Click Play to listen audio of this column If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here Are you
using iPad ( any iOs Device)? Try direct MP3,
Click
here
ఒక ఆలోచన - ఒక మీమాంస
గొప్పగా
మాట్లాడేవారంతా గొప్ప వక్తలు కారు. అలాగే గొప్ప వక్తలంతా గొప్ప విషయాలను
మాట్లా డనక్కరలేదు. రెండో నిజానికి గొప్ప ఉదాహరణ -మన రాజకీయ నాయకులు. మరో
అనర్థమైన ఉదాహరణ హిట్లర్. జాతిని ఊపి ఉర్రూతలూగించి -తన దౌష్ట్యాన్ని అంత
గొప్పగా సబబనిపించేలాగ మాట్లాడే వక్త బహు శా మానవ చరిత్రలో మరొకరు లేరేమో.
మరి గొప్ప విషయాలను బొత్తిగా నేలబారుగా మాట్లాడే గొప్ప వ్య క్తులు? మూడు
ఉదాహరణలు చాలు. మహాత్మా గాంధీ, శ్రీశ్రీ, రామకృష్ణ పరమహంస. గొప్ప విష యం
చెప్తూ, గొప్ప వక్తగానూ చెల్లుబాటయే గొప్పతనం చరిత్రలో అరుదు. అలాంటి
గొప్పతనం కొట్టొచ్చినట్టు చరిత్ర చేసిన వ్యక్తి -కాదు వ్యవస్థ -స్వామి
వివేకానంద. చెప్పిన విషయంలో, చెప్పడంలో ప్రపంచ దేశాలను దిగ్భ్రాంతుల్ని
చేసిన ఘనత వివేకానందుడిది. సద్గురు శివానంద మూర్తిగారి సమక్షంలో కూర్చో వడం
గొప్ప అనుభవం. వారు అప్పుడప్పుడు ఇచ్చిన అపురూపమయిన ప్రసంగా లన్నీ -పుస్తక
రూపంలో వారి శిష్యులు తీసుకువచ్చారు. కాగా, ఆయన గొప్ప వక్తకారు. అంటే మైకు
బద్దలుకొట్టే ప్రసంగాలు చేయరు. ఆ మాటకి వస్తే గొప్ప వ్యక్తులెవరూ చేయరు.
వారి మాటల్ని జాగ్రత్తగా విని మనం విజ్ఞానాన్ని ఏరుకోవాలి. సినీ ప్రపంచంలో
ఇలా అతి సాధారణమైన స్థాయిలో మాట ని నిలిపి (అండర్ ప్లే) అతి అసాధారణమైన
పాత్రీకరణను సృష్టించిన సందర్భం ది గాడ్ ఫాదర్. పాత్రను నటిం చిన మహానటుడు
-మార్లిన్ బ్రాండో. దర్శకుడు ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా. ఎంతో కొంత ఈ
సృష్టి నామ నస్సులో చెరగని ముద్ర వేసింది. సంవత్సరాల తర్వా త -నేను జీవితంలో
మొదటిసారిగా ఒక విలన్’ పాత్ర వెయ్యవలసి వచ్చినప్పుడు -ఫ్రాన్సిస్ ఫోర్డ్
కొప్పోలా, మార్లిన్ బ్రాండో నా మనస్సులో ఉన్నారు. వారి ప్రభావమే ఇంట్లో
రామయ్య -వీధిలో కృష్ణయ్య లోనా సుబ్బారావు పాత్ర. దుర్మార్గాన్ని అతినేలబారు
స్థాయిలో సంస్కారానికి దీటుగా నిలిపిన పాత్రీకరణ. తర్వాత అది ఒక
దుర్మార్గానికి నమూనాగా, నా జీవితకాలమంతా ఎన్నో పాత్రలు చేశాను.
దుర్మార్గాన్ని అండర్ ప్లే చెయ్యడం ఆ దుర్మార్గానికి మరింత దుర్మార్గాన్ని
జత చేస్తుంది. ఇంట్లో రామయ్య పాత్రలో సంధించిన కొత్త, వింత కోణమిదే. సరే.
ఇది విషయాం తరం. మళ్లీ సద్గురువుల దగ్గరికి వస్తే మొన్న వారి సమక్షంలో
గడిపిన క్షణాలు అమూల్యమైనవీ, అపురూప మైనవీను. వారు బిగ్గరగా మాట్లాడ లేని
స్థితి. నిజానికి అది వారి స్వభా వం. కాని చెప్పే విషయం అతి లోతైన ది.
నాలాంటి వారు గొంతు చించుకుని నలభైసార్లు చెప్పవలసినదీను. వర్తమాన సామాజిక
అవ్యవస్థ గురించి మాట్లాడుతూ శివానంద మూర్తిగారు నేటి సమాజ ధోరణిని
ఒక్కమాటలో క్రోడీకరించారు. నేడు మనిషి కేవలం సుఖం కోసం కష్టపడు తున్నాడుఅని.
ఇదొక్కటి చాలు మన వ్యవస్థలో వికారాల న్నింటినీ వివరించడానికి. నాకు మంచి
కారు కావాలి. సుఖం. 50 వారాలు శ్రమ పడి వాయిదాలు చెల్లించాలి. నాకు కోటి
రూపాయిలు కావాలి. ఎందుకు? మనిషి బతకడానికి అంత అవసరం లేదుకదా? కాదు. నేను
సుఖంగా బతకాలి. నా సుఖా నికి నేను పెట్టుకున్న గుర్తు -కోటి. మరి ఏ. రాజా
పెట్టుకున్న గుర్తు? కనిమొళి పెట్టుకున్న గుర్తు? వాన్‌పిక్ పెద్దలు
పెట్టుకున్న గుర్తు? జగన్ పెట్టుకున్న గుర్తు? యెడ్యూరప్ప పెట్టుకున్న
గుర్తు? ఇలా ఎన్ని ప్రశ్నల యినా ఉన్నాయి. మరొక గొప్పమాట. ఈ దేశంలో -మన
ధర్మంలో -వైరాగ్యం ఆఖరి దశ. ఎవరికయినా. రాజుకయినా. రైతుకయినా. మనిషన్నవాడికి.
కాని -అది చాలాముఖ్యం -వైరాగ్యం విరక్తి ద్వారా రాకూడదు. కేవలం తృప్తి
ద్వారా రావాలి. నేరాలు చేసి, జైళ్లకి వెళ్లి, అలసిపోయి, అపకీర్తి పాలయి,
విసిగిపోయి -అవసాన దశలో -విరక్తితో వచ్చేది వైరాగ్యం కాదు. అది
నిలవదు.”నాకిది చాలు అనుకొన్న ది, అనిపించిన జీవితం వైరాగ్యం. ఆ పని మన
వ్యవస్థలో రాజులూ చేశారు. మామూలు మను షులూ చేశారు. అందుకనే ఆరోగ్యకర మైన
కాలధర్మం ఇంతకాలం సాగింది. అయితే తృప్తి ఎలా వస్తుంది? న్యాయస మ్మతమైన
జీవితంతో వస్తుంది. అన్యా య జీవనం వల్ల భయం వస్తుంది. సంకటం వస్తుంది. కీడు
వస్తుంది. ఆపద వస్తుంది. మనం శివుడిని దరిద్రుడని కీర్తిస్తాం. సినీమా భాషలో
ఒక్క గుర్తుని సూచిస్తే చాలు. “ఆది భిక్షువు వాడినేమికోరేది?
బూడిదిచ్చేవాడినేమి యడిగేది?” అన్నాడు సిరివెన్నెల. శివుడి దరిద్రం వైభవం.
అసలు దరిద్రం అంటే ఏమిటి? ఏది అవసరమో అది లేకపోవడం దరిద్రం. మరి శివుడి
దరిద్రం? ఏదీ అవసరం లేకపోవడం ఆయన దరిద్రం.
ఈ వ్యవస్థలో “ఇక చాలు’ అనుకోవడం ఆర్ష సంప్రదాయం. ఇది సుఖానికీ, సంపాదనకీ,
జీవికకీ, జీవన విధానానికీ -అన్నిటికీ వర్తిస్తుంది. ఈనాటి వ్యవస్థలో
రాజూభయ్యాలు, మనూశర్మలూ, నిన్న మొన్నటి రేప్ వీరుడు రాంసింగులూ ఈ సంప్రదాయ
విపర్యయానికి ఎంత గొప్ప ఉదాహరణలు? అలాగని అందరూ ఆశ్రమాలకి వెళ్లి
జీవించనక్కరలేదు. రఘు మహారాజు, జనక మహారాజూ రాజ్యాల్ని పాలిస్తూనే
సంప్రదాయ’వైభవానికి అద్దం పట్టారు. ఒక పుచ్చలపల్లి సుందరయ్య, ఓ అన్నా హజారే
తమ జీవికతో ఆ నిజాన్ని నిరూపించారు. లేకపోతే అన్నా హజారే గొంతుని ఈ దేశం
ఎందుకు వినాలి? జీవించే జీవ నం కూడా “ఇక చాలు’ అనుకొని శరీరం లోంచి
నిష్క్రమించడం ఈ జాతి వైభవం. శరీరం అన్న మాటకే నశించేది అని అర్థం.
శరీరంలోంచి జీవం పోయాక చచ్చిపోవడం నిజమైన చావు కాదు. అది చాలామంది చచ్చే
చావు. మనం రోజూ వింటున్న చావు. ఇవాళ మనకి చావంటే అర్థం అదే. కాని శరీరంలో
జీవలక్షణం ఉండగానే దాన్ని ఐచ్చికంగా వదిలిపెట్టడం ఒకనాటి సంస్కారం.
ప్రాణాన్ని వదలాలనుకున్న దశలో శరీరంలోప్రాణం ఉండాలి. అదీ వైభవం. ఇదంతా
పుక్కిటి పురాణంలాగ అనిపిస్తుంది మనతరానికి. జైలునుంచి విడుదలయాక -దక్షిణాఫ్రికా
గవర్నరు దగ్గరే ఒక డాలరు అప్పు అడిగిన గాంధీ, ఔషదానికి లొంగని శరీరాన్ని
విడిచిపెట్టి -దాని నిస్సహాయతను గౌరవించాలని భావించిన వినోభా భావే ఈనాటి
కథలు. ప్రజాధనానికి జవాబుదారీగా మాత్రమే పాలకుని బాధ్యత అని భావించి, ఆ
నీతికి నిలిచిన పాలకులున్న ఈ దేశంలో ప్రజాధనాన్ని దోచుకుంటున్న నాయకులు -జైళ్లల్లోకి
మాయమవుతున్న ఈ తరంలో -ప్రజాధనాన్ని -కోట్లకి కోట్లు దోచుకుంటున్న
ప్రబుద్ధులకి “ఇక చాలు’ అనిపించే తృప్తి ఈ వ్యవస్థ సంస్కారమని ఎలా చెప్పి
ఒప్పించగలం! సద్గురువులతో ఒక్క సాయంకాలం ఇంత ఆలోచింపజేస్తే ఈ దేశ ఆలోచనా
స్రవంతికి ఎంత లోతయిన మూలాలున్నాయి? పాటించడం అదృష్టం. కనీసం తెలుసుకోవడం -అవకాశం.
అవసరం. మనం ప్రతిరోజూ ఏం పోగొట్టుకుంటున్నామో తెలియని దురదృష్టపు జీవితాలను
గడుపుతున్నాం.