Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here 
 
Are you using iPad ( any iOs Device)? Try direct MP3, Click here

 నూకల జ్ఞాపకాలు

      నూకల చిన సత్యనారాయణగారితో నాకు తేలికగా ఏభై సంవత్సరాల పరిచయం. అందుకు ముఖ్యకారణం ఆలిండియా రేడియో. ఆయన పాండిత్యానికీ, ప్రతిభకీ నాకూ పరోక్షమయిన బంధుత్వం ఉన్నదని తెలిశాక మా దగ్గరతనం మరింత పెరిగింది. ఆయన మా పినమామగారు -శ్రీపాద పినాకపాణిగారి శిష్యులు. నన్ను ఆప్యాయంగా 'అల్లుడు గారూ!' అని పిలిచిన కొద్దిమందిలో ఒకరు. గురువుని మించిన శిష్యుడనిపించుకున్న అదృష్టవంతులు. గురువుగారిలాగే పద్మభూషణులయారు. కాని గురువుగారు నడిచిన దారినే తొందరపడి పదేళ్లు ముందుగా సాగిపోయారు.
మొదట వయొలిన్‌ని తన సంతకం చేసుకున్న ద్వారం వెంకటస్వామి నాయుడుగారి దగ్గర విజయనగరంలో వయొలిన్‌ నేర్చుకోడానికి చేరారు నూకల. నాయుడుగారే ఆయన గాత్ర వైదుష్యాన్ని గుర్తుపట్టి డాక్టర్‌ పినాకపాణి గారికి పరిచయం చేశారు. మనోధర్మ సంగీతానికి జీవితమంతా సాధికారికమైన ప్రతినిధిగా నిలిచారు నూకల. పాండిత్యం ఆయన సంగీతయాత్రలో ఒక పార్శ్యం. సంగీత గురువుగా, సంగీత వైభవాన్ని -250 సంచారి రాగాల సమీకరణ, విశ్లేషణ గ్రంథాన్ని 'రాగ లక్షణ వైభవా'న్ని రచించారు. దీక్షితార్‌ నవగ్రహ, కమలాంబ నవావర్ణకృతులమీద చక్కని పరిశోధనా గ్రంథాన్ని వెలువరించారు. అలాగే మరెన్నో. మహామహోపాధ్యాయులయారు. ప్రపంచంలో ఎన్నో విశ్వవిద్యాలయాలలో సంగీతం మీద సోదాహరణ ప్రసంగాలు చేశారు.
కొన్ని సంవత్సరాల క్రితం అమెరికా వెళ్లినప్పుడు తప్పనిసరిగా కెనడా వెళ్లి అటునుంచి నయాగరా చూడాలని మా అబ్బాయి పట్టుబట్టాడు. అతని స్నేహితుడి అన్నగారు -ఓ పంజాబీ మిత్రుడు అక్కడ ఉన్నారు. వారికి నా గురించి చెప్పారు. ఆ దంపతులు నన్నూ, నా భార్యనీ నయాగరా తీసుకువెళ్లారు. వారి ఇంటి పక్కనే ఒక తెలుగు కుటుంబం ఉంది. ఆ మాటా యీమాటా చెప్తూ ఇండియా నుంచి ఎవరో 'గొల్లాపూడ్‌ మార్తీ' అంటూ వచ్చీరాని పేరు చెప్పాడట. ఆ కెనడా తెలుగు దంపతులు విజయ, శాస్త్రిగారూ తుళ్లిపడ్డారట. 'బాబోయ్‌! గొల్లపూడి మారుతీరావా?' అన్నారట. తెల్లవారితే మేం బోస్టన్‌కి ప్రయాణం చెయ్యాలి. వారు మా గదిలోకి దూకేశారు. ఆ సాయంకాలం అప్పటికప్పుడు మమ్మల్ని ఒప్పించి -చిన్నవిందు ఏర్పాటు చేశారు. ఆ సాయంకాలం మాకు గుర్తున్న అంశం -ఒకావిడ ఉన్నపాటునే కుర్చీలోంచి దిగి నేలమీద కూర్చుని 'గం గణపతే నమో నమో' అనే హరికేశనల్లూర్‌ ముత్తయ్య భాగవతార్‌ కీర్తన పాడారు. ఎక్కడ కెనడా? ఎక్కడ హంసధ్వని? ఎక్కడ ముత్తయ్య భాగవతార్‌? 'ఎవరు నేర్పారమ్మా?' అని అడిగాను. ''నూకల చిన సత్యనారాయణగారు మా గురువుగారు'' అన్నదావిడ గర్వంగా. కళ -పాండిత్యం -రెండు సందర్భాలలో పరిమళిస్తుంది. ఒకటి అభ్యసించినప్పుడు. మరొకటి -ప్రదర్శించినప్పుడు. కెనడాలో నూకల పరోక్షంగా పలకరించిన అరుదయిన సందర్భమది.
ఎప్పుడు కలిపినా ''మీరు మా ఇంటి అల్లుడుగారు. భోజనానికి రండి'' అని సాదరంగా ఆహ్వానించేవారు. ఒకసారి దంపతులం వెళ్లాం. చక్కని సంగీతంతో, శ్రీమతిగారి చక్కని వంటలతో ఉభయులూ విందుచేశారు. కొత్తబట్టలు పెట్టి, ఆయన కేసెట్లూ, సీడీలూ ఇచ్చారు.
నూకల ఆర్ద్రమయిన హృదయంగల వ్యక్తి. ఉదారులు. ఉదాత్తులు. గురువుగారిని ఏ క్షణం తలచుకున్నా గౌరవ ప్రపత్తులతో ఆయన గొంతు ఆర్ద్రమవుతుంది. జీవితంలో గురువుగారికి దక్కిన బంగారు పతకాలని కరిగించి భద్రాచల దేవేరికి వడ్డాణం చేయించారని చెప్పినప్పుడు ఆయన గొంతు గాద్గదికమవడం నాకు జ్ఞాపకం.
నూకల చాలా అందమయిన సంగీతజ్ఞులు. అంతటి అందం, ఠీవీ మరొకరిలో మాత్రమే గుర్తుపట్టాను నేను. జి.ఎన్‌.బాలసుబ్రహ్మణ్యం. ఆయన ముఖంలో వ్యక్తిత్వంలో పాండిత్యపు తేజస్సు వెల్లివిరుస్తూంటుంది. ఆయన్ని ఆ మధ్య చాలా శ్రమతో చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో ఏదో కార్యక్రమానికి తీసుకొచ్చారు వారబ్బాయి. అది కేవలం శరీరానికి ఏర్పడిన రుగ్మత. ప్రేక్షకుల్లో నన్ను చూడగానే ఆనందంతో మురిసిపోయారు.
విశాఖపట్నంలో గురజాడ కళాక్షేత్రంలో ఏదో కార్యక్రమానికి ఆయన వచ్చారు. నన్నూ కార్యకర్తలు వేదిక ఎక్కించారు. తర్వాత ఆయన కచ్చేరీ. నేనెక్కడికో వెళ్లాలి. ''మీ కీర్తన ఒక్కటి విని వెళ్తాను'' అంటూ 'బృహదీశ్వర మహాదేవ!' పాడమని కోరాను. అది మంగళంపల్లి బాలమురళీకృష్ణ రచన అనుకుంటాను. నాకు నూకల గారి గొంతులోనే మనస్సులో మిగిలిపోయింది. ''అయ్యో, గుర్తులేదే!'' అన్నారు. ''సాహిత్యాన్ని నేను గుర్తు చేస్తాను'' అంటూ చెప్పాను. 'మమత పాశముల తాళను శమనవైరి దయలేకను' ఆయన గొంతులో వింటే నాకు తన్మయత్వం. పాడారు. కేవలం నాకోసం. అదీ ఆయన ఔదార్యం. స్నేహశీలత.
గురువుగారు శ్రీపాద పినాకపాణిగారి నూరేళ్ల పండగకి వెళ్లలేనందుకు ఎంతగా బాధపడివుంటారో నేనూహించగలను. హైదరాబాద్‌లో రోజంతా జరిగిన ఉత్సవంలో శ్రమతో వచ్చారు. ఉదయం ఇద్దరం మొదటివరసలో కూర్చున్నాం. సాయంకాలం రవీంద్రభారతిలో జరిగిన సభలో ఇద్దరం వేదికమీద ఉన్నాం. ఆనాటి ఆయన ఉపన్యాసమంతా గురువుగారికి అశ్రుతర్పణమే.
11వ తేదీ రాత్రి 11 గంటలకి ఆయన ప్రోగ్రాం చూస్తున్నాను. కింద కీ.శే. నూకల చిన సత్యనారాయణ అని స్క్రోల్‌ నడుస్తోంది. తుళ్లిపడ్డాను. వెంటనే ఛానల్‌కి ఫోన్‌ చేశాను. ఆ ఉదయమే కన్నుమూశారన్నారు. ఉదయమే మా ఆవిడకి చెప్తే ఆమె కళ్లు ధారాపాతాలయాయి. ఆయన శ్రీమతి శేషుగారిని జ్ఞాపకం చేసుకుంది.
ఇంటికి ఫోన్‌ చేస్తే మనుమడు తీశాడు. ''తాతగారు దేనికీ రాజీపడరు. తలవొంచరు. నాలుగు రోజుల కిందట -'ఇంక మేడమీదకు వెళ్లలేనురా. కిందనే ఉంటాను' అన్నారట. మనస్సుని శరీరం జయిస్తున్న అరుదయిన క్షణం అది. నిన్న ఉదయం డాక్టరు దగ్గరకి వెళ్లాలి. అబ్బాయి అన్నాజీరావు పూజ చేసుకుంటున్నారట. పంచెకట్టుకుని బాత్‌రూమ్‌కి వెళ్లివచ్చి మంచంమీద ఒరిగారు. అంతే. ప్రశాంతంగా వెళ్లిపోయారు. అనాయాస మరణం అపూర్వమయిన యోగం. ఒక వ్యక్తి మహనీయత ఆయన నిష్క్రమణం చెప్తుంది. దాదాపు 80 సంవత్సరాలు సంగీత ప్రపంచాన్ని ఆనందపరిచి -తన క్లేశాన్ని తనకే మిగుల్చుకుని -నిశ్శబ్దంగా, నిర్మలంగా, నిరాసక్తంగా శలవు తీసుకున్న నూకల యోగి. ఓ పరిపూర్ణమయిన జీవితానికి అరుదయిన, అపురూపమయిన ముగింపు అది. ఓ చరిత్ర ముగింపులో హుందాతనం, యో గం, వ్యక్తిత్వ శబలతనూ సమీకరించిన గొప్ప మానవతావాది -నూకల.


      gmrsivani@gmail.com   
     జూలై 15,  2013          

*************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   


KOUMUDI HomePage