Click Play to listen audio of this column If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here Are you
using iPad ( any iOs Device)? Try direct MP3,
Click
here
వరాల వెల్లువ
వరం అర్హతతో వచ్చేదికాదు. సాధించుకుంటే దక్కేది కాదు. అప్పనంగా కొట్టేసేది.
అది దేవుడయినా, యజమాని అయినా, నాయకుడయినా -ఆయన ఇష్టప్రకారం ఇచ్చేది. దాని
పరిమితి ఎదుటివాడి దయా దాక్షిణ్యం. హిరణ్యకశిపుడు చావులేని వరం అడిగాడు. ''అది
కుదరదు. ఎలా చావకూడదనుకున్నావో చెప్పు'' అన్నాడు బ్రహ్మదేవుడు. మన నాయకులూ
అంతే. మనకేం కావాలో ఊహించుకుని, ఏది యిస్తే రాణిస్తుందో పసిగట్టి, యివ్వడం
వల్ల తమకొచ్చే లాభాన్ని ముందుగా మీకు చెప్పి, మీ ముక్కుపిండి -అప్పుడు
యిస్తామంటారు. మీకు కావాల్సింది కాదు. వారికి ఇవ్వడానికి అనువుగా ఉన్నదీ,
ఇవ్వడం వల్ల వారికి కలిసివచ్చేదీను. ఉదాహరణకి: తమిళనాడులో పేదలు ప్రతీ ఇంటికీ కలర్ టీవీ అడగలేదు. కాని గవర్నమెంటు ఇస్తానంది. పేదవాడికి గంజికావాలి.
అందరూ తినగలిగిన వనరులు కావాలి. కాని రెండు రూపాయలకి బియ్యం యిస్తానంది.
మరి పప్పు? వంటచెరుకు? ఉప్పు? చింతపండు? గవర్నమెంటు జాబితాలో చింతపండులేదు.
అన్నిటికీ మించి రెక్కలు ముక్కలయేటట్టు పనిచేసి వచ్చిన పేదవాడికి 200
మిల్లీల 'సరుకు' కావాలి. ప్రభుత్వం ఇవ్వదుకదా? కనుక -ప్రభుత్వం ఇచ్చే
మేలురకం బియ్యాన్నీ, టీవీలనీ అమ్మి -తనకి కావలసింది కొనుక్కున్నాడు
తమిళనాడులో. ప్రభుత్వం పంచిన వారం రోజుల్లో ఏ గుడిసెలో నూ కలర్ టీవీ పాటలు
పాడలేదు. మేలురకం బియ్యం లారీలు ఆంధ్రా, కర్ణాటక సరిహద్దుల్లో పట్టుబడ్డాయి.
ప్రభుత్వం ఒకందుకు ఇచ్చింది. నేలబారు మనిషి మరొకందుకు వాడుకున్నాడు.
అన్నిటికన్నా ముఖ్యమయినది -గవర్నమెంటు బలహీనత -వరాలతో వోట్లు రాబట్టాలనే
యావ, వరాలతో పదవుల్లోకి రావాలనే తాపత్రయం వోటరుకి పెట్టుబడి. వోటర్లకి -కులాలను
బట్టి, మతాలను బట్టి, వాడలను బట్టి, పేటలనుబట్టి ఒక్కో మేస్త్రీ ఉన్నాడు.
అతను రేపు ఎమ్మెల్యే అవుతాడు. ప్రభుత్వం నుంచి ఏం రాబట్టాలో ఎంత రాబట్టాలో
అతనికి తెలుసు. లంచం అలవాటుగా మారిపోయిన నేటి వ్యవస్థలో వోటుకి బహిరంగంగా
లంచం యిచ్చే నాయకులను బ్లాక్‌మెయిల్ చెయ్యడం ఏం కష్టం? ఈ లావాదేవీల రామాయణం
పేరు మనదేశంలో ఒకటుం ది -దానిపేరు 'ప్రజాస్వామ్యం'.
సరదాగా మన రాష్ట్రంలో వరాలను
పరిశీలిద్దాం...
మొన్న పాదయాత్ర ముగిశాక ప్రతిపక్ష నాయకులు కురిపించిన నమూనా వరాల వెల్లువ:
అన్ని వ్యవసాయ రుణాల మాఫీ, బెల్టు దుకాణాల బాధితులయిన స్త్రీలకు మేళ్లు,
స్త్రీల పట్ల అత్యాచారాలపై త్వరగా విచారణ జరిపే కోర్టులు, బీసీలకు చట్ట
సభల్లో నూరుసీట్లు, పదివేల కోట్ల ఉపకార పధకం, కాపులకు రిజర్వేషన్లు,
బ్రాహ్మణులకు 500 కోట్ల ఉపకారాలు, డ్వాక్రా మహిళలకు వడ్డీల మాఫీ, ఇది కాక
పుట్టిన ప్రతీ ఆడపిల్లకీ ఆర్థిక సహాయం, ప్రభుత్వ ఉద్యోగులకు ఉచితంగా ఇళ్లు,
పేదలకు ఇళ్లు, ముస్లిం యువతులకు ఏభైవేల రుణాలు, దేశం లో ప్రతి మసీదులో
పనిచేసే ఇమామ్, ముజ్జిన్‌లకి మూడువేలు, ఐదు వేల నెలసరి జీతాలు, చదువుకున్న
నిరుద్యోగ యువతకు నెలసరి మంజూర్లు -ఇవి స్థాళీపులాక న్యాయంగా కొన్ని మాత్రమే.
ఇక ప్రభుత్వ వరాల నమూనా: విద్యార్థులకు ఆర్థిక సహాయం, విదేశాలలో చదువుకునే
వెనుకబడిన కులాల విద్యార్థులకు 5 లక్షల నుంచి 10 లక్షల ఆర్థిక సహాయం, పొలాలు
కొనుక్కునే వెనుకబడిన కులాల రైతులకి ఎకరాకు లక్ష నుంచి 5 లక్షల ఆర్థిక సహాయం,
దళిత కుటుంబాలకు -అంటే నెలకు 50 యూనిట్ల కన్నా తక్కువ వినియోగించుకునే
కుటుంబాలకు ఉచిత విద్యుత్ (ప్రస్థుతం రోజుకి 8 గంటలు గ్రామాల్లో విద్యుత్
లేదు -అది వేరే విషయం), దారిద్య్ర రేఖకి కింద ఉన్న కుటుంబాలకు ప్రతీనెలా
185 రూపాయలు కిమ్మత్తు చేసే 9 అత్యవసర వస్తువుల పంపిణీ -అంటే కిలో పామ్
నూనె, కందిపప్పు, గోధుమలు, గోధుమ పిండి, ఉప్పు, అర కిలో చింతపండు, పావుకిలో
కారప్పొడి, నూరు గ్రాముల పసుపు, తొమ్మిది, పది క్లాసుల కుర్రాళ్లకి స్కాలర్‌షిప్పులు,
బయట ఉండి చదువుకునేవారికి నెలకి 2224 రూపాయలు, హాస్టళ్లలో ఉన్నవారికి 4500,
పుస్తకాలు కొనుక్కోడానికి 750 రూపాయలు, కడుపుతో ఉన్న మహిళలకు సహాయం
చెయ్యడానికి నూరుకోట్ల మం జూరు, ఇవి కాక గ్రామాల్లో ఉండే గ్రామీణులకు
సహాయానికి గాను 884 కోట్ల మంజూరు.
ఇవి కేవలం నమూనావరాలు.
అయితే ఎవరికి ఏం కావాలో నాయకత్వం ఎలా నిర్ణయించగలదు? ఈ దేశంలో ఉన్న 121
కోట్ల ప్రజల అవసరాలను ఎవరు జనరలైజ్ చెయ్యగలరు? నా కొడుక్కి ప్రభుత్వం
సైకిలిచ్చింది. కాని నాకు పెద్దకూతురు పురిటికి వచ్చిన ఖర్చు ముఖ్యం.
తమిళనాడులో ఏ కుర్రాడికిచ్చిన సైకిలూ ఆ కుర్రాడు తొక్కగా చూడలేదు నేను.
ప్రత్యేకంగా తమిళనాడు గురించే రాయడానికి కారణం నేను గడుసువాడిని కనుక.
తమిళనాడులో మామిడిచెట్టుకి కొబ్బరికాయలు కాయించాలని చేసిన ప్రయత్నం లాంటిదే
ఇక్కడా జరుగుతోంది కనుక. రాష్ట్రంలో అందరి సామూహిక అవసరానికి రాజకీయ
నాయకులు కొన్ని గుర్తులు పెట్టుకున్నారు. తుంటి మీద కొడితే పళ్లు రాలతాయని
నిర్ణయించారు. ఎక్కడయినా కొడితే చాలునని ప్రజలు ఎదురు చూస్తున్నారు.
పుస్తకాలకిచ్చిన డబ్బుతో విద్యార్థి ''అసలిలా మొదలయ్యింది'' సినిమా
చూస్తాడేమో ఎవడు చూడొచ్చాడు?
నిజానికి ప్రభుత్వం చెయ్యాల్సిన పని -వ్యక్తి స్తోమతుని పెంచడం. అతని
ఆర్థిక స్థాయిని మెరుగు పరచడం. ఇది ఒక ఎన్నిక వ్యవధిలో జరిగే పనికాదు.
మరుసటి ఎన్నికకి మనం ఉంటామో ఊడుతామో! ప్రస్థుత ఎన్నికకు పబ్బం గడుపుకోవడమే
పార్టీల లక్ష్యం. ఆ విషయం స్పష్టంగా జనానికి అర్థమౌతోంది. వారికి
అర్థమౌతోందన్న నిజం పార్టీలకీ అర్థమౌతోంది. ఇది వోటరూ, వా రి వారి
ప్రతినిధులూ తెలుసుకుని బెల్లిస్తున్న బ్లాక్‌మెయిల్. ఎవరి ఊరింపు గొప్పదో
వారిది గెలుపు. బాచాబూచుల లోపల బాచన్నే పెద్ద బూచి!