Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here 
 
Are you using iPad ( any iOs Device)? Try direct MP3, Click here

నూరేళ్ల సినిమా

          

నూరేళ్ల కిందట భారతీయ సినిమా మన దేశంలో అప్పటికి ఉన్న అన్ని పరిమితులనూ పుణికి పుచ్చుకుని పురుడుపోసుకుంది. ప్రపంచ సినిమాకు కలిసివచ్చిన అదృష్టం -సిమోన్‌ వాన్‌ స్టాంపర్‌, డి.డబ్ల్యూ. గ్రిఫిత్‌, చార్లీ చాప్లిన్‌ వంటి వైతాళికులు మనకి లేరు. అయితే మన అదృష్టం -చిత్తశుద్దీ, కర్తవ్య దీక్షాగల ఒక స్వాప్నికుడూ, కార్యసాధకుడూ మన సినిమాకి కలిసివచ్చారు. ఆయన దాదా సాహెబ్‌ ఫాల్కే. కదిలే ఫిలింల ఫ్రేములు దగ్గర్నుంచి, కెమెరా కవాటాల దగ్గర్నుంచి, ఎడిటింగు వరకూ ప్రతీదీ 'ఓం నమ:' అంటూ ఆద్యంతమూ పరిశీలించి ఒడుపుని సాధించిన మహానుభావుడు ఫాల్కే. ఈ కృషిలో -సినిమాకు చరిత్రను సృష్టించిన ఈ స్వాప్నికుడు దాదాపు గుడ్డివాడయాడు. ఇతని కార్యదక్షతను గుర్తించిన బ్రిటిష్‌ నిపుణులు ఇంగ్లండులో ఉండమని ఆహ్వానించినప్పుడు -'మా దేశంలో మాదయిన మాధ్యమానికి సేవచేస్తాను. మరో దేశానికి వలసపోను' అంటూ మన దేశం తిరిగివచ్చిన దేశభక్తుడు ఫాల్కే. ఆయన తీసిన మొదటి చిత్రం ఈ దేశంలో ఈ పరిశ్రమకి మొదటి మైలురాయి -రాజా హరిశ్చంద్ర (1913). విచిత్రమేమిటంటే ఒక కొత్త మాధ్యమం రూపురేఖల్ని దిద్దుకునే సమయంలో ఆనాటి పరిమితుల కారణంగా రెండు వ్యవస్థలు ఈ ప్రక్రియలోకి దొడ్డిదారిన ప్రవేశించాయి. నాటకం, సంగీతం. ఈ నూరేళ్లలో సినిమా నాటక ప్రక్రియకు దూరంగా తనదైన గొంతుని సవరించుకుంటూ ఉండగా, ఇప్పటికీ -లేదా ఎప్పటికీ సంగీతం అతి నిర్దుష్టంగా భారతీయ సినిమాలో పీట వేసుకు కూర్చుంది. వాస్తవిక ధోరణి అయినా, మరే ధోరణి అయినా కథానాయకుడు, నాయకీ ''చెట్టులో ఏముంది? ఈ పుట్టలో ఏముం ది?'' అంటూ చెట్లచుట్టూ పరిగెత్తుతూ ప్రేమగీతాలు పాడడం, ''నినుబాసిపోవుదానా, కొనుమా సలాము ఖయస్‌'' అంటూ ప్రేయ సి కంట తడి పెట్టుకోవడం -అప్పటికీ ఇప్పటికీ మన ప్రేక్షకులకి ఎబ్బెట్టుగా కనిపించదు. ఈ పని -సంగీత రూపకాలలో తప్ప మరే దేశంలోనూ, భాషలోనూ ఏ సినిమా చేయదు. విచిత్రంగా ఇది నూరు సంవత్సరాల పాటు ప్రేక్షకులు అంగీకరించి, రాజీపడిన విషయం. భారతీయ సినిమా ప్రత్యేకతగా గర్వపడేటట్టు చేయగల ఎందరో మహనీయులు -ఈ అసంబద్దాన్ని అలంకరించారు. నౌషాద్‌, సి.రామచంద్ర, ఓ.పి.నయ్యర్‌, సుబ్బరామన్‌, కె.వి.మహదేవన్‌, ఇళయరాజా, ఏ.ఆర్‌.రెహమాన్‌, మహమ్మద్‌ రఫీ, లతా మంగేష్కర్‌, ఘంటశాల. పి.లీల, సుశీల, జానకి -ఈ జాబితా అనంతం. ఈ ఆనందం వర్ణనాతీతం. ఇక సినిమాలో ఇతివృత్తం. మెలోడ్రామాని ఆనాటినుంచీ ఈనాటివరకూ కొంగుబంగారంగా ఉపయోగిస్తున్న మాధ్యమం -సినిమా. నీతి జయించును, దుర్మార్గుడు శిక్షింపబడును, పాపికి ఏనాటికయినా రోజు మూడును, సత్యానికి పట్టంగట్టెదరు -ఇవన్నీ నికార్సయిన మూల సూత్రాలు. వీటికి అపజయంలేదు. ప్రేక్షకులలో రాణింపుకి ఢోకా లేదు. ఈ మెలోడ్రామాకి మూలనిధి మన పురాణాలు, ఇతిహాసాలు, జానపదాలు. ఇవన్నీ సినిమాకు అపురూపమయిన పెట్టుబడులయాయి. మొట్టమొదటి చిత్రమే 'సత్యానికే పట్టాభిషేకం' అని ఢంకా భజాయించే ''రాజా హరిశ్చంద్ర''. ఇక నాటకం. మన తెలుగు సినిమా గురించి చెప్పుకుంటే -అలనాడు -అంటే 1931లో ''భక్తప్రహ్లాద'' నాటకంలో నటించిన నటీనటుల్ని కెమెరాముందు నిలబెట్టి నటింపజేశారు. కెమెరా ఫీల్డుకి బయట నిలబడి హార్మోనిస్టు వాయిస్తూండగా పాటలు, పద్యాలు పాడారు. నాటకాన్ని చూసి ఆనందించడం అప్పటి ప్రేక్షకుల అలవాటు. తెరమీద కూడా ఆ పనినే చూసి అప్పటి ప్రేక్షకులు ఆనందించారు. సినిమాల్లోకి పాట వచ్చి చేరిన రూటూ అదే. మెల్లగా సినిమా తన గొంతు సవరించుకుంది. పురాణ పాత్రలు, వాస్తవిక సమాజంలో ప్రతీకలయాయి. ఈ కథలు కొత్త అంగీలు తొడుక్కున్నాయి. కొత్తరూపులు దిద్దుకున్నాయి. ఇతివృత్తం తనదైన ప్రక్రియని ఒడిసిపట్టుకునే పరిణామ దశ అది. ఆదర్శం, నీతి, శాశ్వత విలువలు, సామాజిక బాధ్యత -ఇలాంటి ఇతివృత్తాలను దాటి -సమాజ నీతిని ప్రశ్నించే, విమర్శించే, ఎదురుతిరుగే కథలు వచ్చాయి. మనుషులు మారాలి, ప్రతిఘటన, కర్తవ్యం, ప్రతిధ్వని వంటివి 'యాంటీ హీరో'కి స్థానాన్ని కల్పించిన చిత్రాలు. సినిమా రూపురేఖలు మారే తరుణంలో మరో ఉప్పెన ఈ మాధ్యమం మీదకి వచ్చి పడింది -టెలివిజన్‌. డ్రాయింగు రూముల్లో 24 గంటలూ పలకరించే ఈ ప్రక్రియ అరుదైన మాధ్యమాన్ని అలవాటయిన స్థాయికి తీసుకువచ్చేసింది. వందలాది సినిమాలు అయాచితంగా డ్రాయింగు రూముల్లోనే కొలువు తీర్చాయి. మరి సినిమాకి మనుగడ ఏమిటి? చిన్న డబ్బాకి పరిమితం కాలేని, కేవలం తెరమీద మాత్రమే చూడగలిగిన విశ్వరూపానికి సినిమా విస్తృతమైంది. విస్టా విజన్‌, సినిమాస్కోప్‌, 70 ఎం.ఎం. మొదలైన 'విశ్వరూపాలు' వచ్చాయి -ప్రపంచమంతా. ఇక డిజిటల్‌ టెక్నాలజీ, గ్రాఫిక్స్‌ -ఒకటేమిటి? కొత్తదనాన్ని -గదుల్లో చూడలేని గొప్పదనాన్నీ పెద్ద పెద్ద తెరలమీద ఈ తరానికి మప్పారు నిర్మాతలు. ఉదాహరణకి -ఒకానొక సినిమాలో ఫారెస్ట్‌ గంప్‌ (టామ్‌ హాంక్స్‌) అనే పాత్ర -ఒకనాటి అమెరికన్‌ అధ్యక్షుడు జాన్‌ కెన్నెడీని కలిసే సన్నివేశాన్ని చిత్రించారు! ఇప్పుడు అభిరుచులు మారాయి. జీవనంలో వేగం పెరిగింది. విలువలు మారా యి. ఉద్దేశాలు మారాయి. సౌండాప్‌ మ్యూజిక్‌, టెన్‌ కమాండ్‌మెంట్స్‌, చంద్రలేఖ, శ్రీ వేంకటేశ్వర వైభవం, అవ్వయ్యార్‌, త్యాగయ్య, విప్రనారాయణ చూసే ప్రేక్షకులు వెనకబడ్డారు. కొత్తతరం, కొత్త అభిరుచులు ముందుకొచ్చాయి. కళ్లు మిరుమిట్లు గొలిపే దృశ్యాలు, నరాల్ని మత్తెక్కించే సంగీతం, స్పాట్‌ ఇంటరెస్ట్‌ -ఇవీ ఈనాడు చిత్రం రాణింపుకి పెట్టుబడులు. ఆదర్శం స్థానంలో ఆనందం మాత్రమే మిగిలింది. సందేశం స్థానంలో సందర్భం మాత్రమే మిగిలింది. ఒక తరం ధియేటర్లకు దూరమయింది. ''మీరీ మధ్య సినిమాలలో నటించడం లేదేం?'' అని అడిగే తరం నాకు కనిపిస్తూంటుంది. ''మీరీమధ్య సినిమాలు చూడడం లేదా?'' అంటూ నేను నటించిన అయిదారు చిత్రాల పేర్లు చెప్తే ''మేం ఈ మధ్య సినిమాలు చూడడం లేదు సార్‌! కాని మీ 'సంసారం ఒక చదరంగం' అనే తరం కనిపిస్తోంది. మరి ప్రస్థుతం సినిమాలు చూసే కొత్తతరం ఎవరు? వారికి ఏం కావాలి? దురదృష్టవశాత్తూ సినిమా వ్యాపారం కూడా. దాదా సాహెబ్‌ ఫాల్కేలూ, బి.ఎన్‌.రెడ్డిలూ, శాంతారాంలూ వెనకబడి -వ్యాపారి సినీ నిర్మాత అయాడు. చెప్పే విషయం కన్నా దక్కించుకునే ఆదాయానికి ప్రాధాన్యం పెరిగింది. ఆ మేరకు ఇప్పటి సినిమా ఇంగువ గుడ్డని కట్టిన వంటకం అయింది. ఇది మనదేశంలోనే కాదు, ప్రపంచమంతటా జరిగింది. క్లియొపాత్రాలు, బెన్‌హర్‌ లూ వెనకబడ్డాయి. జురాసిక్‌ పార్క్‌లూ, చెన్నై ఎక్స్‌ప్రెస్‌లు వచ్చాయి. ఈ మాట చెప్తున్నప్పుడు సినీరంగంలో అమోఘమయిన ప్రతిభాపాటవాల్నిగాని, ప్రావీణ్యాన్నిగాని కించపరచడం ఉద్దేశం కా దు. ఆస్కార్‌ స్థాయిలో మన కళాకారులు నిలిచిన సందర్భాలివి. శ్రీకర్‌ ప్రసాద్‌ అనే ఫిలిం ఎడిటరు 9 సార్లు జాతీయ బహుమతినందుకున్నారు. రెసూల్‌ పూకుట్టీ సౌండ్‌ మిక్సింగ్‌కి (స్లండాగ్‌ మిలియనైర్‌) ఆస్కార్‌ పుచ్చుకున్నారు. ఈయన ఈ మధ్య నిర్మించిన అపూర్వమైన చిత్రం ''ఐ.డి.''కి దర్శకత్వం వహించిన కమాల్‌ కె.ఎమ్‌. అనే యువ దర్శకుడికి ఈ సంవత్సరం మేం గొల్లపూడి శ్రీనివాస్‌ జాతీయ బహుమతినిచ్చాం. రేపు ఇర్భాన్‌ ఖాన్‌ నటించిన, మొట్టమొదటి చిత్రంగా దర్శకత్వం వహించిన యువ దర్శకుడు రితేష్‌ భాటియా చిత్రం ''లంచ్‌ బాక్స్‌'' ఆస్కార్‌ బహుమతికి వెళ్లనుంది.

ఇక మిత్రు డు, నటుడు తణికెళ్ల భరణి ఇటీవల నిర్మించిన ''మిధునం'' తెలుగువారి మనస్సుల్లో పచ్చగా, గొప్ప జ్ఞాపకంగా మిగిలే ఉంది. ఇప్పుడు కమర్షియల్‌ సినిమా, ఆర్ట్‌ సినిమా అని రెండు విభాగాలకు గుర్తులు ఏర్పడ్డాయి. ఇవి న్యాయంగా విభాగాలు కానక్కరలేదు. ఒకే కుటుంబంలో తండ్రుల విభాగం, తల్లుల విభాగం అని ఉండదు కదా? కాని వ్యాపారం మూలసూత్రంగా వచ్చే చిత్రం, కళని మూల సూత్రంగా పెట్టు కుని తీసే చిత్రానికి ఇవి గుర్తులు. ప్రస్థుతం భారతీయ సిని మా -ఆ మాటకి వస్తే ప్రపంచ సినిమా ఈ రెండు ఎల్లల మధ్యా తనదైన గొంతు విప్పుతోంది. ఒకపక్క అపూర్వమైన అభిరుచి, మరొకపక్క -బాగా డబ్బు చేసుకోవాలనే వ్యాపారి యావ -ఈ రెండే ఎల్లలుగా సినిమా రూపుదిద్దుకుంటోంది. అయి తే కళ మీద వ్యాపారం పెద్దరికం వహిస్తే -రెండు పనులు జరుగుతాయి. అభిరుచి, మంచి ఇతివృత్తం శలవు తీసుకుంటాకుంటాయి.


      gmrsivani@gmail.com   
     సెప్టెంబర్ 23,  2013          

*************

Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   


KOUMUDI HomePage