Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here 
 
Are you using iPad ( any iOs Device)? Try direct MP3, Click here

 మళ్ళీ ఉల్లి

 పేదవాడి జీవనాధారం ఉల్లిపాయ. మా చిన్నతనంలో మా అమ్మమ్మ పులుసిన చద్దన్నంలో కాస్త నూనె వేసి చేతికి చిన్న ఉల్లిపాయని ఇచ్చేది. ఇప్పటికీ తలుచుకున్నా మత్తెక్కించే ఆహారం అది. తెలంగాణాలలో ఇప్పటికీ బడుగుజీవులకు ముఖ్య ఆహారం గొడ్డుకారం. పచ్చి ఉల్లిపాయ, ఎండు మిరపకాయలు, ఉప్పు. ఇంతే. అన్నంలో ఏది కలిసినా కలవకపోయినా -యిన్ని నీళ్లు పోసుకుని ఉల్లిపాయ కొరుక్కుని తిన్నవారిని నాకు తెలుసు. పేదవాడి భోజనానికి 'రుచి'ని ఇచ్చేది అదే. అతనికి ఆర్థిక వ్యవస్థ తెలీదు. రాజకీయం తెలీదు. ధరల పెరుగుదలలెందుకు వస్తాయో తెలీదు. అతని దైనందిన జీవితంలో ఆ కాస్త అధరువు మాయమయితే ఎంతగా ఉపాధి కొరవడుతుందో తెలుసు. అందుకనే ఈ దేశంలో ఒక్క ఉల్లిపాయే ఢిల్లీలో ప్రభుత్వాలను గద్దె దించింది. రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. పేదవాడి గుండెకి లేని బలం అతని కడుపుకి ఉంది. అది అతని ఉపాధి కనుక. కనీస గ్రాసం కనుక.
ప్రస్థుతం ఉల్లిపాయ ఖరీదు కిలో 80 రూపాయలు. లోగడ కొన్ని సరుకులు కొన్నవారికి చిన్న వస్తువులు ఉచితంగా యిచ్చే వ్యాపారసూత్రం యిప్పటికీ ఉంది. అలా యివ్వడం వారిని ఊరించడానికి. ఒక కిలో కాఫీపొడి కొంటే ఒక చెంచా. ఒక పాకెట్‌ బిస్కట్లు కొంటే ఒక చిన్న స్టీలు గిన్నె. నాలుగు సబ్బులు కొంటే ఒక టంబ్లర్‌. నిన్న జంషెడ్‌పూర్‌లో సత్నాం సింగ్‌ గంభీర్‌ అనే ఆయన -టైర్ల కంపెనీ నడుపుతున్నాడు. మీరు కారుకో, లారీకో టైర్లు కొంటే 5 కిలోల ఉల్లిపాయలు ఉచితంగా యిస్తున్నట్టు ప్రకటించారు. ఈ కరువుని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే మార్గం యిదొక్కటేనని అన్నారు. మా పనిమనిషి -ఉల్లిపాయ లేకుండా వంట చేసుకోలేని పేద వర్గానికి చెందిన వ్యక్తి. ''అమ్మా, బంగారం తాకట్టుపెట్టి ఉల్లిపాయలు కొనుక్కొనే రోజులొచ్చాయి'' అని వాపోయింది.
పాపం, మన పార్లమెంటు సభ్యులకి ఏ రూట్లోంచి తమ కంచాల్లోకి ఉల్లిపాయ వస్తోందో తెలియడంలేదు. కాని వారికి తెలిసేటట్టు చేసి -వారిని గద్దె దింపిన సందర్భాలు మన దేశ చరిత్రలో బోలెడున్నాయి. అలనాడు ఇందిరాగాంధీని జనతా ప్రభుత్వం గద్దె దింపడం చరిత్ర అయితే -కేవలం ఉల్లి ధరల కారణంగా జనతా ప్రభుత్వం కూలిపోవడం చరిత్ర. అయితే దరిమిలాను ఉల్లిపాయ ఆమెకీ కళ్లనీళ్లు తెప్పించింది. అప్పట్లో ఉల్లి ధర కేజీ ఆరు రూపాయలయింది. ఆరుకీ ప్రస్థుతం ఎనభైకీ మధ్య రూపాయి విలువ క్రుంగిపోవడమే ముఖ్యకారణం. రూపాయి ధర తరిగింది. ఉల్లి ధర పెరిగింది.
ఇప్పుడిప్పుడు తిట్టుకోవడంలో, కొట్టుకోవడంలో, అరుచుకోవడంలో, కరుచుకోవడంలో పార్లమెంటు సభ్యులు బరితెగించారు గాని ఆ రోజుల్లో సభ్యతతో కూడిన హాస్యానికి, చమత్కారానికి పార్లమెంటు కూడలిగా ఉండేది. ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉల్లి ధరని అదుపులో పెట్టలేనందుకు నిరసనగా ఆనాటి లోక్‌దళ్‌ సభ్యులు రామేశ్వర సింగుగారు రాజ్యసభలోకి ఉల్లిపాయల దండ వేసుకుని వచ్చారు. అప్పటి రాజ్యసభ చైర్మన్‌, అప్పటి ఉపరాష్ట్రపతి హిదయతుల్లాగారు. ఆయన చమత్కారానికి, సున్నితమైన హాస్యానికి పెట్టింది పేరు. సింగు గారిని చూస్తూ ''ధరలు పెరిగింది ఉల్లిపాయ కావడం వల్ల బతికిపోయాం. అదే ఏ కారు టైర్లో, చెప్పులో అయితే గౌరవసభ్యులు యిబ్బందిలో పడేవారు పాపం'' అన్నారు. ఈ రామేశ్వర సింగుగారే రాజ్యసభ చైర్మన్‌ బల్లమీద 1300 రూపాయలు పెట్టి చవక ధరలకు ఉల్లిపాయలు తెప్పించండి అన్నారు. వెంటనే కాంగ్రెస్‌ సభ్యు లు హరిసింగ్‌ నల్వాగారు ఆ డబ్బుని అందుకుని జేబులో వేసుకుని 'అలాగే' అన్నారు. ఒక సమస్యకి ఆరోగ్యకరమైన నిరసన, దానికి చమత్కారాన్ని జతచేసిన సందర్భం, 33 సంవత్సరాల తర్వాత కూడా గుర్తు చేసుకొనే ఔచిత్యం -యిన్నిటికి ఆటపట్టు ఆనాటి పార్లమెంటు.
అయితే కేవలం ఉల్లి ధరల పెరుగుదల కారణంగా ఆనాడు (1998) ఢిల్లీ, రాజస్థాన్‌ ప్రభుత్వాలు కూలిపోయాయి. 2000 లో నాసిక్‌లో జరిగిన ఎన్నికల సభలో బిజెపి నాయకులు ప్రమోద్‌ మహాజన్‌ మీద ఉల్లిపాయల వర్షాన్ని సభికులు కురిపించారు.
ఇవాళ ప్లానింగ్‌ కమిషన్‌ డిప్యూటీ చైర్మన్‌ గారికి చెప్పాల్సిన రోజులొచ్చాయి. ''అయ్యా, ఈ దేశంలో ప్రజల పేదరికానికి కొలబద్ద వారి దినసరి ఆదాయం కాదు. ఉల్లిపాయని తిని ఎన్నిరోజులయిందో వాకబు చేయించండి'' అని. ఉల్లిపాయల మీద ఇంటర్నెట్లో రకరకాల ట్విట్టర్‌లు చిటపటమంటున్నాయి. ''అయ్యా, బాంకుల మేనేజర్లూ! ఉల్లిపాయలు తాకట్టు పెడితే అప్పులిస్తారా?'' అని ఒకాయన రాశారు. మరొకావిడ ''కట్నం మాట దేవుడెరుగు. ఓ కారునిండా ఉల్లిపాయలతో వచ్చినాయన్ని పెళ్లి చేసుకుంటాను'' అన్నారు. మరొకాయన ''బప్పీ లహరిగారు ఈ మధ్య ఫేషన్‌ మార్చారు. పూలదండలకి బదులు అందంగానూ, ఖరీదుగానూ ఉంటాయని ఉల్లిపాయల దండలను ధరిస్తున్నారు'' అన్నారు. ప్రస్థుతం ఇరాన్‌, ఈజిప్టు, చైనా, పాకిస్థాన్‌ల నుంచి దిగుమతికి నాయకులు ఆలోచనలు చేస్తున్నారని తెలుస్తోంది. ఉల్లిపాయలు సమృద్ధిగా పండించే రాష్ట్రాలు -మహారాష్ట్ర, కర్ణాటకలలో ఆ మధ్య కరవు, ఈ మధ్య అధిక వర్షాలు కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. అయితే అక్టోబరులో మరో పంట మార్కెట్లోకి వచ్చేలోగా వర్తకులు సరుకుని దొంగ నిలవలు చేసి -కృత్రిమమైన కరవుని సృష్టిస్తున్నారని వాణిజ్య వర్గాలు చెప్తున్నాయి. ఉల్లి చేసిన మేలు తల్లికూడా చెయ్యదని సామెత. కాని ఉల్లిని అశ్రద్ధ చేస్తే ఉల్లిచేసే కీడు ఏ తల్లీ, ఏ నాయకుడూ తట్టుకోలేనిదని భారత 'ఉల్లిపాయ' నిరూపించడం ఈ దేశంలో చరిత్ర. పేదవాడి హృదయం కంటే పేదవాడి కడుపు రగిలితే రాజకీయ నాయకులు కుర్చీలు దిగవలసి వస్తుందని ఈ దేశంలో పదే పదే నిరూపణ జరిగింది. నాకు రాజకీయాలలోకి వచ్చే ఆలోచన ఏనాడూ లేదు. ఏతావాతా రావడం సంభవిస్తే యిప్పుడే రిజర్వు చేసుకుంటున్నాను -నా ఎన్నికల చిహ్నం -ఉల్లిపాయ.

       
      gmrsivani@gmail.com   
     ఆగస్టు 19,  2013          

*************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   


KOUMUDI HomePage