జైళ్లల్లో 'చిల్లర' దేవుళ్లు!

 

 మా చిన్నతనంలో ఎవరినయినా పరిచయం చేస్తూ ''ఈయన స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని జైలుకి వెళ్లారు'' అంటే దేవుళ్లని చూసినట్టు చూసేవాళ్లం. ఆనాడు అది అరుదైన త్యాగం. అప్పటి మహానాయకులంతా జైళ్లకి వెళ్లి వచ్చినవారే. తిలక్‌ జైల్లో 'భగవద్గీత' వ్యాఖ్యానం రాశారు. రాజాజీ మహాభారతం, భాగవతం, రామాయణం వంటి పురాణాలను అతి సరళమయిన భాషలో జైల్లోనే రాశారు. నెహ్రూ 'ది డిస్కవరీ ఆఫ్‌ ఇండియా' రాశారు. మరో కారణానికి జైలుకి వెళ్లిన ప్రముఖ రచయిత ఆస్కార్‌ వైల్డ్‌ 'డి ప్రొఫండిస్‌' అనే స్మృతి కావ్యం రాశారు. ఆ రోజుల్లో పరాయి ప్రభుత్వం గొప్ప గొప్ప నాయకుల్ని జైళ్లలో పెట్టింది. ప్రస్థుతం మన నాయకులు నేరాలు చేసి జైలు పాలవుతున్నారు. కొందరు జైళ్లనుంచే పార్లమెంటుకీ, రాష్ట్ర శాసనసభలకీ ఎన్నికవుతున్నారు. పైగా అలా ఎన్నికకావడం -సిగ్గుగానో, నామోషీగానో కాక తమ హక్కుగా భావించే నిస్సిగ్గు దశకి రాజకీయ నాయకత్వం వచ్చింది. ఇది ఒక పార్శ్వం.

పార్లమెంటులో ఏ విషయంలోనూ అన్ని రాజకీయ పార్టీలూ ఏకాభిప్రాయానికి రాని చరిత్ర ఉండగా -ప్రతిపక్షాలు తమ మాటని నెగ్గించుకోడానికి నెలల తరబడి పార్లమెంటు నడవకుండా అడ్డుపడుతూండగా -కేవలం మూడు అంశాల్లో రాజకీయ పక్షాలన్నీ భేషరతుగా ఏకాభిప్రాయానికి రావడం గమనార్హం. 1. పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం బిల్లు. తమ ఉనికి ఎంతమాత్రం వదులుకోడానికి ఇష్టపడని మగనాయకుల నిర్ద్వందమైన ధోరణి ఇది. 2. పార్లమెంటు సభ్యుల జీతాలు, భత్యాల బిల్లు. ఏ చిన్న కారణానికయినా ఎవ్వరూ విభేధించలేదు. 3. మూడోది మరీ ముఖ్యమైనది. ఈ మధ్య ఈ దేవుళ్ల బెడద మరీ రెచ్చిపోయే దశకి రావడాన్ని ఇటు దేశమూ, అటు న్యాయస్థానమూ గమనిస్తూ -నేర చరిత్ర ఉన్న ఏ రాజకీయ నాయకుడికీ ఎన్నికలలో పోటీచేసే హక్కులేదని సుప్రీం కోర్టు బెంచీ ఈ మధ్య చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది.

అయితే -ఈ ఒక్క విషయంలోనే దేశంలోని రాజకీయ పార్టీలన్నీ ఏకాభిప్రాయానికి వచ్చేశాయి! కారణం -దేశంలో ఎవరి పార్టీల దేవుళ్లు వాళ్లకి ఉన్నారు. వాళ్ల డబ్బు, జులుం, వర్గ బలం, కులం -మరేకారణంగానయినా వాళ్లని కదపలేని దుస్థితి ఆ పార్టీలకు ఉంది. కదపడం వారి అభీష్టం కూడా కాదేమో! నిజానికి సుప్రీం కోర్టు తాఖీదు అమలులోకి వస్తే మన మధ్యనుంచి చాలామంది దేవుళ్లు శాశ్వతంగా జైళ్లకి వెళ్తారు. వారి వర్గం ఓట్లు కారణంగా ఒకప్పుడు యెడ్యూరప్ప ఆ పార్టీలో ఓ వెలుగు వెలిగి -పార్టీని బెదిరించిన కథలు మనము చదివాం. ప్రస్థుత ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి చిన్నాన్న కాస్త దోచుకుంటే పరవాలేదని ఐయ్యేయస్‌ ఆఫీసర్లకి హితవు చెప్పడం మనం విన్నాం. ప్రస్థుత కాంగ్రెస్‌ మంత్రి బేణీ ప్రసాద్‌గారు 37 కోట్లు పెద్ద అవినీతి కాదని చిరునవ్వు నవ్విన హాస్యాన్ని మనం ఆస్వాదించాం. రెండు వేలో, నాలుగు వేలో లంచం తీసుకుంటున్న స్థానిక ఉద్యోగిని అరెస్టు చేసిన కథలు మనం పేపర్లలో చదువుతూనే ఉంటాం. గుడుల్ని మింగే నాయకులు మనల్ని ఢిల్లీలో పాలిస్తూండగా, గతిలేక పదే పదే ఈ జైళ్లల్లో దేవుళ్లనే నిస్సహాయంగా ఎన్నుకునే ఈ ప్రజాస్వామ్యానికి ఎక్కడో అడ్డకట్ట వేసే రోజు ఏనాడయినా వస్తుందా అని తమ చికాకునీ, నిస్పృహనీ, కోపాన్నీ ఈ నాయకుల పట్ల వోటర్లు తమ విముఖతని ఎప్పటికప్పుడు స్పష్టంగా చెప్పి కుండబద్దలు కొడుతూనే ఉన్నారు. అయినా ప్రత్యామ్నాయం లేదు. మరో గతిలేదు.

ఒక సమాచారం ప్రకారం పార్లమెంటులో క్రిమినల్‌ కేసులున్న ఎంపీలు 162 మంది ఉన్నారట. ఇందులో 76 మంది చేసిన నేరాలకు కనీసం 5 సంవత్సరాల కఠిన శిక్ష వేయవలసిన నేరాలు. అలాగే రాష్ట్ర శాసనసభలలో కేసులున్న 1460 సభ్యులు ఉండగా ఇందులో 30 శాతం వారి నేరాలు కనీసం అయిదేళ్ల శిక్ష పడవలసిన నేరాలు. చట్టసభల్లో ఉన్నవారిపైన విచారణలు సాగవన్న ధైర్యం, తమ పదవులతో, డబ్బుతో చట్టాన్ని లొంగదీసుకోవచ్చుననే ధైర్యం వీళ్ల చర్యలకి ఆజ్యం పోస్తున్నాయి. కేవలం మెజారిటీ బలం దన్నుగా విర్రవీగే నాయకమ్మణ్యుల కథలు మనం ప్రతీరోజూ వింటూనే ఉన్నాం. ఈ తరుణంలో -ఇన్నాళ్లకి సుప్రీం కోర్టు తీసుకున్న గొప్ప నిర్ణయానికి నేలబారు మనిషి సంబరపడుతూండగా ప్రస్థుతం కేంద్ర ప్రభుత్వం -అన్ని పార్టీల సమన్వయంతో -పెట్టిన ఈ రివ్యూ పిటిషన్‌ విచారణకి వచ్చింది. ''అయ్యో. ఓ గొప్ప తీర్పుకి అవకాశవాదులు మళ్లీ గండి వేస్తున్నారని బాధపడే నేపథ్యంలో నిన్నటి విచారణ -న్యాయస్థానం స్పందన -ఇంకా ఈ దేశంలో సబబైన జీవనానికి ఆస్కారం కల్పించే వ్యవస్థ పూర్తిగా నేలమట్టం కాలేదని ఊపిరి పీల్చుకునేటట్టు చేసింది.

మొన్న సుప్రీం కోర్టు ప్రభుత్వ రివ్యూ దరఖాస్తుని అతి స్పష్టంగా తోసిపుచ్చింది. ''మీ వాదనలో బొత్తిగా ఆధారం లేదు. లోగడ ఇచ్చిన తీర్పులో ఏ లోపమూ లేదు. కేవలం కావేషాలతో -రాజకీయ దురుద్దేశాలకు ఎవరిమీదైనా ఎవరైనా కేసులు బనాయిస్తే -ఆయా కేసుల్ని వాటి మంచి చెడ్డల దృష్ట్యా పరిశీలించడం జరుగుతుంది'' అని తెగేసి చెప్పింది సుప్రీం కోర్టు. ఈ తీర్పు ఇలాగే అమలులోకి వస్తే -మనకి ప్రతి నిత్యం కనిపించే చాలామంది నాయకుల ముఖాలను తప్పించుకునే అదృష్టం దేశానికి దక్కుతుంది. ఈ దేవుళ్ల అంతిమ గమ్యస్థానం జైలు గదులన్న ఆలోచనే ప్రస్థుతం ప్రజలకు ఎంతో ఊరటగా ఉంది. అయితే ఇందులో మళ్లీ కొన్ని దొడ్డిదారులున్నాయి. కేసుల విచారణ సంవత్సరాల తరబడి ఒక నిర్ణయానికి రాకుండా జాప్యం చేయగలిగితే? పండిత్‌ సుఖరాం కేసు 17 సంవత్సరాలు సాగింది. దశాబ్దాలు పైన తేలని -లేదా గడుసయిన వాళ్లు తేలనివ్వని సందర్భాలు ఉన్నాయి. ఇంకా ఎక్కువవుతాయేమో. అలాగే తమ ప్రయోజనాలకు దొంగ కేసుల్ని బనాయించి -త్వరగా శిక్షల్ని రాబట్టే కుతంత్రాలు జరిగితే? నేరం మోపడం అతి సుళువు. కాని రుజువు చెయ్యడం కష్టం.

రుజువులున్నా తమ మాట సాగించుకునే ముఖ్యమంత్రులు (ఉత్తరప్రదేశ్‌ అఖిలేష్‌ యాదవ్‌ ఐయ్యేయస్‌ ఆఫీసరు దుర్గాశక్తి నాగ్‌పాల్‌ విషయంలో) పుష్కలంగా ఉన్న ఈ దేశంలో ఏదయినా అసాధ్యం కాదు. సమాజంలో చదువు, కులం, వర్గం, ప్రాంతం ప్రమేయం లేకుండా అందరికీ ప్రజా ప్రతినిధులను ఎన్నుకునే, ప్రజా ప్రతినిధులు కాగలిగే అద్భుతమైన 'ప్రజాస్వామ్యం' అనే ఆలోచనని ఎంతగా ఈ 70 సంవత్సరాలలో దుర్వినియోగం చేశారో మనం చూస్తూనే ఉన్నాం. అవకాశవాది బుర్రలో ప్రతీ చట్టానికీ ఒక విరుగుడు ఉంటుంది. అయితే చట్టం ఎప్పటికప్పుడు ఆరోగ్యకరమైన దిశగా సమాజం నడిచే ప్రయత్నం మాత్రమే చేయగలదు. అదే ఇప్పుడు జరిగింది. ప్రతీ విషానికీ విరుగుడు ఉంటుంది. అలాగే ప్రతీ విరుగుడినీ చెడగొట్టే కొత్త విషాన్ని సృష్టించే ప్రబుద్ధులు పెరుగుతున్న దేశం మనది.

 

 

         
      gmrsivani@gmail.com   
     సెప్టెంబర్ 09,  2013          

*************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   


KOUMUDI HomePage