Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here 
 
Are you using iPad ( any iOs Device)? Try direct MP3, Click here

       వందేళ్ల సినిమాకి వందనాలు 


సినిమా తెరకెక్కి వందేళ్లయింది. నేను సినిమాకెక్కి ఏభై యేళ్లయింది. 1913లో దాదా సాహెబ్‌ ఫాల్కే 'రాజ హరిశ్చంద్ర' మొదటి చిత్రం. 1963లో 'డాక్టర్‌ చక్రవర్తి' నా మొదటి చిత్రం. సినిమాతో నా బంధుత్వాన్ని చెప్పడాని కే, చెప్పడం వరకే ఈ విషయం.
నేను సినిమాలో తొలిపాఠాలు నేర్చుకున్న రోజుల్లో -సినిమా బాగా ఆడడానికి ఏయే హంగులు ఉండాలో ఎవరూ ప్రసస్తంగానయి నా మాట్లాడిన గుర్తులేదు. వ్యాపారపరంగా ఏ సినిమా డబ్బు చేసుకుంటుందో కూడా చెప్పిన గుర్తు లేదు. సమాజంలో నైతిక విలువలో, మానవీయమైన ఇతివృత్తమో, హృద్యమైన పాత్రలో, ఆర్ధ్రమైన సంఘటనలో -వీటి గురించే నెలల తరబడి మాట్లాడుకున్న గుర్తు. ఇవన్నీ సినిమా రాణించడానికి, ప్రేక్షకుల ఆదరణ పొందడానికి ప్రాథమికమైన అవసరాలని మాత్రమే చర్చలు జరిగేవి.
ఒక జట్కావాడు. చెల్లెలు. తండ్రి ఏ కారణానికో అతని చిన్నతనంలోనే జైలుకి వెళ్లాడు. చెల్లెలికి పెళ్లి చేశాడు. తీరా బావ తండ్రినే తన తండ్రి హత్య చేశాడని తెలిసింది. చెల్లెలి కాపురం చెడింది. ఆమె జీవితాన్ని చక్క దిద్దడానికి తండ్రి నిరపరాధి అని నిరూపించా డు. ఇదీ కథ. బాధ్యత గల అన్న, కాపరాన్ని చక్కదిద్దుకున్న చెల్లెలు, నిర్దోషి అయిన తండ్రి -ఇది రాణించే కథ. సినిమా రజతోత్సవం చేసుకుంది. పేరు 'పూలరంగడు'. మరో పాతికేళ్ల తర్వాత మళ్లీ అదే కథ రాశాను. ఈసారి చిరంజీవితో. మళ్లీ వందరోజులు పోయింది. పేరు 'ఆలయ శిఖరం'.

విలువల్ని నమ్ముకున్న సినిమాలవి. డబ్బుకోసం అమ్ముకుంటున్న సినిమాలు ఇప్ప టివి. ఒక్క తెలుగు చిత్రాలనే తీసుకుంటే -ఆనాటి లవకుశ, మల్లీశ్వరి, మాయాబజారు, మనుషులు మారాలి, ప్రతిఘటన, సీతారామయ్యగారి మనుమరాలు -మచ్చుకి ఇవన్నీ ప్రేక్షకుల్ని ఊరించే దృష్టితో తీసినవికావు. అలరించే దృష్టితో తీసినవి. వాటికి రాణింపూ, ఆదరణా, చరిత్రలో భాగమయే గౌరవం -మూడూ దక్కాయి. ఏదీ? ఈ మధ్య కోట్లు సంపాదించిన చిత్రాల్ని -గుర్తుంచుకు -నలుగుర్ని కనీసం నాలుగు పేర్లు చెప్పమనండి.
దేశ స్థాయిలో మదర్‌ ఇండియా, వక్త్‌, మొఘల్‌ ఏ ఆజం, అంకుర్‌, జాగ్‌తే రహో -యిలా ఎన్నయినా చెప్పవచ్చు. ఇవన్నీ విలువల్ని ఎత్తిచూపే పనిచేశాయి. డబ్బు చేసుకున్నాయి. ''ఈ సినీమాలు చూడండి బాబోయ్‌!'' అని గోలపెట్టలేదు. పెద్దమనిషి అరవడు. కొంటె కుర్రాడు కేకలేస్తాడు.విలువల పతనానికి ఒకే ఒక కారణం -డబ్బు, సినిమాకీ, డబ్బుకీ మొద టినుంచీ లంకె ఉంది. అయితే పెళ్లాం నగలు తాకట్టుపెట్టి రాజా హరిశ్చంద్రని తీసిన ఒక జిజ్ఞాసి స్థాయినుంచి -సినిమానీ, విలువల్నీ తాకట్టుపెట్టి బాంకు అకౌంట్లు పెంచుకునే స్థాయికి సినిమా 'రాజీ' పడిపోయింది. ఇదీ స్థూలంగా సినిమా చరిత్ర పరిణామం -ఒక్కమాటలో. ఇవాళ సాంకేతిక విలువల్లో కాని, సామర్థ్యంలో కాని ఏ భాషకీ, ఏ దేశానికీ తీసిపోని స్థాయిలో మన తెలుగు పరిశ్రమ ఉంది. 'ఈగ' వంటి చిత్రం భారతీయులుగా మనల్ని ప్రపంచ పఠంలో నిలపగల స్థాయి. కాని హృదయం లోపించింది. విచిత్రమేమిటం టే -విలువలు లేకపోయినా 'సరుకు' అమ్ముడుపో తోంది. విలువలు ఎవరో నిర్దేశించేది కాదు. నిర్మాత, దర్శకుని సంస్కారానికీ, సామాజిక బాధ్యతకి సంబంధించింది. ఇది లేకపోతే ఎవరూ ఉరితీయరు. ఒక గొప్ప మాద్యమానికి ఉన్న, ఉండగల 'నీతి' బలి అయిపోతోంది. అమ్మని 'అమ్మా' అని పిలవడం సంస్కారం. దాన్ని ఎవరూ నేర్పరు. అది జన్మత: వచ్చే విలువ. వ్యాపార కోణంతో సంధించే ఒక గొప్ప మాద్యమంలో స్వచ్ఛందంగా నిలుపుకోవలసి న ఈ గొప్ప అంశాన్ని క్రమక్రమంగా సినిమా కోల్పోవడమే నూరేళ్లలో పరిణామానికి పెద్ద నిదర్శనం.
ఈ పరిణామం అన్ని దేశాలలో, అన్ని సిని రంగాలలోనూ జరుగుతోంది. సినిమా కంటే అతి చురుకైన, డ్రాయింగు రూముల్లోకి దూసుకువచ్చిన మాద్యమాన్ని (టీవీ) సంధించే ఈ ప్రక్రియకి ఇదివరకెన్నడూ లేని కోరలు వచ్చాయి. తెరమీద ఆకర్షించే గుణం ప్రతీ నట్టింట్లో తుపాకీ లాగ పేలుతోంది. అమితాబ్‌ బచ్చన్‌ పాపులారిటీకీ అలనాటి శివాజీ గణేశన్‌ పాపులారిటీకీ బొత్తిగా పోలికలేదు. ప్రతిభలో కాదు. ప్రచారం లో.కారణం మాద్యమం విస్తృతి. ఈ విస్తృతి బలమైతే? ఈ విస్తృతి ఒక ఆరోగ్యకరమైన సందేశాన్ని కూడా చిత్రానికి సంధించగలిగితే?
నేలబారు జీవితాలను అలరించే పోకిరీతనాన్ని, తిరుగుబాటునీ (సహేతుకమైన దికాదు), బాధ్యతా రాహిత్యాన్ని సినీమా అలంకరిస్తే మొన్న ఢిల్లీలో ఏడుగురు ప్రబుద్ధుల పైశాచిక ప్రవృత్తికి మనం వారసులమౌతాం. సెకెనుకి 24 ఫ్రేములు కదిలే సినిమా 'సెకెనుకి 24 సార్లు నిజాన్ని లేదా అబద్ధాన్ని లేదా పోకిరీత నాన్ని బూతద్దంలో చూపిస్తుంది. నష్టపోయే సమాజంలో ఈ సినిమా ప్రపంచమూ ఉంది. నా కొడుకూ ఉన్నాడు. మీ చెల్లెలూ ఉంది. సినిమా భగవద్గీత చెప్పనక్కరలేదు. ఆ పని సీనిమాదికాదు.
నిన్నకాక మొన్న అలరించిన మణిరత్నం ''నాయకన్‌'' సినిమాని ఉదహరిస్తాను. తన కారణాలకి సమాజం మీద తిరగబడిన ఒక మాఫియా నాయకుని కథ. భయంకరమైన అవినీతి పెట్టుబడిగా పెరిగి, నిలదొక్కుకుని, నిర్దుష్టమైన ఉపకారిగా మారడం రెండో పార్శ్యం. అయితే ఏది ఆకర్షిస్తుంది. దుర్మార్గమే. తిరుగుబాటే. చివరలో కుక్కచావు చచ్చే అతణ్ణి మూడోతరం ప్రశ్నిస్తుంది -అతని మనుమరాలు. ''నువ్వు మంచివాడివా? చెడ్డవాడివా?'' అని. ప్రాణం వదలబోయే ముందు ఒక్క క్షణం ఆలోచించి, నిస్సహాయంగా ''తెలీదు'' అంటాడు నాయగన్‌. ఆ సన్నివేశం మహాకావ్యం. ఒక దుర్మార్గుడి ఆకర్షణమీయమైన కథకి -బాధ్యతగల నిర్మాత, దర్శకుడి ముక్తాయింపు.
సినిమాని ఆకాశంలో నిలపగల నేర్పుని కూడదీసుకున్న ఈ తరం -విలువల్ని నిలిపే చిత్రాలు డబ్బుతో పాటు, పేరునీ, వాటి ఆయుర్దాయాన్ని పెంచుకుంటాయని నమ్ము తూ సినీమాలు తీయగలిగితే (మొన్న మొన్నటి 'ది వెడ్నెస్‌ డే', 'తారే జమీన్‌ పర్‌',నిన్నటి 'మిధునం') మరో నూరేళ్ల తర్వాత విలువలూ, వికాసమూ కలిసి వచ్చే మరో కొత్త శతాబ్దానికి నాందీ పలకగలదని నాకనిపిస్తుంది.

 


                                                                           gmrsivani@gmail.com  

 
     మే 13,  2013          

*************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   


KOUMUDI HomePage