Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here 
 
Are you using iPad ( any iOs Device)? Try direct MP3, Click here

 

కుక్కపిల్ల కథ

 

 అమెరికా నుంచి మా మిత్రుడొకాయన ఒక కార్టూన్‌ పంపించాడు. కార్టూన్‌ అంటే తెలియనివారికి -దృశ్యరూపమయిన వెక్కిరింత. దాని శీర్షిక 'ఇండియా రాజకీయాలు -మాధ్యమాల అద్భుత ప్రదర్శన'. ఒక పాత్రికేయుడు భారతీయ జనతా పార్టీ నాయకులు మోడీగారిని అడుగుతున్నాడు: ''అయ్యా, మీకే పండు ఇష్టం?'' అని. మోడీ క్లుప్తంగా 'ఆపిల్‌' అన్నారు. వెంటనే పెద్ద అక్షరాలతో టీవీ తెరనిండా ''తాజా వార్త!'' అనే అక్షరాలు. ఏమని? ''మోడీ మామిడిపళ్లని అసహ్యించుకుంటున్నారు!'' అని. వెంటనే కాంగ్రెస్‌ ప్రతినిధి ఒకాయన ఆవేశంగా కళ్లు పెద్దవి చేసి చెప్తున్నారు: ''ఇప్పటికైనా నా మాట నిజమని నమ్ముతారా? ఏపిల్‌ రంగునిబట్టి మీకేం అర్థమౌతోంది? మోడీకి రక్తదాహం! అందుకనే ఎర్రటి పండు ద్వారా ఆయన అసలు రంగు బయటపడింది!''

ఇది నికార్సయిన నీచ రాజకీయం. నూటి కి నూరుపాళ్లూ కోడి గుడ్డుకి వెంట్రుకలు పీకడం. ఇంకా చెప్పాలంటే గొంగళిలో బొచ్చు ఏరడం.

ప్రస్తుతం మోడీగారు ఏం మాట్లాడినా అందులోంచి రకరకాల అర్థాలు పీకగల అద్భుతమైన పాత్రికేయులు -వాటిని నెత్తికెత్తుకుని మోడీని కేవలం గబ్బు పట్టించడమే పరమావధిగాగల రాజకీయ దురంధరులు ఈ దేశంలో బోలెడుమంది ఉన్నారు. వీళ్లందరికీ రకరకాల కళ్లద్దాలున్నాయి. కొందరి కళ్లకి పూర్తిగా కామెర్లు ఉన్నాయి. కొందరయితే కళ్లతో చూడడమే మానుకున్నారు!

నేను భారతీయ జనతాపార్టీ సభ్యుడిని కాను. ఆ మాటకి వస్తే ఏ రాజకీయ పార్టీకీ సంబంధించినవాడిని కాను. కాని అన్ని రాజకీయాల కంపునూ, అవినీతినీ నిస్సహాయంగా భరిస్తూన్న దురదృష్టవంతుడయిన భారతీయుడిని. ఈ క్రింది పేరాలకు ఈ ఉపోద్ఘాతం అవసరమనిపించి ఈ నాలుగు వాక్యాలూ రాస్తున్నాను.

మోడీగారిని ఫలానా మారణకాండ గురించి మీరు బాధపడడం లేదా? అని ఓ పాత్రికేయుడు అడిగాడు. ఇంత జరిగినా -ఆ మారణకాండకు ఆయన ప్రత్యక్షంగా కారణం కాకపోయినా (మనం వింటున్న దాన్నిబట్టి) -ఆయన ఈ సంఘటన పట్ల పశ్చాత్తాపమో, క్షమాపణో చెప్పాలని కొన్ని పార్టీల, ఎందరో పాత్రికేయుల మనోగతం. మోడీగారికి చెవిలో పువ్వులేదు. ఆపిల్‌ పండు గురించి చెప్తే రక్తం మరిగాడని అర్థాలు తీసి కోడి గుడ్డుమీద వెంట్రుకలను రాజకీయ దురంధరులు పీకుతారని వారికి తెలుసు. ఒకవేళ నిజంగా పశ్చాత్తాపం ఉన్నా ఆ విషయాన్ని తన మాటగా చెప్తే ఆ ఒక్కమాటనీ పీకి ''తనకి అందులో ప్రమేయం లేకపోతే క్షమాపణ ఎందుకు చెప్పాల్సి వచ్చింది? పరోక్షంగా ఆ మారణకాండలో వారి ప్రమేయం ఉన్నదనడానికి ఇంతకన్న రుజువు ఏంకావాలి?'' అని కత్తులు దూసేవారు. అది మోడీకి తెలియని విషయం కాదు. మోడీకి తెలుసన్న విషయం ఈ దురంధరులకి (ఇందులో పాత్రికేయులూ ఉన్నారు) తెలియంది కాదు.

కాని గడుసయిన పాత్రికేయుడు మోడీని ఇరుకున పెట్టాలనే కాలుదువ్వాడు. అంటే నేరస్థుడని తాను నమ్మే వ్యక్తిచేత నేరాన్ని అంగీకరించే 'మాట'ని రాబట్టాలని ఈ దురంధరిడి యావ. కాని మోడీ 'కొండల్ని మింగే' అఖండుడు. కాక పరిచిన ముఖమల్‌ తివాచీ కింద ఎన్ని అగాధాలకు ముసుగులు కప్పారో ఆయనకి తెలియకపోలేదు.

ఆయన సమాధానం -ఎదుటివాడి ఆనుపానులు ఎరిగిన, కొమ్ములు తిరిగిన, తెలివైన, నిజమే అయితే అందులో ప్రమేయం లేని, రాజకీయ నాయకుడు మాత్రమే చెప్పగలిగిన అద్భుతమయిన సమాధానాన్ని చెప్పారు. నిజానికి -ఈ సమయస్ఫూర్తినీ, ఈ గడుసుదనాన్నీ, ఈ చమత్కారాన్నీ, ఈ తెలివితేటలనీ -ఎప్పటికప్పుడు -నేను నేర్చుకోడానికే ఈనాటి రాజకీయ నాయకుల కార్యక్రమాల్ని 'పాఠశాల'గా వింటూంటాను. దేవుడిని అనునిత్యం ఆరాధించే ప్రహ్లాదుడు మనకే పాఠం చెప్పడు -చేతనయితే ఆ విశ్వాసాన్ని పుణికి పుచ్చుకోమనడం తప్ప. ఎప్పటికప్పుడు కొత్త తిట్లు, కొత్త కారణాలు వెదికే హిరణ్యకశిపుడిది నిరంతర పరిశ్రమ. గొప్ప మౌలికమయిన కృషి. ఐాూు-సశ-ా శ ౌషషెెప| ిుశి అన్నాడు సోమర్సెట్‌ మామ్‌.

ఈ ప్రశ్నకి ఏం సమాధానం వస్తుంది? ఇక్కడ ఈ ప్రోగ్రాంని నిలిపి -అయిదు నిముషాలు నిశ్శబ్దాన్ని ప్రసారం చేస్తే -నేను టీవీని విడువకుండా కూర్చునేవాడిని. ఇది గడుసయిన పదిరకాల సమాధానాలకు సిద్ధపడిన, నికార్సయిన 'రాజకీయపు' పాత్రికేయుని ప్రశ్న. మరి సమాధానం? ఇక్కడ ఆరు నమూనాలు.

''మీరెందుకు ఈ ప్రశ్న అడుగుతున్నారో మీకూ తెలుసు నాకూ తెలుసు'' అని మోడీ చిరునవ్వు నవ్వి ఊరుకోవచ్చు.

''ఇలాంటి ప్రశ్నకి ఇప్పటికి లక్షసార్లు సమాధానం చెప్పాను'' -మరో నమూనా.

''నేను ఏం చెప్పినా మీరు ఏం కెలుకుతారో నేను ఊహించగలను''

''సమాధానం లేదు''

కేవలం చిరునవ్వు.

''ఈ విషయమై విచారణ జరుగుతోంది. నా అభిప్రాయం ఇపుడు చెప్పడం సబబుకాదు''

''నేనేమనుకొని ఉంటానో మీరే ఊహించండి''

-ఇలా ఏదయినా కావచ్చు.

కాని -ఏమీ కంగారు పడకుండా (నేనూ పాత్రికేయుడినని మరిచిపోవద్దు) నిష్కల్మషంగా, ఏమీ నటనలేకుండా, అతి ఆర్ధ్రంగా ఓ మాట అన్నారు.

''కారు వెనక సీట్లో కూర్చున్నా -ఓ చిన్న కుక్కపిల్ల కారుకిందపడినా మనసు కలుక్కుమంటుంది'' -ఇవీ మాటలు.

ఇది ప్రత్యర్థులకి భగవద్గీత. కుహనా పాత్రికేయులకి, మనసులో మత విద్వేషణ పెట్టుబడిగా ఉన్నవారికి మృష్టాన్న భోజనం.

ఇందులోంచి ఎవరూ ఊహించని విధంగా పుట్టుకొచ్చిన ఆలోచనా స్రవంతి మనవారి మౌలిక ప్రతిభకు కరదీపిక. వెనక సీట్లో అంటే మారణ హోమానికి ప్రత్యక్షంగా ప్రమేయం లేదు అనే సూచన కదా! అంటే పరోక్షంగా ఉన్నదనేగా అర్థం? కారుకింద కుక్కపిల్ల పడింది. కారులో నువ్వు ఉన్నావు. మరి దాని హింసకి నీ పాత్రలేదని ఎలా అనగలవు? పోతే, హింసాకాండలో హింసించబడినవారంతా 'కుక్క'లా? అంత నీచమయిన ఆలోచనా? ఎంత అహంకారం? ఎంత బాధ్యతారహితం? ఎంత దుర్మార్గం?

అప్పటికప్పుడు చెప్పారుకనుక -పోనీ, మరోమూడు నమూనా సమాధానాలను మోడీగారు చెప్పగలిగారనుకుందాం.

''ఒక పిల్లి కారుకిందపడితే....''

పిల్లి కాస్త మెరుగయిన ఉదాహరణగా ఉండేదా?

''ఒక పావురం పడితే...''

అప్పుడు ఈ దురంధరులు ఆ 'పావురం' మతం ఏమిటి? అని వెంట్రుకలు పీకేవారేమో.

''ఎలక్ట్రిక్‌ తీగెల మీద వాలిన పక్షి షాక్‌కి కిందపడి మరణిస్తే....''

మోడీ తాను 'విద్యుత్తు' ననుకుంటున్నాడేమో! అనో ''మారణహోమంలో చచ్చిపోయినవాళ్లంతా దిక్కుమాలిన పక్షుల్లాగ రాలిపోయారు అని ఈసడిస్తున్నారు'' అని దుయ్యబట్టేవారేమో!

ఏతావాతా -ఇన్ని అర్థాలు అప్పటికప్పుడు చెప్పిన ఆయన మాటల్లోంచి పుట్టుకు రావచ్చునని ఆరోగ్యంగా ఆలోచించగల ఎవరికీ తట్టదు. అయితే మన ఆలోచనల్లో ఆరోగ్యం చెడి ఎన్నాళ్లయింది? ఎదుటి వ్యక్తి యధాలాభంగా మాట్లాడిన మాటల్లో కూడా కుత్సితం ఉన్నదని అన్వయాలు చేసే పాత్రికేయుల, రాజకీయ దురంధరుల 'కంపు' నేటి వాతావరణం. ఊహించలేని సందర్భాలలో అర్థాలు కుక్కడం పాత్రికేయ వృత్తికి సొగసుని, హుందానీ ఇవ్వదు.

నేను మోడీగారిని వెనకేసుకు రావడంలేదు. ఆపని నాదికాదు. కాని ఒక మామూలు వాక్యంలోంచి పెడర్థాలు తీయడం నాలాంటివారికి ఆశ్చర్యచకితుల్ని చేసిందని చెప్పడమే నా ఉద్దేశం.

ఇంతకూ ఈ కసరత్తుని చూసేవారికి ఒకటి అర్థమౌతుంది. మోడీని దుయ్యపట్టాలనే తాపత్రయం పరోక్షంగా ఆయన ప్రాచుర్యాన్ని, ఉనికినీ, పరపతినీ పెంచుతుంది. నీడని చూసి భయపడేవాడు బలహీనుడు. కత్తిదూసేవాడు దుర్మార్గుడు -ఆ ఆలోచనలోనే దురుద్దేశం ఉంది కనుక.

ఏమైనా ఈ దేశం రాజకీయాలకి చక్కగా అద్దం పట్టిన కార్టూన్‌ని అమెరికాలో వండిన మా మిత్రుని కి ధన్యవాదాలు. ఈ వికారానికి ఇంతకంటే అద్భుతమయిన స్పందన మరొకటి ఉండదు.

 

     
      gmrsivani@gmail.com   
     జూలై 29,  2013          

*************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   


KOUMUDI HomePage