Click Play to listen audio of this column If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here Are you
using iPad ( any iOs Device)? Try direct MP3,
Click
here
విద్యా
వ్యాపారం - 2
వ్యక్తిగతమైన, కేవలం కులం ప్రాతిపదికగా గల వృత్తుల నుంచి ఉద్యోగ వ్యవస్థవేపు
క్రమంగా భారతదేశపు సమాజం పరిణామం చెందింది. ఉద్యోగం ద్వారా సంపాదించుకునే
ఆదాయం, తద్వారా కుటుంబ నిర్వహ ణ, భవిష్యత్తులో కుటుంబ భద్రత -ఈ దిశగా
ప్రయాణం చేసింది. ఇది దాదాపు శతాబ్దం పైగా సాగిన మార్పు. తరతరాలుగా
అగ్రవర్ణాల పెద్దరికం కింద, అజమాయిషీ కింద, అణచివేత కింద నలిగిపోయిన
వెనుకబడిన వర్గాలు -ఏనాడూ తమ స్థాయినుంచి విముక్తి గురించి ఆలోచిం చనయినా
ఆలోచించలేని దశలో అలాంటి ఆశయాలకు, ఆలోచనలకు తావిచ్చిన మార్పు ఇది. ఎదుగూ
బొదుగూ లేని గ్రామీణ జీవనం, చేతికీ నోటికీ దారి వెదుక్కుంటూ జీవించే
గంగిరెద్దు జీవితం వీటినుంచి బయటకి చూసే వెసులుని ఈ వ్యవస్థ కల్పించింది.
ఇది పెద్ద గుహ చివర కనిపించిన చిన్న వెలుగు. మార్పుకి సంకేతం. కాగా గత 65
సంవత్సరాలలో వెనుకబడిన వర్గాలకు కల్పించిన వెసులుబాట్లు ఈ సంకెళ్లను
పూర్తిగా తెంచేశాయి.
తరతరాలుగా అభివృద్ధి నెరగని బడుగు కుటుంబాలు ఒక్కసారి వొళ్లు విరుచుకున్నాయి.
గ్రామం లో ఆస్తుల్ని అమ్ముకుని అయినా, తల తాకట్టు పెట్టి అయినా -ఒక్క
వ్యక్తికయినా ఉద్యోగాన్ని కల్పించే మార్గంగా ప్రయాణం చేశాయి. కుటుంబ
వికాసానికి హఠాత్తుగా ఏర్పడిన అవకాశాన్ని అందుకోడానికి అడ్డదారిన హుటాహుటిగా
ప్రయాణం చేసిన సందర్భమది. ఆదినుంచి ఆకాశాన్ని అందుకునే ప్రయత్నమది.
ఆశ్చర్యమూ లేదు. ఆక్షేపణా లేదు. చదువురాని ఇంటిపెద్ద కేవలం మంచి జీవితం వేపు
మోర సారించిన తరుణమది. తరాలుగా మ్రగ్గినవర్గాలు ఒక్కసారిగా వొళ్లు
విరుచుకున్న సందర్బ éమది. ఆతృతగా, ఆశగా లక్ష్యం వేపే వాళ్ల దృష్టి. వాళ్ల
పిల్లలు ఏం కావాలో వాళ్ల మనస్సుల్లో లక్ష్యాలున్నాయి. మంచి ఉద్యోగం, మంచి
ఆదాయాన్నిచ్చే, తమ కుటుంబ సరళిని మార్చేసే విముక్తి. దానికి ఒకటేదారి.
ఇంగ్లీషు చదువు. సాంకేతిక, శాస్త్రీయ వ్యాపార రంగాల్లో ఇప్పటికీ ఒక్క
ఇంగ్లీషు చదువే అవకాశాల్ని కల్పించే కల్పతరువు. (భాష, దేశభక్తి -యివన్నీ
చదువులేని ఆ తల్లిదండ్రులకు తెలియని విషయాలు). పిల్లలకి ఇంగ్లీషు చదువులు
చెప్పించాలి. తమ లక్ష్యాల దిశగా పిల్లల్ని నడిపారు. ఎందరో మెట్లన్నీ ఎక్కి
అంతర్జాతీయంగా తమ సత్తాని చాటారు. భారతీయ శాస్త్రరంగంలో అంతర్జాతీయ స్థాయికి
చేరిన యలమర్తి నాయుడమ్మ ఒక మామూలు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. సామాజిక
ప్రగతికి తన వృత్తిని అంకితం చేసిన డాక్టర్ సదాశివరావు వంటివారు ఎందరో
ఉన్నారు. ఇవన్నీ కొన్ని ఉదాహరణలు. మరో గొప్ప ఉదాహరణ. రెండున్నర ఎకరాల
కుటుంబం నుంచి వచ్చి నిమ్మకూరు నుంచి సైకిలు మీద పాలు విజయవాడకి తెచ్చి
ఇళ్లకీ, హోటళ్లకీ పోసి చదువుకున్న మరొక ఆసామీ ఉన్నారు. ఆయన పేరు నందమూరి
తారక రామారావు.
సంకెళ్లు తెగిపోయాయి. వేదాన్ని నమ్ముకున్న కుటుంబాలూ ఉద్యోగాలవేపు పిల్లల్ని
మళ్లించాయి. మొన్నటికి మొన్న ఒక వేదపండితుడు -తన జీవనం వేపు తన బిడ్డల్ని
నిలపడం ఇష్టం లేక కుటుంబ నియంత్రణ చేయించుకున్నానని నాతో చెప్పారు. పేరు
అనవసరం. న్యూ ఆర్లీన్సులో -దాదాపు 23 సంవత్సరాల కిందట -ప్రదర్శనలు ఇచ్చి
నేనూ, జె.వి.సోమయాజులు, పద్మనాభం, తులసి ఎయిర్‌పోర్టుకి ఒక డాక్టరుగారి
కారులో వస్తున్నాం. ఆయన ఘంటశాల పాటలు పెట్టారు. ఉన్నట్టుండి ''నేను మా
నాన్నని క్షమించలేను మారుతీ రావుగారు!'' అన్నారు. ఈయన పేరుమోసిన డాక్టరు.
భార్యా ఆయనా అక్కడ మంచి క్లినిక్ నడుపుతున్నారు.
ఆయన చెప్పుకొచ్చారు. ''మావూళ్లో -కుటుంబాల్లో పిల్లల్ని తలో, పొలమో
తాకట్టుపెట్టి అమెరికా పంపించా లన్న ముమ్మరంలో మా నాన్నా నన్ను ఇక్కడికి
తరిమా డు. ఇక్కడ ఆర్థికంగా నిలదొక్కుకున్నాను. కాని నా మనస్సుని మన దేశంలో
పారేసుకున్నాను'' -అన్నారు.
అవును. తరతరాల బడుగు జీవితాల నుంచి విడివడే ముమ్మరంలో ఎవ్వరూ ఏ బిడ్డ
ఆలోచనలకీ తావివ్వలేదు. ఆనాడు ఆర్థిక వికాసానికే ప్రాధాన్యం. అవకాశం ఉంటే
కళారంగంలోనో, మరో రంగంలోనో రాణించగల ఎందరో విదేశీ తెలుగువారిని తెలుసు నాకు.
డిట్రాయెట్‌లో డాక్టర్ వామరాజు మూర్తి, కెంట్ (ఇంగ్లండు)లో డాక్టర్
వ్యాకరణం రామారావు, డాక్టర్ నాగభైరు అప్పారావు, విగాన్‌లో డాక్టర్
కె.వివేకానంద మూర్తి, అబూదాబీలో డాక్టర్ కోడి రామారావు -యిలా. మీరు
క్షమిస్తే యిప్పుడూ అదే పరిస్థితి. పిల్లల్ని మంచి జీవితం వేపు తరిమే
పెద్దల -చదువుల కొనుగోళ్లు. అందుకే -చదువుల్లో సరదాలు పోయాయి. పోటీలు,
డిప్రెషన్లు, ఆత్మహత్యలూ -ఇదో కొత్త దశ. అయితే యిదొక ఉద్యమం. ఆ కుటుంబాల
పరంగా చూసినప్పుడు సంకెళ్లు తెంచుకున్న ఆవేశంలో దారితప్పిన కొన్ని ఉదాహరణలు.
అదొక వెల్లువ. ఇందులో -ఈ తరం కుటుంబాలు చెల్లించిన మూల్యం -భాష, తెలుగుదనం.
సమాజం చెల్లించిన మూల్యం -బ్రెయిన్ డ్రెయిన్. చదువులు మన దేశంలో, ఫలితం
మరొక దేశంలో.
ఇప్పుడిప్పుడు -ఇది పరిణామం కాదు. అప్పుడు వందల డాక్టర్లు వెళ్లారు. ఇప్పుడు
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు. అప్పుడది మార్పు. ఇప్పుడు? మంచి జీవితానికి అర్రులు.
తన కొడుకు బాగుపడాలి. అంటే ఏం కావాలి? ఫస్టుక్లాసు రావాలి. 98 శాతం మార్కులు
రావాలి. అమెరికా ఉద్యో గం రావాలి. లక్షలు సంపాదించాలి. మరొక ముఖ్య కారణం -నానాటికీ
చెదలు పట్టి, అవినీతితో కుళ్లిపోతున్న ఈ వ్యవస్థ నుంచి విముక్తి. ఈ మాట నాతో
ఎందరో అన్నారు. ఇక్కడ ఉండాలని ప్రయత్నించి, ఈ అవినీతికి షాక్ అయి అమెరికా
పారిపోయిన నా ఆనర్స్ సహచరుడు, శాస్త్రవేత్త -కృష్ణమాచారి. కేవలం జీవన
సాయంకాలం గడపడానికి మళ్లీ అమెరికాకి మళ్లిపోయాడు.
అతినేలబారు జీవితం గడిపిన ఓ రైతు కొడుకు -లేదా ఓ మామూలు కులవృత్తి
చేసుకుంటున్న వ్యక్తి కొడుకు -అమెరికాలో అనూహ్యమైన కొత్త జీవన ప్రణాళికని
ఏర్పరుచుకుంటాడు. కారు, తన యిల్లు, పరిశుభ్రమయిన జీవితం, కంపుకొట్టే నీచపు
రాజకీయాలు లేని వ్యవస్థ. సంపాదించే ప్రతీ డాలరూ ఇక్కడ 50 రెట్లు
ఫలితాన్నిస్తుంది. చేసిన కృషి -ఏనాడూ ఎరగని తన తల్లిదండ్రులకి సుఖాన్ని
కొనిపెడుతుంది. అతను భాష తగలడిపోతోందని గింజుకునే తెలుగువాడు కాదు. తరాల
దాస్యం నుంచి ఈ తరంలోనే బయటపడి వెలుగు చూస్తున్న వాస్తవాన్ని ఎరిగిన మనిషి.
తన తమ్ముడికి చదువు చెప్పిస్తున్నాడు. చెల్లెలికి పెళ్లి చేస్తున్నాడు.
తల్లి జబ్బుకి వైద్యం చేయిస్తున్నాడు. ఆ దేశపు చట్టానికి వొదిగి -ఎవరి
ప్రమేయం లేకుండా హాయిగా బతుకుతున్నాడు. ఇక్కడ ఆధార్ కార్డుకి లంచం. పన్ను
కట్టడానికి లంచం. కట్టకుండా ఎగవేసే లంచం. కొడుకుని స్కూల్లో చేర్చాలంటే లంచం.
బదిలీ కాగితం చేతికి రావాలంటే లంచం. ఆసుపత్రికి గుండె తణిఖీకి వెళ్లాలంటే
లంచం. ఎందుకీ దరిద్రపు, కుక్కబతుకు? ఇవి నా మాటలు కావు. అక్షరాలా నేను
విన్న మాటలు. నామిత్రుడు -ఓ అతి మామూ లు గుమాస్తా కొడుకు. వీడూ గుమా స్తాయే.
వీడి కొడుకు అమెరికా వెళ్లాడు. ప్రతి మూడేళ్లకీ 20 రోజులు వస్తాడు.
ప్రతివారం గంట మాట్లాడుతాడు. వాడి కొడుకుకి తెలుగురాదు. నేను అడిగాను. నా
మిత్రుడి సమాధానం: ''నాతరంలో వాడు అనుభవించేవేవీ నేను చూడలేదు. అక్కడ
వాడయినా సుఖంగా ఉంటాడు''. ఇది గొప్ప నిస్త్రాణ. ఆ సౌకర్యాలు ఇవ్వలేని ఈ
దేశంలో పరిస్థితులు ఎరిగిన ఒక తండ్రి తెగింపు.
ఈ దశగానే ఇప్పుడిప్పుడు కుటుంబాలన్నీ ప్రయాణం చేస్తున్నాయి. మంచి జీవితానికి
మార్గం మంచి ఉద్యోగం. మంచి ఉద్యోగానికి పెట్టుబడి -మంచి చదువు. మంచి చదువంటే?
బాలశిక్ష, మనుచరిత్రకాదు. ఇంగ్లీషు చదువు. సాంకేతికంగా, వ్యాపార రంగంలో
ప్రగతికి మన బాష ఏ కొద్దిగానయినా పనికిరాదు. అవసరమైన ఒకే ఒక భాష -ఇంగ్లీషు.
పాలస్థినా, కొరియా వంటి చిన్నదేశాలు -ప్రపంచంలోని అన్ని సాంకేతిక విలువలనూ
తమ బాషలోకి తెచ్చుకున్నారు. కొరియా ఇవాళ అణ్వస్త్రాలు తయారు చేస్తోంది.
కొరియా మనుషులు అమెరికా ఉద్యోగాల్లో కనిపించరు. మన తల్లి భాష? గుమాస్తాగా
మురుగుతున్న నౌకరీ చేసుకొనేవాడికి ఎందుకు? తన కొడుకు బాగుపడాలి. బాగు అంటే?
మంచి ఆదాయం. డబ్బు. సుఖం. అంతే. మన విద్యా వ్యవస్థలో -ఎవరు ఆపి నా ఆగని -ఆపలేని
పెనుతుపాను -ఇంగ్లీషు చదువు. అప్పుడది విముక్తి. ఇప్పుడిది అవకాశం. మంచి
జీవితానికి దగ్గర తోవ. కష్టపడి బిడ్డని చదివిస్తే, వాడు అమెరికా వెళ్లి మంచి
ఉద్యోగం చేస్తే -లక్షలు గడిస్తే -ఇదే మామూలు సగటు మనిషి కల. మా పనిమనిషి
రెక్కలు ముక్కలు చేసుకుని తన కూతురిని బీటెక్ చదివిస్తోంది. ఆవిడ
పాచిపోయిన అన్నం తినదు. కూతురు తల్లికి సహాయం చెయ్యడానికి రాదు. అచిరకాలంలో
ఆమెకూడా నా స్థాయిలోనే హాయిగా, డిగ్నిటీతో బతకగలదు. వ్యవస్థలో దృష్టి
మారిపోతోంది.
ఇదిగో -ఈ నేపథ్యంలో చదువుల బజారుకి పునాదులు ఏర్పడ్డాయి. దాన్ని అవినీతి
అందామా? పోటీ అందామా? మీ ఆశలకు మధ్యవర్తులు నిర్ణయించిన మూల్యం అందామా?
వ్యాపారం నిలదొక్కుకుని -మీ ఆశలకు ఇప్పుడే ఖరీదుల్ని నిర్ణయించే సంస్థలు
తలయెత్తాయి.
(ఇది విద్యావ్యాపారంలో రెండో భాగం మాత్రమే)