Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here 
 
Are you using iPad ( any iOs Device)? Try direct MP3, Click here

      విద్యా వ్యాపారం - 1

   విద్యా వ్యాపారం ఒక విషవృక్షం. దీనికి మూలాలు ఎక్కడో ఎప్పుడో పడ్డాయి. ఈ తరంలో ఉపాధికీ, మంచి జీవనానికీ, సంపాదనకీ, కులాల వికాసానికీ, భాష సర్వ నాశనం కావడానికీ, అన్నిటికీ మించి చదువులు కార్పొరేట్‌ వ్యాపారం కావడానికీ -అన్నిటికీ పునాదులు ఏర్పడి తేలికగా నూటపాతిక సంవత్సరాలయింది. ''అన్నీ మన వేదాల్లోనే ఉన్నాయిష!'' అని అనుకోవలసిన రోజులు. నాకు తెలిసింది, తెలిసినంత మట్టుకు విన్నవిస్తాను.
సాహిత్యం చరిత్రకు రుజువులు సిద్ధపరుస్తుంది. చరిత్ర గోత్రాలు సాహిత్యంలో దొరుకుతాయి. 1897లో ప్రచురితమయిన గురజాడ 'కన్యాశుల్కం' -ఈనాటి పరిణా మాలకు ప్రారంభ సూచికలని అందజేస్తుంది. గిరీశం వెంకటేశంతో కలిసి వాళ్ల ఊరు వచ్చినప్పుడు అగ్నిహోత్రా వధాన్లు భార్య వెంకమ్మ ''బాబూ -యేదీ, మా అబ్బాయీ మీరొక్క పర్యాయం ఇంగిలీషు మాట్లాడండి బాబూ'' అని అడుగుతుంది. పర్యవసానం 'ట్వింకిల్‌ ట్వింకిల్‌ లిటిల్‌ స్టార్‌..' అంటూ చేసిన మోసం. ఇంగిలీషు మోజు అప్పటికే ప్రారంభమయిపోయిన రోజులు. వీళ్లని నోరెళ్లబెట్టి చూస్తు న్న మరో కుర్రాడు -కరటక శాస్త్రి శిష్యుడు -''మృగా ప్రియాళు దృమమంజరీణాం'' ఎవడిక్కావాలి -యీ చదువిక్కడితో చాలించి గిరీశం గారి దగ్గర నాలుగు ఇంగిలీషు ముక్కలు నేర్చుకుంటాను -అని ఉవ్విళ్లూరిపోతాడు.
ఎందుకు ఇంగ్లీషు మీద మోజు? కొత్త ఒక వింత అని మాత్రమే కాదు. కుంపిణీ వారు (ఇస్టిండియా కంపెనీ) మన దేశంలో కాలుమోపి అప్పటికే 130 సంవత్సరాల యింది. నిలదొక్కుకుని -వారి పాలన, వారి విధానాలు, వాటి ప్రభావం పల్లె పల్లెకీ ప్రాకడానికి చాలా సమయం పట్టింది. అంతకు ముందున్న వృత్తులు మారిపోయాయి. ఉద్యోగాలు మనవారికి తెలియవు. గ్రామం ఒక సమిష్టి జీవన కుటుంబంగానే ఉండేది -వాటిలో లోటుపాట్లు ఎలా వున్నా. చదువులు, ఉద్యోగాలు, బోనస్‌లూ, జీతాలూ, ప్రమోషన్లు -యిలాంటివి కొత్త. మించి -జన జీవనాన్ని ప్రభావితం చేసే ఎన్నో మార్పులు -దొరల పద్ధతులు వచ్చా యి. (అవి ఎన్నో మేళ్లనూ చేశాయి. మనం చర్చించేది మార్పు కనుక ఆ విషయాన్ని కాసేపు పక్కన పెడదాం) మారిపోతున్న సామాజిక, ఆర్థిక వ్యవస్థలో తెలుగు, సంస్కృతం చదువులు వెనకబడి ఇంగ్లీషు చదువు అవసరం, తత్కారణంగా దానిపట్ల మోజు గ్రామాలలో స్థిరపడుతున్న -తొలిరోజులవి. ఇంగ్లీషు వచ్చిన కారణం గానే అగ్నిహోత్రావధాన్లు గిరీశాన్ని తన ఇంట్లో ఉండనిచ్చాడు. కారణం? ''డబ్బు కానీ ఖర్చులేకుండా వీడిచేత కాగితం ముక్కలన్నీ తర్జుమా చేయించేస్తాను'' అనుకున్నాడు స్పష్టంగా. ఏమిటా కాగితం ముక్కలు? కోర్టు కాగితాలు. అప్పటికే కోర్టు వ్యవహారాల్లో ఇంగ్లీషు అవసరమూ, తప్పనిసరికావడమూ మొదలయింది. అంత కుముందు చదువులంటే -మళ్లీ అగ్నిహోత్రావధాన్లు మాటల్లోనే 'కానీ ఖర్చు లేకుండా గురువుగారి ముఖత: వే దం నేర్చుకో వడం'. దానివల్ల ఉపయోగం? ఇది ముఖ్యం -చదువు ఉపయోగానికి, వినియోగానికి, ఉద్యోగానికి, సంపాదనకి, జీవనాన్ని మరింత సుఖమయం చేసుకోడా నికి, ఆస్తులు పెంచుకోడానికి కానేకాదు. ఆ రోజుల్లో చదువుకీ, వీటికీ ఏమీ సంబంధం లేదు. విద్య ఉపాధికి కాదు. విజ్ఞానం అమ్ముకోడానికి కాదు. వికాసానికి. ధర్మాన్ని నిలుపుకో డానికి. సరే.
ఇంగ్లీషు పరిపాలనలో కోర్టు వ్యవహారాలన్నీ ఇంగ్లీషులో నడవడం ప్రారంభమయి చాలా రోజులయిం ది అప్పటికే. కోర్టు వ్యాజ్యాలకి ఆస్తులు తగలెట్టుకోవడం, వాటి పద్ధతులు తెలియని -ఇంగ్లీషు రాని వాళ్లని -ఏ కాస్తో ఇంగ్లీషు వచ్చినవారు నంచుకు తినడం ప్రారంభమయి పోయింది. 'కన్యాశుల్కం' నాటకమం తా వెధ్వల్‌ (కోర్టులు), ప్లీడర్లు, కోర్టు కేసులు, సాక్షులు, దావాలు -యిదే వ్యవహారం.
''నాకు ఇంగ్లీషు తెలియకపోవడం చాలా చిక్కొచ్చింది'' అని వాపోతాడు అగ్నిహోత్రావధాన్లు.
''మీకే ఇంగ్లీషు వొస్తే భాష్యం అయ్యంగార్లా అయిపో రా?'' అంటాడు గిరీశం. ఎవరా భాష్యం అయ్యంగారు? అప్పటికి పేరు మోసిన న్యాయవాది -సంయుక్త మద్రాసు రాష్ట్రంలో. జనజీవనాన్ని 'ప్రయోజనం' పెట్టుబడిగా, ఆవశ్యకత మూలకారణంగా -ఉపాధికోసం, ఉద్యోగాల కోసం కొత్త చదువుల అవసరం, గిరాకీ, మోజు, నేర్చుకో వాలన్న ఆర్తీ పెరిగింది -మరో అడుగు ముందుకువేసి అర్థం చేసుకుంటే -నేర్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. కన్యాశుల్కం నాటికి చదువు బాగా సాధించానని గిరీశం బుకాయించినా, పద్ధతిగా చదువుకున్న సౌజన్యారావు పంతులదే పైచెయ్యి.అంటే -మనకి తెలిసి -116 సంవత్సరాల కిందట ఆనాటి జనజీవనానికి ఇంగ్లీషు పునాది అవుతున్న రోజులు. నిస్సహాయంగా ప్రతీవాడూ తనకి తెలియని భాష వేపు తను ఆశించే జీవనానికి అర్రులు చాస్తున్న రోజులు.
116 సంవత్సరాల తర్వాత -2013లో ఇంగ్లీషు చదువులు చదువుకుని, గొప్ప ఉద్యోగాలు చేసి, కోరి అమెరికాలోనే పిల్లల్ని కని, పిల్లలకి అమెరికా పౌరసత్వాన్ని పుట్టుకతోనే సంపాదించిపెట్టినందుకు గర్వపడి ఆనందించే తరాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. పదేళ్లు గా అమెరికాలో ఉంటున్న తన కూతురు కొడుకు (మనుమడు) తెలుగులో మాట్లాడడం అస్సలు రాకపోతే -ఆ పసివాడితో మాట్లాడడానికి నా తమ్ముడి భార్య ఇప్పుడి ప్పుడు ఇంగ్లీషు పాఠాలు నేర్చుకుంటోంది -ఇంగ్లీషురాని బ్రాహ్మణా గ్రహారం -గంగలకుర్రు అమ్మాయి. ఆనాటి వెంకమ్మకి కుర్రాడు ఇంగ్లీషు మాట్లాడితే మోజు. ఈనాటి సూరమ్మకి మనుమడు తెలుగు మాట్లాడితే అపురూపం! విచిత్రం! శ్రీపాదవారి కాలంలో తెలుగు చదువుకోవ డం నిషిద్ధం. ఆయనకి మనుచరిత్ర చదువు కోవాలని ఉంటే ఉపాధ్యా యుడు పాఠం చెప్పడానికి నిరాకరించాడు. మనుచరిత్ర చదువుకుని చెడిపోతాడని తండ్రి బాధపడ్డాడు. ఆ రోజుల్లో సంస్కృతం చదువు కోవడం సంప్రదా యం. తరువాత కొంతకా లం -తెలుగు. అటు తర్వాత ఇంగ్లీషు చదువు అవసరం. ఆనాటి సంస్కృతం చదువు కేవలం ధర్మనిష్టకి. ఇంగ్లీషు చదువు కేవలం -ఉపాధికి.
మార్పు అవసరాన్ని ఒరుసుకుని జీవనాన్ని పెనవేసుకుంది. ఉపాధి దాని మూలకారణం. మంచి జీవితం లక్ష్యం. కొందరికి -ఆ రోజుల్లో మనగలగడం లక్ష్యం. ఆనాడు ఇంగ్లీషు నేర్చుకోడానికి తాపత్రయపడే దశ ఇప్పుడు తల్లి భాషని బతికించుకోవాలనే యావ. ఏ కాస్త మాట్లాడినా అదృష్టం. కనీసం మనవలతో ఏ కాస్త వాళ్ల కొచ్చిన భాషలో ముచ్చటించగలిగినా ఆమెకి ఆనందం.
ఒక శతాబ్దం కిందట -పాలక వ్యవస్థ మనకిచ్చిపోయిన పాశ్చాత్య జీవన విధానంలో వొదగడానికి అతలాకుతల మయి -తమకు తెలియకుండానే -లేదా ఏ కాస్తో, ఏ కొద్దిమందికో తెలిసినా (కరటక శాస్త్రి శిష్యుడిలాగ) భాషని అటకెక్కించి -అవసరాన్ని అటక దించడంలో -పూర్తి పరాకాష్టని సాధించిన దశ ఈనాటిది. ఇప్పుడు మన యావ తెలుగుని ఉద్ధరించడం. అది బలహీనపు యావ అనుకుం దాం. ఉపాధి కారణంగా అమెరికాలో మాయమయి -శాశ్వతంగా కుటుంబం నుంచి నిర్ధాక్షిణ్యంగా తెగిపోతున్న రెండోతరాన్ని నిస్సహాయంగా మరిచిపోతున్న పరిస్థితి. మా బంధువు -ఒకాయన ఇద్దరు పిల్లలూ నల్లబ్బాయిల్ని పెళ్లి చేసుకున్నారు. అమెరికాలో పెరిగే ఏ పిల్లలూ తెలుగు మాట్లాడరు. ఆ కారణంగా తెలుగువారితో కలవరు. వాళ్లకి తెలుగుదేశం తెలీదు. తెలియాల్సిన అవసరం తెలీదు. నిన్ననే! -కేవలం నిన్ననే -మా తమ్ముడి మనుమడు -నన్ను ఇంగ్లీషులో అడుగుతు న్నాడు -''మా అమ్మని (అంటే నా తమ్ముడి కూతుర్ని) నీకెలా తెలుసు?'' అని!! వీడు తన కుటుంబానికి దూరమవడం ప్రారంభించి అయిదేళ్లయింది. వాడి వయస్సు అయి దు. ఉగ్గుపాలతో ఈ భ్రష్టత ప్రోదవుతోంది.
(ఇది 'విద్యా వ్యాపారం' శీర్షికలో కేవలం మొదటి భాగం.)


      gmrsivani@gmail.com   
     జూన్ 10,  2013          

*************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   


KOUMUDI HomePage