|
|
Click Play to listen audio of this column If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here Are you using iPad ( any iOs Device)? Try direct MP3, Click here
క్రీడా క్షేత్రంలో కర్ణుడు
కురుక్షేత్రంలో కర్ణుడు అర్జనుడి బాణాలకు కూలిపోయాక - రణరంగంలో పాండవులు శ్రీకృష్ణుడు వెంటరాగా అతని దగ్గరకు వచ్చారు. "ఇదా నువ్వు సాధించదలచిన విజయం?" అంటూ ఎకసెక్కం చేశాడు ధర్మరాజు. కర్ణుడు చిరునవ్వుతో ఒక మాట అన్నాడు: "నేను జీవితమంతా అక్కరతో చెయ్యిజాచిన వాడిని లేదనకుండా ఆదుకున్నాను. జీవితమంతా ఒకే వ్యక్తితో (భార్యతో) జీవనం గడిపాను. జీవితంలో ఒక్కరికే (దుర్యోధనుడు) విధేయుడిగా జీవించాను. జీవితం ఆఖరి క్షణాలలో దేవుడిని తలుచుకోవడం లేదు. దేవుడే నా సమక్షంలో నిలబడ్డాడు. నాకన్న అదృష్టవంతుడు ఎవరుంటాడు?" నిన్నకాక మొన్న క్రికెట్ బోర్డు జీవితకాలం బహిష్కరించిన లలిత్ మోడీని కర్ణుడంతటివాడిని చెయ్యడం నా ఉద్దేశం కాదు. కానీ ప్రతీ కార్యసాధకుడి మనస్సులో - అతను గొప్ప పనిని సాధించినా, గొప్ప అనర్ధాన్ని తెచ్చిపెట్టినా కర్ణతత్వం ఉంటుందన్నది నా ఉద్దేశం. నలుగయిదు పేర్లు - హిట్లర్, స్టాలిన్, దుర్యోధనుడు, మోడీ, మహాత్ముడు - ఎవరయినా. తను చేస్తున్న పనికి మనస్సులో తన సమర్ధన - ఆ కృషికి - అది మంచయినా, చెడయినా ఊతాన్ని ఇస్తుంది. ముఖ్యంగా అంతకు ముందెన్నడూ జరగని, జరపని ఒక కొత్త ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నప్పుడు. విచిత్రమేమిటంటే - ఆ కృషి మంచి చెడ్డల్ని - దరిమిలాను - మామూలు కొలబద్దలతో చూసేవారు - ఆ విలువలకు, ఆ దశలో కట్టుబడని అతడిని వెలి వేసినపుడు అతడు తప్పనిసరిగా చాంపియనో, యుగపురుషుడో, ఏదీ కాకపోయినా 'హీరో' అవుతాడు. అలాగని లలిత్ మోడీ దేవుడు కాదు. రాజస్థాన్ రాయల్స్ లో అతని పరోక్షమైన వాటాలు, అతని నిరంకుశత్వం, క్రూరమైన వ్యవహారశైలి - ఇవన్నీ ఈ విషయాన్ని నిరూపిస్తాయి. అయితే ఒక్కటి మరిచిపోకూడదు. అతను దేవుడు కాదు కనుకే కర్ణుడయాడు. అవకాశం అవినీతికి పురికొల్పుతుంది. అహంకారం అంటేనే అవినీతి. ఈ రెండూ లలిత్ మోడీకి కలిసివచ్చాయి. అసలు హీరోయిజాన్ని ఎలా గుర్తుపడతాం? సాధించే విజయాన్ని బట్టికాదు. సాధనలో అతని చిత్తశుద్ధిని బట్టి ప్రతీ వైతాళికుడూ ఇదివరకు ఎవరూ వెళ్ళని ఊహించని మార్గాన్ని వెదుకుతున్నాడు. అది కొత్తగా, వింతగా ఉంటుంది. సంప్రదాయవాదులకు అబ్బురంగా, కొండొకచో ఎబ్బెట్టుగానూ ఉంటుంది. ఊహించని పద్దతిలో ప్రయాణం చెయ్యడమే మౌలికమైన కృషి. ఇందులో 'నిబంధన 'లకు తావులేదు. కొత్తవి ఏర్పరచుకోక తప్పదు - అసలు ఆ పనే కొత్తది, ఆ దారి ఎవరూ తొక్కనిదీ కనుక. ఇల్లు తగలబడుతోం,ది ఒకాయన చుట్టూ చూశాడు. పట్టుబట్టల మూట కనిపించింది. ఒక్కొక్క బట్టనీ తాడులాగ అతికించాడు. ఆరుగురి ప్రాణాలు కాపాడాడు. అంతా జరిగాక - దూరంగా నిలబడి ఏడుస్తున్న వాళ్ళు 'నిక్షేపంలాంటి బట్టల్ని వృధా చేశాడు కనుక ఇతను నేరస్థుడు' అన్నారు. ఏది సబబు? మౌలిక కృషిని వివరించడానికి వ్యాకరణం పుట్టింది. వ్యాకరణాన్ని దగ్గర పెట్టుకుని ఏ రచయితా రచన చెయ్యలేదు. గొప్ప రచనలో గొప్ప ఆలోచనకి వ్యాకరణం ఒదిగింది. షేక్సిపియర్ ఒక్కడు చాలు - ఈ విషయాన్ని సమర్ధించడానికి. ఒక కొత్త కృషిలో ఎన్నో నిబంధనలు నలిగిపోతాయి. కొత్తవి ఏర్పరచుకోవాలి. అయితే ఇక్కడ ఒక దుర్మార్గం ఉంది. చేసే వ్యక్తీ మనిషేకదా? కొత్తదారిలో ఒక వజ్రం దొరికింది. జేబులో వేసుకున్నాడు - ఎవరూ తన వెనక నడవడంలేదు కనుక. అవకాశం, అందులో కలిసివచ్చిన కొండంత ఐశ్వర్యం అతనినీ మనిషిని చేశాయి. కక్కుర్తిపడ్డాడు. లలిత్ మోడీ ప్రైవేటు జెట్ లో ఊరేగాడు. తను చెప్పిందే వేదమన్నాడు. అడ్డొచ్చిన వారిని నేలరాసేశాడు. అతని కార్యదక్షతకి నిర్ఘాంతపోయిన వారంతా ఆయన అహంకారానికి వెక్కసపడ్డారు. వారి దగ్గర అతని దగ్గర ఉన్నన్ని ఆయుధాలు లేవు. కాని వారికి తెలిసినవి అతను పట్టించుకోడు. ఏమిటవి? రూల్స్. తెలియని దారిలో ఊహించని ఉద్యమాన్ని ప్రారంభించి క్రికెట్ సంస్థకి కోట్లు ఆర్జించి పెట్టిన ఒక ఉద్యమకారుడిని చుట్టూ ఉన్న వ్యాపార వేత్తలు - (వారూ సామాన్యులు కారు. వారికీ వారి వాటా అవినీతి ఉంది. శ్రీనివాసన్ ని గురునాధ్ మెయ్యప్పన్ ఉన్నాడు!) తమకి తెలిసిన ఆయుధాలతో ఎదిరించారు. ఏమిటవి? రూల్స్. లలిత్ మోడీ తనని తాను సమర్ధించుకుంటూ ఒక మాట అన్నాడు: "నేను కొత్తదారులని ముందుగా వెతికాను. అందరికంటే ముందు నడిచాను. మిగతావారు అనిశ్చితంగా ఆగిపోయిన చోట నేను ఒక అవకాశాన్ని గుర్తుపట్టాను. అందులో లోతుపాతుల్నీ, ఎగుడు దిగుడుల్నీ ఆకళించుకున్నాను. తప్పటడుగు వేసిన చోట అడుగు తప్పించుకున్నాను. కొత్త విజయం వెనుక మరో కొత్త విజయానికి దారులు వెదికాను. ఇందులో నేను రిస్క్ తిసుకున్నానా? అవును. తీసుకున్నాను. గొప్ప కృషికి, కొత్త కృషికి ఆ పని అవసరం. ఒక కొత్త 'కలని' గుర్తుపట్టినప్పుడు - కొత్తగా, గొప్పగా ఆలోచిస్తూ పోవాలి. నేనాపనే చేశాను." ఇప్పుడు క్రికెట్ బోర్డు లలిత్ మోడీని శాశ్వతంగా వెలివేసింది. ఐ.పి.ఎల్ వంటి ఉద్యమాన్ని, వ్యాపారాన్ని ప్రారంభించినవాడిగా క్రికెట్ బోర్డు తనకి హారతులు పట్టి, తన లోపాలను అర్ధం చేసుకోవాలంటాడు లలిత్ మోడీ. ఆయన మాటలివి:"నన్ను దూరం చేసుకోవడం వారికే నష్టం. కారణం - నేను విజయం సాధించాను. నన్ను సముదాయించాలి. నాతో కలిసి నడవాలి" కురక్షేత్రంలో కూలినా తనదే విజయం అన్న కర్ణుడి ధోరణి ఇక్కడ కనిపిస్తోందా? క్రుంగిపోయే ప్రతీయోధుడికీ 'నేను' అనే అహంకారం పటిష్టంగా ఉంటుంది. కానీ ఎదుటివాడికి అతని ప్రవర్తనలో అపశృతులే కనిపిస్తాయి. అందుకే ప్రస్తుతం అతను కృంగిపోయాడు. అలనాటి కర్ణుడికీ, ఈనాటి లలిత్ మోడీకీ ఈ ఒక్క విషయంలోనూ చక్కని పోలిక కుదురుతుంది.
*************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com |
|