Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here 
 
Are you using iPad ( any iOs Device)? Try direct MP3, Click here

 ఒక ముగింపు

 

       ఇప్పటికీ నా ఫైళ్లలో రెండు పాతబడిన టెలిగ్రాంలు ఉన్నాయి. అవి మాసి, మూలలంట నలిగి ఉన్నాయి కాని అవి రెండూ నా జీవితంలో ఆకుపచ్చని జ్ఞాపకాలు. ఇప్పటికీ రెండు పెద్ద మలుపులకు అభిజ్ఞలవి. ఒకటి 54 సంవత్సరాల కిందట వచ్చినది. నాకు అంతర్విశ్వవిద్యాలయ నాటక రచనా పోటీల్లో నా ''అనంతం'' నాటికకు మొదటి బహుమతి వచ్చినట్లు ఢిల్లీ ఆకాశవాణి నుంచి వచ్చిన టెలిగ్రాం. రెండవది 51 సంవత్సరాల కిందట మా మామగారు పంపింది -నా పెద్ద కొడుకు పుట్టాడంటూ.
మొన్న ఆఖరి టెలిగ్రాం సికింద్రాబాద్‌లో పారడైజ్‌ దగ్గర టెలిగ్రాం ఆఫీసునుంచి ఒకాయన పంపాడు. బహుశా భారతదేశంలో ఆఖరి టెలిగ్రామేమో అది. ''బాస్‌ టెలిగ్రాం చచ్చిపోయింది స్టాప్‌ వయస్సు 169 స్టాప్‌ రేపే అంత్యక్రియలు స్టాప్‌.''
నాకు తెలిసి 'సేవకుడు' అన్నమాట ఒక్క టెలిగ్రాం యిచ్చే మనిషికే వాడిన గుర్తు. టెలిగ్రాం బంట్రోతు అనేవాళ్లం. న్యాయంగా టెలిఫోన్‌ ఆఫీసరుగారినీ 'టెలిఫోన్‌ బంట్రొ తు' అనాలి -ఆయనా గవర్నమెంటు సర్వెంటు కనుక. కాని వారెప్పుడూ సేవకులుగా భావించిన దాఖలాలు లేవు. వాళ్లు 'గవర్నమెంటు మొగుళ్లు'గానే నిన్నమొన్నటి దాకా అధికారాల్ని చెలాయించారు.
తపాలా బంట్రోతు మీద బాలగంగాధర తిలక్‌ కవిత ఎలా మరిచిపోగలం?
ఉత్తరం యిచ్చి నిర్లిప్తుడిలాగ వెళ్లిపోయే నిన్ను చూసినప్పుడు
తీరం వదిలి సముద్రంలోకి పోతున్న ఏకాకి నౌక చప్పుడు
ఎప్పుడో మోర్స్‌ కోడ్‌ సంజ్ఞలతో బ్రిటిష్‌ వారి పుణ్యమాంటూ ప్రారంభమయిన సంప్రదాయం టెలెక్స్‌, టెలిప్రింటర్‌ దశలలో హంగులు మార్చుకుని -మొబైల్స్‌, ఎస్‌ఎమ్‌ఎస్‌లూ, ఇంటర్నెట్‌ల కాలంలో పూర్తిగా తన అవసరాన్ని మినహాయించుకుంది. మొన్న మొన్నటివరకూ కోర్టు కాగితాలకూ, గవర్నమెంటు ఉత్తరాలకూ పరిమితమయిన టెలిగ్రాం ఇప్పుడిక ఆ వునికినీ కోల్పోయింది. ఒక పాత సంప్రదాయపు అవసరం తీరిపోయింది. చరిత్రలో భాగమయిపోయింది. అది కాలధర్మం.
ముసలమ్మ నిష్క్రమిస్తుంది. ముసిలితనం వచ్చేదాకా పడుచుదనం పలకరిస్తుంది. నిన్న చరిత్ర. నేడు చైతన్యం. రేపు నిరీక్షణ.
అచిరకాలంలో టెలిఫోన్‌కీ అదేగతి పట్టబోతోంది. అయితే టెలిఫోన్‌ గురించి ఎవరూ అంతగా బెంగపెట్టుకోరేమో! టెలిఫోన్‌ దరిద్రం ఎప్పుడయినా వదిలిపోతుందా అని దేశం ఎదురుచూసిన సందర్భాలు బోలెడు. ఇరవై సంవత్సరాల కిందటిమాట. ఈ దేశంలో పద్మశ్రీ, డాక్టరేట్‌ రావడం అసాధ్యం కాదు. కాని టెలిఫోన్‌ కనెక్షన్‌ రావడం దుర్లభం అనే స్థాయికి డిపార్టుమెంటు అవినీతితో రాజ్యమేలింది. అది భయంకరమైన బ్లాక్‌మెయిల్‌. డాక్టర్‌ సర్టిఫికేట్‌, ఇంటి ఆస్తి దస్తావేజులు, అడ్రసుని సమర్థించే పత్రాలు, నువ్వు ఫలానా నువ్వేనని సమర్థించే పత్రం, రికమెండేషన్ల ఉత్తరాలు -వాళ్లం ఇష్టం. కస్టమర్లతో చెడుగుడు ఆడారు. ఆఖరున ఆఫీసరుగారి చేతులు తడపాలి. తీరా టెలిఫోన్‌ ఇంట్లో ఉంచడానికి వచ్చే మరో 'బంట్రోతు' (కసిగానే ఈ మాట వాడుతున్నాను) ఆకాశంలోంచి దిగివచ్చిన గంధర్వుడిలాగ నిలబడతాడు -తన వాటా లంచానికి.
చాలా ఏళ్ల కిందట మద్రాసులో మూడు నక్షత్రాల హొటల్‌ ప్రారంభించాడు మా అబ్బాయి మిత్రుడు. అన్నీ జరిగినా టెలిఫోన్లు రాలేదు. బాస్‌కి తెలిసింది. ఆయన నవ్వుకున్నాడు. ఓ పెద్ద కరెన్సీ కట్ట పట్టుకుని డిపార్టుమెంటుకి బయలుదేరాడు. సాయంకాలానికి ఆరు లైన్ల కనెక్షన్లు తెచ్చాడు. అన్నిటికీ అవినీతి సమాధానం. అంతెందుకు? ఈ దేశంలో టెలిఫోన్‌ మంత్రిగారు మద్రాసులో తన ఇంట్లోనే 200 లైన్ల టెలిఫోన్‌ ఎక్స్‌చేంజ్‌ని పెట్టించుకున్నాడు! బిఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు కొందరయినా ఈ కాలమ్‌ చదువుతారనుకుంటాను. వీలయితే ఈ కాలమ్‌ని ఫఠం కట్టించి డిపార్టుమెంటులో వేలాడదీయాలి.
ఈ కాలమ్‌ రాస్తూ శాన్‌ఫ్రాన్సిస్కోలో మా మిత్రుడికి ఫోన్‌ చేశాను. ఆయన చెప్పిన విషయాలివి. ఆయన 1980లో ఇండియాలో ఉన్న రోజుల్లో టెలిఫోన్‌కి దరఖాస్తు పెట్టాడట. కేవలం 15 సంవత్సరాల తర్వాత 1995లో వచ్చిందట. 1992లో మా నాన్నగారు విశాఖలో చావుబతుకుల్లో ఉన్నారు. నేను మద్రాసులో. ఎంత ప్రయత్నించినా టెలిఫోన్‌ తెచ్చుకోలేకపోయాను. మా ఇంటి ఎదురుగా ప్రముఖ రచయిత అనిశెట్టి సుబ్బారావుగారుండేవారు. ఓ రాత్రి 11-30 కి మా నాన్నగారికి గుండెపోటు వచ్చిందని వారింటికి ఫోన్‌ వచ్చింది. ఈ దేశంలో ఇంతకంటే టెలిఫోన్‌ అవసరం ఉంటుందని ఎవరిని ఒప్పించాలో తెలియని దుర్బరమయిన పరిస్థితి అది. అమెరికాలో టెలిఫోన్‌ని రెండు లేక మూడు రోజుల్లో యిస్తారని ఆ మిత్రుడే చెప్పాడు. సింగపూర్‌లో మూడేమూడు రోజులు. అప్పటికి ఇవ్వకపోతే నాలుగో రోజున డిపార్టుమెంటల్‌ విచారణ జరుగుతుంది. అయిదో రోజున ఉద్యోగాలు పోతాయి.
కృతఘ్నతకి ఈ దేశం పెట్టింది పేరు కనుక మనం తలుచుకోంగాని ఈ దేశానికి పీవీ నరసింహారావుగారు 'లిబరలైజేషన్‌' ద్వారా చేసిన మేలు నిరుపమానం. రెండు దరిద్రమయిన వ్యవస్థల నుంచి ఈ దేశాన్ని కాపాడారు. టెలిఫోన్‌, విమానయానం. ఇవాళ కసిగా -మరో దిక్కులేక బిఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్ల కోసం దేబిరిస్తున్నా -ఎవరూ అటు చూడనయినా చూడడం లేదు. ఒక్క టెలిగ్రాం విషయానికొస్తే ఈ దేశంలో ఒకప్పుడు 45,000 టెలిగ్రాం ఆఫీసులు ఉండేవి. ఇప్పుడు 75 కి వచ్చేశాయి. ప్రస్థుతం టెలిఫోన్‌ వ్యవస్థ గతీ అంతే. ఇవాళ ముష్టివాడి చేతిలో కూడా మొబైల్‌ ఫోన్‌ ఉంటుంది -పక్కవీధి ముష్టివాడితో మాట్లాడడానికి.
ఎయిర్‌ ఇండియా కూడా ఒకప్పుడు అవినీతితో రాజ్యం ఏలింది. ఒకే ఒక్క ఉదాహరణ. 1990లో మా పెద్దబ్బాయి పెళ్లి -విశాఖలో. నేను మద్రాసు ఎయిర్‌ పోర్టులో ఉన్నాను. నా చేతిలో మంగళసూత్రం దగ్గర్నుంచి, అన్ని ప్రధాన అంశాలూ ఉన్నాయి. తెల్లవారితే పెళ్లి. విమానం ఎక్కడానికి బోర్డింగు కార్డు కూడా ఇచ్చి, రెండు గంటలు కూర్చోపెట్టి విమానాన్ని రద్దుచేశామన్నారు. ఎందుకు? చెప్పే నాధుడు లేడు. ప్రతి ఉద్యోగి ఒక నవాబు. నాకు మతిపోయింది. 800 మైళ్లు ఎలా వెళ్లాలి? నాతో ఎయిర్‌పోర్టులో విజయలక్ష్మి డిస్ట్రిబ్యూటర్‌ రాజుగారు, శృంగవరపుకోట అప్పారావుగారు ఉన్నారు. నన్ను పట్టుకుని, ధైర్యం చెప్పి -రెండు రైళ్లు మార్పించి విశాఖపట్నం తీసుకొచ్చారు. ఆనాటి పెళ్లి విశాఖపట్నంలో చరిత్ర. ఇవాళ ఎయిర్‌ ఇండియా ఎలా అడుక్కుతింటోందో మనం వింటున్నాం.
'గవర్నమెంటు సర్వెంట్‌' అన్నమాట బ్రిటిష్‌ వారి పుణ్యం. ఆ తరంలో సి.పి.బ్రౌన్‌, ఆర్దర్‌ కాటన్‌, జె.పి.ఎల్‌.గ్విన్‌, మెకెంజీ వంటి వారు నిజంగానే ప్రజలకు నౌఖరులుగా పనిచేశారు. ఇప్పటికి బ్రౌన్‌ సృష్టించిన నిఘంటువుకి మించినది మరొకటి లేదు. మొన్ననే మెకెంజీ కైఫీయత్‌లు అయిదు సంపుటాలు కడపలో బ్రౌన్‌ గ్రంథాలయం లో ఇచ్చారు. అది వారు మనకి చేసిపోయిన ఉపకారం. ఇప్పుడు? మనవాళ్లే మనల్ని దోచుకుతింటున్న బేఖాతరు. ఏ కొందరినో మినహాయిస్తే -అంతా దొరలు! అందుకే 65 ఏళ్ల తర్వాత పార్లమెంటులో, రాష్ట్ర శాసనసభల్లో దొంగలు, ఖూనీకోర్లు, మాఫియా లీడర్లు, రేపిస్టులు ఉండకూడదని ఇప్పుడిప్పుడు చట్టాలు చేసుకుంటున్నాం.


      gmrsivani@gmail.com   
     జూలై 22,  2013          

*************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   


KOUMUDI HomePage