Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here 
 
Are you using iPad ( any iOs Device)? Try direct MP3, Click here

      విద్యా వ్యాపారం - 3

ఉద్యోగాలకోసం చదువులుసాగి, డిగ్రీలకు ఉద్యోగాలిచ్చే వ్యాపారం బ్రిటిష్ వారి ధర్మమాఅని ఆ రోజుల్లోనే మన దేశంలో ప్రారంభమయింది.. మనవాళ్లు మేధావులు. ఇప్పుడు చదువుల్నే వ్యాపారం చేసే బజార్లని విరివిగా, విశృంఖలంగా కొనసాగిస్తున్నారు.

            దేశంలో వ్యాపారాల్లోకల్లా లాభసాటి వ్యాపారం- రాజకీయం. ఒక్క సారి పదవిలో ఉంటే ఎంత నొల్లుకోవచ్చో ఈ మధ్య చాలామంది నిరూపించారు. మంచి లాయకీ ఉన్న పెట్టుబడి పదవి. దానికి పెద్ద చదువులు అక్కరలేదు. వేలిముద్ర వేసే నిశానీకూడా మనకి మంత్రికాగలడు. మన మంత్రుల్లో ప్రస్థుతం జైలుకి వెళ్లినవారు, వెళ్తున్నవారు, వెళ్లవలసినవారూ చాలామంది ఉన్నారు. పార్లమెంటు సభ్యులు చాలామంది వారికోసం జైళ్లలో ఎదురుచూస్తున్నారు.

            మన దేశంలో రాజకీయనాయకులు పదవిలోకి రాగానే చేసే మొదటిపని కాలేజీలు తెరవడం. రాజకీయం తరువాత వారికి అచ్చొచ్చే మరోవ్యాపారం-చదువు. మన దేశంలో కాలేజీలు లేని రాజకీయ నాయకులు దాదాపు లేరు. తాము ఏ కొద్దిగానో చదువుకున్నా- సంపాదనకి చదువులతో ప్రమేయం లేదని వారి జీవితాలే నిరూపిస్తున్నా- చదువుల మీద వీరికి ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది? రెండు కారణాలు. చదువుల వ్యాపారం లాయకీ ఆని వీరు గ్రహించడంవల్ల. నిజంగా చదువుల వల్ల తమ జీవితాలు, బిడ్డల జీవితాలూ బాగుపడతాయని, తద్వారా తమ కుంటుంబానికి మంచి రోజులు వస్తాయని నిజమైన అర్తితో ఉన్న తల్లిదండ్రులు ఈ సమాజంలో ఉన్నారని వీరికి తెలియడం వల్ల. వీరికి చదువుల బజారు చల్లని చలివేంద్రం.

            ఇది చాలా లాభసాటి అయిన వ్యాపారం. డాక్టరు చదవడం వల్ల ఏం లాభం? రేపు ప్రాక్టీసు పెడితే లక్షలు గడించవచ్చు. మరి లక్షలు గడించే డిగ్రీకి ముందుగానే కొన్ని లక్షలు తమవాటాగా తీసుకునే టోకు వ్యాపారం ఈ చదువుల బజారు. కొన్ని కుటుంబాలలో డాక్టరు చదువుకున్న కుర్రాడికి లక్షలు కట్నం పలుకుతుంది. ఆ కట్నండబ్బు బజారులో పెట్టుబడి పెడితే- తర్వాత ప్రాక్టీసు అంతా కిట్టుబాటే కద? ఈ సూత్రాలు ఇలాంటి బజార్లలో సూచిస్తారు.

            మన దేశంలో ఒక దిక్కుమాలిన నానుడి ప్రచారంలో ఉంది. వైద్యో నారయణో హరిః ఆని. వైద్యుడు దేవుడులాంటివాడు అనలేదు మన సంస్కృతి. సాక్షాత్తూ దేవుడే అంది. సుమతీశతకకారుడు కూడా అప్పిచ్చువాడు, వైద్యుడు.. ఉన్న చోట ఉండమన్నాడు. ఏదీ? ఏ కార్పొరేట్ ఆసుపత్రిలో ఏ డాక్టరు తనకు తెలిసిన ఇద్దరు పేషెంట్ల పేర్లు చెప్పమనండి చూద్దాం. అదీ ప్రస్థుతం మన దేవుళ్ల కధలు. డిగ్రీకే లక్షలు పోసిన ఈ నిస్సహాయమయిన వైద్యుడు ఎందరి గొంతులు కోస్తే అ పైకం కిట్టుబాటవుతుంది?

            చావుబతుకుల్లో ఉన్న 88 ఏళ్ల మా పినతల్లిని చూడడానికి ఇంటికి రావడానికి డాక్టరుగారు నిరాకరించారు. ఆమె లేచి నడవలేని పరిస్థితి ఆవిడది. వైద్యుడు ఏ దిక్కుమాలిన సమాజానికి దేవుడు? ఈ దేవుళ్లకి మానసికమైన కమిట్ మెంటు యిచ్చే చదువులు ఎవరయినా నేర్పితేకద!

            తమిళనాడులో ఆంధ్రదేశం గురించి రాసి నేను అల్లరిపాలు కావడానికి ఇష్టం లెదుకనుక- డాక్టరు చదువుకి  కేవలం 75 లక్షలు యాజమాన్యానికి ముడుపు కట్టాలి. ఇక ఆ పై చదువులకి కోటీ పాతిక లేదా కోటిన్నర చెల్లించాలి. ఇంజనీరు చదువుకయితే 20 లక్షలు. మన రాష్ట్రంలో  ఇంజనీర్లు తామర తంపరగా తయారవుతున్నారు ఏటేటా. కారణం ప్రతీ రాజకీయనాయకుడికీ ఒక్కో కాలేజీ ఉండడమే. అవసరానికి మించి డిగ్రీలు ఉత్పత్తి అవుతున్నాయి-గమనించండి- ఇంజనీర్లుకాదు.

            ఇక చిన్న చదువుల్లో వేలకి వేలు దోచుకునే రకరకాల చదువుల బజార్లు తయారయాయి. అలనాడు మా పిల్లల చదువులకి నెలకి రూపాయి చెల్లించాను సెంట్రల్ స్కూళ్లలో. రాష్ట్రానికంతటికీ మొదటిస్థానంలో నిలిచిన వారి ఫొటోలు లోగడ పేపర్లలో వేసెవారు. ఇప్పుడు 2000 బజార్లు. ప్రతీ కాలేజీలోనూ మొదటి స్థానాల్లో నిలిచిన 3500 బొమ్మలు. చదువుకున్న వయస్సులోనే పిల్లలకి కీర్తి దురదని ఎక్కించే ప్రయత్నం కాదిది. తల్లిదంద్రులకి మత్తు. ఈ పరుగులో తమ కొడుకూ ఉంటే ఎంత బాగుంటుంది అని. ఇలాంటి పని ఒకప్పుడు సినీమా రంగానికే లాయకీ. ఇప్పుడు ఈ స్కూళ్ల కుర్రాళ్ల ఫోటోలు కోకొల్లలు. తమ వ్యాపారానికి పెట్టుబడి.

            రోజుకి 16 గంటల చదువులట. మా చిన్నతనంలో డిప్రెషన్, ఆత్మహత్యలు- ఇలాంటి మాటలకి అర్ధం తెలీదు. చెడుగుడు, తొక్కుడు బిళ్ల, గుడు గుడు కుంచంలాంటి ఆటలు ఉన్నాయని ఈ కాలం కుర్రాళ్లకి తెలీదు. లోకజానం లేని రూళ్ల కర్ర చదువులు లక్షలతో అమ్మే బజారులివి. తల్లిదండ్రులకి పిల్లల చదువులు తమ మంచి జీవితాలకి పెట్టుబడి. కార్పొరేట్ విద్యాసంస్థలకి చదువు వ్యాపారం. మొన్ననే ఓ మాజీ నిర్మాత- తన కొడుక్కి ఒక స్కూలులో తెలుగులో పాఠం చెప్తున్నారని భయపడి లక్షలు కట్టి ఇంగ్లీషు స్కూలుకి మార్చేశానని గర్వంగా చెప్పుకున్నాడు నాతో.

            మన ప్రభుత్వానికి ఈ పరిణామం లో వాటా ఏమిటి? తెలుగునాట తెలుగు స్కూళ్లలో తెలుగు నేర్పనక్కరలేదని తేల్చింది. ఇదీ ప్రభుత్వం చేసిన ఘనకార్యం. బడులు నడిపేవారికీ, విద్యాశాఖ పెద్దలకీ- పోలీసు శాఖలాగే మాసికాలు, ముడుపులూ ఉంటాయట. ఈ మధ్య ఎవరో అంటున్నారు- మా రోజుల్లో ఇన్ని మార్కులు ఎరగమని. ఇప్పుడు 98 శాతం, 99.5 శాతం రావడం ఆశ్చర్యంకాదు. ఇందులో బజార్లకీ, పరీక్షాధికారులకీ, తర్వాత సీట్లు ఇచ్చే పై చదువుల సంస్థలకీ మధ్య ఒప్పందాలుంటాయట. ఆ రోజుల్లో ఒక్క లెక్కల్లో తప్ప ఎవరికీ ఏ సబ్జెక్టులోనూ 70 శాతం దాటి వచ్చే అవకాశం ఉండేదికాదు. ఇప్పుడు తెలివిమీరింది విద్యార్ధులు కారు. విద్యని అమ్మే బజార్లు, కొనుగోలు చేసే నిస్సహాయులైన తల్లిదండ్రులు. మధ్యలో మార్కులు పంచి డబ్బుచెసుకునే దళారులూ.

            ప్రతి రోజూ బట్టీపట్టే కుర్రాడు రెండూ రెండూ కలిపితే ఎంతో చెప్పగలడు. ఎందుకు కలపాలో తెలీదు. చదువుయొక్క పరిణతి వారికి లొంగదు.  మార్కులొచ్చే యంత్రాలు, డబ్బు చేసుకుని పెట్టుబడిని భర్తీ చెసుకునే వ్యాపార దృష్టితో డిగ్రీలు పుచ్చుకుని వీళ్లు వీధిన పడతారు. ఈ దిక్కుమాలిన సమాజాన్ని మరింత దిక్కులేనిదిగా తమవంతు సహాయం చెస్తారు.వీళ్లు తమ వంటు బజారు తెరిచినా అశ్చర్యం లేదు.

            పద్నాలుగోయేట కధలు రాసే వినోదంనుంచి నన్ను కట్టడిచేస్తే నేను గుమాస్తా అయేవాడిని. మా నాన్న- ఓ మామూలు గుమాస్తా నాకు ఈ బజారు చదువులు చెప్పించలేకపోయేవాడు. గేదెలు కాసుకునే ఓ రైతుబిడ్డ ఓ పద్మభూషణ్ అయేవారుకాదు.

            ఏపిల్ కంప్యూటర్ తయారుచేసిన స్టీవ్ జాబ్స్ హైస్కూలుకి వెళ్లలేదు. యోగివేమన డిగ్రీ పుచ్చుకోలేదు.పోతన హలం పట్టి పొలం దున్నాడు. ఒకాయన సైకిలుకి పాల బిందెలు కట్టుకుని విజయవాడలో పాలు అమ్మి కాలేజీకి వెళ్లి చదువుకున్నాడు. అయన పేరు నందమూరి తారక రామారావు.

            చదువుల బజారు మంచి బతుక్కి కలలుగనే తల్లిదండ్రుల్ని కొల్లగొట్టే భయంకరమైన దోపిడీ. ఇందులో ప్రభుత్వానికీ, చదువుల వ్యాపారులకీ, మధ్యవర్తులకీ అందరికీ సరసమయిన వాటాలున్నాయి. ఈ దేశాన్ని ప్రభావితం చేయగల మేధస్సుని కాక, ఆచరణకు లొంగని కొన్ని వేల యంత్రాలు అన్యాయంగా ఈ బజార్లలో తయారవుతున్నాయి. వీటి నుంచి విముక్తి లేకపోవడం, ఉండాలన్న ఆలోచన మన పరిపాలకులకి లేకపోవడం మన దరిద్రం.

            ఉదాత్తత పదవులతో రాదు. ఉపజ్న బజార్లలో అమ్మకానికి దొరకదు. ఉద్యమం చిత్తశుద్ధి లేని వ్యాపారుల కర్మాగారాల్లో కార్యరూపం దాల్చదు.


 


      gmrsivani@gmail.com   
     జూన్ 17,  2013          

*************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   


KOUMUDI HomePage