Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here 
 
Are you using iPad ( any iOs Device)? Try direct MP3, Click here

 మళ్ళీ తాజ్

  నేనూ మా ఆవిడా తాజ్‌మహల్‌ చూసి 51 సంవత్సరాలయింది. అప్పుడు ముగ్గురం కలిసి చూశాం. మేమిద్దరం, మా చేతిలో పదినెలల మా పెద్దబ్బాయి. అప్పుడే ఆలిండియా రేడియోలో చేరిన రోజులు. నా వయస్సు 24. మా ఆవిడ 22. ఢిల్లీ ట్రెయినింగ్‌కి పదిరోజులు పిలిచారు. ఢిల్లీ వెళ్లడం మా ఆవిడకి కొత్త. అప్పుడు నా జీతం 260 రూపాయలు (1963 మాట). అయితే అప్పటికే 'డాక్టర్‌ చక్రవర్తి' రాసి ఉన్నాను. కనుక కాస్త డబ్బు చేతిలో ఉన్న పరిస్థితి. మళ్లీ ఇలాంటి అవకాశం ఎప్పటికో? ఇద్దరం వెళ్లాలని నిశ్చయించుకున్నాం.
కరోల్‌ బాగ్‌లో మకాం. పార్లమెంటు స్ట్రీట్‌లో ఆకాశ్‌వాణి భవన్‌లో ట్రెయినింగ్‌. సాయంకాలం పదినెలల అబ్బాయిని, ఓ బుట్టలో పాలగుండ డబ్బా, ఫ్లాస్కుతో వేడినీళ్లు, గ్లాసులు, చెంచాలు, రెండు గాజు పాలసీసాలతో మా ఆవిడ బస్సులో వచ్చి మా భవన్‌కి ఎదురుగా రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ముందు బస్సుస్టాప్‌ దగ్గర నిలబడేది. అయిదు గంటలకి ఆఫీసులోంచి బయటకి వచ్చి ఆటోలో డిప్లొమాటిక్‌ ఎన్‌క్లేవ్‌ (ఈనాటి చాణిక్యపురి), రాష్ట్రపతి భవన్‌, ఇండియా గేట్‌, పార్లమెంట్‌ హౌస్‌ -యిలా చూసేవాళ్లం. మధ్యలో ఒకే ఆదివారం వచ్చింది. ఆ రోజు ఆగ్రా వెళ్లాలని ప్లాన్‌ చేసుకున్నాం. కాని ఆనాడు భయంకరమైన తుఫాను ప్రారంభమయింది. ఆ రోజు మానుకుంటే మళ్లీ వెళ్లే అవకాశం లేదు. కుండపోత వర్షంలో రాత్రి పదిగంటలకి పాత ఢిల్లీ స్టేషన్‌కి చేరాం. రాత్రి పదకొండున్నరకి ఆగ్రా పాసింజరు. ఉదయం ఆగ్రా చేరాం. అప్పటికి తుఫాన్‌ ఇంకా తీవ్రరూపం దాల్చింది. ఆనాటి ఆగ్రా స్టేషన్లో ఆచ్చాదన లేదు. జల్లులో ఇద్దరం తడిసి ముద్దయాం. కాస్త వెచ్చని చోటు మాచేతిలో అబ్బాయి. ఎలాగో ఏదో హోటల్‌ చేరాం. ఆటోలూ, టాక్సీలూ లేని రోజులు. ఈ వర్షంలో ఎవరొస్తారు? కూటికి గతిలేని ఓ పాత టాంగావాలా -పేరు నందలాల్‌ రావడానికి ఒప్పుకున్నాడు. వాడికి కురూపి భార్య. తలమీదా, ముఖంమీదా ముగుసు తియ్యదు. ఇత్‌మదుద్దౌలా, ఎర్రకోట, దయాల్బాగ్‌, తాజ్‌మహల్‌- అన్నీ చూపించారు. బురద రంగునీటితో ఒడ్డుని ఒరుసుకుంటూ ప్రవహిస్తోన్న యమున. కాని చూసి ఆనందించే మనసేది? రొజ్జ గాలి. వర్షం. చేతిలో నెలల బిడ్డ. ఆ వర్షంలోనే తాజ్‌మహల్‌ దగ్గరికి తీసుకొచ్చాడు. సంవత్సరాల తరబడి విన్న, మనస్సులో ఊహించుకున్న కల ఆవిష్కృతమౌతున్న మధురమైన క్షణమిది. మలుపు తిరిగాం. గుండె ఝల్లుమంది. ఇదేమిటి? తాజ్‌మహల్‌ ఇంత పేలవంగా వుంది? ఎవరేనా ''ఇది తాజ్‌మహల్‌ కాదు'' అంటే బాగుణ్నినిపించింది. క్రమంగా కారణం అర్థమయింది. 1653 నుంచీ -అంటే నిర్మించినప్పటి నుంచీ 350 సంవత్సరాలపాటు క్రమంగా శిధిలమవుతున్న కట్టడం ఇది. కాని నా మనస్సులో తాజ్‌ నా ఆలోచన అంత కొత్తగా, నేను విన్న, ఊహించుకున్నంత గొప్పగా అనుక్షణం వృద్ధి పొందుతున్న కట్టడం.  A tear of melody glistening on the cheek of time అన్నాడు టాగూర్‌. కాలం చెక్కిలిమీద ఘనీభవించిన కన్నీటి చుక్క -అని. జాషువా ''ఒక్కొక్క రాతిలో నిమిడియున్నదు షాజహాను భూభుక్కు నెడందలో నుడికి పోయిన రక్తపుం జుక్కలలోని చక్కదనమ్ము...'' అన్నాడు.
వర్షం ధారలమధ్య -బూడిదరంగు కట్టడంలో ఆ చక్కదనం కనిపించలేదు. తాజ్‌ అనుభూతి నా మనస్సులో ప్రతీక్షణం నిత్యనూతనం అవుతోంది. నా మనస్సులో తాజ్‌మహల్‌ నా ఆలోచనలంత నూతనమయినది. ఈ కట్టడం కాలం చేతిలో 350 సంవత్సరాలుగా పాతబడుతున్నది. నా మనస్సులో నిలిచిన మొదటి అనుభూతి -అసంతృప్తి. వెనక్కి తిరిగాం. ఆ రోజు వర్షంలో ఒక్క ఆగ్రాలోనే 8 మంది చచ్చిపోయారు. ఆ తర్వాత చాలాసార్లు ఢిల్లీ వెళ్లాను. మరోసారి తాజ్‌ చూడాలని అప్పుడప్పుడు అనిపించేది. కాని అవకాశం కలిసిరాలేదు.
మొన్న ఢిల్లీ తెలుగు అకాడమీవారు నాకు జీవన సాఫల్య పురస్కారం యిచ్చి సత్కరించారు. ఈసారి -51 సంవత్సరాల తర్వాత తాజ్‌మహల్‌ని చూసే ఏర్పాటు చేసుకున్నాను. అప్పుడు చూసింది- ముగ్గురం -నేనూ, మా ఆవిడా, చేతిలో పది నెలల మా పెద్దబ్బాయి. ఇప్పుడు మా అబ్బాయి వయస్సు 51. నేనూ వస్తానన్నాడు. ఈసారీ ముగ్గురం కలిసి బయలుదేరాం.
ఢిల్లీ నుంచి భారతదేశంలో కల్లా అద్భుతమైన యమునా ఎక్స్‌ప్రెస్‌వే వేశారు. కారులో కేవలం రెండున్నర గంటల ప్రయాణం. ఈసారి మంచి యెండ. గత కొన్ని యేళ్లుగా కార్బన్‌ కాలుష్యాన్ని ఆపడానికి తాజ్‌కి కిలోమీటరు ముందుగానే కార్లను నిలిపివేస్తారు. అక్కడినుంచి బేటరీ బళ్ల మీద వెళ్లాలి. ఇప్పుడూ ముసిలి టాంగాలు అక్కడా అక్కడా కనిపించాయి. ఆ రోజు శనివారం. ఇప్పుడు గొల్లపూడి ప్రముఖుడు. తెలుగువారందరికీ సుపరిచితుడు. వందల తెలుగు ముఖాలు పలకరించాయి. తాజ్‌ ముందు గొల్లపూడితో ఫొటో ప్రత్యేక ఆకర్షణ వారికి. ఇక ఆటోగ్రాఫుల ముమ్మరం. 72 ఏళ్ల మా ఆవిడ సగం దూరం నడిచి -తృప్తిగా చూసి, ఇకరానంది. నేనూ, మా అబ్బాయీ నడిచాం.
1653 లో నిర్మించిన ఈ కట్టడానికి గుర్తుగా చుట్టూ 16 లాన్లు, 53 నీటి ఫౌంటెన్లూ ఉన్నాయి. 22 సంవత్సరాలు వేలాదిమంది నిర్మించినప్పుడు ''తాజ్‌మహల్‌ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీల'' ఇళ్ల మధ్యనుంచి నడిచివెళ్లాం. అన్నిటికన్నా అద్భుతం -తాజ్‌ ప్రాకారం చుట్టూ అంచున చెక్కిన కొరాన్‌ సూరాలు. కాలిగ్రఫీ. నిజానికి అక్షరాలను చెక్కలేదు. తెల్ల పాలరాయిలో అక్షరాలుగా నల్లపాలరాయిని తాపడం చేశారు. ఈ పనికి ప్రత్యేకంగా అబ్దుల్‌ హక్‌ అనే పనివాడిని రప్పించాడు చక్రవర్తి. ఈ గొప్ప కృషికి ఆయనకి 'అమానత్‌ ఖాన్‌' అనే బిరుదునిచ్చి సత్కరించాడు. ఎదురుగా నిలిస్తే హాయిగా ఉర్దూ అక్షరాలను చదవవచ్చు. అయితే వందలగజాలు దూరమయినా -అంటే -ప్రాకారం చివర ఉన్న సూరానీ అంతే సౌలభ్యంతో అక్కడే నిలిచి చదవగలం. ఇదెలా సాధ్యం? అక్షరం దూరమవుతున్నకొద్దీ కన్ను ఏ సౌలభ్యాన్ని నష్టపోతోందో -ఆ సౌలభ్యాన్నివ్వడానికి అక్షరం ఎంత పెద్దదికావాలో ఆ నిష్పత్తిలో అక్షరాన్ని పెద్దదిగా చేశాడు శిల్పి. దూరంగా వున్నది కంటి పరిమితిని గుర్తెరిగిన 'పెద్ద' అక్షరం. Art is larger than life అనడానికి ఇంతకన్న గొప్ప ఉదాహరణ ఎక్కడ దొరుకుతుంది? ఈసారి తాజ్‌ గొప్పగా ఉంది. కొత్తగా ఉంది. నిజానికి కళ యిచ్చే తృప్తి కళలో లేదు. చూడగల చూపులో వుంది. ఆనాడు తప్పనిసరిగా తుఫాన్‌లో నిస్సహాయంగా చూసి అనుభూతిని వాస్తవంతో పొదగలేని కుర్ర రచయిత అసంతృప్తి. వెచ్చటి దుప్పటి కప్పి, పసిబిడ్డని కాపాడుకుంటూ యిద్దరం నడిచాం ఆనాడు.
ఇవాళ మా యిద్దరినీ చెయ్యి పట్టుకు నడిపించుకు వచ్చాడు 51 సంవత్సరాల పెద్దబ్బాయి. అందమయిన కారులో, అద్భుతమైన రోడ్డుమీద ప్రయాణం చేసివచ్చాం. వెయ్యి రూపాయల భోజనం పెట్టించాడు. అయిదు నక్షత్రాల సుఖం పరిచాడు. ఈ అనుభవంలో పరిణతి ఉంది. సాధించుకున్న తృప్తి ఉంది. 51 సంవత్సరాల ప్రస్థానంలో ఎక్కిన మెట్లున్నాయి. వృద్ధాప్యానికి బాసటగా నిలిచే రెండు చేతులు మా చుట్టూ ఉన్నాయి. ఈ జీవితం గొప్పగా, తృప్తిగా, నమ్మకంగా, ధైర్యంగా ఉంది. విచిత్రం! ఈసారీ తాజ్‌మహల్‌ మమ్మల్ని జయించలేకపోయింది! ఈసారీ తాజ్‌మహల్‌ కన్నా మా జీవన ప్రస్థానమే అందంగా ఉంది! కళ -ఎదురుగా ఉన్నది కాదు. మనం చూసే చూపు.
 

       
 
      gmrsivani@gmail.com   
     అక్టోబర్ 28,  2013          

*************

Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   


KOUMUDI HomePage