Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here 
 
Are you using iPad ( any iOs Device)? Try direct MP3, Click here

 అరాచకానికి ఎల్లలు

 ఓ యింటిముందు రాలుగాయి కుర్రాళ్లు సీనారేకు డబ్బాలు మోగిస్తూ అల్లరి చేస్తున్నారు. ఇంట్లో ముసలాయన గుండె ఆ శబ్ధానికి రెపరెపలాడుతోంది. ఆపమంటే ఆగరని తెలుసు. రోజూ అదేవరస. ఏం చెయ్యాలి? ముసలాయన అఖండమైన మేధావి. బయటికి వచ్చి వాళ్లందరినీ పిలిచాడు. ముసలాయన్ని అనుమానంగా చూశారు కుర్రాళ్లు. ఆపమంటే రెచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాని వాళ్లని ఆపమనలేదు. ''మీరెంతమంది?'' అన్నాడు.

''ఆరుగురం. ఏం?'' అన్నారు కుర్రాళ్లు రొమ్ములు విరిచి.

జేబులోంచి పదిరూపాయల నోటు తీశాడు. ''నా చిన్నతనాన్ని గుర్తుచేస్తున్నారయ్యా. ఈ డబ్బుతో బఠాణీలు కొనుక్కోండి. రోజూ యిస్తూంటాను. ఆ పక్కన కిటికీ దగ్గర వినిపించేలాగ వాయించండి. నా చిన్నతనాన్ని గుర్తుచేసుకుంటాను'' అన్నాడు. కుర్రాళ్లు ఆనందించారు. పదిరూపాయలు తీసుకుని మరీ రెచ్చిపోయి మ్రోగించారు. నాలుగు రోజుల తర్వాత ముసలాయన బయటికి వచ్చాడు. కుర్రాళ్లు పదిరూపాయల కోసం ఎదురుచూస్తున్నారు. కాని అయిదు రూపాయలే బయటికి తీశాడు. ''జీతం ఇంకా రాలేదు. వచ్చాక మళ్లీ యిస్తాను. మీ కృషి అమోఘం. కానివ్వండి'' అన్నాడు. కుర్రాళ్లకి ఉత్సాహం తగ్గింది. అయినా ఎంతో కొంత ముట్టిందికదా? యధాలాభంగా కిటికీ ముందు రెచ్చిపోయారు. మరోవారం తర్వాత దిగాలుగా ముఖం పెట్టి వచ్చాడు ముసలాయన. ''మీరెంత ఉపకారం చేస్తున్నారు? ఈమాట చెప్పడానికే సిగ్గుగా ఉంది. నా చేతిలో డబ్బులు అయిపోయాయి. అయినా ఆపకండి. రాగానే యిస్తాను'' అన్నాడు. కుర్రాళ్లు ఎదురు తిరిగారు. ''అప్పనంగా వాయించడానికి మేమేం వెర్రికుట్టెలనుకున్నారా? అదేం కుదరదు. రండిరా'' అంటూ కుర్రాళ్ల లీడర్‌ వాళ్లని తోలుకుపోయాడు. ముసలాయన హాయిగా కిటికీ తలుపులు మూసుకుని ప్రశాంతంగా నిద్రపోయాడు. ఈ కథ ఇక్కడితో ఆగవచ్చు. ఒక జోక్‌గా. కాని దీనిలో ఒక ఆసక్తికరమయిన కోణం వుంది. కుర్రాళ్ల అరాచకాన్ని వాళ్ల మానాన వారిని వదిలేస్తే -వారిని నియంత్రించడం జరిగే పని కాదు. కాని వాళ్ల అరాచకానికి ధర కట్టాడు ముసలాయన. అంటే పిల్లల దృష్టిలో వారు చేస్తున్న అల్లరి ఆదాయమయింది. ఒక 'విధి' అయింది. ఒక సంపాదన అయింది. దానికి ఒక ప్రయోజనం, ఒక కొత్తకోణం సంతరింపు జరిగింది. ఇప్పుడు వారి దృష్టి అరాచకం మీదనుంచి తద్వారా వచ్చే ఫలితం మీదకి మళ్లింది. ఆ ఫలితం ఇప్పుడు ఆగిపోయింది 'అరాచకం' అనే విధిని వాళ్లు ఆపేశారు. మామూలుగా అయితే ఆ అరాచకానికి గమ్యంలేదు. ఇప్పుడు వచ్చింది. లేదా ఎవరో కల్పించారు. అది ఆగిపోయింది. పనీ ఆగింది. ఓ అద్భుతమైన సినిమా -ప్రముఖ హాలీవుడ్‌ నటీమణి కాధరిన్‌ హెప్‌బర్న్‌ తన తొంభైయ్యవ పడిలో నటించింది. ఆ సినిమా పేరు 'గ్రేస్‌ క్విగ్లీ'. ఆమె బజారులో పేవ్‌మెంట్‌ మీద నడుస్తోంది. ఎదుటి పేవ్‌మెంట్‌ మీద ఒకాయన ఆగి వున్న కారుని దాటాడు. దాటిన క్షణంలోనే కారు స్టీరింగు ముందు కూర్చున్న డ్రైవరు తల వాలిపోయింది. అతన్ని చంపేశాడు. ఈవిడ చూసింది.అతన్ని వెంబడించింది. అతను వెళ్లిన ఇంట్లోకి వచ్చి తలుపు తట్టింది. ముసలమ్మని చూసి ఆశ్చర్యపోయాడు హంతకుడు.

''నేను చూశాను'' అంది ముసలమ్మ.

హంతకుడు అనుమానంగా చూశాడు. లోపలకి వచ్చి కూర్చుంది. ''నువ్వు చాలా సునాయాసంగా మనిషిని చంపావు'' అంది. తనని బ్లాక్‌మెయిల్‌ చేస్తుందా? హంతకుని నరాలు బిగుసుకున్నాయి. ఈ సాక్షిని చంపడం ఎంతసేపు? కాని ఆమె ఆలోచన వేరు. ఆమె తర్వాతి ప్రశ్నే ఆ విషయాన్ని చెప్పింది.

''చంపడానికి ఎంత తీసుకుంటావు?''

సమాధానం చెప్పలేదు.

''నువ్వొకరిని చంపాలి''

ఆశ్చర్యపోయాడు. ''ఎవరిని?''

''నన్ను. ఆ కారు డ్రైవరు లాగే ఎక్కువ బాధలేకుండా సునాయాసంగా చచ్చిపోవాలి''

''ఎందుకు?'' అని అడగలేదు. అదే ఇంగ్లీషు సినిమా గొప్పతనం. మన సినిమా అయితే ఆ ముసలమ్మ వృద్ధాప్యం, కలిసిరాని కొడుకు, కోడలి దుర్మార్గం, అనారోగ్యం -యిలాంటి వాటి గురించి ఊదరకొట్టేసేది.

''ఎంత?''

''400 డాలర్లు''

''నేనంత యిచ్చుకోలేను. కాని యివ్వగలిగే మనిషిని రేపు తెస్తాను. నిజానికి యిద్దర్ని తెస్తాను. నాకు కన్సెషన్‌ యివ్వు.'' మరో 87 ఏళ్ల వృద్ధుడిని తెచ్చింది. అతనికేం సమస్యలు. ఏమో?కళ్లు తిరిగిపోయే కథ యింతవరకే చెప్తాను. ఏతావాతా దుశ్చర్యకి డబ్బు పుచ్చుకునే అతను ఆశ్చర్యకరమైన కారణానికి -ఉదారంగా డబ్బు చెల్లించి నిరపాయంగా చావడానికి సిద్ధపడిన వీరిని చంపలేకపోయాడు. ఎందుకని? అరాచకం ఆర్ద్రతముందు నిర్వీర్యమవుతుంది. చంపే క్రూరత్వం చచ్చిపోయే దయనీయమైన కారణం ముందు వీగిపోయింది. మరో కథ. ప్రపంచ ప్రఖ్యాత వస్తాదు మహమ్మదాలీ ఆత్మకథని చదివాను. అతను ఏనాడూ జీవితంలో వస్తాదు కావాలని కలలు గనలేదు. కాని తన చుట్టూన్న తెల్లవారి దౌష్ట్యమూ, హింసాపూరితమైన ఎదిరింపులూ -తట్టుకుని బతకడానికి ఓ నల్లకుర్రాడు తను ఉన్నపట్టణం వెనుక వీధుల్లో తనదయిన మార్గానికి పదును పెట్టాడు. ఎదిరించే పనితనాన్ని పెంచుకున్నాడు. తప్పనిసరిగా తన రక్షణకు కొత్త శక్తుల్ని కూడదీసుకున్నాడు. ఒక అరాచకాన్ని ఎదిరించక తప్పని నిస్సహాయత అతన్ని ప్రపంచపు స్థాయిలో నిలిపింది. ఇది అరాచకానికి మరో కొత్త ఆవలిగట్టు. మరో అందమయిన కథతో ముగిస్తాను. ముంబై శివాజీ పార్కులో రమాకాంత్‌ అచ్రేకర్‌ సారథ్యంలో తన ఆటకి మెరుగులు దిద్దుకుంటున్న కుర్రాడి పేరు సచిన్‌ టెండూల్కర్‌. సచిన్‌ని రెచ్చగొట్టడానికి అచ్రేకర్‌ ప్రతీరోజూ వికెట్‌మీద ఒక రూపాయి ఉంచేవాడట. రోజంతా ఆ నాణం పడిపోకుండా ఆడాలి. పడిపోతే పడగొట్టిన బౌలర్‌కి ఆ రూపాయి దక్కుతుంది. అలా 33 రూపాయలు సచిన్‌ సంపాదించుకున్నాడు. అవి చాలా విలువయినవి అంటాడాయన. కాదు. ఓ విలువైన ఆటగాడి జీవితానికి అవి పెట్టుబడి. ఆనాటి రూపాయి ఒక సాకు. ఒక ప్రోత్సాహం. సచిన్‌ సాధనకు ఒక లక్ష్యం. మరో దృష్టితో చూస్తే బౌలర్‌ చేసేది అరాచకం -వికెట్‌ని పడగొట్టడం. దానికీ రుసుం ఉంది -రూపాయి. సచిన్‌ ప్రతిభని మరో విధంగా చెప్పాలంటే -24 సంవత్సరాలు ఓ అరాచకం నుంచి తన వికెట్‌ని కాపాడే కృషికి ఆనాడు 33 రూపాయలు పెట్టుబడి. ఇతివృత్తమూ, నేపధ్యమూ భిన్నమయినా ఈ నాలుగు కథల్లోనూ ఓ సామాన్యమైన గుణం ఉంది. మొదటి, ఆఖరి కథల్లో దృష్టి ప్రాధాన్యం. రెండూ మూడు కథల్లో సామాజిక అపశృతి ప్రాధాన్యం. అంతే తేడా

       
 
      gmrsivani@gmail.com   
     అక్టోబర్ 21,  2013          

*************

Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   


KOUMUDI HomePage