కమిటీ ప్రకటిస్తూ - అద్భుతమైన కవిత్వాన్ని, ప్రతిభావంతంగా అభివ్యక్తీకరించిన కవికి ఇస్తున్నట్టు పేర్కొన్నారు. అటు తర్వాత విచిత్రంగా రవీంద్రుడి నోబెల్ బహుమతికి కారణమైన "గీతాంజలి" అనువాదం మొదట స్వీడన్ లో ప్రచురితం కాలేదు. ఆయన 'గార్డెనర్ ', 'క్రిసెంట్ మూన్ ' ప్రచురితమయాయి. 2004 ఆగస్టు 4న శాంతినికేతన్ లో ఉన్న ఆయన నోబెల్ మెడల్ దొంగతనం జరిగింది. శాంతినికేతన్ మళ్ళీ దానిని ఇవ్వవలసిందిగా నోబెల్ కమిటీకి విజ్నప్తి చేసింది. ఆ మోడల్ నమూనా బంగారు పతకాన్నీ, మరో బ్రాంజ్ పతకాన్నీ నోబెల్ కమిటీ పంపింది. ఇదీ చరిత్రలో మొదటిసారీ, ఆఖరిసారీను. ఒక కవి రాసిన పాటల్ని రెండు దేశాలు తమ జాతీయగీతాన్ని చేసుకున్నాయి - భారతదేశపు 'జణగణమణ ', బంగ్లాదేశ్ ' 'అమోర్ సోనార్ బంగ్లా '. ఇది ఒక కవికి దక్కిన అరుదైన గౌరవం. అన్నిటికన్నా రవీంద్రుని జీవితంలో తలమానికమైన సంఘటన ఒకటిఉంది. ఆయనకి 'సర్ ' బిరుదునిచ్చి బ్రిటిష్ ప్రభుత్వం గౌరవించింది. కానీ జలియన్ వాలా బాగ్ మారణ కాండ తర్వాత బ్రిటిష్ చర్యని నిరసిస్తూ ఆ గౌరవాన్ని రవీంద్రులు తిరస్కరించారు. అప్పటి ఆయన బ్రిటిష్ ప్రభుత్వానికి రాసిన లేఖ గుర్తుంచుకోదగ్గది. "మాకు జరిగిన అవమానం, అన్యాయాన్ని ఈ గౌరవాలు మరింత ప్రస్పుటంగా ఎత్తి చూపిస్తాయి. వీటన్నిటినీ తిరస్కరించి, నా ప్రజల సరసన నిలబడే సమయం ఆసన్నమయింది. మానవాళి ఊహించని పరాభవానికి లోనైన జాతికి చెందినవాడిగా ఇది నా కనీస కర్తవ్యం" - ఇదీ స్థూలంగా ఆయన లేఖ సారాంశం. తన జీవితకాలంలో రవీంద్రులు 30 దేశాలు, 5 ఖండాలు పర్యటించారు. ఆ తరానికి చెందిన ఎందరో ప్రముఖులను కలిసి, వారితో సంబంధాన్ని పెట్టుకున్నారు. డబ్ల్యూ.బి.ఈట్స్, ఎజ్రా పౌండ్, జార్జ్ రాబర్ట్స్, గాంధీ అనుచరులు చార్లెస్ ఏండ్రూస్, ఇంకా అప్పటి ఇటలీ నియంత ముస్సోలినీని కూడా కలిశారు. అన్నిటికన్నా గొప్ప విషయం - ఏ ప్రయత్నానికయినా కాలం చెల్లదంటూ తన అరవైయ్యవ ఏట చిత్రకళనీ, తన డెబ్బైవ ఏట సంగీతాన్నీ అభ్యసించి - సంగీతంలో 'రవీంద్ర సంగీతం 'కు ఒరవడి దిద్దారు. సంవత్సరాల కిందట హైదరాబాదు రవీంద్ర భారతిలో శంభుమిత్ర (ఆ పేరు గుర్తురాని చాలామందికి - రాజ్ కపూర్ నిర్మించిన అద్భుతమైన చిత్రం 'జాగ్ తేరహో ' చిత్ర దర్శకుడు. నిజానికి ఆయన ఒకే చిత్రానికిదర్శకత్వం వహించారు) తన నాటక సంస్థ 'బహురూపి 'తో రవీంద్రుని రెండు నాటికలు 'రక్త కరభీ (రెడ్ ఓలియండర్స్), క్షుధిత పాషాన్ (హంగ్రీ స్టోన్స్) చూసిన అద్భుతమైన అనుభవం గుర్తుంది నాకు. ప్రముఖ కవి, దర్శకులు గుల్జార్ తర్వాత 'క్షిధిత పాషాణ్ ను చిత్రంగా నిర్మించారు. "ఎక్కడ శిరస్సు ఉన్నతంగా నిలుస్తుందో.." అన్న కవితను తెలుగులో 46 మంది కవులు అనువదించారు. ఆ కవితల్ని ప్రముఖ పాత్రికేయులు బి.యస్సార్ కృష్ణగారు "నివేదన" అనే పేరిట పుస్తకంగా ప్రచురించారు. శంకరం బాడి సుందరాచారి, కొంగర జగ్గయ్య చలం, కనకమేడల, కేతవరపు రామకోట శాస్త్రి, బెజవాడ గోపాలరెడ్డి, దాశరధి, బెల్లంకొండ రామదాసు వంటి వారెందరో ఆ కవితకి మురిసి తెనుగు చేశారు. దానిని పునర్ముద్రిస్తానని నా దగ్గర ఉన్న ఒకే ఒక్క కాపీని తీసుకున్నారు బియస్సార్. కాని పునర్ముద్రణకి వేళ మించిపోయింది. వెళ్ళిపోయారు. ఈ పుస్తకం మళ్ళీ పునర్ముద్రణ కావలసినంత విలువైంది. ఆ కవితని చదవనివారూ, చదివి స్పందించని వారూ ఉండరు. అది కవితగా మిగిలిపోయింది కాని పాట అయితే - ఏదేశానికయినా - లేదా మానవజాతికంతటికీ 'జాతీయగీతం ' కాగలిగిన కవిత అది. ఆ పాట ఒక్కటి చాలు రవీంద్రుని 'విశ్వకవి 'ని చేయడానికి. నాకనిపిస్తుంది - కొందరి కవితలు గొప్పగా ఉంటాయి. కొందరు కవులు చూడ ముచ్చటగా ఉంటారు - తిలక్, గుంటూరు శేషేంద్ర శర్మ వంటివారు. రవీంద్రుడు - పెద్ద అంగీతో, పట్టుదారాల వంటి తెల్లటి జుత్తుతో, గెడ్డంతో, నిలిపి పలకరించే ఆర్ద్రమైన కళ్ళతో - అపూర్వమైన, పవిత్రమైన కళాఖండంలాగ దర్శనమిస్తారు. కవితకి సౌందర్యాన్ని సృష్టి జతచేసిన సందర్భమిది. మతానికి సౌందర్యం జత కలిసిన మరొక అపూర్వమైన, పవిత్రమైన రూపం - గౌతమ బుద్దుడు. ఈ మధ్య గణేశునికీ అలాంటి కళాత్మకతను జతచేస్తున్నారు - మన కళాకారులు. లౌకికమైన సౌందర్యానికి పారలౌకికమైన కోణాన్ని జతచేసిన అరుదైన సందర్భాలివి.
*************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com |
|