Click Play to listen audio of this column If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here Are you
using iPad ( any iOs Device)? Try direct MP3,
Click
here
’పెంట’ రాజకీయాలు
మేముండే అపార్టుమెంటులో 12 కుటుంబాలున్నాయి. ఆరు కుటుంబాలు
ఒకవేపు, మరో ఆరు మరొకవే పు. మా ఇంటి పక్కనే మరో అపార్టుమెంటు. ఈ కుటుంబాలు
-ఎవరో తెలీదుకాని -వారిలో ఒకరు తమ చెత్తని పక్క అపార్టుమెంటు గోడదగ్గర
వేస్తారు. కొన్నాళ్లకి వారి కాలువల్లో నీరు నిలిచిపోతుంది. వారు తగాదాకి
వస్తారు. వేసేది ఎవరు? ఈ ఆరుగురిలో ఎవరయినా కావచ్చు. ఎవరూ ఒప్పుకోరు. పక్క
అపార్టుమెంటు కాలువ పూడుకుపోతూనే ఉంటుంది. తగాదా జరుగుతూనే ఉంటుంది. కాని
సమస్య ఎన్నడూ పరిష్కారం కాదు. ఇక్కడో సౌకర్యం ఉంది -కనీసం ఆ వేపున ఉన్న
ఆరుగురికి. ఎవరో చెత్త వేస్తున్నారు. చెత్తని దూరంగా పారేసే శ్రమ తప్పింది.
నేరం ఎవరిమీదా రుజువు కాలేదు. కనుక తగాదా కారణంగా ఇవాళ ఒకాయన చెత్త వేయడం
మానుకుంటే -మరో అయిదుగురికి ఆ అవకాశం ఉంది. ఎందుకంటే నేరం ఆరుగురి మధ్య
నిలిచిన విషయం. కనుక చెత్త పడుతూనే ఉంటుంది. వేసేవారు మారుతారు. కాని
కాలువల్లో దరిద్రం కొనసాగుతూనే ఉంటుంది. స్థూలంగా ఇదీ ప్రస్థుతం మన పాలక
వ్యవస్థ పరిస్థితి. పెంట ఎవరిదన్న ప్రసక్తి కాదు. నేరం ఎవరిదన్న బాధా లేదు.
మొత్తంమీద నష్టపోయేది పక్క ఇంటివాడు. తర్జన భర్జనలు జరుగుతూనే ఉంటాయి.
నేరారోపణ జరుగుతూనే ఉంటుంది. కాని చెత్త అలాగే ఉంటుంది. చెత్త రాజకీయాలు
సాగుతూనే ఉంటాయి. మన రాజకీయ పరిస్థితిని చూద్దాం. కాంగ్రెస్‌కి రాకూడనన్ని
రోగాలు వచ్చిపడ్డాయి. రకరకాల కుంభకోణాలు. అవినీతులు. మానభంగాలు. వగైరా వగైరా.
మన ప్రధానికి ప్రస్థుతం 81 సంవత్సరాలు. మొదటినుంచీ ఆయన ఆపద్ధర్మ నాయకుడు.
తీరా రేపు ప్రధాని అవుతాడని మనకు చెప్తున్న యువ కిశోరం -రాహుల్ గాంధీ తనకు
ప్రధాని అయే ఆలోచన లేదని కుండబద్దలు కొట్టేశాడు. ఇక తప్పనిసరిగా మన్మోహన్
సింగుగారే కొనసాగుతారా? లేదా -ఏతావాతా పదవి చేతికి దక్కితే అంత నోరులేని
మనిషి, కళ్లు మూసుకొనే సౌకర్యాన్ని ఇవ్వగల మనిషి సోనియా గారికి దొరుకుతాడా?
మనకి అర్థంకాని విషయం.
అసలే చావు తప్పి కన్నులొట్టపోయిన డియెంకె -తమ మంత్రి జైలుకి వెళ్లినా, తమ
కూతురు జైల్లో ఉన్నా తట్టుకుని -గతిలేక -భరించింది. ఇప్పుడు రాష్ట్రంలో
కనీసం వ్యతిరేక పక్షంగానయినా నిలిచే యోగ్యత లేదు. చావూ తప్పలేదు. కన్నూ
లొట్టబోయింది.
కనుక ఎలాగో నాలుగు మార్కులయినా సంపాదించుకోవాలంటే ప్రభుత్వ పక్షం చెయ్యని
ఏదో సాహసం చెయ్యాలి. 12 నెలల ముందు యూపీఏ నుంచి బయటకి వచ్చి సాధించిందీ లేదు.
ఓట్లని కూడబెట్టిందీ లేదు. ఏతావాతా ఢిల్లీలో కాంగ్రెస్‌కి అది మూతి బద్దలయే
దెబ్బ. ఏమాటకి ఆ మాటే చెప్పుకోవాలి -గత 18 నెలలుగా ఢిల్లీ సంకీర్ణ ప్రభుత్వం
రోజువారీ లెక్కల మీదే బతుకు సాగిస్తోంది. రోజుల్లెక్కన పొరుగింటి చెత్తమీద
పడుతోంది. డిఎంకె తప్పుకోగానే మరో ఇద్దరికి 'పెంట' వేసే అవకాశం దొరికింది.
ఎవరి పెంట వారికిసిద్ధంగా ఉంది. ఎవరికీ 2014 దాకా -అంటే మరో సంవత్సరం దాకా ఎన్నికలు
లాయకీ కాదు. ఈలోగా కాంగ్రెస్ అడుక్కునే స్థితికి వచ్చింది. ఆ జోలెలో ఎవరు
ఏం వేసినా, వెయ్యకపోయినా పుట్టె మునుగుతుంది. ఇద్దరిముందు -ప్రస్థుతం -ఆ
జోలె వుంది. మాయావతి, ములాయం సింగ్. ఇద్దరికీ కాంగ్రెస్ మీద పెద్ద మోజు
లేదు. ఆ పార్టీ పిలక తమ చేతిలో ఉందని ఇద్దరికీ తెలుసు. ఎవరు ముందు పెంట
వేసినా కాలువ పూడిపోతుంది. వెయ్యకుండా ఆపడానికి కాంగ్రెస్ దగ్గర ఉన్న
అస్థ్రం సీబీఐ. వెనకటికి ఓ సినిమా మనిషి నాతో అన్నాడు -'నాకు రాజకీయాల మీద
మోజు లేదు. కాని నా ఆస్థిని కాపాడుకోవాలంటే రాజకీయ జెండా అవసరమ'ని.
ములాయంగారు కాంగ్రెస్‌ని కూలదోయనని అంటూనే నవంబరులో ఎన్నికలు తప్పవన్నారు.
అదేమిటి? వారు దన్నుగా నిలబడితే 2014 దాకా ప్రభుత్వం సాగవచ్చు కదా? మరి ఈ
సందిగ్ధం ఎందుకని? ఈ గవర్నమెంటు నిలవడానికి వారొక్కరూ చాలుకదా? పొమ్మనలేక
పొగ పెట్టినట్టు -వారి మార్కు పొగని వారు సిద్ధం చేసుకుంటున్నారా? లేదా
పొరుగింటి చెత్తని వారప్పుడే గుర్తుపట్టారా? మాయావతిగారు కిమ్మనడం లేదు.
వారి జాబితాలో మరికొన్ని కొత్త విగ్రహాలు ఏమైనా ఉన్నాయా? ఏ రోజైనా, ఏ
ఒక్కరైనా -ఏ క్షణాన్నయినా 'ఊ' అనకపోతే కూలిపోయే స్థితిలో ప్రస్థుతం
ప్రభుత్వం ఊగిసలాడుతోంది. ఈ పద్నాలుగు నెలల్లో ఎవరి ఇళ్లు వారు
చక్కబెట్టుకోడానికి ఏ ఇల్లూ అడ్రసులేని ఈ దిక్కుమాలిన ప్రభుత్వాన్ని
నిర్దాక్షిణ్యంగా వాడుకుంటారా? 'మా అవసరం లేనప్పుడు మా మీదికి సీబీఐని ఈ
ప్రభుత్వం పురికొల్పుతుంది' అంటూనే కాంగ్రెస్‌ని ప్రస్థుతం కూల్చే ఆలోచన
లేదని ములాయం వాక్రుచ్చారు. వారి మాటల్లో కాంగ్రెస్ పట్ల ప్రేమ కంటే -వారి
అవకాశవాదం గుర్తింపూ, తమ అవసరానికి మదింపూ తెలుస్తోంది.
పద్నాలుగు నెలల తర్వాత తనని ఉంచితే ఉండాలన్న తపన మన్మోహన్‌సింగ్ మాటల్లో
తెలుస్తోంది. ఆయనకొచ్చిన నష్టం ఏమిటి? ఆయన -పాపం, కొండకి కట్టిన వెంట్రుక.
ఉంటే ఉపయోగమూ లేదు. పోతే ఊడిందీ లేదు. కాని ప్రతిదినం, ప్రతీ సందర్భంలోనూ
-ఈ బలహీనపు ప్రభుత్వాన్ని నిలపడానికి ఎన్నిరకాల తాయిలాలు చేతులు
మారుతున్నాయో, ఎన్ని విధాలుగా బుజ్జగింపులు తప్పనిసరవుతున్నాయో తలుచుకుంటేనే
-ఈ మెజారిటీ వ్యవస్థమీద ఏహ్యభావం కలుగుతోంది. ఎవరయినా, ఎప్పుడయినా తమ
స్వేచ్ఛ మేరకి మనమీద 'పెంట'ని వేసే అవకాశం ఉంది. వారి పక్షాన ఆలోచిస్తే -ఏ
విధమైన ప్రేమలూ, బంధుత్వాలూ లేని ఈ ప్రభుత్వం మీద ఎవరయినా రాయి వేసే హక్కు
ఉంది. ఏతా వాతా నష్టపోయేది ఈ వ్యవస్థ. పూడిపోయేది మన జీవనం. తన కొడుకు
పాలనని విమర్శించి, ఎల్.కె.అద్వానీ గారిని ప్రశంసించి, కాంగ్రెస్
వెన్నుపోటు మనస్తత్వాన్ని ఎత్తిచూపి -మూడో ఫ్రంటుకి వత్తాసు పలికిన ములాయం
అనే గుంటనక్క- తన ప్రణాళికా రచనను -ప్రధాని కావాలనే ఆలోచనకు -కార్యాచరణను
సిద్ధం చేసుకుంటున్నారని మనకి స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. ఒక్కటి మాత్రం
నిజం. మన జీవన విధానంలో 'పెంట' తప్పదు. గత 18 నెలలలోనూ ఎవరయినా సమాజ
శ్రేయస్సు అనే బూతుమాట మాట్లాడారా? మన ఆవరణలో 'పెంట' గురించి ఆందోళన వ్యక్తం
చేశారా? ప్రస్థుతం ఢిల్లీలో జరుగుతున్న వైకుంఠపాళీలో మనం కేవలం పావులం.
అక్కడ నాయకులు పరిచిన పరమపద సోపాన పఠంలో మనం కేవలం గుర్తింపుకి కూడా
నోచుకోని నిర్భాగ్యులం. రేపు ఢిల్లీ గద్దెని ములాయం ఎక్కినా, మాయావతి
ఎక్కినా మనకి ఒరిగేదేమీలేదు. మన ఆవరణలో 'పెంట' పడుతూనే ఉం టుంది. వేసేవారు
మారతా రు. వెయ్యడంలో అనువుని అర్థం చేసుకున్న మరో ప్రముఖులు వస్తారు. మనం
చెయ్యవలసినదల్లా మన వాటా 'పెం ట'కు సిద్ధపడి ఢిల్లీ నాటకాన్ని చూసి ఆనందించి,
తరించాలి. మనవి 'పెంట' జీవితాలు అని అర్థం చేసుకోవాలి.