Click Play to listen audio of this column If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here Are you
using iPad ( any iOs Device)? Try direct MP3,
Click
here
వింత మనిషీ - కొంత నవ్వూ
అమెరికాలో
ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం కులపతికి అర్ధరాత్రి ఫోన్ వచ్చింది. అటునుంచి
ఓ వ్యక్తి ఆతృతగా అడుగుతున్నాడు: ''112 మెర్సన్ స్ట్రీట్‌కి ఎటువెళ్లాలో
చెప్పగలరా?'' అని. ఆ ప్రశ్నని వినగానే ఈ కులపతి దిగ్గునలేచి కూర్చున్నాడు.
''బాబూ, మీరెవరో తెలీదు కాని -ఇంత అర్ధరాత్రి అంత పెద్దాయన్ని ఎందుకు
డిస్టర్బ్ చేస్తారు?'' అన్నాడు. కారణం -ఆ అడ్రసు ప్రపంచ ప్రఖ్యాత
శాస్త్రకారుడు ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌ది. కాని అటువేపు నుంచి నిస్సహాయంగా
సమాధానం వచ్చింది:''నేను ఐన్‌స్టీన్‌నే మాట్లాడుతున్నాను. నా ఇంటికి దారి
తెలియడం లేదు''. కులపతికి పూర్తిగా మెలకువ వచ్చేసింది. కంగారు పడిపోయాడు.
''సార్! మీరెక్కడ ఉన్నారు?'' అని దిగ్గున లేచి కూర్చున్నాడు. అటు పక్కనుంచి
నిస్సహాయంగా సమాధానం వచ్చింది: ''అదే అర్థం కావడంలేదు. ఎదురుగా ఎర్రటి భవనం
కనిపిస్తోంది. దానిమీద ఫలానా టీవీ బొమ్మ ఉంది...'' అని ఏవో గుర్తులు
చెప్పబోయాడు. కులపతి కారుతాళాలు తీసుకుని కారులో దూకాడు. ఆయనకి ఆ గుర్తులు
అర్థం అవుతున్నాయి. మరో అరగంటకి నిస్సహాయంగా రోడ్డుమీద నిలబడిన ఐన్‌స్టీన్
ముందు కారాగింది. కులపతి సగౌరవంగా ఆయన్ని కారులో ఎక్కించుకుని ఇంటి దగ్గర
దింపి వచ్చాడు. ఐన్‌స్టీన్ ఇంటి అడ్రసు ప్రపంచ ప్రఖ్యాతమయినది: 112,
మెర్సన్ స్ట్రీట్, ప్రిన్‌స్టన్ యూనివర్సిటీ, న్యూజెర్సీ.
మేధావులలో గొప్పతనం వారికే ప్రత్యేకం. అయితే అదెప్పుడూ ఏకపక్షంగానే ఉంటుంది.
మనకి అతి సామాన్యంగా కనిపించే తేలికయిన విషయాలు వారి తలలో నిలవవు. ఈ
ఉదాహరణకి ప్రత్యేకమయిన నిదర్శనం ప్రపంచంలో కల్లా గత శతాబ్దపు గొప్ప మేధావి
ఐన్‌స్టీన్. ఇందుకు మనలాంటి వారిని కితకితలు పెట్టే ఎన్నో సందర్భాలున్నాయి.
ఆయన ఒకసారి రైల్లో ప్రయాణం చేస్తున్నారు ఒంటరిగా. టికెట్టు తనిఖీచేసే
ఉద్యోగి వచ్చాడు. ఆయన ఐన్‌స్టీన్‌ని వెంటనే గుర్తుపట్టాడు. నమస్కారం చేశారు.
ఆనవాయితీగా, సగౌరవంగానే టిక్కెట్టు అడిగాడు. ఐన్‌స్టీన్ టిక్కెట్టు కోసం
జేబులన్నీ వెదుకుతున్నాడు -కంగారు పడుతూ. టిక్కెట్టు ఎంతకీ కనిపించడంలేదు.
ఆయన కంగారు ఎక్కువయింది. అంతటి మహానుభావుడు టిక్కెట్టు లేకుండా ఎందుకు
ప్రయాణం చేస్తాడు? మరిచిపోవడం సహజం. ''మరేం పరవాలేదు సార్!'' అని చెప్పి
ముందుకు సాగిపోయాడు ఉద్యోగి. మరో నలభై నిముషాల తర్వాత ఉద్యోగి అటువెళ్తూ ఐన్‌స్టీన్
వేపు చూశాడు. ఆయన ఇంకా కంగారుగా టిక్కెట్టు వెదుకుతున్నాడు. రైలు నడుస్తూనే
ఉంది. ఉద్యోగికి సానుభూతి కలిగింది. దగ్గరికి వెళ్లాడు. ''టిక్కెట్టు
చూపించకపోయినా పరవాలేదు సార్. దానికోసం వెదకకండి'' అన్నాడు. ఐన్‌స్టీన్
నిస్సహాయంగా అన్నాడు: ''నేను వెదికేది నీకోసం కాదు బాబూ. నాకోసం నేను ఏ
స్టేషన్‌లో దిగాలో మరచిపోయాను'' అన్నారట. ఆయన్ని ఎవరో అడిగారట. ''అయ్యా, మీ
పరిశోధన జగత్ ప్రసిద్ధం. కాని 'సాపత్య సిద్ధాంతం' (ధియరీ ఆఫ్ రెలిటివిటీ)
నా కర్థమయేలాగ చెప్పగలరా?'' అని. ఆయన చెప్పారు. ''ఒకేచిన్న ఉదాహరణ. నిన్ను
ఎర్రగా కాలిన పెనం మీద కూర్చోపెట్టారనుకోండి. క్షణమొక యుగంలాగ కనిపిస్తుంది.
అదే ఓ అందమయిన అమ్మాయి సమక్షంలో ఉన్నారనుకోండి -ఒక యుగం క్షణంలాగ
జరిగిపోతుంది. అదే థియరీ ఆఫ్ రిలెటివిటీ -స్థూలంగా'' అని వివరించారట. ఆయన
ఒకసారి బూట్లు కొనుక్కోడానికి షాపుకి వెళ్లారట. వెళ్లేముందు -ఆయన సెక్రటరీ
-ఈయన ఇబ్బందులు ఎరిగిన వ్యక్తి కనుక -పాదం సైజు, తనకి ఏ నంబరు బూటు కావాలో
చెప్పలేడని -కాలి ఆదెని ఒక కాగితం మీద గీసి ఆయన జేబులో పెట్టింది. తీరా ఆయన
షాపులోకి వెళ్లి -తన సెక్రటరీ ఇచ్చిన కాగితాన్ని వెదుక్కున్నాడు.
యధాప్రకారంగా కనిపించలేదు. షాపు యజమాని నమస్కారం పెట్టి ఆహ్వానించాడు. ఈయన
వెదికి వెదికి వేసారి -లేచి బయలుదేరిపోయాడు. ''ఏం సార్! వచ్చి
వెళ్లిపోతున్నారు?'' అని అడిగాడు యజమాని. ''ఏం లేదయ్యా. నా సెక్రటరీ నా కాలి
సైజుని కాగితం మీద రాసి ఇచ్చింది. అదెక్కడో పారేసుకున్నాను. మళ్లీ వస్తాలే''
అని షాపులోంచి బయటకు వచ్చారట!
ఆయనకి మహా తెలివైన డ్రైవరు ఉండేవాడు. అతని దినచర్య -తన యజమాని అద్భుతంగా
చేసే ఉపన్యాసాలు రోజూ వినడం. ఎంత అలవాటయిపోయిందంటే -తు.చ. తప్పకుండా తనే
చెప్పగలిగే స్థితికి వచ్చాడు. ఐన్‌స్టీన్‌ని వ్యక్తిగతంగా తెలియని సభకి
ఇద్దరూ వచ్చారు. డ్రైవరుకి ఓ సరదా కలిగింది. ''సార్! ఈసారి మీరు చెప్పేదంతా
నేను చెప్పేస్తాను'' అన్నాడట. మేధావులు పసిపిల్లల వంటివారు. ఐన్‌స్టీన్
నవ్వుకున్నాడు. ''ఏదీ. చెప్పుచూదాం'' అని సభలో వెనక కూర్చున్నాడు. డ్రైవరు
అనర్గళంగా రోజూ వినే తన యజమాని ఉపన్యాసాన్ని అదరగొట్టేశాడు. అంతా అయాక -ఒక
జిజ్ఞాసి లేచి -ఒక క్లిష్టమయిన ప్రశ్న వేశాడు. అంతే. డ్రైవరు నీళ్లు నమలడం
ప్రారంభించాడు. వెనకన కూర్చున్న ఐన్‌స్టీన్ లేచి నిలబడ్డాడు. ''దీనికి
సమాధానం మా బాసుదాకా ఎందుకు? వారి డ్రైవరుని -నేను సమాధానం చెప్పగలను'' -అని
గడగడా చెప్పేశాడట. ఆయన లేబరేటరీలో ఎప్పుడూ పిల్లుల బెడద ఉండేది. ముఖ్యంగా
రెండు పిల్లులు- ఒకటి పెద్దది, మరొకటి బొత్తిగా చిన్నదీ వస్తూండేవి. ఈయన
పనిలో ఉన్నప్పుడు బయటికి వెళ్లడానికి, లోనికి రావడానికి గొడవ చేస్తూండేవి.
ఐన్‌స్టీన్ బాగా ఆలోచించి మంచి ఆలోచన చేశాడు. ఆ విషయాన్ని తన స్నేహితునికి
గర్వంగా వివరించాడు. ''నా గదిలోకి రెండు పిల్లులు వచ్చి గొడవ చేస్తూంటాయి.
వాటి రాకపోకలకి అడ్డులేకుండా మంచిమార్గాన్ని ఆలోచించాను'' అన్నాడు.
''ఏం చేశారు సార్!'' అన్నాడా స్నేహితుడు.
''గోడకి రెండు కన్నాలు చేయించాను. పెద్ద పిల్లికి పెద్ద కన్నం. చిన్న
పిల్లికి చిన్న కన్నం'' అని వివరించాడు -ధియరీ ఆఫ్ రిలెటివిటీని కనుగొన్న
ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడు!
ఒకసారి ఏదో సభలో రావలసిన వాద్యగాడు రాలేదట. ఏం చెయ్యాలో తెలీక సభా
నిర్వాహకులు ఇబ్బంది పడుతున్నారు. ఎవరో వారితో చెప్పారట. ''మీకు తెలుసో
తెలియదో -ఐన్‌స్టీన్ ఫిడేలు వాయిస్తారు'' అని చెవిలో గొణిగారు. భయపడుతూనే,
అడగలేక అడగలేక ఐన్‌స్టీన్‌ని అడిగారట. ఆయన వెంటనే అంగీకరించారు. మేధావికి
తన పనికంటే చిన్న వినోదం మీద రుచి ఎక్కువ ఉంటుంది. ఆయనకి సాధ్యమయినట్టు
వయొలిన్ వాయించి, వేదిక దిగి తన స్నేహితుడితో అన్నారట. ''చూశావా?
చాలామందికి తెలియని విషయం ఏమిటంటే -ఈ ఐన్‌స్టీన్ మామూలు 'ఫిడ్లర్' అని''
అని పగలబడి నవ్వారట. ఇంగ్లీషులో ఫిడ్లర్ అంటే 'మోసగాడు' అనే అర్థం కూడా
ఉంది! మహానుభావుల మామూలు విషయాలు కూడా వినముచ్చటగా ఉంటాయి. గత శతాబ్దం
గర్వించదగ్గ మహా శాస్త్రవేత్తలలో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఒకరు. ఆయనెంత
గుర్తుంటారో ఆయన అన్న మరొకమాట అంత గుర్తుంటుంది. అది మహాత్మాగాంధీని గురించి.
ఒకాయన నోబెల్ బహుమతిని పుచ్చుకొన్నారు. మరొకరికి ఆనాటి బ్రిటిష్
ప్రభుత్వాన్ని ఇబ్బంది కలిగిస్తుందని భయపడి నోబెల్ బహుమతి (గాంధీకి)
యివ్వలేదు. మహాత్ముడు కన్నుమూసినప్పుడు ఐన్‌స్టీన్ అన్నమాటలివి: ''రాబోయే
తరాలు ఈ భూమిమీద ఇలాంటి వ్యక్తి ఒకరు రక్తమాంసాలతో సంచరించారా అని
నమ్మలేకపోతా రు''. ఈ మాటని రిచర్డ్ అటెన్బరో గత శతాబ్దపు గొప్ప చిత్రాన్ని
''గాంధీ''ని నిర్మిస్తూ -మొదటి సీనులోనే ఉటంకించారు.