Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here 
 
Are you using iPad ( any iOs Device)? Try direct MP3, Click here

       అవ్యవస్థకి ఆవలిగట్టు



  
ఇలాంటి సమస్యలు మరే దేశంలోనూ వచ్చి వుండవు. ఒక మంత్రి పోలీసు ఆఫీసర్ని హత్య చేయించాడు. ముఖ్యమంత్రి ముఖం చాటుచేసుకున్నాడు. ఆ మంత్రి పేరు రాజాభయ్యా. ఉత్తరప్రదేశ్‌లో పేరు మోసిన గూండా.
ఒక పోలీసాఫీసరు గారి తనయుడు ఒక జర్మన్‌ మహిళని రేప్‌ చేశాడు. కోర్టు అతనికి ఏడేళ్లు శిక్షని విధించింది. అతని బాబు ఒరిస్సాలో డైరెక్టరు జనరల్‌ ఆఫ్‌ పోలీసు. కుర్రాడు అమ్మని చూడడానికి బెయిల్‌ కోరాడు. కోర్టు ఆరు నెలల తర్వాత ఇచ్చింది. ఆ తర్వాత మాయమయాడు. ఎన్నేళ్లు? ఏడు సంవత్సరాలు. కొడుకు ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదన్నాడు డైరెక్టర్‌ జనరల్‌ కెమెరాల ముందు. ''వాడిని మరిచిపోయాను'' అన్నాడు. నేరం రాజస్థాన్‌లో జరిగింది. తండ్రి ఒరిస్సాలో ఉన్నాడు. కొడుకు పుట్టపర్తి అనే పుణ్యక్షేత్రం చేరాడు. బాబాగారు ఉన్న రోజులవి. రోజూ లక్షల మంది వచ్చిపోయే క్షేత్రం. తప్పించుకున్న ఖైదీ అంత గుండెలు తీసినట్టు పుట్టపర్తిలో ఎలా వున్నాడు? ఆయన పుట్టపర్తి నివాసి అని డాక్టర్‌ కృష్ణయ్య అనే గజిటెడ్‌ ఆఫీసరు సర్టిఫికెట్‌ ఇచ్చారు. ఒక ఐయ్యేయస్‌ ఆఫీసరుగారు ఆయన్ని ఉద్యోగానికి సిఫార్స్‌ చేశారు. ఓ హెడ్‌ మాస్టర్‌గారు ఉద్యోగం ఇచ్చారు. ఆయన చదువు సర్టిఫికెట్లు? నివాసం ఉన్న సాక్ష్యాలు? స్థానికంగా కేంద్ర ఎన్నికల కమిషన్‌ గుర్తింపు కార్డు పుచ్చుకున్నాడు ఈ ప్రబుద్ధుడు. వాళ్ల నాన్న తరుచు అక్కడికి వచ్చిపోతూండేవాడు. ఆయన తన 'అంకుల్‌' అని పరిచయం చేశాడు. ఫలానా తండ్రి- అంటే పోలీసాఫీసరు గారి గుర్తింపు కార్డు తనయుడి గదిలో ఉంది. రకరకాల విశ్వవిద్యాలయాల దొంగసర్టిఫికేట్లు, దొంగ గుర్తింపు కార్డులు, కంప్యూటర్‌ -ఇవన్నీ ఈ మానభంగం చేసిన నేరస్థుడి గదిలో దొరికాయి. అక్కడినుంచి ఈ ప్రబుద్ధుడు కేరళ వెళ్లాడు. బ్యాంకు పరీక్షలు రాశాడు. ఉద్యోగం సంపాదించాడు. బ్యాంకుల్లో అకౌంట్లు పెట్టుకున్నాడు. భారత దేశంలో నాలుగు రాష్ట్రాలలో విచ్చలవిడిగా దొంగ సర్టిఫికేట్లతో బతికే ఓ నేరస్థుడి వెనుక ఎంత మోసం, ఎంతమంది అండదండలు ఉన్నాయో ఊహించలేము. ఈ మోసం ఇలా కొనసాగేదే కాని ఎవరో ఓర్వలేని వారు బ్యాంకుకి ఆకాశరామన్న ఉత్తరం రాశారు -ఫలానా ఉద్యోగి ఫలానా నేరస్థుడని. అప్పుడు మిన్నువిరిగి మీద పడింది. ఒక పోలీసు డైరెక్టర్‌ జనరల్‌, ఒక ఐయ్యేయస్‌ ఆఫీసరు, ఒక గజిటెడ్‌ ఆఫీసరు, ఒక హెడ్మాష్టరు, ఒక బ్యాంక్‌ -ఇంతమంది మద్దతుతో, ఇన్ని రాష్ట్రాలలో కన్నుమూయగల ఒక నేరస్థుడు రేపు మరో రాజాభయ్యా అవడానికి అన్ని అర్హతలూ సంపాదించుకుంటున్నాడు. అరెస్టు చేయవలసింది -ఈ దౌర్భాగ్యుడిని మాత్రమే కాదు. అతని వెనుక నిలిచిన పోలీసు ఆఫీసర్ని, మిగతా ప్రమధ గణాలని.
ఇదొక కథ. గత ఫిబ్రవరిలో ఒక ఇటలీ నావలో పనిచేస్తున్న రక్షణదళ అధికారులు -భారత దేశపు సముద్ర ప్రాంతాలకు వచ్చారు. వారు మాస్సిమిలియన్‌ లతోరే, సాలతోర్‌ గిరోన్‌. సముద్ర జలాలలో తిరుగుతున్న ఒక బోటులో ఉన్న ఇద్దరు కేరళ జాలర్లను -సముద్రపు దొంగలనుకొని కాల్చి చంపారు. వారిని ప్రభుత్వం అరెస్టు చేసింది. కోర్టులో లజ్జుగుజ్జులు జరుగుతున్నాయి. నేరాన్ని మా దేశంలో విచారిస్తామని ఇటలీ అన్నది. భారతదేశం ఒప్పుకోలేదు. ఈలోగా ఇటలీ ఎన్నికలలో పాల్గొనడానికి ఈ నేరస్థులు, వారి ప్రభుత్వం కోర్టుని ఆశ్రయించింది. నేరస్థుల ఓటు హక్కుని మన న్యాయస్థానం గుర్తించి -ఓటువేసి మళ్లీ మన దేశంలో జైలుకి రావడానికి అంగీకరించింది. వస్తారని ఇటలీ రాయబారి వ్రాతపూర్వకంగా కోర్టుకి హామీని ఇచ్చారు. హంతకులు వెళ్లారు. వారి దేశంలో ప్రధానమంత్రితో సహా అంతా వారికి ఘనస్వాగతం పలికారు. కథ అక్కడితో సరి. వారు రాలేదు. రాయబారిని దేశం వదిలి వెళ్లవద్దని మన న్యాయస్థానం ఆదేశించింది. ''హాయిగా ఇక్కడే ఉంటాను'' అని రాయబారి శెలవిచ్చారు. గమనించాలి. తప్పుని ఒప్పుకోవడం గాని, నేరస్థుల్ని రప్పిస్తామని గాని చెప్పలేదు.
మన దేశంలో నేరాలూ, చట్టాలూ, న్యాయస్థానాలూ, మన పట్ల విదేశాల చిన్నచూపూ -యివన్నీ ఆటలో అరిటిపండుగా మారిపోతాయి. జపాన్‌లో, ఇటలీలో (అవును, వారి దేశంలోనే) దేశ నాయకుల్ని అవినీతికి చట్టం నిలదీసిన కథలు మనం చదివాం. కాని మనదేశంలో బొగ్గు గనుల కుంభకోణం, టూజీ కుంభకోణం, హెలికాప్టర్ల కుంభకోణం, కామన్వెల్తు క్రీడల కుంభకోణం, ఆదర్శ అపార్టుమెంట్ల కుంభకోణం, వాన్‌ పిక్‌ కుంభకోణం, తీహార్‌ వంటి జైళ్లలో ఆత్మహత్యలు, మానభంగాలు -యివన్నీ దైనందిన కార్యక్రమాలయిపోయాయి.
ఇంట గెలవలేనివాడు ఎలాగూ రచ్చగెలవలేడు. మనదేశపు పార్లమెంటు మీద దాడిచేసి, దేశంలో అత్యుత్తమ న్యాయస్థానం శిక్ష విధించి, రాష్ట్రపతి సమర్థించిన నేరస్థుడిని ఎందుకు ఉరితీయకూడదో పక్కదేశపు పార్లమెంటు మనకి చెప్తోంది.
జైల్లో -ఏ కారణానికయినా ఉరిపోసుకున్న రాంసింగ్‌ అనే రాక్షసుడి అర్ధాంతరం చావుకి అతని తల్లిదండ్రుల ఏడుపుని పత్రికలు నెత్తికెత్తుకుంటున్నాయి. తలనీ, మొండాన్నీ వేరుచేసి వీధిన పారేసిన పోలీసు శవాన్ని చాలామంది మరిచిపోయారు. మానవతా హక్కుల సంఘాలు అలాంటి సంఘటనల్ని గుర్తించవు.
9/11 తర్వాత -ఒకటి -ఒక్కటంటే ఒక్క సంఘటన అమెరికాలో జరగకుండా ఆ దేశం జాగ్రత్తపడింది. ఊరూ పేరూ విచక్షణ లేకుండా మన హీరో షారూక్‌ ఖాన్‌నీ, మన రాష్ట్రపతి అబ్దుల్‌ కలామ్‌ గారిని నిలదీసింది. మొన్న ఢిల్లీలో జరిగిన అనర్థానికి దేశమంతా నిరసన తెలిపింది. తర్వాత ఢిల్లీలోనే మానభంగాలు జరిగాయి. డజన్ల మానభంగాల కథలు రోజూ పత్రికల్లో కనిపిస్తున్నాయి.
నన్ను ఆ మధ్య ఎవరో అడిగారు -అయ్యా, ఎప్పుడూ అవినీతి, అన్యాయం, అక్రమాలంటూ గొడవ పడతారు. మంచి మీకు కనిపించదా? అని. మంచి ప్రశ్న. గత 32 సంవత్సరాలలో సంవత్సరానికి తేలికగా 30 వారాలు ఈ కథలే రాయడానికి కావలసినంత విషయం ఈ దేశపు అవినీతి కల్పిస్తోంది. మంచిని భూతద్దంతో వెదికి రాయాలని తంటాలు పడుతున్నాను. అప్పుడప్పుడు రాశాను కూడా.
మన దేశంలో అవినీతికి సిగ్గుపడే రోజులు పోయి -నా అవినీతితో మీ అవినీతిని పోల్చి నేను గర్వపడే రోజులు వచ్చాయి. ''అయ్యా, మీరు బొగ్గు కుంభకోణంలో 250 కోట్లు ఫలహారం చేశారు కదా?' అని అడగండి. ఆ నాయకుడు సిగ్గుపడడు. ఒప్పుకోడు. తల దించుకోడు. ''ఫలానా సంవత్సరంలో తమరు తిన్న రగ్గుల కుంభకోణం మాటేమిటి?'' అంటాడు. నిన్న కాశ్మీరులో దుండగులు నలుగురు జవాన్లను చంపేశారు. ఎవరో టీవీలో అడుగుతున్నారు: ''జవాన్లు చావడం సరే. ఒక జవాను ఫలానా చోట ఒకడిని చంపాడు. దీనికి మీ సమాధానం ఏమిటి?'' అని. మొండివాడు రాజుకంటే బలవంతుడని సామెత. అవినీతికి సిగ్గుపడడమో తలవొంచడమో మరిచిపోయి -పెద్ద అవినీతికంటే చిన్న అవినీతి 'నిజాయితీ'గా బుకాయించే నాయకులు పాలిస్తున్న దేశం మనది. మానభంగాలు ఆనవాయితీ అయిన దేశం మనది. గూండాలు అధికారుల్ని చంపి ''ఇది ప్రత్యర్థులు నామీద పన్నిన కుట్ర'' అని బుకాయించే రోజులివి.ఈ నేపథ్యంలో మరో పై దేశం -తమ వాటా అవినీతిని జతచేసి ''ఏం చేస్తారో చేసుకోండి'' అనడం ఆశ్చర్యం కాదు. ఇదీ ఇటలీ కథ మనకి చెప్పేనీతి.
అమెరికా మీద నాకు మక్కువలేదు. కాని తమకు జరిగిన అన్యాయానికి ఓ దేశాన్ని (ఆఫ్గనిస్థాన్‌ని) నేలమట్టం చేసి, తమ శత్రువుని పొరుగు దేశంలో (పాకిస్థాన్‌లో) వాళ్లకి చెప్పకుండా జొరబడి, చంపి, తప్పించుకుని -వారి నోరు మూయించిన బుకాయింపు ప్రపంచానికి అర్థం కాకుండా పోదు. ఈ దేశపు అత్యున్నత న్యాయస్థానానికి దొంగ హామీ యిచ్చి హంతకుల్ని ఎగరేసుకుపోయిన మరో దేశాన్ని చూసి ఎన్నిదేశాలు నవ్వుకుంటున్నాయో, మన దేశపు చేతకానితనాన్ని ఎంత ముచ్చటగా చెప్పుకుని నవ్వుకుంటున్నాయో ఎవరికి ఎరుక?


                                                                           gmrsivani@gmail.com  

 
     మార్చి 18.2013          

*************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

   


KOUMUDI HomePage