దోశెలా? దోషులా?
అందుకే వంటొచ్చిన మంత్రుల్ని
కేంద్రంలో ఉంచడం చాలా తెలివైన పని అని సోనియా గాంధీగారికి తెలుసు. తెలంగాణా
గురించి ఎంతమంది ఎన్నిసార్లు అడిగినా గులాం నబీ అజాద్ కానీ, వీరప్ప మొయిలీ
కానీ -సరైన సమాధానం కాదుకదా, తృప్తికరమైన సమాధానం చెప్పలేకపోయారు. కాని
ఇప్పటి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ప్రతినిధి వయలార్ రవిగారు కళ్లకు
కట్టినట్లు, నోటికి అందేటట్టు -ఆ సమస్యని వివరించారు. 'తెలంగాణా సమస్య అంటే
దోశె వెయ్యడమంత తేలికకాదు' అని శెలెవిచ్చారు.
ఈ మాట కొందరికి అర్థమయింది. మరికొందరిని బాధపెట్టింది. అది న్యాయం. ఎందుకంటే
ఇంతవరకూ ప్రజలు దోశెల భాష ఎరగరు. నా ఉద్దేశంలో వయలార్ గారు తెలంగాణా
పెద్దలకు ముందు దోశెలు వేయడం నేర్పాలి. దోశెలపిండి ఎలా కలపాలి?
పచ్చిమిరపకాయలు ఎన్ని తరిగి పెట్టుకోవాలి? తగుమాత్రం జీలకర్ర ఎప్పుడు
వెయ్యాలి? ఘాటుపోకుండా ఉల్లిపాయ ముక్కలు ఏ మోతాదులో కలపాలి -యివన్నీ చాలా
నేర్పుతో కూడిన పని. కేరళ రాజకీయ నాయకుల శిక్షణలో భాగంగా వయలార్‌గారు దోశెల
తయారీ నేర్చుకున్నారని మనకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. వారెప్పుడూ రాజకీయ
సమస్యల్ని దోశెలు వేయడంతో పోల్చుకుని అర్థం చేసుకుంటూంటారు. అయితే దోశెల్లో
చాలారకాలున్నాయి. ఆయా ప్రాంతాలను బట్టి దోశెల రుచి, నేర్పు మారిపోతుంది,
తెలంగాణా సమస్యల్లాగే. హైదరాబాద్ కలిసి ఉండాలా? రాయలసీమలో కొన్ని జిల్లాలు
కలవాలా? హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఉండాలా? కొన్ని సంవత్సరాల పాటు
సమష్టి రాజధానిగా ఉండాలా? తెలంగాణాకు ప్రత్యేక ఆర్థిక ప్రతిపత్తి యిస్తే
బాగుంటుందా? -యిలాగ.
దోశెల విషయానికొస్తే సాదా దోశెకి కొంచెం పిండి పులుపుగా ఉండాలి. రవ్వదోశెకి
పిండి పల్చగా పాళ్లు మారుతాయి. ఒక్కొక్కప్పుడు కొత్తిమెర, జీడిపప్పు కలిసినా
రుచి పెరుగుతుంది. వయలార్‌గారి దేశంలో -అంటే కేరళలో దీన్ని 'ఆప్పం' అంటారు.
చిదంబరం గారి దేశంలో -అంటే నాటుకోట చెట్టియార్ల ప్రాంతంలో 'నాటు దోశె'
బహురుచిగా ఉంటుంది. మన రాష్ట్రంలో -చిత్తూరు, పీలేరు, తలకోన ప్రాంతాల్లో -కన్నడ
దేశంలో లాగ దళసరి అట్టుకి ఒక పక్క ఉల్లికారం రాస్తారు. నెల్లూరు సమీపంలో
బిట్రగుంట వేంకటేశ్వరస్వామి తిరనాళ్లు, రంగడి తిరునాళ్లలో దోశెలకి
ప్రత్యేకమైన రుచి. కనుము పండగనాడు కోడికూర దోశె మరో ప్రత్యేక సృష్టి.
కట్టెల పొయ్యిమీద చేసే దోశె యిప్పటికీ పల్లెటూళ్లలో ప్రత్యేకం. పెనం మాడితే
కట్టెల్ని వెనక్కి తీసి వేడి తగ్గిస్తారు. మరి దోశె పిండి మురిగిపోతే
పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు సంతరించుకుని ఊతప్పం అవుతుంది -కూరలు తగుమాత్రం
లేనప్పుడు అరవదేశంలో 'అవియల్' రూపు దాల్చినట్టు.
అయ్యా! పిండి కొద్దీ దోశె. అలనాడు చిదంబరం గారు నాటుకోట చెట్టియార్
సంప్రదాయంలో 'వెర్త కొళంబు'తో నాటు దోశె వడ్డిస్తున్నామని చెప్పి, నోరూరించి
వెయ్యకుండా తప్పించుకున్నారు కదా? మరి ఈ వయలార్ గారి 'ఆప్పం' ఎంతవరకూ
తయారవుతుందో చూడాలి.
తీరా దోశెకి సైడ్ డిష్‌గా చెనిక్కాయ పచ్చడి చేస్తున్నారా? సాంబారు
తయారవుతోందా? ఉల్లి చెట్నీ సిద్ధమవుతోందా? లేక సోనియాగారు -వారి దేశపు -అంటే
ఇటలీ 'పీజ్జా' ధోరణిలో ఏదైనా కొత్తరకం దోశెలు తయారుచేస్తున్నారా? కేంద్రం
అన్ని ప్రాంతాల దోశెల సమాహారంగా ఉండడం మన అదృష్టం. మన మంత్రులు రాజకీయాలు
కూడా దోశెల భాషలో మాట్లాడుతారని మనం గ్రహించాలి. ఎంత మంత్రికి అంత దోశె!
అయితే గియితే -బాబూ! యిప్పటికి ఎన్నిసార్లు దోశెలు వేసే ప్రయత్నాలు జరిగాయి?
అసలు పెనం మీద పిండి పడిందా? ఒక పక్క కాలిందా? అట్టు తిప్పారా? ఇవన్నీ
వయలార్‌గారు తమ దోశెల భాషలో మనకి తెలియజెయ్యాలని నా మనవి. తెలంగాణా దోశె
వెయ్యడమంత సుళువుకాదని మంత్రివర్యులు వక్కాణించారు. ప్రత్యేక రాష్ట్రం
ఏర్పడాలా వద్దా అన్న విషయం మీద ఉపసంఘం మాట అటుంచి -దోశె వెయ్యడంలో మెలకువలు,
కష్టనష్టాలు, రుచిబేధాలు, రూపాంతరాలు దేశానికి తెలియజెప్పాలని -ఈ బోధనలో
గులాం నబీ అజాద్‌గారు కాశ్మీర్ దోశెల మర్మమేదయినా చెప్పగలరా? వీరప్ప
మొయిలీగారు కూర్గ్ రుచులేమయినా నేర్పుతారా? మనకు తెలియజెయ్యాలి. రాష్ట్రాలు
అడిగే మనకి ఆఖరికి దోశెల్ని మాత్రం మిగిల్చే ఈ నాయకుల దగ్గర కనీసం వంటయినా
వంటబడితే అదయినా మన అదృష్టం అని భావించే స్థితికి మనల్ని తీసుకువచ్చారు.
నోరూరించి, ప్లేట్లు వేయించి, వడ్డనకి సిద్ధంగా కూర్చోపెట్టి, పెనాన్ని
చూపించి, అనుపానాన్ని సిద్ధం చేసుకోమని అట్టు ఇంకా తిరగబడలేదని నాయకత్వం
ఇప్పటికే చాలాసార్లు ఆశ పెట్టింది. అసలు వంటగదిలో ఏం జరుగుతోందో, ఏ రకమయిన
దోశెకు ప్రయత్నాలు జరుగుతున్నాయో, తీరా అది వంటగదో స్నానాల గదో అనే అనుమానం
కలిగే స్థితి వచ్చింది.ఏమయినా హోటళ్లవారూ, మహిళలూ నిన్న వయలార్‌గారి మాటలకు
నిరసన తెలపాలని నా మతం. తెలంగాణా సమస్యకంటే దోశెలు వేయడం సుళువయిన పనిగా ఈ
దేశపు పాకకళని చిన్నచూపు చూడడం కేంద్ర మంత్రికి భావ్యంకాదు. పీతకష్టాలు
పీతవి. దోశె వెయ్యడంలో కష్టాలు దానికీ ఉన్నాయి.అయ్యా వయలార్ మహాశయా!
తెలంగాణా దోశె వెయ్యడమంత సుళువు కాదని సెలవిచ్చి మాకు కొత్త విషయాన్ని
బోధించినందుకు ధన్యవాదాలు. కాని కేంద్రాన్ని తమవంటి పెద్దలు 'దోశె'కు కూడా
నోచుకోని దురదృష్టపు 'పూటకూళ్లమ్మ' సత్రంగా తయారు చేశారు. తమ చేతులమీదుగా 'పొంగరం'
వంటి దోశె తయారవుతుందని ప్రజలు ఆశిస్తున్నారు. అటుపక్క పెనం వేడెక్కి
ఎర్రబడింది. అనుపానాలు చప్పబడుతున్నాయి. తినేవాడి ఆకలి పోయి కోపం
పెల్లుబుకుతోంది. వాస్తవం కంటే ఆశ ఎక్కువ హింసిస్తుంది. సమస్యల్ని వంటగదికి
ఈడ్చుకొచ్చే చాకచక్యం తమకి ఉన్నది కాని భోజనం గదులు అప్పుడే వీధిన పడిన
వాస్తవం తమరు పట్టించుకున్నట్టు లేదు. లోగడ రకరకాల దోశెల ఎరచూపించారు.
ఈసారయినా ఆకలితీరే అసలైన దోశె వేస్తారో వెయ్యరో తేల్చి చెప్పమని మనవి.
ఆఖరికి మాకు దక్కేది ఆప్పమా? పాపమా? దోశెలా? దోషులా?
gmrsivani@gmail.com
మార్చి 11.2013
************* Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com Read all the columns from Gollapudi గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
|
|