|
|
Click Play to listen audio of this column If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here Are you using iPad ( any iOs Device)? Try direct MP3, Click here
మాలతీ చందూర్ జ్నాపకాలు నేను పుట్టిన పదేళ్ళకి ఆవిడ మొదటి కథ పుట్టింది. పేరు 'రవ్వల దుద్దులు '. ఏలూరులో ఆవిడ చిన్నతనం గడిచింది. తెలుగు భాషని డ్రాయింగు రూముల్లోకి తెచ్చిన కొవ్వలి లక్ష్మీ నరసింహారావుగారు, బంగారు మామని పరిచయం చేసిన కొనకళ్ళ వెంకట రత్నంగారు, ఎంకి - నాయుడు బావ సృష్టి కర్త నండూరు సుబ్బారావుగారు, 'బాలబంధు ' బి.వి.నరసింహారావుగారు మొదలైన వారు ఇంటికి తరచు వచ్చిపోతూండేవారు. వీరు కాక 'ఆనందవాణి ' పత్రిక చిన్నతనం నుంచే ఆవిడకి వ్యసనం. కాగా ఎన్.ఆర్.చందూర్ గారు సొంత మామయ్య. మాలతిగారు చిన్నప్పుడు అల్లరిచేస్తూ 'టాం బాయ్'లాగ ఉండేవారు ఆమె మాటల్లోనే . మామయ్య ఆమెని కోరి పెళ్ళి చేసుకున్నారు. వారిద్దరూ ఆనాటి మద్రాసులో రైలు దిగి - ఆ రోజుల్లో టాక్సీలు, ఆటోలు లేవు - ఒంటెద్దు బండి కట్టించుకుని జార్జి టౌనులో ఒక లాడ్జిలో దిగారట. అదీ వారి మద్రాసు నగర ప్రవేశం. అప్పట్లోనే వారి గదికి ఒకాయన వచ్చిపోతూండేవారు - ఆచంట జానకిరాం. మరొకాయన - ఎస్.ఎన్.మూర్తిగారు. ఇంతమంది సాహితీపరుల మధ్య - చిగురుకొమ్మయినా వికసించే వాతావరణం. ఆమెని రేడియోకి తీసుకెళ్ళారు చందూర్ గారు. ఆమె లొడలొడ మాట్లాడుతున్నారు - ఆమెకి తెలియకుండానే టెస్టు జరిగిపోయింది. అంతే. మొదటి రేడియో ప్రసంగం రాశారు. ఆమె ఏం రాసినా చందూర్ గారి పర్యవేక్షణ ఉండేది. రాతలో మధ్య మధ్య అక్షరాలు ఎగిరిపోయేవి. వాటిని చందూర్ గారు సరిచేసేవారు. ఈ పని తేలికగా 60 సంవత్సరాలు పైగా ఆయన చేశారు. చందూర్ గారు ఆమెకి స్నేహితుడు, మార్గదర్శి, పర్యవేక్షకులు, హితైషి, మేనేజరు - ఆ తర్వాతే భర్త అని ఆవిడ నాతోనే "వందేళ్ళ కథకు వందనాలు" ఇంటర్వ్యూలో చెప్పారు. 52 సంవత్సరాలు ఆగకుండా పాఠకలోకాన్ని తన 'ప్రమదావనం' అనే శీర్షికతో అలరించిన ఘనత మరే రాష్ట్రంలోనూ, ఏ భాషలోనూ ఎవ్వరూ సాధించలేదు. మొదట కొన్ని రచనలకు పాఠకుల స్పందన అంతగా రాలేదట. ఆలోచించి ఒక పుస్తకం ప్రచురించారు. తెలుగు శాఖాహార వంటల గురించి "వంటలూ - పిండి వంటలూ" అనే పుస్తకం. ఇది తెలుగుదేశంలో ఒక విప్లవం. ఇది లేని ఇళ్ళు, చదవని ఇల్లాలు, వంటగదిలో జొరబడి ఆమె సహాయంతో వంట చేయని సందర్భమూ లేదు. తదాదిగా పెళ్ళిళ్ళలో ఇప్పటికీ దంపతులకిచ్చే బహుమతుల్లో "వంటలూ - పిండి వంటలు"దే అగ్రస్థానం. ఇప్పటికీ ఈ పుస్తకం 29 సార్లు పునర్ముద్రణ అయింది. అన్ని పునర్ముద్రణలకు నోచుకున్న గ్రంధం తెలుగులో మరొక్కటే ఉంది. అది విశ్వనాధ "వేయిపడగలు". మాలతీ చందూర్ ఏ స్కూలుకీ వెళ్ళి చదువుకోలేదు. సంప్రదాయ యుక్తమైన బడి చదువులు సాగలేదు. అయితే ఇంటిలోనే ఆమెకో పెద్ద మాష్టారు ఉన్నారు. చందూరుగారు. అన్నిటికీ మించి - మనసులో పెద్దబడబానలం ఉంది. చదవాలని. ప్రపంచ సాహిత్యంలో అన్ని గొప్ప నవలలూ చదివారు. అక్కడితో ఆగలేదు. దాదాపు 300 నవలలను తెలుగులో అనువదించి ప్రచురించారు. జేన్ ఆస్టిన్, డాఫ్నే డూ మారియర్, పెరల్ బుక్ దగ్గర్నుంచి వాసుదేవన్ నాయర్, తస్లీమా నస్రీన్ 'లజ్జ ', అరుంధతీ రాయ్ వరకూ ఎందరినో తెలుగు పాఠకులకు పరిచయం చేశారు. ఈ నవలలన్నీ పది సంపుటాలుగా ప్రచురితమయాయి. ఇవి కాక 'శతాబ్ది సూరీడు ', 'శిశిర వసంతం ', 'భూమి పుత్రి ', 'హృదయనేత్రి ', 'ఆలోచించు ', 'కలల వెలుగు ', 'మనసులోని మనసు ', 'కొత్త కెరటాలు ' మొదలైన నవలలు రాశారు. ఇక మద్రాసు వస్తే వారింటికి రాని, వారి ఆతిధ్యం తీసుకోని సాహితీ ప్రముఖులు భారతదేశంలో ఉండేవారు కాదు. అది ఒక విధంగా ఎన్.ఆర్.చందూర్ గారి పుణ్యం. చలం, కొడవటిగంటి కుటుంబరావు, బెజవాడ గోపాలరెడ్డి, వాసుదేవన్ నాయర్ - ఎవరైనా. కచ్చేరీ రోడ్డులో వారి ఇల్లు - మద్రాసు వచ్చేవారికి ఒక సందర్శనా స్థలం. మా గొల్లపూడి శ్రీనివాస్ ఫౌండేషన్ కార్యక్రమాలకి వారిద్దరూ తప్పనిసరిగా వచ్చే అతిధులు. ముందు రోజు వేసే పూర్తి సినిమా ప్రొజెక్షన్ కి తప్పక వచ్చేవారు. "మీరిద్దరూ దంపతులు. కానీ ఎవరికి వారే ప్రముఖులు. మీకు వేర్వేరు ఆహ్వానాలు పంపుతాను" అనేవాడిని. మా అవార్డు, మేం చేసే కృషికి ఆమె పొంగిపోయేవారు.రెండవ సంవత్సరం బహుమతి ప్రధాన సభ అయాక ఫోన్ చేశారు. "నిన్న పెళ్ళివారిని పంపించే హడావుడిలో ఉంటారని చెయ్యలేదు. ఇవాళ చేశాను. కిందటి సంవత్సరం శ్రీనివాస్ పారాడాడు. ఇవాళ అడుగులు వేస్తున్నాడు. సభ చాలా గొప్పగా ఉంది. నిన్న ఓ వాక్యం చదివాను. అది మీకు వర్తిస్తుందని చెప్పాలనుకున్నాను. వెలుగులో ఉన్నవాడు చీకటి వస్తుందని భయపడతాడు. చీకటిలో ఉన్నవాడు - ఏ చిన్న వెలుగు కనిపించినా దాని వెనుక నడిచిపోతాడు. మీరీపని చేస్తున్నారు.అది సామాన్యమైన విషయం కాదు" - ఇవీ ఆవిడ మాటలు. నగరంలో ఏ సాహితీ సభ జరిగినా చందూర్ దంపతులు లేకపోతే వెలితిగానే ఉండేది. ఎన్.ఆర్. చందూర్ గారు పోయాక రాశాను. 'ఓ గొప్ప చిత్రపఠంలో సగం బొమ్మ చెరిగిపోయిందని. ఇప్పుడు బొమ్మ పూర్తిగానే మాయమయింది. ఆమె పొట్టి శ్రీరాములు కేంద్రం అధ్యక్షురాలు. రమ్మని పిలిచేవారు కాదు. రావాలని శాసించేవారు. నా చేత ఆంధ్ర రాష్ట్రావతరణ దినాన పొట్టి శ్రీరాములుగారి విగ్రహానికిపూలదండ వేయించారు. ఇవన్నీ మధుర స్మృతులు. ఆమె బాపు, రమణల అభిమాని. వారిద్దరూ ఆమె అభిమానులు. ఒకసారి బాపూగారి చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేసి, నన్ను ఉపన్యాసకునిగా పిలిచారు. నా ఆత్మకథ మీద ఒక పత్రికలో తేలికగా ఆరు పేజీల సమీక్ష రాశారు. కోరి తెప్పించుకుని చదివి మరీ. చందూర్ గారు ఆమెని ఎటువంటి అభిప్రాయబేధాలు, వివాదాల జోలికి పోనిచ్చేవారు కాదు. ఆయన ఆమె సాహితీ జీవితానికి పెద్ద గొడుగు. ఆమె కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి, రాష్ట్ర సాహిత్య అకాడమీ బహుమతి, పద్మావతీ విశ్వవిద్యాలయం డాక్టరేట్, గృహలక్ష్మి కంకణం, లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం - ఇలాగ అందుకోని గౌరవం లేదు. రెండేళ్ళ కిందట తన 94 వ ఏట చందూర్ గారు నిష్క్రమించారు. అది మాలతీ చందూర్ జీవితంలో పెద్ద విషాదం. ఈ రెండేళ్ళూ ఆమె మనస్సుని నిలదొక్కుకోలేకపోయారు. ఈ వయసులో పెద్ద అండని, స్నేహితుడినీ దూరం చేసుకున్న విషాదమది. "ఆయన మీకెలా జ్నాపకం ఉంటారు?" అని ఒక అర్ధం లేని ప్రశ్న వేశాను - వందేళ్ళ కథ రికార్డింగులో. "ఆయన్ని మరిచిపోయిందెప్పుడు?" అన్నారు విషాదంగా. మొన్న ఆమె శలవు తీసుకునే నాటికి జ్నాపకాలతో కుచించుకుపోయిన 40 కేజీల శరీరంలోంచి హంస లేచిపోయింది. తను పోయాక కూడా సమాజానికి ఉపయోగపడే కృషి చేసిన ధన్యురాలామె. తన భౌతిక దేహాన్ని రామచంద్ర మెడికల్ కాలేజ్ కి అప్పగించిపోయారు.
************* |
|